Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

gopal krishna

Abstract Drama Classics

4.7  

gopal krishna

Abstract Drama Classics

ఆ కళ్ళు

ఆ కళ్ళు

6 mins
441


    "ఇవాళైనా స్కూలు కి వెళ్తానమ్మా" అప్పటికి మూడోసారి అడిగాను. "నువ్వు స్కూలు కి వెళ్తే ఇంట్లో నాకేం తోస్తుందిరా కిట్టూ" అంది అమ్మ. అమ్మనొదిలి ఉండడం నాకూ ఇష్టముండదు. ఏమనుకుందో అమ్మ, "సరే నాన్నా, జాగ్రత్తగా వెళ్ళి మధ్యాహ్నం వచ్చెయ్యి" అంది. అమ్మ ఒప్పుకోడమే తరువాయి, సంతోషంగా ఇస్త్రీ బట్టలు వేసుకొని రెండు మూడు పుస్తకాలు పట్టుకొని బయల్దేరాను బడికి.

   ఇల్లు దాటి రెండు అడుగులు వేసానో లేదో, ఎదురైంది రమణి. "ఒరేయ్ కిట్టూ, ఏంట్రా పెళ్లికొడుకు లా తయారయ్యావు. కొంపదీసి బడికి గానీ రావట్లేదు కదా" అడిగింది నవ్వుతూ. రమణి నాకు పిన్ని వరస. కొంచెం దూరం చుట్టరికం. మనిషి మంచిదే కానీ, దానికి చేతివాటం ఎక్కువ. తనకంటే చిన్నవాళ్లు కనిపిస్తే ఒక్కదెబ్బ అయినా వెయ్యకపోతే దాని చేతులు కుదురుగా ఉండవు. నాకంటే నాలుగేళ్లు పెద్దది. నేను ఆరోతరగతి. తాను తొమ్మిదిలో ఉంది.

   నేను రోజూ బడికి వెళ్లకపోయినా చదువులో మాత్రం ఎప్పుడూ అశ్రద్దగా ఉండేవాణ్ణి మాత్రం కాదు. పరీక్షల సమయానికో, స్కూలు కి అధికారులు వచ్చిన ప్పుడో తప్పకుండ వెళ్ళేవాణ్ణి. "నాకు టైం అవుతోంది. నువ్వు నెమ్మదిగా నడుస్తున్నావు నేను వెళ్ళిపో తున్నా" అంటూ తన అలవాటు ప్రకారం వీపు మీద ఒక్కటిచ్చి గబగబా నడుస్తూ వెళ్ళిపోయింది. "రాక్షసీ, నీ సంగతి అమ్మతో చెప్తాను" అంటూ అరిచాను. అసలు తాను నన్ను పట్టించుకుంటేగా. 

  "హేయ్, నిన్నెప్పుడూ చూళ్ళేదు. ఏ క్లాస్ నువ్వు" వెనకనుండి మాటలు వినపడ్డంతో తిరిగి చూసాను. "నీ పేరేంటి" మళ్ళీ అడిగింది తానే. నేను పేరు చెప్పే లోపే, "భలే ఉన్నావు నువ్వు. నీ జుట్టు భలే పెద్దదిగా ఉంది కదా", అంది తలమీద ఉన్న జుట్టు ముడి తడుముతూ. "ఏ క్లాస్?" అడిగింది. "సిక్స్త్ చదువు తున్నా". "చాల చిన్నగా ఉన్నావు నువ్వు సిక్స్త్ అంటే నేను నమ్మడంలేదు", అంటూ చేతిలో ఒక చాక్లెట్ పెట్టింది.

   ఆ అమ్మాయి నవ్వు చాల చాల బాగుంది. ముఖ్యంగా ఆ కళ్ళు ఇంకా బాగున్నాయి. ఆ కళ్ళు నవ్వుతున్నట్లు భలే ఉన్నాయి. నేను ఆమె మొహం లోకి చూస్తూ అలాగే ఉండిపోయా. "నువ్వు ఈ ఊరికి కొత్తా"అని అడిగింది. "మాది ఈ ఊరే. అదిగో ఆ కనిపించే ఇల్లు మాదే"అన్నాను. "అవునా, ఎప్పుడూ చూళ్ళేదు కదా!"అందుకే అడిగాను" అంది.

