SATYA PAVAN GANDHAM

Abstract Inspirational Thriller

4  

SATYA PAVAN GANDHAM

Abstract Inspirational Thriller

"శ్రీ కృష్ణ మహా భారతం - 22"

"శ్రీ కృష్ణ మహా భారతం - 22"

8 mins
268


"శ్రీ కృష్ణ మహా భారతం - 21" కి

కొనసాగింపు...

"శ్రీ కృష్ణ మహా భారతం - 22"

ఆ రోజు రాత్రి తన తల్లి కుంతీ వద్దే విశ్రమించారు పాండు కుమారులు.

రాత్రి భోజనం లేకపోవడంతో...

ఉదయం లేవగానే భీముడికి బాగా ఆకలైంది. వెంటనే నకులిడిని తీసుకుని వంటశాల ఎక్కడుందోనని రాజ్య భావనాలన్ని తిరుగుతున్నారు. కానీ, వాళ్ళకి ఎక్కడా అది కనిపించడం లేదు. అదృష్టం కొద్దీ ఒక పరిచాలకుడు వారికి ఎదురుపడ్డాడు. వంట శాల ఎక్కదుందోనని ఆ పరిచాలకున్ని అడిగితే,

అతను

"తిన్నగా వెళ్లి, దక్షిణం వైపు తిరగండి, ఆ తర్వాత కుడి వైపుకున్న ఉత్తరం వైపు తిరగండి, అలా నేరుగా వెళ్ళి దాని ఎడమ వైపున పశ్చిమానికి తిరగండి, ఆ పిదప నాభి కి ఉత్తరం వైపుకు తిరగండి, తర్వాత కొంచెం ఈశాన్యం వైపు మళ్ళీ, అలా పది గజలా దూరం వెళ్ళాకా ఆగ్నేయం వైపు తిరగండి" అంటూ ఆ పరిచాలకుడు బదులిచ్చాడు.

అసలే ఆకలి మీద ఉన్న భీముడికి అదేం అర్థం కాలేదు. అంతా గందరోళంగా అనిపించింది. తనతో పాటు వచ్చిన నకులుడికి కూడా అలాగే అనిపించింది. వాళ్ళకి ఏం అర్థం కాక, అమాయకపు మొహాలు పెట్టీ,

"మళ్ళీ చెప్పు పరిచాలక..!" అంటూ అతన్ని అడిగితే,

అతను మళ్ళీ చెప్పడం మొదలుపెట్టాడు.

అప్పుడు భీముడు

"కొంచెం అర్థమయ్యేలా...

సులభ రీతిలో చెప్పు పరిచాలకా...!" అని అడగ్గా ..

పరుచాలకుడు...

"అయితే, బుద్ధికి కాకుండా మీ ముక్కుకి పని చెప్పండి రాకుమారులారా!" అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు.

భీముడికి అదేం అర్థం కాలేదు. నకులుడు మాత్రం ఆలోచిస్తూ...

"బ్రాతా ...

పరిచాలకుడు ఏమన్నాడో అర్థమైంది."అంటూ భీముడికి చెప్పాడు.

"ఏం అర్థమైంది,

నీకు దారి తెలుసా..!

వంట శాల ఎక్కడ నకుల" అంటూ ఆతృతగా నకులుడుని అడుగుతాడు భీముడు..

"ముక్కు ...

ముక్కు ..." అంటూ తన ముక్కున వేలు పెట్టుకుని గట్టిగా వాసన పీల్చి వదులుతాడు.

భీముడికి విషయం అర్ధమయ్యి,

తను కూడా గట్టిగా వాసన పీల్చి వదలగానే,

ఒకవైపు నుండి మామిడి పండ్ల వాసన వస్తుంది.

ఆ వాసన వస్తున్న వైపు వెళ్తే,

ఒక మామిడి పళ్ళ తోట వాళ్ళకి కనిపిస్తుంది. ఆ తోటలో అన్ని చెట్లు దట్టంగా మామిడి పళ్ళతో నిండి ఉన్నాయి.

