SATYA PAVAN GANDHAM

Horror Crime Thriller

4.2  

SATYA PAVAN GANDHAM

Horror Crime Thriller

"అన్వేషణ-1(మా"నవ" మృగానికై)"

"అన్వేషణ-1(మా"నవ" మృగానికై)"

5 mins
555


ఆ రోజు ఆదివారం, సుమారు అర్ధరాత్రి ఒంటిగంట ఆ ప్రాంతంలో జూబ్లీహిల్స్ పరిధిలోనున్న పోలీస్ స్టేషన్కి ఒక అజ్ఞాత వ్యక్తి దగ్గర నుండి ఫోన్ కాల్ వచ్చింది.


"హలో..!


సార్ ..! సార్..!


అది జూబ్లీహిల్స్ పోలీసుస్టేషన్ ఆ అండి !


హా.. అవునయ్య (ఆ రాత్రి డ్యూటీలోనున్న కానిస్టేబుల్ బదులిచ్చాడు)


"ఇక్కడ ... ఇక్కడ...


జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 10, లక్ష్మి విలాస్ అపార్ట్మెంట్, ఫ్లాట్ నెంబర్ 333(అడ్రస్ కల్పితం)లో ఒకావిడని అతి దారుణంగా చంపేశారు సార్!


మీరు త్వరగా ర్ర.. ర్ర.. ర్రండి సార్! (కొంచెం కంగారు పడుతూ తడబడుతున్న స్వరంతో)" అంటూ విషయం చెప్పి సడెన్గా కాల్ కట్ చేశాడు ఆ అజ్ఞాత వ్యక్తి.


అది విన్న కానిస్టేబుల్ తన పై అధికారులకు సమాచారమివ్వడంతో, హుటాహుటిన ఆ అజ్ఞాత చెప్పిన అడ్రెస్స్ కి బయలుదేరి వెళ్ళారు ఆ పోలీసు వారంతా.


వాళ్ళు అక్కడికి చేరుకునే సరికే, ఆ ఫ్లాట్ మెయిన్ డోర్ తీసే ఉంది. పక్కన ఫ్లాట్లలో ఉన్న వారందరూ ఆ రూం చుట్టూ గుమిగూడున్నారు. ఎవరో ఒక వ్యక్తి మాత్రం రక్తపు మడుగులో పడున్న ఆ డెడ్బాడీ దగ్గర కూర్చుని భోరున విలపిస్తున్నాడు.. క్షణాల్లోనే అర్థమైంది వాళ్ళకి, అతను మరెవరో కాదు ఆ చంపబడ్డ మృతురాలి భర్తని.


వాళ్ళని చూడగానే


"సార్..! సార్..! రండి సార్..!


నా సంధ్యని ఎవరో... ?


అతి దారుణంగా...హు.. హు.."


అంటూ ఆవేదనతో నిట్టూర్చాడతను.


ఆ డెడ్ బాడీని అలా చూస్తుంటే, పోలీసులకి కూడా చెమటలు పడుతున్నాయి, అంత కిరాతకంగా హతమార్చాడు ఆ రాక్షసుడు.


చెంపలు మీద కొట్టి , ముక్కు మీద గుద్ధి, నోటిని గుడ్డతో కట్టి, బట్టలు చించి, ఎక్కడ పడితే అక్కడ బ్లేడ్ తో కోసి, ఒళ్లంతా గోళ్ళతో రక్కేసి, చాలా పాశవికంగా, అతి దారుణంగా, మరింత కిరాతకంగా ఒక సైకోలా ఆవిడను హతమార్చాడు ఆ దుర్మార్గుడు.


రేప్ కూడా జరిగుండొచ్చని భావించారు పోలీసులు.


సమాచారమివడంతో తెల్లారేసరికి మృతురాలి తల్లిదండ్రులు, బంధువులు, ఫోరెన్సిక్ వాళ్ళు చేరుకున్నారు ఘటనా స్థలానికి.


ఆ ఫ్లాట్లో ఆ భార్య భర్తలు తప్ప ఇంకెవరూ ఉండరు, పైగా పోలీసులకి వచ్చిన ఫోన్ కాల్ కూడా వాళ్లింట్లో నుండి వచ్చిందే కావడంతో, దోషిగా తన భర్తనే అనుమానిస్తున్నారు ఆ పోలీసులు.


తను బయటకి వెళ్లి అప్పుడే వచ్చినట్టు, తనకు ఏ పాపం తెలీదని, తాను నిర్దోషినని ఎంత చెప్తున్నా వినిపించుకోలేదు ఆ పోలీసులు.