  "నా పేరు రజియా సుల్తానా" చెప్పింది తనను తాను పరిచయం చేసుకుంటూ. నేనెప్పుడూ అలాంటి పేరు విని ఉండలేదేమో తాను సరిగా చెప్పలేదేమో అనుకుని మళ్ళీ అడిగాను. "నా పేరు రజియా సుల్తానా. నువ్వు రజియా అని పిలువు, పక్కన ఎవరూ లేనప్పుడు రాజీ అని పిలవచ్చు" దగ్గరగా వచ్చి రహస్యంగా చెప్పి, నవ్వింది. ఆమె మంచి పెర్ఫ్యూమ్ వేసుకుందేమో స్కూల్లో అడుగుపెట్టిన వెంటనే, "నేను పక్కనే ఎనిమిదో తరగతిలో ఉంటాను. ఇంటర్వెల్ లో కలుద్దాం" అని చెప్పి, వెళ్ళిపోయింది. ఫస్ట్ పీరియడ్ లో లెక్కలు క్లాస్. మనకి అస్సలు పడని సబ్జెక్టు.

    మేడం వచ్చేసరికి అందరి ముఖాల్లో భయం కనిపిస్తోంది. నన్ను చూడగానే "రోజూ బళ్ళోకి రావాలి. ఇంత వయసొచ్చినా అమ్మకూచిలా ఇంట్లో ఉండిపోకూడదు" అంటూ క్లాస్ పీకారు ఆవిడ. తరువాత బోర్డు మీద ఏదో రెండు మూడు లెక్కలు చెప్పేసి వెళ్లిపోయారు. మా క్లాస్ పక్కనే రజియా వాళ్ళ క్లాస్. ఇప్పటిలాగా పక్కా బిల్డింగ్స్ ఉన్న స్కూలు కాదు అది. ఇంటర్వెల్ ఇచ్చేసరికి నేను క్లాస్ రూంలోంచి బయటికి వచ్చి నిలబడ్డాను. వెనకాల నుండి వచ్చి, "ఇప్పుడే బయటికి వచ్చావా కిట్టూ" అడిగింది. "నీ పేరు అందరికి తెలుసు మన స్కూల్ లో" తానే చెప్పింది. ఆమెతో మాట్లాడకుండా మౌనంగా ఆమె కళ్ళని, వాటి వెనుక ఉన్న ఆ నవ్వుని చూస్తున్నాను.

  సాయంత్రం ఇంటికి వస్తున్నప్పుడు "నీకు ఖాళీ దొరికినప్పుడు మా ఇంటికి రా, మా అమ్మని పరిచయం చేస్తాను" అంటూ చెప్పాను. తాను చిన్నగా నవ్వేసి, వెళ్ళిపోయింది. ఏదో ఆలోచిస్తూ ఇంట్లోకి వెళ్లిన నేను అమ్మతో రజియా సుల్తానా గురించి పూసగుచ్చినట్లు చెప్పాను. "ఇవాళ ఒకమ్మాయి నన్ను పలకరించింది. తన పేరు రజియా సుల్తానా అంది. చాల వింతగా ఉంది కదా" అడిగాను. "అవును, వాళ్ళు ముస్లిమ్స్. మొన్నీమధ్య మన ఊళ్ళోకి వచ్చారుట. మన ఇంటికి వెనకాల వీధిలో అద్దెకు వచ్చారని పనిమనిషి చెప్పింది" అంది అమ్మ.

   మర్నాడు రజియా నాతో మాట్లాడుతూ ఉంటే రమణి ఎందుకో కోప్పడి తన క్లాస్ లోకి ఈడ్చుకుని వెళ్ళింది. "ఆ అమ్మాయితో మాట్లాడితే దెబ్బలు పడతాయి అంది." ఈ మాట అమ్మకి చెప్పాను. అమ్మ చిన్నగా నవ్వేసి, "నేను చెప్తాలే దానికి. వెళ్ళి ఆడుకో" అంది అమ్మ. అమ్మ వెళ్ళి ఆడుకో అంది అంటే ఏదో ముఖ్యమైన పనిలో ఉండడమో , లేదా చిరాగ్గా ఉండడమో అయ్యుంటుంది.