వాటిని చూస్తుంటే భీముడికి నోరూరుతుంది.

"ఈ రోజు ఈ పళ్ళన్నీ నాకే ఆహారం నకులా..!" అంటూ సంబరపడుతూ ఆ చెట్లకున్న కాయలను తీసుకోబోతుంటే,

సరిగా అదే సమయానికి ఆ చెట్టు కొమ్మ పై నుండి ఒక బాణం వచ్చి దానికి గుచ్చుకుంటుంది. అది ఎవరు విసిరానా అని భీముడు, నకులుడు పైకి చూడగా అక్కడ దుశ్శాసనుడు, నూరుగురు సోదరులలో ఒక ఇద్దరూ సోదరులు ఉన్నారు.

"ఈ చెట్టు మాది, ఈ చెట్టు కాయలపై మాకే అధికారం ఉంది. వెళ్లి ఇంకో చెట్టుని వెతుక్కో..." అంటూ వాళ్ళు పొగరుగా సమాధానం ఇస్తారు.

భీముడు, నకులుడు ఇంకొక చెట్టు వద్దకు వెళ్లగా అక్కడ కూడా ఇంకో ముగ్గురు కౌర సోదరులు ఉంటారు. అలా ప్రతీ చెట్టు పై కౌర సోదరులు ఉంటారు.

"ఈ తోటలో ఉన్న చెట్లన్నీ మావే, ఇక్కడ పళ్లను తీసుకుని తినే అధికారం నీకు లేదు." అంటూ అసలే ఆకలితో ఉన్న భీముడికి ఆహారం దొరక్కుండా అతన్ని తన మాటలతో, చేష్టలతో మరింత రెచ్చగొడతారు.

"నేను కావాలనుకుంటే మీ చేతుల్లో నుండి కూడా లాక్కుని, ఆ పళ్ళను నా సొంతం చేసుకోగలను" అని భీముడు కోపోద్రిక్తుడై అంటాడు.

దానికి వారు వెటకారంగా ...

"అబ్బా...! దిగొచ్చాడండి పెద్ద పోటుగాడు" అంటూ భీమున్నీ హేళనగా చేసి మాట్లాడతారు.

భీముడి కోపం తారా స్థాయికి చేరి,

"వీళ్ళకి మాటలతో కాదు చేతలతోనే సమాధానం చెప్పాలని" అక్కడి నుండి వారి దగ్గరకు గొడవ పడదామని వెళ్లబోతుంటే,

వెనుక నుండి అప్పుడే వచ్చిన యుధిష్ఠిరుడు అతన్ని ఆపుతాడు. సహదేవుడు, అర్జునుడు కూడా యుధిష్ఠిరుడుతో పాటే అక్కడికి చేరుకుంటారు.

"నన్ను ఆపకండి అగ్రజ...

ఈ రోజు వీళ్ళ అంతు చూస్తాను..." అంటూ కోపంతో రగిలిపోతూ గొడవకి సిద్దమవుతుంటే,

"భీమా..!

ఘర్షణ వద్దు..!

నీకు కావలసిన ఆహారానికి నేను తగిన ఏర్పాట్లు చేస్తాను. ముందు ఇక్కడి నుండి వెళ్దాం పదా...!" అంటూ యుధిష్ఠిరుడు భీముడికి నచ్చజెప్పి అక్కడ నుండి తీసుకుని వెళ్ళే ప్రయత్నం చేయబోతుంటే,

"హా... వెళ్ళండి...!,

వెళ్ళండి...!!

రాజ్యంలో ఎక్కడైనా మీకు ఆహారం లభిస్తుంది.