ప్రాథమిక విచారణలో భాగంగా బాధితురాలి తల్లిదండ్రులు కూడా, తమ అల్లుడు అలాంటివాడు కాదని, పెళ్ళయ్యి సంవత్సరమవుతున్నా ఎప్పుడూ వాళ్ల మధ్య ఏ చిన్న గొడవా జరగలేదని బాధితురాలి తరుపువాళ్ళతో పాటే అబ్బాయి తరుపు వాళ్ళు కూడా పోలీసులతో వారిస్తున్నారు.


అయినప్పటికి ఆ పోలీసులకి నమ్మకం కుదరక చుట్టుపక్క ఫ్లాట్లోనున్న వాళ్ళని కూడా విచారించారు. వాళ్ల దగ్గర నుండి అదే సమాధానం వచ్చింది. ఆ భార్యాభర్తలిద్దరూ చాలా అన్యోన్యంగా మెలిగేవారని. ఎప్పుడూ ఏ చిన్న గొడవ పడేవారేకాదని. తమతో కూడా చాలా మచ్చికతో, సఖ్యతతో మెలిగేవారని..


అసలు ఇలా ఎలా జరిగిందో తమకర్థం కావడం లేదని.


ఆ అబ్బాయే ఈ హత్య చేశాడంటే అపార్ట్మెంట్ వాల్లేవరం నమ్మలేకున్నామని తేల్చేశారు. సెక్యూరిటీ కూడా ఆ ముందు రాత్రి అపార్ట్మెంట్లోకి కొత్త వాళ్ళు ఎవరూ రాలేదని పోలీసుల విచారణలో చెప్పాడు.


మరోపక్క పోస్టుమార్టం రిపోర్ట్ లో..


రేప్ జరగలేదని, కానీ చాలా కర్కశంగా, పగతో ఆవిడని ఆ హంతకుడు హత్య చేసినట్టు నిర్ధారించారు వైద్యలు.


పోలీసులకు మాత్రం...


అక్కడే, హత్య జరిగిన గదిలో ఒక మూలన


A satya's revenge అని రాసి ఉన్న ఓ చిన్న కాగితమొకటి దొరికింది. అదొక్కటే ఆ కేసుకు ముఖ్యమైన ఆధారం.


మరొకపక్క భర్తను విచారిస్తున్న పోలీసులకు అతని పేరు సత్య ప్రకాష్ కావడంతో తనని ఇంకా అనుమానిస్తూనే, కస్టడీలోకి తీసుకున్నారు.


అయినా కేసు కి సంబంధించి మరే చిన్న ఆధారం కూడా అతని వద్ద లభించడం లేదు.


ఆ యువతి కాల్ హిస్టరీ, ఫ్రెండ్స్ , పెళ్లికి ముందు కాలేజీలో తన ప్రవర్తన గురించి అంతా, అందరినీ విచారించారు పోలీసులు. అయినా లాభం లేకపోయింది. ఒక చిన్న క్లూ కూడా వాళ్ళకి దొరకలేదు.


సత్య ప్రకాష్(యువతి భర్త)ని దోషిగా తేల్చే సరైన ఆధారాలు కూడా కోర్టులో ప్రవేశపెట్టాలేకపోయారు పోలీసులు. దీంతో కోర్టు బెయిలు పై సత్య ప్రకాష్ ని విడుదల చేసి, కేసుని పదిహేను రోజులకు వాయిదా వేసింది.


ఆ హత్య ఎవరు చేశారోనని ఆ పోలీసులకి అంతు చిక్కడం లేదు.


వారం గడుస్తున్న కేసు లో మాత్రం పురోగతి లేదు.


                                *************


ఇదిలా ఉండగా...


వారం తర్వాత, సరిగ్గా అదే రోజు ఆదివారం.


ఈ సారి గచ్చిబౌలి పరిధిలో పోలీసు స్టేషన్కి ఓ కాల్ వచ్చింది.


ఇందిరా నగర్ కాలనీలో సుందర్ అపార్ట్మెంట్ 65 వ ఫ్లాట్లో(అడ్రస్ కల్పితం) సౌమ్య అనే ఓ యువతిని అతి కిరాతకంగా చంపేశారని అపార్ట్మెంట్ వారు సమాచారమిచ్చారు పోలీసులకు.


అక్కడికి చేరుకుని, తల్లిదండ్రులను విచారించిన పోలీసులకు తమ కూతురు జాబ్ చేస్తూ తమకు ఆసరాగా ఉంటుందని, ఇతరుల జోలికి వెళ్లి కీడు తలపెట్టే మనస్తత్వం కల అమ్మాయి కూడా కాదని, ఈ మధ్యే ఒక మంచి సంబంధం కుదిరిందని, ఎంగేజ్మెంట్ కి ప్లాన్ చేస్తున్న తరుణంలోనే ఇప్పుడు ఇలా..


