SATYA PAVAN GANDHAM

Inspirational Others

4.5  

SATYA PAVAN GANDHAM

Inspirational Others

తనతో ప్రయాణం(తనపైప్రేమ)పార్ట్3

తనతో ప్రయాణం(తనపైప్రేమ)పార్ట్3

7 mins
336


తనతో నా ప్రయాణం (తన స్నేహం) పార్ట్ 2


తర్వాతి భాగం కొనసాగింపు...


తనతో నా ప్రయాణం (తనపై ప్రేమ) పార్ట్ 3


తను నా పై చూపించే ఆ కన్సర్న్ అండ్ కేరింగ్, నన్ను తనకు బాగా దగ్గర చేశాయి...

తన మాటల మాటున దాగున్న ఆ ఆసక్తి ఏంటో..?? 

ఒకవేళ తను నన్ను ఇష్ట పడుతున్నారా.. ?? 

ఆడపిల్లవ్వడం వల్ల కాబోలు... తన ఇష్టాన్ని పైకి చెప్పలేకపోతున్నారేమో..??

లేదా, నాకు ప్రేమపై ఉన్న అభిప్రాయం తెలిసి సైలెంట్ గా ఉండిపోయారా..??

అన్న సందేహాలు నాలో మొదలయ్యాయి..


ఛ ...!! ఛ...!!

అయినా ...నేనిలా ఆలోచిస్తున్నానేంటి?


ప్రేమ, దోమ లాంటి వాటిని దరికి కూడా రానివ్వని అమ్మాయి, తల్లిదండ్రుల నిర్ణయాలను గౌరవిస్తూ, వారి కష్ట దుఃఖాలలో పాలు పంచుకుంటూ పెరిగారని చెప్తుంటారు, 

సిటీ లో ఉంటున్నా ... అక్కడ పద్ధతులకు అలవాటు పడకుండా పల్లెటూరు కట్టుబాట్లు తూ..!! ఛా..!! తప్పకుండా పాటిస్తున్న పిల్ల, ఈకాలపు అమ్మాయిలకు తనొక ఆదర్శం..

ఇవన్నీ తెలిసి కూడా తన గురించి నేనిలా ఊహిస్తున్నానేంటి ..??, 

తొందరపాటు ఆలోచనలతో .. ఉన్న ఫ్రెండ్షిప్ కాస్తా చెడిపోతుందేమోనన్న భయం ! 

నాలో.. మొదలైంది.


కానీ, ఒకసారి ఎందుకో తనకి హెల్త్ బాగా లేక, సరిగా మాట్లాడకపోతే(టెక్స్ట్ చేయకపోతే) చాలా కంగారుపడ్డాను.. నాలో ఏదో తెలియని ఆందోళన.

చెప్పిన జాగ్రత్తలే మళ్ళీ మళ్ళీ చెప్తూ.. తను ఏమి అనకపోయినా.. నాకే అనిపించింది తనని విసిగుస్తున్నానని!


నాలో ఎందుకింత మార్పు...??


అప్పుడే... అర్ధమయ్యింది, నాకు తన మీద ఉన్న స్నేహం కాస్త ప్రేమగా మారిందేమోనని.!


నిజానికి అది ప్రేమో, లేక ఆకర్షణో తెలియదు కానీ,

స్నేహమనే ముసుగులో అది దాస్తూ.. తనతో పైకి నటించడం నాకు నచ్చడం లేదు. అలా అని చెప్పేస్తే అందరిలానే వీడు కూడా అని అపార్థం చేసుకుంటారెమో?? 

అన్న చిన్న సందేహం నాలో...


స్నేహానికి కి ప్రేమకి మధ్యనున్న "భయం..!!" అనే ఆ చిన్న నదిని ఎలా దాటలో అర్ధం కాలేదు.


అందుకే నా కవితలోని అక్షరాల ద్వారా ఓ వారధిని నిర్మించాను.

అవును..!! ఎప్పుడూ.. స్ఫూర్తిని రేకెత్తించే కవితలు రాసే నేను, ఆ రోజు... తన పైనున్న ప్రేమ భావాన్ని ఒక కవిత రూపంలో వర్ణిస్తూ రాసి సామాజిక మాధ్యమాల్లో (వాట్సప్ స్టేటస్) పెట్టాను.


"నీ జాడ లేక...

నా కల చెదిరెను!!


నీ ధ్యాస లేక..

నా మతి తప్పెను!!


