SATYA PAVAN GANDHAM

Abstract Classics Inspirational

4.5  

SATYA PAVAN GANDHAM

Abstract Classics Inspirational

"కథలో రాజకుమారి-11"

"కథలో రాజకుమారి-11"

7 mins
586


"కథలో రాజకుమారి-10" కి

కొనసాగింపు...

"కథలో రాజకుమారి-11"

అలా కూతురి గదిలోకి వచ్చిన పల్లవి తండ్రి,

పల్లవితో...

"ఒరేయ్ నాన్న...!

ఇప్పటివరకూ నీకు ఏది కావాలో.., నీకేం అవసరమో తెలుసుకొని, నువ్వడక్కుండానే తెచ్చిచ్చాను. "నాకు అది కావాలి, ఇది కావాలి" అంటూ నువ్వు కూడా దేనికి అడ్డు చెప్పలేదు.

ప్రతీదాంట్లో నా మాట కాదనవనే ఆ నమ్మకంతోనే, ఆ ఉద్దేశ్యంతోనే నీ మనసెంటో తెలుసుకోకుండా పవన్ బావ తో నీ పెళ్లి చేయాలనుకున్నాను. నా మేనల్లుడు చిన్నప్పటి నాకు తెలిసినోడు, నా దగ్గరే పెరిగాడు, ఏ చెడు అలవాట్లు లేనొడు. పైగా మనమంటే అభిమానమున్న నా తొడ బుట్టిన దాని ఇంటికి నిన్ను కోడలిగా పంపితే, పాలు నీళ్ళల్లా కలిసిపోతారానే ఆశ నాది. నా కళ్ళ ముందే నువ్వు కదలాడుతూ తిరుగుతావనే అంతకుమించిన ఓ తండ్రిగా నాకో స్వార్థం కూడాను. నువ్వు పుట్టిన దగ్గర నుండి ఎప్పుడూ ఇవే ఆలోచనలు, నాకే కాదు పవన్ వాళ్ల అమ్మ నాన్నకి కూడా...నీ మీద అలాంటి అభిప్రాయమే.

కానీ, మీ అమ్మ ఆ రోజు రవికి నిన్నిచ్చి పెళ్లి చెయ్యాలని ఒత్తిడి తెస్తుంటే, నాలాగే తనకి కూడా తన పుట్టింటికే నిన్ను కోడలిగా చెయ్యాలనే స్వార్థమేమో అనుకున్నాను. పవన్ కి ఉద్యోగం లేదంటూ మీ అమ్మ వాడిని నీకు దూరం చేస్తుందని చాలా బాధ పడ్డాను.

అసలే పవన్ అంటే పడని వాళ్ల నాన్నకు కూడా...

ఆ రోజు తను ఆ జాబ్ వదిలేసుకున్న దగ్గర నుండి...

కన్నా కొడుకైనా కూడా... వాడన్నా, వాడిని నీకిచ్చి పెళ్లి చేయడమన్నా ఇష్టం లేదు. వాడి అనాలోచిత నిర్ణయాలతో వాడి భవిష్యత్తే కాకుండా నీ భవిష్యత్తు కూడా అంధకారంలో పడేస్తాడని భయంతో..

నీ గురించి తను కూడా ఓ కన్న కూతురిలానే ఆలోచించాడు. అంతిష్టం.. నువ్వంటే మీ మావయ్యకి.

కానీ, నాకు వాడన్నా(పవన్) వాడికి నేనన్నా అమితమైన ఇష్టం. కనీసం ఆ ఉద్దేశంతోనైనా నిన్ను చేసుకోడానికి ఒప్పుకుంటాడేమొనని మళ్ళీ నా చెల్లెలి, అదే వాళ్ళమ్మ ద్వారా పవన్ ని అడిగించాను.

కానీ, వాడి మనసులో కూడా నీకు స్థానం లేదని తెలిసింది. వాడి మనసెంటో వాళ్ళమ్మ మాటల ద్వారా అర్థమైంది.

నిన్ను చేసుకోవడం తనకి ఏ మాత్రం ఇష్టం లేదని తేల్చి చెప్పేసాడంట!