ఎందుకంటే, మీరు సన్యాసి పుత్రులు కదా... మీ తండ్రి మీకు భిక్షాటన చేయడం నేర్పించే ఉంటారు." అంటూ వాళ్ల తండ్రి పాండురాజును హేళన చేస్తూ వెకిలిగా మాట్లాడుతూ వెటకారంగా నవ్వుతారు.

అది విని ఈ సారి యుధిష్ఠిరుడికి కూడా కోపం కట్టెలు తెంచుకుంది.

"వాళ్ళు మన పితృ దేవులను అవమానించారు. ఇక వాళ్ళను క్షమించే ప్రసక్తే లేదు.

వెళ్ళు..!

వెళ్లి..! నీ ప్రతాపం చూపించు భీమా...!" అంటూ యుధిష్ఠిరుడు అనగానే

భీముడు ఒక్క ఉదుటున వెళ్లి

కౌరవులు ఉన్న చెట్లను తన దేహ బలముతో గట్టిగా ఊపుతాడు. ఆ దెబ్బకు చెట్లపై ఉన్న కౌరవులు కింద పడి నడ్డి విరగొట్టుకుంటారు.

భీముడి దెబ్బకు వారంతా అక్కడి నుండి భయ పడి పారి పోయి విషయం శకునికి, దుర్యోధనునికి చెప్తారు.

ఇక శకుని గురించి మనకు తెలిసిందే గా...

ఎప్పుడెప్పుడు అవకాశం వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటాడు.

"నిన్న ఇక్కడికి వచ్చి తిష్ట వేశారు

ఈ రోజు నీ సోదరులతో కలబడ్డారు.

రేపు నిన్ను కూడా ఏమైనా చేసి ఈ రాజ్యానికి వారే వారసులు అవుతారు.

నువ్వు ఇంకా ఇలానే చూస్తూ ఉంటే, సబబు కాదు మేనల్లుడా..!

నువ్వొక చేతకాని వాడవని నీ సోదరులు, ఆ పాండు కుమారులు, ఈ రాజ్య ప్రజలు అనుకోక ముందే నువ్వెళ్ళి ఆ భీముడి అంతు చూడు యువరాజ!." అంటూ అతని రెచ్చగొడతాడు శకుని.

అతడి మాటలకు రెచ్చిపోయిన దుర్యోధనుడు

తన సోదరులందరినీ తీసుకుని ఆ తోటలోకి వెళ్తాడు.

వెళ్లి అక్కడ మామిడి పళ్ళు తింటున్న పాండు కుమారులను దుర్భాషలాడుతూ తిడుతుంటే,

చూసి...చూసి... సహనం నశించిన భీముడు..

యుధిష్ఠిరుడు వద్దు అంటున్నా వినకుండా

వాళ్ల మాటలను అదుపు చేయడానికి వెళ్లి హెచ్చరిస్తుంటే, దుర్యోధనుడు ఒక్క ఉదుటున భీమున్ని కిందకి తోస్తాడు. అతడి కింద పడిపోతాడు. భీముడికి సహాయం చేద్దాం అని యుధిష్ఠిరుడు, అర్జునుడు, నకుల సహదేవులు వెళ్లబోతుంటే,

దుర్యోధనుని సోదరులలో కొంతమంది అడ్డుగా నిలిచి వాళ్ళని అతని వద్దకు వెళ్లకుండా చేస్తారు.

ఇక దుర్యోధనుడు, దుశ్శాసనుడు భీమున్ని ఒక్కడిగా చేసి అతనితో కలబడతాడు.

"భీమా ఆగు..!

దుర్యోధన ఆగు..!!" అని యుధిష్ఠిరుడు ఎంత వారించినా వాళ్ళు వినరు.