    రజియా తో నాకు స్నేహం కుదిరాక రోజూ స్కూలుకి వెళ్ళడం మొదలెట్టాను. ఒకరోజు ఇద్దరం నడుస్తూ ఉంటే, రజియా అని అప్రయత్నంగా పిలిచాను. ఆమె ఆశ్చర్యంగా నా మొహంలోకి చూసింది. ఎప్పుడూ తనని పేరు పెట్టి పిలవని నేను అలా పిలిచేసరికి ఆశ్చర్యపోయింది. కళ్ళతోనే ఏమిటన్నట్లు అడిగింది. "నీకళ్ళు చాలా అందంగా నవ్వుతున్నాయి తెలుసా, అందుకే నీకళ్ళంటే నాకు చాలా ఇష్టం". "హేయ్ కిట్టూ, అలా గట్టిగా అనకు" అంది. "తప్పా" అడిగాను. "నువ్వు చెప్తే బాగుంది, కానీ గట్టిగా అంటే అందరూ నన్నుఏడిపిస్తారు" అంది.

   రజియా వాళ్ళమ్మ వాళ్ళనాన్నతో గొడవపడి విడిపోయిందిట. వాళ్ళ నాన్న మంచివాడు కాదట. ఈ చుట్టుపక్కల గ్రామాల్లో బేకరీ అంటే ఎవరికీ తెలియకపోవడం వలన, తనకు వచ్చిన పని చేసుకుంటూ రొట్టెల వ్యాపారం చేసుకోవాలని, ఒక్కగానొక్క కూతుర్ని తీసుకొని ఈ ఊరొచ్చింది, రజియా వాళ్ళమ్మ, ముంతాజ్. తన కూతుర్ని చదివిస్తూ, కూతురితోనే తన జీవితం అన్నట్లు రోజులు గడుపుతోంది ఆవిడ. గిన్నెలు తోముతున్న పనిమనిషి అమ్మకి చెప్పడం విన్నాను నేను.

    రెండేళ్లు గిర్రున తిరిగి, రజియా సుల్తానా టెన్త్ ఫస్ట్ క్లాస్ లో పాసైన రోజు నాకు చాల సంతోషంగా అనిపించింది. తాను ప్రత్యేకంగా మా కోసం అల్లం తో బిస్కెట్స్ చేయించి, తీసుకొచ్చి ఇస్తే, అమ్మ తనకు ఏదో గిఫ్ట్ ఇచ్చి పంపింది. రజియా కాలేజీ లో జాయిన్ అవ్వకుండానే వాళ్ళ దగ్గర బంధువు సలీంతో నిఖా జరిపించేసి బాధ్యత తీర్చుకుంది వాళ్ళమ్మ.

    అయితే రజియాకి పెళ్ళైన విషయం ఎప్పుడో సెలవులకి వచ్చినప్పుడు తెలిసి ఎందుకో మనసులో బాధగా అనిపించింది. రజియా లాంటి తెలివైన అమ్మాయి చదువుకుంటే బాగుండేది అనిపించేది. 

              *****

    ఉన్నత చదువులు పూర్తవ్వడం, తరువాత కాలంలో అనుకోని కొన్ని బాధాకరమైన సంఘటనలు జీవితంలో వెంటాడడం, అప్పటికే ఎంతో ఇష్టమైన అమ్మ, ఈ లోకానికి సెలవంటూ వెళ్ళిపోడం నన్నెంతో కృంగదీశాయి. ఈ క్రమంలో రజియా నాకు గుర్తురావడానికి అవకాశం కూడా లేదు. ఒకరోజు నా చిన్ననాటి స్నేహితులు ఇద్దరు కనిపించినప్పుడు హఠాత్తుగా వచ్చిన మాటల్లో రజియా పేరు వచ్చింది. ఆ అమ్మాయి ఇప్పుడు ఎక్కడ ఉంది అడిగాను నా మిత్రుల్ని.