ఇక నాకేం చెయ్యాలో తెలియలేదు. అయినా మీ ఇద్దరికీ చిన్నప్పటినుండి పడదు కదా, అందుకే ఇలా ఇష్టం లేదంటున్నారెమో, పెళ్లి చేస్తే ఒకరినొకరు అర్థం చేసుకుంటారు, ఇద్దరికీ ఒకచోటే జాబ్ కాబట్టి కలిసి బాగానే ఉంటారేమొనని ఆశ పడ్డాను. కానీ, మీ మనసులో ఒకరిపై ఒకరికి అసహ్యం అనేది చాలా లోతుగా పాతుకుపోయిందని తెలిసి చాలా బాధ పడ్డాను.

నా మాటకు ఎప్పుడూ అడ్డు చెప్పని నువ్వు కూడా, ఆఖరికి రవినే ఇష్ట పడుతున్నావని, ఆ రోజు కరాఖండిగా చెప్పాకా.., నీ మనసెంటో తెలుసుకోలేక, వాళ్ళు కాదంటున్నా కూడా వాళ్ళని పదే పదే అడుగుతూ తొందర పడి తప్పు చేసాననిపించింది.

ఇప్పుడు తెలుస్తుంది, ఆ రోజు మీ అమ్మ తీసుకున్న ఈ నిర్ణయమే నాకూ మంచిదనిపిస్తుంది. రవి కూడా ఇది వరకట్లా కాదు, ఈ మధ్య నాతో చాలా సఖ్యతగానే ఉంటున్నాడు. ఇంకా చెప్పాలంటే పవన్ కంటే కూడా చాలా బాగా.. 

(పల్లవి కోసం అందరినీ ఏమార్చుతున్నాడని తెలియట్లేదు పాపం)

అయినా నీ లాంటి బంగారు తల్లిని చేసుకునే అదృష్టం వాడికి కానీ, ఆ ఇంటికి కానీ లేదు. నువ్విష్ట పడే చోటికి కాకుండా, నువ్వంటే ఇష్టం లేని చోటుకి నిన్ను పంపించాలనుకున్నాను. అక్కడే జీవితాంతం ఉంచాలనుకున్నాను. నీ విషయంలో ఉన్నతంగా ఆలోచించే నేను, ఈ విషయంలో తొందరపడి నీ మనసెప్పుడైనా నొప్పించుంటే నన్ను క్షమించమ్మా..!"

అంటూ తన మనసులో మోస్తున్న వాటిని పల్లవికి వివరించాడు ఆయన.

అప్పటివరకూ పవన్ అంటే ఆయనికి మంచి అభిప్రాయం ఉన్నట్టు భావించిన పల్లవికి, తనతో పెళ్లికి నిరాకరిస్తూ.. ఆ క్షణం ఆయన దృష్టిలో ఒక్కసారిగా తను విలన్ అయిపోయాడని అర్థమైంది ఆయన మాటల్లో...

జరిగిన విషయాలన్ని తన తండ్రికి చెప్పాలనుకున్నా, తన మీద ఏర్పడిన అయిష్టంతో ఆయన ఇప్పుడేం చెప్పినా అర్థం చేసుకోరనే భావం పల్లవిలో బలంగా నాటుకుపోయంది. ఇప్పటికే పెళ్లికి టైం కూడా దగ్గర పడుతుంది. ఇప్పటికిప్పుడు తన మనసు మార్చుకున్నంత తేలిగ్గా.. ఆ శుభలేఖలో పెళ్లి కొడుకు పేరు కానీ, పెళ్లి పీటలపై పెళ్లి కొడుకుని కానీ మార్చడం కష్టం. పైగా అసలే కోపంతో తన మీద కూడా తన d

తండ్రికి అసహ్యం పెరుగుతుందనే భయం. అందుకే, అవేం చెప్పలేక తన మనసులోనే సమాధి చేసుకుంది. ఆ పెళ్ళికి అడ్డు చెప్పలేకపోయింది.

                       *********************

"పల్లవిని అంతగా ప్రేమించిన పవన్ ఎందుకు పల్లవి అంటే ఇష్టం లేదని చెప్పాడో తెలుసుకోవాలంటే,

తన తండ్రి అన్న మాటలకు... మాసిన బట్టలతో ఆ పెళ్లి పందిరిలో నుండి వెళ్లిపోతున్న పవన్ ఆలోచనలను మనం అందుకోవాలి."