కాసేపాటికీ అక్కడికి గుర్రపు స్వారీ చేసుకుంటూ భీష్ముడు వస్తాడు. పాండవులను ఒంటరి వాళ్ళను చేసి వాళ్ళతో కౌరవులు ఘర్షణ పడడం గమనిస్తాడు భీష్ముడు. భీష్ముణ్ణి చూసిన దుర్యోధనుని సోదరులంతా అక్కడి నుండి పారిపోతారు. కానీ, అతని రాకను గమనించని దుర్యోధనుడు భీముడితో గొడవ పడుతూ అతన్ని కొడుతూనే ఉంటాడు.

భీష్ముడు కూడా వెళ్లి వాళ్ల గొడవను నియంత్రించబోతుంటే, భీముడు ఆగినా, దుర్యోధనుడు మాత్రం

"నన్ను అపకండి..!

ఈ రోజు వాడిని నేను చంపేస్తాను" అంటూ చాలా మూర్ఖంగా ప్రవర్తిస్తాడు.

దుర్యోధనుని మూర్ఖత్వానికి విసిగిపోయిన భీష్ముడు అతన్ని గట్టిగా పక్కకు లాగి

"దుర్యోధనా..!

ఏంటి నీ దురుసుతనం. రోజు రోజుకీ నీ ప్రవర్తన దిగజారిపోతోంది. రాజ ప్రాంగణంలోనే ఇలా ఘర్షణ పడే దుస్సాహసం ఎందుకు చేసావు నువ్వు..!

నువ్వు చేసిన ఈ పనికి శిక్ష అనుభవించక తప్పదు." అంటూ భీష్ముడు దుర్యోధనుని హెచ్చరిస్తుంటే,

యుధిష్ఠిరుడు...

"పితామహ...!

ఇందులో దుర్యోధనుని తప్పు ఎంత ఉందో..!

భీముడి తప్పు కూడా అంతే వుంది. ఘర్షణ వద్దని ఎంత చెప్పినా వినకుండా వెళ్లి వాళ్ళతో కలబడ్డాడు. కాబట్టి విధించే శిక్ష ఇద్దరికీ కలిపే విధించండి" అంటూ భీష్ముణ్ణి కోరతాడు.

అప్పుడు భీష్ముడు...

యుధిష్ఠిరుడు నిష్పక్షపాత ధోరణికి మనసులో మెచ్చుకుని, అతని మాట ప్రకారం ఇద్దరికీ శిక్ష పడాల్సిందేనని

"ఇద్దరూ మందిరం ముందు రాత్రంతా నిలుచుని ప్రాయశ్చిత్తం చేసుకోవాలని" వాళ్ళని ఆదేశిస్తాడు.

పాండు పుత్రులు అంతా కుంతీ మందిరానికి వచ్చి,

"మాతా...!

మాకొక సమస్య వచ్చిందంటూ" ఆమెతో చెప్పబోతుంటే,

అప్పటికే పూజలో ఉన్న కుంతీ...

"ఏ సమస్య వచ్చినా మీరు ఐదుగురు కలిసి పెంచుకోవాల్సిందే" అంటూ ఆమె ఆదేశిస్తుంది.

భీష్ముడి ఆజ్ఞ, తల్లి మాట ప్రకారం మందిరం వద్దకు అందరూ కలిసి వెళ్ళి చాలా సంతోషంగా శిక్షను స్వీకరించి, దాన్ని పాటిస్తారు. ఆ శిక్షను పాటించడానికి శకునిని వెంట పెట్టుకొని వచ్చిన దుర్యోధనుడు వాళ్లు అంత సంతోషంగా శిక్షను స్వీకరించడం చూసి అసూయా చెందుతూ...

"మామా...

ఎలాగైనా సరే..!

భీముడిని యమపురికి పంపించాలి. లేకపోతే వీళ్ళ ఆటలు ఇక్కడితో ఆగవు. నువ్వే ఏదైనా పన్నాగం పన్ను. దెబ్బకి భీముడు యమలోకానికి చేరిపోవాలి." అంటూ శకునితో అంటాడు.

"అదెంత పని మేనల్లుడా..!" అంటూ శకుని సమాధానమిస్తాడు.