నీ యాస లేక...

నా ప్రాస ఆగెను!!


నీ తోడు లేక...

నా నీడ దూరమయ్యెను!!


నీ ఊసు లేక...

నా స్వరం మూగబోయెను!!


ఎలా..!! ఎలా...!!!

రాతి బండల్లాంటి నా గుండెలపై నుండి జాలువారుతున్న ఈ ప్రేమ జలపాతాన్ని నీ మనసు సెలయేటి లో భద్రపరచడానికి పడుతున్న వేదనను 

తెలిపేదెలా..!! ఎలా...!!!"


తను చదవడం...

నా దగ్గర ఎప్పుడూ.. ఇలాంటి ప్రేమ కవితలు ఊహించని తను "మీరు ఇలా రాయడమెంటనీ!!, అసలు ఎవరి గురించి అని!!" గుచ్చి గుచ్చి నిలదీయడం.. నేను దాటవేయడం.. అంతా ఒక మూడు గంటలు మా మధ్య మిని యుద్దమే జరిగింది.


ఎప్పుడూ తియ్యగా ఉండే తన అలకలు, ఈ సారెందుకో కొంచెం ఘాటుగా అనిపించాయి.

చివరకి చేసేదేమీ లేక, ఏప్రిల్ 28th 2019, సరిగ్గా రాత్రి 10.39 కి నా మనసులో మాట చెప్పేశాను..


(ఆగండి ...!! ఆగండి...!! 

అందరిలా..!

"ఐ లవ్ యూ!" 

"నువ్వు లేకపోతే నేను బతకలేను!" 

"నువ్వంటే నాకు పిచ్చి!" 

అవసరమైతే "ఇంట్లో వాళ్ళని ఎదిరించి పెళ్లి చేసుకుందాం!! " లాంటివి నేను మాట్లాడ లేదండీ! (పాఠకులకు సవివరంగా తెలియచేస్తున్నాను)).


ఆ రోజు నా ప్రేమను నేనిలా వ్యక్తపరచాను ..

"అనుకోకుండా ఈ కొద్ది ప్రయాణంలోనే మీరంటే నాకు గౌరవం ఏర్పడింది, అది కాస్తా ఇష్టం గా మారింది, అది ప్రేమో ఏమో నాకు తెలియదు కానీ, మీ రూపు నచ్చో.., లేక మీ స్వరం మెచ్చో.. ఇదంతా చెప్పడం లేదు.. ఎందుకంటే ఇప్పటికీ అవి ఎలా ఉంటాయో తెలీదు నాకు, నాకు నచ్చింది మీ ఆలోచనలు మాత్రమే. లైఫ్ లాంగ్ మీరు వెన్నంటే ఉంటూ నా గమ్యానికి చేరే ప్రతి అడుగులో తోడుగా ఉంటారని ఆశిస్తున్నాను.


ఎలాగో మనిద్దరి అభిప్రాయాలు, ఆలోచనలు, అభిరుచులు కలిశాయి. ఒక అబ్బాయిలో మీకు కావల్సిన క్వాలిటీస్ నాలో (మీరే చాలా సందర్బాలలో చెప్పారు).. ఒక అమ్మాయిలో నాకు కావల్సిన క్వాలిటీస్ మీలో ఉన్నాయి. అందుకే చెప్తున్నా మీరు ఒప్పుకుంటే " I would like to marry" . అది కూడా ఇద్దరి కుటుంబాలు అంగీకారంతోనే, యే ఒక్కరికీ ఇష్టం లేకపోయినా.. ఇక్కడితో వదిలేధ్దాం.


నాకు తెలుసు మీకు లవ్ మీద మంచి అభిప్రాయం లేదని, నాకు కూడా లేదని మీకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదనుకుంటా! సో, ప్రేమ గీమా లాంటి మాటలు చెప్పి, మీ టైం వృధా చేస్తూ మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకోవడం లేదు, మీ వెనుక తిరుగుతూ మిమ్మల్ని వేధించాలనుకోవడం కూడా లేదు."


ఇది చెప్పి.. ఆత్రుతగా తన ప్రతి స్పందన కోసం ఎదురు చూశాను.

(పాఠకులకు..!!

అవునూ...!! 

మేము ఒకే క్లాస్మేట్స్, ఒకే స్కూల్ మేట్స్ అని చెప్పా కదా! మధ్యలో ఈ మీరు..!! మీరు..!! ఎక్కడినుండి వచ్చిందనుకుంటున్నారా...??