ఎప్పుడూ వాళ్ళమ్మ దగ్గర నిజం దాచని తను, ఆ రోజు వాళ్ళమ్మకు ఎందుకు పల్లవి అంటే ఇష్టం లేదని అబద్ధం చెప్పాడో.. తనలో తానే గుర్తుచేసుకుంటున్నాడు. వాళ్ళమ్మ దగ్గర నిజం దాచినా.. తన మనస్సాక్షికి చెప్పే తీరాలి కదా మరీ!.

అసలేం జరిగిందంటే,

"ఆ రోజు పవన్ కి రవి కి మధ్య జరిగిన సంఘటన తర్వాత పవన్ దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. కానీ, వాళ్లిద్దరి ఇళ్లలో పవన్ పల్లవిలా పెళ్లి ప్రస్తావన వస్తూనే ఉంది. అది నచ్చని పల్లవి తల్లి పవన్ నీ కలిసి ఓ రోజు ఏకాంతంగా మాట్లాడింది.

"ఒరేయ్ పవన్..!

నేను దేని గురించి మాట్లాడాలని పిలిచానో, నీకు ఈపాటికే అర్ధమయ్యి ఉంటుంది. అదే మీ పెళ్లి గురించి..

మీ మావయ్య ఎలాగైనా పల్లవిని నీకిచ్చి పెళ్లి చెయ్యాలని గట్టి సంకల్పంతో ఉన్నాడు. ఆయనికి ఉన్నట్టే నాకు నా అన్న కొడుక్కి ఇచ్చి చెయ్యాలనే ఆశ ఉంటుంది కదా..

పైగా మా అమ్మ నాన్నలకి, అన్నా వదినలకి అది చచ్చేంత ఇష్టం చిన్నప్పటినుండి. దాన్నే వాళ్ళంటికి కోడలిగా చేసుకోవాలని మంకు పట్టుదల వాళ్ళది. రవికి కూడా అదంటే చాలా ఇష్టం. కానీ, దానికి మీ మావయ్య అడ్డు పడుతున్నాడు. మీ అమ్మ నాన్నకి కూడా అదంటే ఇష్టమని, ఎలాగైనా పల్లవిని నీకిచ్చే చెయ్యాలని ఆయన, కాదని నేను...ఆయనకి నాకు ఎప్పుడూ దాని పెళ్లి విషయంలో గొడవే.

నీకు దానికి పడదు అన్న విషయం మా అందరికీ తెలుసు, మీక్కూడా...

కానీ, ఎందుకో వీళ్ళు ఇలా ఆలోచిస్తున్నారు. తండ్రి మాట కాదనలేక అది నిన్ను చేసుకుందే అనుకో.. మీరిద్దరూ జీవితాంతం సంతోషంగా ఉండగలరా?

అందుకే, చిన్న వాడివైనా ఒక్కసారి నువ్వు కూడా పెద్ద మనసు చేసుకుని దీని గురించి ఒక్కసారి ఆలోచించు...!

నాకు తెలుసు, ఈ పెళ్లంటే ఇష్టం లేదని చెప్తే మీ నాన్న గారికి నీకు మధ్య దూరం పెరుగుతుందని. కానీ, ఇది కొంతమంది జీవితాలకి సంబంధించిన విషయం. ముఖ్యంగా నా కూతురు జీవితానికి.. అందుకే, కొంచెం లోతుగా ఆలోచించి నిర్ణయం తీసుకో...

ఆ రోజు రవి నాకు కాల్ చేసి, మీ మధ్య జరిగిందంతా చెప్పాడు. రవికి పల్లవంటే ఇష్టమని నాకు ముందే తెలుసు. అసలు ఆ జాబ్ గురించి నిన్నడగమని తనకి ఆ ఆలోచన ఇచ్చిందే నేను.