రాత్రి శిక్ష పూర్తి చేసి కుంతీ మందిరానికి వచ్చిన తన కుమారులతో...

విషయం తెలిసిన కుంతీ...

"నిన్న భీష్ముల వారికి కోపం తెప్పించే విధంగా మీరేదో చేశారట పుత్రులారా...!

ఆయన మీకు దండన కూడా విధించారు అంట..!

ఆయనికి అంతలా కోపం తెప్పించే పని ఏం చేశారు మీరంతా..!" అంటూ ఆవేదన పడుతూ అడుగుతుండగా ..

"భీష్ముల వారు శిక్ష విధించింది భీమన్నయ్య కి మాత్రమే,

అది చెప్దామని మీ మందిరానికి వస్తె,

మీరు " ఏ సమస్యా అయినా అంతా కలిసే పంచుకోండి" అని అన్నారు. దాంతో అతని శిక్షను అంతా కలిసి అనుభవించాము." అని నకులుడు చెప్తాడు.

"అసలు భీమా నువ్వేం తప్పు చేసావు." అంటూ అతన్ని అడిగితే,

తల్లి అమాయకత్వానికి అతడు సమాధానం చెప్పకుండా తల కిందకి దించుకుని చేతిని నోటికి అడ్డు పెట్టుకొని నవ్వుతాడు.

దాంతో కుంతీ...

"యుధిష్ఠిర నాకు వీల్లేవరూ నిజం చెప్పరు.

నువ్వు నిజాన్ని దాయలేవు. నువ్వైనా అసలు విషయం చెప్పు" అంటూ యుధిష్ఠిరుడుని నిలదీయగా

అప్పుడు యుధిష్ఠిరుడు

"అసలు ఇక్కడికి మనం రావడం ఇక్కడి వారెవరికీ ఇష్టం లేదు. ఏ వంక పెట్టీ మనల్ని ఇక్కడ నుండి వెళ్ళ గొడదామా..!" అని అందరూ చూస్తున్నారు అంటూ యుధిష్ఠిరుడు చెప్తాడు.

కుంతీ...

"ఆ రోజు విదురుడు అన్న మాటలకు అర్థం ఇదా...!

ఒకప్పటి కురువంశానికి, ఇప్పటి కురువంశానికి చాలా మార్పు వచ్చింది. ఈ పదిహేను ఏండ్లలో చాలా మార్పులు వచ్చాయి.

మీకొక్క విషయం చెప్తున్నాను పుత్రులారా..!

ఎన్ని కష్టాలు ఎదురైనా, మరిన్ని సమస్యలు ఎదురొచ్చినా...

మీరు అంతా కలిసే ఎదుర్కోవాలి. ఎప్పుడూ మీలో కలహాలు, విభేదాలు రాకూడదు.

ఈ విషయం ఎప్పటికీ గుర్తుపెట్టుకోండి..." అంటూ కుంతీ ప్రమాణం చేయించుకుంటుంది.

పాండు పుత్రులు అంతా తన తల్లి మాట ప్రకారం ఆమెకి మాటిస్తారు.

శకుని దుర్యోధనుని, దుశ్శాసనుని పిలిచి భీముడుని వధించడానికి తన రహస్య మందిరంలో పన్నాగం పన్నుతున్నాడు. తన గాంధర్వ రాజ్యం నుండి ప్రమాదకరమైన విషాన్ని తెప్పించి, దానికి ఇంకొన్ని విషపు పదార్ధాలు జోడించి అది అత్యంత ప్రమాదకరమైన విషంగా మార్చుతూ...

"యువరాజులారా...!

ఇది గాంధర్వ దేశంలో మాత్రమే దొరికే అత్యంత విషపు గుణం ఉన్న ఆకులు. ఇది ఒంటికి తగిలితే భీముడు లాంటి వాడైనా స్వర్గానికి పయనం కావాల్సిందే..!" అంటూ వాళ్ళకి చెప్తూ దాన్ని తయారు చేసి వాళ్లకు ఇస్తాడు.