   వాళ్ళు చెప్పిన అడ్రస్ పట్టుకొని వెళ్ళడం కొంచెం కష్టమైనా సరే కానీ రజియా వాళ్ళ ఊరు వెళ్లాను. ఐతే ఆమె ఫోన్ నెంబర్ అదీ ఏమీ లేకపోవడంతో ఇల్లు కనుక్కోడం కొంచెం కష్టమే అయ్యింది. "సలీం అని ఒకాయన ఇక్కడ బేకరీ నడిపేవాడుట ఒకప్పుడు" అడిగాను ఒక పాన్ షాప్ అతణ్ణి. "మీకు అతను ఎలా తెలుసు" అడిగాడు అతను. "కొంచెం పరిచయం ఉంది. ఆయనతో మాట్లాడ్డానికి వచ్చాను" అన్నాను. "ఆయన ఇప్పుడు ఇక్కడ లేడు. ఏమయ్యాడో మాకూ తెలియదు" అన్నాడు. "పోనీ వాళ్ళ ఫామిలీ ఉంటుంది కదా. నాకు వాళ్ళిల్లు ఎక్కడో చెప్పగలరా"? అడిగాను.

    ఏమనుకున్నాడో, ఒకబ్బాయిని తోడిచ్చి పంపించాడు. "ఇదే అంకుల్ వాళ్ళిల్లు" అంటూ వచ్చిన అబ్బాయి అక్కడినుండి పారిపోయాడు. నేను డోర్ కొట్టాను. "ఎవరూ" అంటూ ఒక గొంతు వినిపించింది. అదే గొంతు, అవే నవ్వుతున్న కళ్ళు. అందమైన చిరునవ్వు. నా కళ్ళముందు కనిపించ బోతోంది నా చిన్ననాటి స్నేహితురాలు రజియా సుల్తానా. మళ్ళీ తలుపు కొట్టాను. "ఎవరూ, వస్తున్నా ఆగండి" అంటూ కొంచెం సేపటికి తలుపు తెరిచింది.

   తలమీంచి ముసుగు కప్పుకొని ఉంది. పనిలో ఉందేమో, చేతులు తాను వేసుకున్న డ్రెస్ కి తుడిచేసుకుంది. ఎవరదీ అంటూ మళ్ళీ అడిగింది. నిజంగా నన్ను గుర్తుపట్టలేదా? అనుకుంటూ, "నేనే" అన్నాను. "ఎవరండీ మీరు" అడిగింది ఆశ్చర్యంగా మళ్ళీ గొంతు గుర్తు పట్టినట్లు "కిట్టూ బాబూ" అంది సంభ్రమాశ్చర్యాలతో. "అవును నేనే, కానీ నువ్వు నన్ను మరిచిపోయావు, అందుకే గుర్తుపట్టలేక పోయావు" ఒకింత బాధగా అన్నాను.

  "అదేం లేదు, రా".. అంటూ నా చెయ్యి పట్టుకొని ఇంకో చేత్తో కర్ర పట్టుకొని తడుముకుంటూ నడుస్తోంది. "నువ్వు రజియా సుల్తానావే కదా" చెయ్యి విడిపించుకుంటూ అనుమానంగా అడిగాను. "అవును కిట్టూ, నేనే" అంది. "ఏమైంది ఆ కళ్ళకి, ఎందుకు కర్రపట్టుకొని తడుముకుంటూ నడుస్తు న్నావు" అడిగాను. తెలీకుండానే నా కళ్ళల్లో నీళ్ళు. ఆ కన్నీటిలో చెదిరిపోయినట్లున్న రజియా అందమైన ముఖం, "కూర్చోడానికి కుర్చీ లేదు కిట్టూ", అంటూ ఖాళీగా ఉన్న బిందె బోర్లించి, దానిమీద ఒక దిండు పెట్టి, కూర్చో, బాగా పెద్దవాడివయ్యావు" అంది, టీ పెడుతూ. "అవన్నీ సరే, నీ కళ్ళు కేమైంది" అడిగాను దాదాపుగా ఏడుస్తున్న గొంతుతో. చిన్నగా నవ్వి, "కళ్ళు ఆ అల్లా తీసుకున్నాడు కిట్టూ" అంది చాలా కూల్ గా. ఇంట్లో ఏమీ వస్తువులు లేవు. కటిక పేదరికం ఆమె ఇంట్లో తాండవిస్తోంది. ఆ ఇల్లు చూస్తే అర్థమవుతోంది. టీ పెట్టి నా పక్కనే కూర్చొని నా చేతిని తన చేతిలోకి తీసుకుని తడిమింది. ఆ స్పర్శ లో ఆప్యాయత ఉంది. ఆ స్పర్శలో చిన్నప్పటి అనుబంధం ఉంది. 