ఎంత పేరుకు ఒకే క్లాస్మేట్స్ అయినా.. , ఒకే ఊరివాల్లమైనా.. 


స్వతహాగా గోదారోళ్ళం, మర్యాదలకు మచ్చుతునకలం.

సాంప్రదాయాలకు దాసోహులం, ఆడంబరాలకు అతీతులం.)


ఇంతలో తన రిప్లై రానే వచ్చింది. అనుకున్నట్టు గానే "తన పెళ్లి తన చేతుల్లో లేదని, తన తల్లిదండ్రుల ఇష్ట ప్రకారమే నడుచుకుంటానని, ఆ పెళ్లి చేసుకున్న అతన్నే ప్రేమిస్తానని అప్పటివరకూ వీటికి దూరంగానే ఉంటానని." నాకు చెప్పడానికి కొంచెం ఇబ్బంది పడుతూనే.. తన మనసులో మాట బయటపెట్టారు.


ఆ మాట.. తనపై ప్రేమనే కాదు అంతకుమించిన గౌరవం ఏర్పరిచింది..


వాళ్ళ ఇంట్లో నేనిలా చేసినట్టు చెప్పమన్నాను. (మంచివాడిగా ట్రీట్ చేస్తున్న వాళ్ళ అమ్మగారిని మోసం చేస్తున్నట్టనిపించి). కానీ, ఇంట్లో తెలిస్తే మళ్ళీ ఇష్యూస్ అవుతాయని, చేస్తున్న జాబ్ మానిపించి తనకి పెళ్లి చేస్తారని భయపడి చెప్పడానికి నిరాకరించారు.


అలా ఆ రోజు తెల్లవారు జాము 4.30 గంటలు వరకు ఇద్దరం మేల్కొనే ఉండి ఆ డిస్కషన్ కంటిన్యూ చేస్తూనే ఉండిపోయాం.. 

ఆ వాట్సప్ చాటింగ్ లో...


నేను ఆ రోజుల్లో కాళీ! కానీ, తనకి తెల్లారితే ఆఫీసూ..!! వర్కూ...!! అయినా ఎందుకో! తనకు ఆ ప్రపోజల్ ఇష్టం లేదంటూనే.. నన్ను అవాయిడ్ అండ్ రిజెక్ట్ చేయకుండా నా గురించి అప్పటివరకు తన విలువైన సమయాన్ని కేటాయించారు. (అంతకుముందు కొంత మంది ప్రపోజ్ చేస్తే తను రిప్లై ఇవ్వడం సంగతి దేవుడెరుగు, కనీసం తను అవతల వాళ్ళకి రెండో మాట మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వలేదని చెప్పారు).


ఎప్పుడూ.. ఎర్లీ మార్నింగ్ లేచే నేను, ఆ రోజు లేట్ గా లేవడం అమ్మ గమనించింది. నాకు ఏ విషయం అయినా అమ్మ దగ్గర దాయడం ఇష్టం ఉండదు. ఆ నైట్ జరిగిందంతా చెప్పేశా.! తప్పు చేసావు అంది....! ఎప్పుడూ నన్ను తప్పు పట్టని అమ్మ, ఎందుకు అలా అందో అర్ధం కాక అడిగాను...??


"ప్రతీదీ ఎక్కువగానే ఆలోచిస్తావ్ కదరా!! ఇది కూడా ఆలోచించు అంది...(కొంచెం గడుసుగా)"


తన మాటల మాటున దాగున్న కోపం అర్ధం కాలేదు..

మరొక పక్క ప్రతి రోజు ఉదయాన్నే "good morning" మెసేజ్ తో తట్టి లేపే తను, ఈ సారి మార్నింగ్ 10 గంటలైనా తన దగ్గర నుండి ఒక్క మెసేజ్ రాలేదు... ఒక మంచి స్నేహాన్ని కోల్పోయానేమోనన్న దిగులు నాలో మొదలయ్యింది. దానికి తోడు అమ్మ మాటలు మరింత బలాన్ని చేకూర్చాయి.


ఎక్కడో తప్పు చేశానన్న ఆలోచన తలపులోకి వచ్చింది..

వాటిని వెతికే పనిలో దొరికిన కొన్ని కారణాలు:


1. ఇద్దరం ఒకే క్లాస్మేట్స్ అవ్వడం(అసలే పల్లెటూరు ఆ నోట ఈ నోట తెలిస్తే... నేను ఎలా ఉన్నా తను, వాళ్ళ ఫ్యామిలీ బ్లేం అవుతారు.)