మరుసటి రోజు పాండు కుమారులు రాజ్యానికి సమీపంలో ఒక ఆట స్థలంలో ఆడుకుంటూ వుండగా...

భీముడు మాత్రం లడ్డులు తింటూ కూర్చుని వుంటాడు.

అతనికి వద్దకు మిగిలిన రాకుమారులు ఆడుతున్న బంతి వచ్చి అతడి తిండికి భంగం కలిగించడంతో, అతడు ఆ బంతిని కోపంతో తన బలం ఉపయోగించి బాగా దూరంగా విసిరేస్తాడు.

ఆ బంతి ఎక్కడో ఉన్న దుశ్చల బొమ్మకి తగిలి, అది కింద పడి పగిలిపోతుంది. ఆ బొమ్మ పగిపోవడంతో దుశ్చల ఏడుపు లంకించుకుంటుంది. భయపడిన రాకుమారులు ఆ బంతిని తనే విసిరాడు కాబట్టి, దుశ్చల వద్దకు వెళ్లి భీముడిని ఆ బంతిని తీసుకురమ్మని చెప్పారు.

దుశ్చల వద్దకు వెళ్ళి, ఆమెను ఒదార్చి, ఆ బంతిని ఇవ్వాల్సిందిగా భీముడు ఆమెను కోరతాడు. అందుకు ఆమె నిరాకరిస్తుంది. అప్పుడే అక్కడికి వచ్చిన దుర్యోధనుడు అతని సోదరులు విషయం అడిగి తెలుసుకుంటారు.

ఎప్పుడూ పాండవులంటే విరుచుకుపడే దుర్యోధనుడు అసహజంగా వారికి మద్దతు తెలుపుతాడు.

"ఆ బంతిని భీమన్నయ్యకి ఇచ్చేయి దుశ్చల..!" అంటూ ఆమెను హెచ్చరిస్తాడు.

దానికి దుశ్చల కోపంగా...

"భీమన్నాయ్య నా బొమ్మను పాడు చేశాడు. అతడికి ఈ బంతిని ఇవ్వను" అని బదులిస్తుంది.

దుర్యోధనుడు...

"ఇవ్వమని నీకే చెప్తున్నాను. మర్యాదగా ఆ బంతిని భీమన్నయ్యకి ఇచ్చెయి" అంటూ ఆమెను రెచ్చగొడుతూ ఆమెపై మరింత కొప్పడతాడు.

దానికి దుశ్చలకి కోపం వచ్చి,

ఆ బంతిని పక్కనే ఉన్న బావిలోకి విసిరేస్తుంది.

ఇక్కడ దుర్యోధనుడి ఉద్దేశ్యం ఏంటంటే,

ఆ బావిలో అప్పటికే శకుని ఇచ్చిన విషం కలిపాడు. దుశ్చలను రెచ్చగొడితే ఆమె ఆ బంతిని పక్కనున్న బావిలోకి విసిరేస్తుంది. భీముడు వైపు ఉన్నట్టు మాట్లాడితే ఎలాగో అతనే ఆ బంతిని తీయడానికి ఆ బావిలోకి దిగి, ఆ విషం తన ఒంటికి తగిలి చనిపోతాడు. ఇది శకుని పన్నిన పన్నాగం. దుర్యోధనుడు అమలు చేసిన ప్రణాళిక.

అక్కడున్న వారంతా ఆ బావి దగ్గరకు వెళ్ళి చూస్తారు. ఆ బంతి పైకి తేలుతూ కనిపిస్తుంది. కానీ, ఆ బావి చాలా లోతుగా ఉంటుంది.

"అయ్యయ్యో..!

దుశ్చల ఎంత పని చేసింది. ఇప్పుడు ఈ బంతిని ఎవరు తీస్తారు...

