ఉదయమందు
ఉదయమందు
నడకలోని మాధుర్యం..అందమందు ఉదయమందు..!
ఆరోగ్యం కుదురుకోగ..సాయమందు ఉదయమందు..!
మందులెన్ని తోడున్నా..గంట నడక గొప్పమందు..
కణకణమున చైతన్యపు..భోగమందు ఉదయమందు..!
ఆహ్లాదం ఉల్లాసం..కలగలిపిన ప్రసాదమే..
ఊపిరికో ఉత్తేజపు..స్వర్ణమందు ఉదయమందు..!
మాటాడక నిన్నునీవు..గమనిస్తూ నడవాలోయ్..
నీ లోపలి దైవానికి..హాసమందు ఉదయమందు..!
లేవగానే ఒక్క గ్లాసు..నీరుత్రాగి బయలుదేరు..
నెమ్మదైన నడకచాలు..దివ్యమందు ఉదయమందు..!
పూలగాలి ఉంటేసరె..ఉన్నగాలి తోడుచాలు..
ఉదయించే సూర్యునితో..కూడమందు ఉదయమందు..!