2. తను అందంగా ఉండడం.

3. నాకన్నా బాగా సెటిల్ అయ్యినవారిని తన పేరెంట్స్ తనకిచ్చి పెళ్లి చెయ్యాలనుకోవడం.


ఇక ఇంతటితో ఇది ఫుల్ స్టాప్ పడినట్టే అనుకున్నా...!!


కానీ, సాయంత్రం 3 గంటలకు తన నుండి మెసేజ్ " సారీ అండి..!! రాత్రి సరిగా నిద్ర లేక మార్నింగ్ లేట్ గా లేచి, ఆఫీస్ కి వెళ్ళే హాడివిడి లో మెసేజ్ చేయలేదు." అని


"తెగిన గాలిపటపు దారం చేతికందినట్లు.

విరిగిన చెట్టు కొమ్మ చిగురించినట్టు.

వాడిన పువ్వు పరిమలించినట్టు.

నాలో ఆశలు మరలా పుట్టుకొచ్చాయి .."


ఎందుకో.. తనకి బాగా దగ్గరవుతున్నా అనిపిస్తుంది..!!

అమ్మ హెచ్చరిక గుర్తొచ్చింది..!!

రేపు ఇదంతా మళ్ళీ ఒక పెద్ద సమస్యలా మారుతుందేమో? అన్న భయం ఒకవైపు.


యద చప్పుడు తనకి వినిపించగలిగానే కానీ,  

మది తలుపుల వెనుకున్న ఆలోచనలు నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తాయని, ఊహించలేదు..! 


అందుకే తనతో చెప్పేశా??

ఏదో.. అనాలోచిత నిర్ణయం తీసుకుని మిమ్మలని ఇబ్బంది కి గురిచేస్తున్నానని అసలు ఆలోచిస్తే అర్ధం అవుతుంది.. మనిద్దరికీ అసలు match అవ్వదని.

దానికి గల కారణాలు (ఇంతకుముందు నేను ఊహించనవే..) తనకీ తెలియచేశాను.


కానీ, తను.. "నేను అందరిలాంటి వాడిని కాదని, అందుకే అలా సడెన్ గా ప్రపోజల్ చేసినా, ఏం చెప్పాలో అర్థం కాకపోయినా, దూరం మాత్రం చెయ్యలేకపోయానని,


ఇక ఆ కారణాల విషయానికి వస్తె వాటి గురించి ఆలోచించడం ఆపెయ్యమని , పైగా వాళ్ళమ్మ గారికి నేనంటే మంచి అభిప్రాయమే ఉందని, అప్పుడప్పుడు నా గురించి తనకు పాజిటివ్ గానే చెప్తారని, ఇది ఒక రకంగా నా ప్రయత్నానికి దోహదం చేస్తుందని, అయినా నాలా తనను ప్రేమించేవారు దొరకరేమో నని, నేను అనుకున్నది జరగాలని తను కూడా కోరుకుంటున్నట్టు, తన మద్దతు కూడా నాకు ఉంటుందని తెలిపారు. ఒకవేళ వాళ్ళ పేరెంట్స్ నన్ను సెలెక్ట్ చేసినా అబ్జెక్షన్ చెప్పనని" చెప్పారు.


పెళ్లి విషయం లో తన పేరెంట్స్ దే ఫైనల్ డెసిషన్ అని ఒక పక్క చెప్తూనే.., మరొక పక్క నా ప్రేమకి సపోర్టింగ్ గా కూడా ఉండే తన మాటలు చూస్తుంటే మనసంతా ఉక్కిరిబిక్కిరి అయ్యేది.


తనకి ప్రపోజల్ చేసిన రెండో రోజే..!! రెండు నెలలుగా నలుగుతున్న జాబ్..!! బెంగళూర్ లో కన్ఫర్మ్ అవ్వడం, నేను అక్కడికి వెళ్ళడం, అంతా వారం వ్యవధిలో జరిగిపోయింది.


అసలే కొత్త ప్లేస్, పైగా వచ్చి రాని బాషా. పల్లెటూర్లో పెరిగిన వాడిని. అక్కడి లైఫ్ స్టైల్ కీ అలవాటు పడడం కొంచెం ఇబ్బంది గానే ఉండేది..