నేను దిగుతాను" అంటూ దుర్యోధనుడు పైకి నటిస్తుంటే,

అది అర్థం కాని భీముడు..

"మీరెందుకు లే అన్నయ్య ..

తప్పు నాదే కదా నేను దిగి తీస్తాను" అని అంటాడు.

"లేదు... లేదు...

నేను తీస్తాను" అంటూ దుశ్శాసనుడు...

నువ్వెందుకు అనుజా...

"నేను తీస్తాను లే" అంటూ దుర్యోధనుడు

ఇలా ఒకరి తర్వాత ఒకరు కపటి నాటకాలు ఆడుతుంటే అది అర్జునుడికి అర్థమవుతుంది.

ఇక భీముడు వాళ్ల మాటలకి కరిగిపోయి...

"లేదు, నేనే బావిలోకి దిగి ఆ బంతిని తీస్తాను" అంటూ అందులోకి దిగబోతుంటే,

వెనుక నుండి ఒక గడ్డి పోచ పుల్ల అతని చెవిని తాకుతూ వెళ్లి

బావిలో ఉన్న బంతికి గుచ్చుకుంటుంది.

అలా మరొక గడ్డి పోచ, దాని తర్వాత మరొక గడ్డిపోచ అలా ఒకదాని తర్వాత మరొకటిగా ఒకదానిపై మరొకటి గుచ్చుకుని, బావి పై వరకూ...

వాళ్ళకి అంది వచ్చెట్టుగా ఒక పెద్ద కర్రలా ఏర్పడుతుంది.

అవన్నీ ఎక్కడి నుండి వచ్చాయా అన్నట్టు వాళ్ళందరూ వెనకకు తిరిగి చూస్తే, వస్తున్నది అజేయ పరాక్రమ వంతుడిగా పేరు తెచ్చుకున్న ఓ గురువు దగ్గర శిష్యరికం చేసిన ఓ గొప్ప గురువు ద్రోణాచార్యుడు.

ధృతరాష్ట్రల కోరిక మేరకు భీష్ముడు రాకుమారుల శిక్షణ కోసం నియమించిన గురువు.

అక్కడ జరుగుతుందంతా అతడు గమనిస్తూనే ఉంటాడు.

ఆ బావి వద్దకు వచ్చి, అతను ఏర్పరిచిన గడ్డిపోచలా ద్వారా ఆ బంతిని బయటకు తీస్తాడు.

అతంటి పరాక్రమవంతుడైన ద్రోణాచార్యుడు ఎవరి వైపు ...?

అతడు ఎలాంటి విద్యలను వారికి నేర్పిస్తాడు ...?

అతడి దృష్టిలో పడేదెవరు ...?

దుర్యోధనుడి ప్రణాళిక విఫలమవడంతో మళ్ళీ శకుని ఎలాంటి పన్నాగాలు, దుర్యోధనుడు మరెన్ని ప్రణాళికలు పన్నుతాడు ...?

ఇలాంటి విషయాలను తర్వాతి భాగాలలో తెలుసుకుందాం.

"శ్రీ కృష్ణ మహా భారతం" కొనసాగబోతుంది.

తర్వాతి భాగం "శ్రీ కృష్ణ మహా భారతం - 23"

అప్పటివరకూ పాఠకులందరూ మీ విలువైన అభిప్రాయాలను, సూచనలను సమీక్షల ద్వారా తెలుపగలరు.

అవి నాకు మరింత ఉత్సాహాన్నిచ్చి, ఈ కథ మరింత బాగా రాయడానికి నూతనోత్తేజాన్నిస్తాయి.

నా రచనలను ఆదరిస్తున్న పాఠకులందరికీ నా హృదయ పూర్వక కృతజ్ఞతలు.

రచన: సత్య పవన్ ✍️✍️✍️



Rate this content
Log in

Similar telugu story from Abstract