    తన కళ్ళ గురించి గట్టిగా నిలదీస్తే అప్పుడు చెప్పింది, నా భర్తకి బేకరీ ఉండేది. బేకరీ లో తయారైన సరుకు షాప్ లకి వేసేవాడు. ఎలా, ఎందుకు మొదలైందో నా మీద అనుమానం మొదలైంది. రోజూ మద్యం తాగివచ్చి కొట్టేవాడు. భరించి భరించి ఒకరోజు ఎదురు తిరిగాను. అంతే, బలంగా కర్రతో తలమీద కొట్టాడు. నేను పడిపోతే చచ్చిపోయానని వదిలేసి పారిపోయాడు. రెండో రోజు స్పృహలోకి వచ్చాను. అప్పటికే కళ్ళకి చూపు పోయింది. టీ నా చేతికి ఇస్తూ, "కిట్టూ, ఒక్కసారి నీ మొహం తడిమి చూడనీ" అంది.

    నా మొహాన్ని ఆప్యాయంగా తడుముతూ, "ఇలా అయిపోయావేంటి కిట్టూ" అని అడిగింది. నా కథ అంతా విన్నాకా, ఆమె మొహం దిగాలుగా ఉండడాన్ని గమనించాను. "జరిగిందేదో జరిగింది, నీకు నేను తోడున్నాను, నువ్వు ఇలా ఉండడం నాకు నచ్చలేదు పదా!" అంటూ ఆమెను నాతో రమ్మని నిర్బంధం చేసి, బయల్దేరేలా ఒప్పించాను. బయటికి వస్తూనే 


రమణి కి కాల్ చేసి, రజియా కి జరిగిన అన్యాయం వివరించాను.

    "చూపు రావడం కష్టంరా. డాక్టర్ వి నీకు మాత్రం తెలియదా చెప్పు" అడిగింది రమణి. "రజియా కి దారి చూపించాలి ఇది నా రిక్వెస్ట్ కాదు. ఆర్డర్ అనుకో" చెప్పాను. "రజియా సంతోషంగా ఉంటే చాలు ప్రస్తుతం. తరువాత కళ్ళసంగతి చూడొచ్చు" చెప్పాను. "ఆమెను నేనొక చోట ఉంచుతాను. నాతోనే ఉండొచ్చు కానీ ఆమెకు పూర్తిగా కొన్నాళ్ళు రెస్ట్ ఉండాలి". చెప్పింది రమణి. ఏర్పాట్లు చకచకా జరిగిపోయాయి. తన హాస్పిటల్ కి దగ్గర్లోనే ఒక ఇల్లు అద్దెకు తీసుకుంది. ఒక మనిషిని ఆమె కోసం ఏర్పాటుచేసింది. రజియా కి ఇప్పుడు అమ్మా, నాన్నా అన్నీ తానే అయ్యింది.

    "కిట్టూ బాబూ, రమణి ఎంతో మంచిది. నాకు అమ్మలా అన్నీ చేసిపెడుతోంది" ఎప్పుడు ఫోన్ చేసినా ఈ మాట చెప్తుంది తాను. "రజియా కి ఆపరేషన్ చేద్దాం, చూపురావచ్చు అన్నారు. అన్ని టెస్టులు చేయించాను" రమణి స్వయంగా చెప్పిన మాటలు నాకెంతో ఆనందాన్నిచ్చాయి. కార్నియా ట్రాన్స్ప్లాంట్ చేసే ప్రయోగం విజయవంతం అవుతుందని ఆశిస్తున్నా. ఎప్పటికైనా ఆ కళ్ళు మళ్ళీ నవ్వాలి. ఆ ముఖంలో ఆనందం చూడాలి. ఆ నవ్వుల్లో చిన్నప్పటి రజియా సుల్తానాను మరొకసారి చూడాలి.


Rate this content
Log in

Similar telugu story from Abstract