కానీ,

ప్రతిక్షణం పలకరించే తన పలుకులు, ఉల్లాస పరిచే తన ఊసులు , ఇంటికి దూరంగా ఉంటున్నాన్న సంగతే మర్చిపోయెట్టు చేసి, రోజుంతా సరదాగా గడిచేది. అసలక్కడ ఒంటరనే ఫీలింగ్ నాలో పూర్తిగా పోయింది...

ఇదంతా..!! తన వల్లే...


ఒక వేళ తనకి ప్రపోజ్ చేసిన రోజే తను రిజెక్ట్ చేసి వెళ్లిపోయుంటే .. నా పరిస్థితి...??

అమ్మో!! తలుచుకుంటేనే భయమేస్తోంది!!


తనకి ప్రపోజ్ చేసిన తర్వాత మొట్ట మొదటిసారి తనని చూసింది.. మా ఉరి శ్రీరామ నవమి ఉత్సవాల్లో..అది కూడా ఒక ఫ్రెండ్ వల్ల.

(పింక్ చుడీదార్ విత్ టాన్ ఫేస్. బహుశా..!! వేసవి ఎండ వల్ల అనుకుంటా! పాల మెరుపు లాంటి ఆ చర్మం కొంచెం కందినట్టుంది). 

తన గురించి ఇంట్లో అమ్మ, చెల్లి తో పాటు నాతో క్లోజ్ గా ఉండే ఇద్దరి ఫెండ్స్ కి తెలుసు.


ఆ రోజు తను టెంపుల్ లో ఉంటే, నా ఫ్రండ్ ఒకడు అర్జెంట్ పని అని బయటకి రమ్మని, తీసుకెళ్ళి తన ముందు నిల్చోబెట్టాడు... తర్వాత బైక్ పై తన వెనుక తిప్పాడు.

అది నాకు నచ్చలేదు, తనకి కూడా అలాంటివి అసలు నచ్చవు, పైగా పక్కనే వాళ్ళ అమ్మగారు. దానికంతటీకి కారణం నేనే అనుకుని తను అపార్థం చేసుకుంది. నా తప్పేం లేదని ఎంత చెప్పినా వినలేదు. ఇక చేసేదేమీ లేక కోపం తో ఆ మరుసటి రోజు సాయంత్రం జరిగే రథ యాత్రకు లేకుండానే సడెన్ గా బెంగళూర్ ప్రయాణమయ్యాను...


చివరికి తన తప్పు తెలుసుకుని రిక్వెస్ట్ చేసినా.. అప్పటికే నేను రైల్వే స్టేషన్ కి చేరుకున్నాను.

పశ్చాత్తాపంతో తను కూడా ఊళ్ళో జరిగే తీర్థానికి వెళ్లి ఎంజాయ్ చేయకుండా ఇంట్లోనే కూర్చున్న అని, ఆ రోజు అసలు ఫుడ్ కూడా తినలేదని చెప్పారు.

ఇలాంటి చిన్న చిన్న అపార్థాలు, అలకలు తర్వాత వాటికి సారీ లు చెప్పుకుని కాంప్రమైజ్ అవ్వడం మా మధ్య సర్వ సాధారణం అయిపోయాయి.


ఒక రోజు మాటలో మాట వచ్చి రూమ్మేట్స్ డ్రింక్ చేస్తున్నారని చెప్పాను.. అంతే

తను చేయించుకున్న ప్రమాణాలు...


1. మందు ముట్టనని..!

2. స్మోకింగ్ లాంటి హ్యాబిట్స్ చేసుకోనని..!!


10 ఏళ్ల క్రితం ఇవే ప్రమాణాలు అమ్మకి చేశాను, ఇప్పటికీ వాటికి కట్టుబడే ఉన్నానని, ఎంత చెప్పినా వినకుండా తనపై ప్రామిస్ తీసుకున్నారు.

మనం ఫ్రెండ్స్ మాత్రమే కదా..!! ఎందుకు ఇంతలా రియాక్ట్ అవుతున్నారు అని అడిగితే బెట్టు చేశారు ... ప్రామిస్ చేసే వరకు నన్ను వదలలేదు తను...

దాంతో తను నాపై చూపించే కేరింగ్ కి మరింత దగ్గరయ్యి మూడో ప్రమాణం కూడా చేసేసా..


3.తనని తప్ప వేరొక అమ్మాయిని తాకనని..!!

(తను నా సొంతమవ్వొచ్చు , కాకపోవచ్చు. కానీ ఎప్పటికీ ప్రేమించేది తననే! తన స్థానంలో మరొకరిని ఊహించుకోలేను.)