ఈ జాబ్ కాకపోతే, నీ టాలెంట్ కి ఇంత కన్నా మంచి జాబ్ వస్తుంది. కానీ, దీని వల్ల మీ పెళ్లి చెడిపోవడం తో పాటు, రవి కి అదే కంపనీ లో జాబ్ వస్తుంది. వాళ్ల మధ్య బంధం బలపడుతుంది. రవి పల్లవిలా పెళ్లికి మార్గం కూడా సుగమం అవుతుంది. నువ్వు తీసుకునే ఈ ఒక్క నిర్ణయం వల్ల కొన్ని జీవితాలు బాగుపడతాయి.

కానీ, అదే మీ పెళ్లి జరిగితే, నాకు నా పుట్టింటి వాళ్ళు దూరమై పోతారు. మీ పెళ్లి చేసిన మేము సంతోషంగా ఉండలేము.

నా కూతురు కూడా నీ దగ్గర సంతోషంగా ఉండలేదు.

కాదు కూడదు అంటే నీ ఇష్టం. బాగా ఆలోచించు..

చివరిగా ఒక్క మాట...

మీ పెళ్లి జరిగితే, నాకు మా పుట్టింటి వాళ్ళను దూరం చేసిన పాపం నీకే తగులుతుంది. నేనది తట్టుకోలేను." అంటూ కనీసం ఆ మాటలకు పవన్ చెప్పే సమాధానమేమి వినకుండా అక్కడ నుండి వెళ్ళిపోయింది పల్లవి తల్లి.

ఇక కథలోని గతంలో నుండి బయటకి వచ్చిన మనం ఆ పెళ్లి మండపం దగ్గరకు వెళ్తే,

అలా జరిగిన గతాన్ని తలుచుకుంటూ వెళ్తున్న పవన్ కి,

ఆ భాజాబజంత్రీల శబ్ధం ఒక్కసారిగా ఆగిపోయినట్టనిపిస్తుంది.

వెనకకు తిరిగిన పవన్ కి పల్లవి తన దగ్గర కి పరిగెత్తుకుంటూ వచ్చి గట్టిగా వాటేసుకుంటుంది.

"ఐ లవ్ యూ బావా...!

ఐ లవ్ యూ.. !!"

ఇప్పటివరకూ ఎందుకు నా దగ్గర ఇదంతా దాచావ్..!

ప్లీజ్ ఇప్పటికైనా మించిపోయింది లేదు, నన్ను పెళ్ళి చేసుకో..!" అంటూ ఆ పెల్లికొచ్చిన వాళ్ల ముందు, వాళ్ల ఇంట్లో వాళ్ల ముందు, ఆ పెళ్లి కొడుకు ముందు ఏ మాత్రం భయపడకుండా పవన్ నీ గట్టిగా కౌగలించుకుని ఏడుస్తూ తనలో ప్రేమను బయటకు దైర్యంగా వ్యక్తపరుస్తుంది.

పవన్ కి అసలేం జరుగుతుందో ముందు అర్థం కాకపోయినా..

జరిగిన విషయాలన్నీ తెలిసి, పల్లవి తన చెంతకు చేరుకుందనుకుంటాడు.

"బాబు... జీలకర్ర బెల్లం అమ్మాయి నెత్తిమీద పెట్టు, భాజా బజంత్రీలు మీ మంగళ వాయిద్యాలు మొదలుపెట్టండి" అంటూ పంతులు గారి మాటలు , ముహూర్త సమయాన ఆయన మంత్రాలు చెవిన పడ్డ పవన్, ఆ ఊహ నుండి తేరుకున్నాడు.

(దాంతో అప్పటి వరకూ జరిగిందంతా, తన ఊహా మాత్రమేనని పవన్ తో మీకు అర్థమైందనుకుంటా.)

ఈ లోపే అటుగా వెళ్తున్న పవన్ ఫ్రెండ్ తన దగ్గరకు వచ్చి,

"అరేయ్.. !

అరేయ్..!!

పవన్..

ఒక పక్కన అక్కడ నీ మరదలు పెళ్లి జరుగుతుంటే,

నువ్వేంటి..?,

ఈ అవతారం ఏంటి?

అసలిక్కడ నిలబడి అంత దీర్ఘంగా ఏం ఆలోచిస్తున్నావ్..?" అంటూ భ్రమలోనున్న తనని ఆ భ్రమలో నుండి మరింతగా బయటకు లాగుతాడు.