పాపం పుణ్యం ఎరుగని నా బిడ్డను అన్యాయంగా పొట్టనపెట్టుకున్నారని వాపోయారు..


తనని చేసుకోబోయే అబ్బాయి తరుపు వాళ్ళని కూడా విచారించిన పోలీసులకు వాళ్ల వద్ద కూడా ఏ ఆధారాలు లభించకపోయే సరికి, వాళ్ళకి ఈ హత్య కి సంబంధం లేదని వాళ్ళని నిర్దోషులుగా విడిచిపెట్టారు.


కానీ, అంతకుముందు జుబిహిల్స్ లో హత్య చేయబడ్డ వివాహిత లాగానే ఈ అమ్మాయిని కూడా ఆ హంతకుడు కర్కశంగా, దారుణంగా హత్య చేశాడు. తన జుట్టుని పట్టుకుని నేలకేసి కొట్టి కసితీరా చంపినట్టున్నాడు.


హత్య చేసిన విధానం చూస్తుంటే, అంతకు ముందు వారం జూబ్లీహిల్స్ లో జరిగిన ఆ వివాహిత హత్య కి ఈ అమ్మాయి హత్య కి చాలా దగ్గర పోలికలు ఉండడంతో ఆ రెండు హత్యలు చేసింది ఒక్కరేనని ఆ పోలీసులు నిర్ధారణకు వచ్చారు.


దానికి తోడు అంతకు ముందు హత్య కేసులో అక్కడ పోలీసులకు దొరికనట్టే A satya's revenge అని ఫ్లోర్ మీద రక్తంతో రాసిన అదే క్లూ దొరకడంతో వాళ్ల అనుమానం మరింత బలపడింది. 


ఇక అది తప్ప మరే ఆధారం దొరకకుండా ఈ సారి కూడా చాలా జాగ్రత్త పడ్డాడు ఆ కిరాతకుడు. ఈ కేసు కూడా కోర్టుకెక్కింది.


అసలే వారం క్రితం జరిగిన హత్య కేసులో పురోగతి లేదని, పోలీసుల తీరును ఎండగడుతూ కోడై కూస్తున్న మీడియాకు, ఈ ఉదంతం కూడా తొడయ్యి, పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది.


కేవలం వారం వ్యవధిలో ఇద్దరు యువతుల హత్య చేయబడడం, అది కూడా నగరం ప్రధాన ఏరియాలలో జరగడం తెలిసి, ప్రజలు బిక్కు బిక్కు మంటున్నారు. పోలీసులు ఆ సైకో కిల్లర్ ఆచూకీ తెలియక తలలు పట్టుకుంటున్నారు. మీడియాలో మాత్రం రోజూ ఇదే హాట్ టాపిక్.


                                *************


ఇది జరిగిన మళ్ళీ ఇంకో వారానికి


మళ్ళీ ఆ సైకో కిల్లర్ వేరొక హత్య చేసినట్టు పోలీసులు కి సమాచారమందించారు. ఈ సారి పంజాగుట్ట లో జరిగింది ఆ హత్య. ఆవిడ పేరు సుకన్య ఒంటరిగా జీవనం సాగిస్తుంటుందని, రెండు నెలల క్రితమే ఈ అపార్ట్మెంట్ లోకి వచ్చిందని పోలీసుల విచారణలో వివరించాడు ఆ అపార్ట్మెంట్ యజమాని. ముందు రెండు హత్యల లాగానే ఈ సారి కూడా అతి దారుణంగా ఆవిడని చంపి, ఫ్యాన్ కి తనని ఉరివేసి, ఆవిడ చేతుల మీద బ్లేడుతో A satya's revenge అని చెక్కి ఎప్పటిలానే ఒక క్లూని వదిలి, చాలా చాక చక్యంగా తప్పించుకున్నాడు ఆ హంతకుడు.


ఈ కేసు కూడా కోర్టుకెక్కడంతో, రెండు వారాల వ్యవధిలోనే మూడు హత్యలు జరిగితే ఏం చేస్తున్నారంటూ పోలీసులకి కోర్టు మొట్టికాయలు వేసింది.


కారణాలు లేకుండానే ఆ సైకో కిల్లర్ మతిస్థిమితం లేక అందరినీ పొట్టన పెట్టుకుంటున్నాడా..


లేక, వెనుక మరేదైనా బలమైన కారణంతో ఈ హత్యలన్ని పక్కా పథకం ప్రకారం చేస్తున్నాడా,

అసలు ఈ హత్యలు చేసేది ఒకరా లేక ఒక బృందమా అని పోలీసులు తనకామునకలవుతున్నారు.