అలా.. మా ఇద్దరి మధ్య బంధం రోజు రోజుకూ బల పడుతూనే ఉంది.. ప్రతి చిన్న విషయం తనకి చెప్పేవాడిని...

అది తన దగ్గర నన్ను నెగటివ్ గా చూపిస్తుందా.. లేక పాజిటివ్ గా చూపిస్తుందా అనేది పట్టించుకునేవాడిని కాదు.

తన దగ్గర దాయడం నచ్చదంతే.

తను కూడా ప్రతి చిన్న విషయానికి సలహాలు అడిగేవారు.


ఆఖరికి కుటుంబ వ్యవహారాల లో కూడా ఒకరికిఒకరం పంచుకుంటూ , సలహాలు ఇచ్చుకునేంత...


కొన్ని కొన్ని సార్లు తను చెప్తుండేది, తను నన్ను ఎంతలా నమ్నారో..!!

అందుకే ప్రపోజల్ తనకి ఇష్టం లేదని చెప్తూనే, ఇంకా నన్ను దూరం పెట్టకుండా ఉన్నారని..

ఇంతలో వాళ్ళ సిస్టర్ కి match సెట్ అయ్యింది అని, త్వరలోనే పెళ్లి అని, ఆ పెళ్ళికి స్పెషల్ గెస్ట్ గా ఇన్వైట్ చేస్తానని, తప్పకుండా రావాలని రిక్వెస్ట్ చేశారు.


తన మాటల్లో కూడా నేనంటే తనకి ఇష్టమున్నట్టు అనిపిస్తుంది..! కానీ, తన పేరెంట్స్ గీసిన లక్ష్మణ రేఖ లాంటి గీత దాటి ఆనాటి సీతలా సమస్యల పాలవుతాననుకున్నారో..? ఏమో..? బయట పడలేదు.


అసలమ్మాయిలే వద్దునుకున్నా..!! 

అలాంటి నా జీవితంలోకి ఇంత ఇష్టంగా, గొప్పగా నన్ను ట్రీట్ చేసే అమ్మాయి వస్తుందనుకోలేదు... 


"అందమైన అలలా నా మోముని తాకింది...!!

కెరటంలా నా హృదయంలో అలజడి రేపింది...!!

ఎడారి ఎండమావి లా నాతో దోబూచలాడింది...!!

నన్నే మరిచిన నాకు తన ప్రపంచంలో చోటిచ్చింది...!!"


తను నా ప్రేమకిచ్చే మద్దతు నా యదని మీటుతూ తనకి నన్ను మరింత దగ్గర చేస్తూన్నా..!!

ఓ వైపు బాధ్యతలూ పెరుగుతున్నాయి, ప్రపోజ్ చేసినపుడు ఊహించిన కారణాలు నా మదిని వెంబడిస్తూ తనకి దూరం చేస్తున్నాయి..!!


తనని అంతలా ప్రేమించాను కాబట్టే కాబోలు, ఏ రోజూ తానే నా సొంతమవ్వాలని ఆశపడలేదు, తను ఎక్కడ సంతోషంగా ఉండగలదో అక్కడే తనని ఉంచాలనుకున్నా...

(కొన్ని కొన్ని సందర్బాలలో తను ఎలాంటి వారిని పెళ్లి చేసుకుంటే హ్యాపీగా ఉండగలదో కూడా సజెషన్స్ ఇచ్చే వాడిని.. అంత ప్రేమ తనంటే..)


నా ఆశలు పక్కన పెట్టీ మరీ తన ఆశయాలకు విలువనివ్వడమే కదా.. ప్రేమంటే..!!

కెరీర్ పై తనకున్న ఆలోచనలను సపోర్ట్ చేస్తూనే వచ్చాను.


అందుకే... తనతో ప్రయాణంలో..!!

తన పై ప్రేమ ... "ఓ నిజం..!"


జరిగిన నిజమంతా నాకు ఓ కలలా అనిపించింది... 


నిజమే, ఆ నిజమంతా నిజంగానే ఒక కలలా మారడానికి ఎక్కువ కాలం పట్టలేదు.


తర్వాత పార్ట్...

తనతో ప్రయాణం...తన వీడ్కోలు (పార్ట్ 4)

                              

                          - సత్య పవన్ ✍️



Rate this content
Log in

Similar telugu story from Inspirational