పవన్ ఫ్రెండ్ అలా పవన్ నీ ఆ మండపపు హల్ గుమ్మం దగ్గరకు తీసుకెళ్లే సరికి, ఆ గుమ్మం నుండి పవన్ చూస్తుండగానే అందరి సమక్షంలో అందరి ఆశీర్వాదాలతో రవి, పల్లవి ఒక్కటవబోతున్నారు. పల్లవి మాత్రం తనని క్షమించమన్నట్టు పవన్ వైపు తదేకంగా చూస్తూనే ఉంటుంది.

"ఒక్కసారి నన్ను ప్రేమించానని చెప్పు బావా, ఉన్న పలంగా ఈ పీటల మీదనుండి లేచి నీతో కలిసి ఏడడుగులే కాదు, ఏడేడు జన్మాలు నడుస్తాను. నేను చెప్పేది నీకు వినిపిస్తుందా?" అంటూ పవన్ ని చూస్తూ పల్లవి తన మనసులో అనుకుంటూ కన్నీళ్లు కారుస్తుంది.. అక్కడనున్న వాళ్లంతా అవి కన్యాదానపు నిట్టూర్పులు అనుకుంటూ.. తనని ఓదారుస్తారు. కానీ, తనకి మాత్రమే తెలుసు వాటి వెనకున్న కారణమేమిటో!

"కనీసం మరొక్క సారి నీకు ఐ లవ్ యూ పల్లవి..! అని చెప్పాలని ఉంది.. దానికి నువ్వు ఒప్పుకుంటే, ఇక్కడున్న వాళ్ళని ఎంతమందినైనా ఎదిరించి నిన్ను నా దాన్ని చేసుకోవాలని ఉంది. కనీసం ఇప్పుడైనా నా ప్రేమ పిలుపు నీ హృదయపు చెవులను తాకుందా..? " అంటూ పల్లవిని చూస్తూ పవన్ తన మనసులో... అనుకుంటూ పెళ్లి పీటలపై ఉన్న పల్లవిని అలానే చూస్తుంటాడు.

ఈ లోపే ఆ జీల కర్ర బెల్లం తంతు కాస్తా పూర్తయ్యింది. పల్లవి మెడలో మూడు ముళ్ళు రవి చేతుల ద్వారానే పడ్డాయి. తన హస్తాల్లోకే పల్లవి జీవితం జారుకుంది.

ఇక పల్లవి.. రవికి మాత్రమే సొంతం.

ఆ క్షణం ఇద్దరి(పవన్ పల్లవిలా) హృదయాలు బద్దలయ్యాయి. వారిద్దరి ప్రేమ అక్కడున్న వారికి ఎవరికి తెలీదు..!

అసలు వారిద్దరికీ ఒకరి ప్రేమ గురించి ఇంకొకరికి తెలీదు.

"నీ సొగసుల సౌందర్యం మాయమైన వేళ...

ఎందుకాగలేదో, నీకై నా ఈ నయనపు ఎదురుచూపులు!

నీ పలుకుల సవ్వడి మూగబోయిన వేళ...

ఎందుకాగలేదో, నీకై నా ఈ నిరంతరపు ఆలోచనలు!

నీ పెదవుల చిరునవ్వు ఇక దొరకదన్న వేళ...

ఎందుకాగలేదో, నీకై నా ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసములు!

నీ అడుగుల కదలిక దూరమైన వేళ...

ఎందుకాగలేదో, నీకై నా ఈ హృదయపు స్పందనలు!"

ఇదే అసలైన ప్రేమంటూ నా మది నాకు మద్దతిస్తూ జై కొడుతుంది.

ఇక బయట పడవా అంటూ నా బుద్ధి నన్ను వెక్కిరిస్తూ ఛీ కొడుతుంది.

ఎవరి మాటని వినను? ఎవరికని నచ్చజెప్పను?

నువ్వే చెప్పు, ఓ ప్రియ నేస్తం!

దూరమైనా, చేరువైనా నా తీరపు అల నువ్వని,

బరువైనా, బాధ్యతైనా నా ఊహల పల్లకి నువ్వని,

భారమైనా, బంధమైనా నా హృదయపు తీగ నువ్వని,

స్వప్నమైనా, నిజమైనా నా వేకువ పొద్దు నువ్వని

వాటికీ... నీకు... తెలీదా?