రెండు వారాల వ్యవధిలో జరిగిన మూడు హత్యలు ఒకేలా ఉన్నా, పోలీసుల ప్రాథమిక విచారణలో మాత్రం అసలు ఈ ముగ్గురికి మధ్య సంబంధమే లేదని తేలింది.


నగరంలో అత్యంత దారుణంగా జరుగుతున్న ఈ వరుస హత్యలకు గల కారణాలు చేధించలేకపోవడంతో పోలీసు వ్యవస్థపై ప్రజలు నమ్మకం కోల్పోయి భయం గుప్పిట్లో బ్రతుకుతున్నారు. ఎక్కడిక్కడ ఆ సైకో కిల్లర్నీ చంపేయాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ప్రజా సంఘాలు , మహిళా సంఘాలు రోడ్ల పైకి వచ్చి ఆ సైకో కిల్లర్నీ కఠినంగా శిక్షించాలని ధర్నాలు, రాస్తా రోకోలు చేస్తున్నారు.


స్వయంగా రాష్ట్ర హోం మంత్రే జరుగుతున్న పరిణామాలకి బాధ్యత తీసుకుని, తన కేబినేట్ వారితో సమీక్షలు జరిపి పోలీసు డిపార్ట్మెంట్ వారికి అన్ని పవర్స్ ఇచ్చేశారు.


ఇక పోలీసులు సైతం ఎంక్వైరీ ముమ్మరం చేశారు. ప్రతి అణువణువునా శోధించడం మొదలు పెట్టారు. పోలీస్ డాగ్స్నీ, స్పెషల్ ఫోర్స్ నీ రంగంలోకి దింపారు. నగరంలో యువతుల పట్ల భద్రత కట్టుదిట్టం చేశారు, తమ బందోబస్తు మరింతగా పెంచారు.


ఎక్కడైన అనుమానపు వ్యక్తులు కనిపిస్తే తమకు వెంటనే తెలియచేయాలని, గుర్తుతెలియని వ్యక్తులు పట్ల జాగ్రత్తగా ఉండాలని మైక్ కాన్వర్సింగులు, పేపర్ ప్రకటనలు ఇచ్చారు. ఆ సైకో కిల్లర్ని అప్పచెప్పినవారికి తగిన పారితోషికాలు ఇవ్వబడునని ప్రకటించారు.

ఎక్కడిక్కడ కంట్రోల్ రూంలు ఏర్పాటు చేశారు పోలీసులు.


కొంతమందిని అనుమానించి అదుపులోకి తీసుకొని విచారించినప్పటికి,


విచారణలో వాళ్ళకి, ఈ హత్యకి ఏం సంబంధం లేదని వదిలిపెట్టేసారు.


ఒక పక్క ప్రజలు, మరో పక్క ప్రభుత్వం, ఇంకో పక్క న్యాయస్థానం ఇన్ని వ్యతిరేకతల నడుమ..


వీటి వెనుక కారణాలేమిటని ఎన్నో, మరెన్నో అంతుపట్టని సందేహాలతో ఆ పోలీసులు ఈ హైదరాబాద్ నగరపు అనువనవున అనుక్షణం తమ తమ అలుపెరగని అన్వేషణను కొనసాగిస్తూనే ఉన్నారు.


అసలు ఎవరా ఆ సత్య...?


సంధ్య, సౌమ్య, సుకన్య ఎవరు వీళ్ళు..?


ఆ అజ్ఞాత వ్యక్తి వాళ్ల ముగ్గుర్నీ ఎందుకంత క్రూరంగా హత్య చేశాడు?


వాళ్ళందరూ ఒకరికొరు ఏ సంబంధం లేనోల్లయినప్పటికీ...


ఈ మూడు హత్యలు ఒకేలా ఉండడం వెనుక మర్మమేమిటి?


ఆ హత్యలు చేసింది ఒకరా లేక ఒక బృందమా ?


అసలేం జరిగింది, జరుగుతుంది, జరగబోతుంది?


లాంటి సందేహాలన్నీ ఆ పోలీసులతో పాటు మీ మదిని కూడా కలవరపెడుతున్నాయి కదూ...


అందుకే తర్వాతి భాగాలను అస్సలు మిస్ అవ్వకండి మరి!


మిగిలిన కథ తర్వాతి భాగం


అన్వేషణ-2(మా"నవ" మృగానికై)


లో కొనసాగిద్ధాము..


నా ఈ కథ చదువుతున్న పాఠకులందరికీ నా కృతజ్ఞతలు🙏


రచన : సత్య పవన్✍️✍️✍️



Rate this content
Log in

Similar telugu story from Horror