చివరిగా, నీతో చెప్పాలనుంది...

నువు దూరమైనా...

ఎన్నాళ్లగానో నీకై నా ఈ మనోవేదన?

ఎన్నాల్లైనా తప్పదుగా నీకై నా ఈ నిరీక్షణ!

నీకై తపించే...

కాదు కాదు,

నీ ప్రేమకై నిరంతరం శ్రమించే

- ఓ ప్రేమ పిపాసి...

అంటూ పవన్ మదిలో పల్లవి గురించి ఇంకా ఆలోచనలు పొంగిపొర్లుతున్నాయి.

"పల్లవి..."

పవన్ కథలోరాజ కుమారిగానే కాదు,

తన కలల రాకుమారిగా...

తన ప్రేమ కన్నీటికి కారకురాలుగా మిగిలిపోయింది.

రచయితగా నా విశ్లేషణ:

ఆ ప్రేమ బలయ్యింది...

ఒకరిపైఒకరికున్న వాళ్ళిద్దరీ ఇష్టాలు బయట పెట్టలేక వాళ్ల మనసులు మూగబోయినందుకు...

బలయ్యింది కానీ, బలమైంది.

ఆ ప్రేమ బలయ్యింది..

రవి, పల్లవి తల్లి స్వార్థానికి,

అనుబంధాలు, ఆప్యాయతతో నిండిన పవన్ పెద్ద మనసుకు...

బలయ్యింది కానీ, బలమైంది.

ఆ ప్రేమ బలయ్యింది..

కొన్ని అపార్ధాలకు, ఇంకొన్ని త్యాగాలకు...

బలయ్యింది కానీ, బలమైంది.

మీరందరూ అనుకున్నట్టు పవన్ ప్రేమ ఓడిపోలేదు. తనని అంతలా ప్రేమించిన పవన్ ...

తన ఇష్టాన్ని కాదనలేక తను కోరిన దాన్ని తనకిస్తూ తన మనసుని త్యాగం చేశాడు.

తను సంతోషంగా ఉండాలని రవికి తన జాబ్ నీ త్యాగం చేశాడు.

పల్లవి అమ్మ, వాళ్ల అన్న తరపు వాళ్ళు సంతోషం కోసం తన ప్రేమను త్యాగం చేశాడు.

అంతగా ప్రేమించే వాళ్ల మేన మామకి, ద్వేషించే వాళ్ల నాన్న దృష్టిలో ఒక చెడ్డ వాడిగా మిగిలిపోయాడు.

ఇవన్నీ కేవలం తనకు పల్లవి మీదున్న ప్రేమను మాత్రమే తెలియచేస్తున్నాయి.

ప్రేమించిన అమ్మాయిని ఎలాగైనా పొందడం కాదు, తనకోసం తన సంతోషం కోసం ఏం చేయడానికైనా, ఎంత చేయడానికైనా సిద్ధ పడడమే ప్రేమకు ఇచ్చే నిజమైన గుర్తింపు, అదే నిజమైన ప్రేమని నా గట్టి నమ్మకం. అందుకే ఇక్కడ పవన్ ప్రేమ గెలిచింది.

పవన్ ప్రేమ బలైంది కానీ, చాలా బలమైనది.

నిజం నిప్పులాంటిది అంటారు. పవన్ చేసిన త్యాగాలన్నీ వాళ్ల కుటుంబంలో వాళ్ళకి ఎప్పటికైనా తెలిసి, తనపై ఉన్న ఆ చెడ్డ అభిప్రాయం కాస్తా పోయి, మనకు లాగానే వాళ్ల దృష్టిలో కూడా పవన్ మంచి వాడిగా మిగిలిపోవాలని కోరుకుందాం.

ఇంతటితో నా ఈ కథలో రాజకుమారి అనే కథ ముగిసింది.

ఇన్ని రోజులు నా రచనలను ఆదరిస్తూ, నాకు మద్దతిస్తున్న పాఠకులందరికీ నా హృదయ పూర్వక ధన్యవాదములు

రచన: సత్య పవన్ ✍️✍️✍️



Rate this content
Log in

Similar telugu story from Abstract