Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Varun Ravalakollu

Romance

4.5  

Varun Ravalakollu

Romance

పచ్చవోని పిల్ల ....!!

పచ్చవోని పిల్ల ....!!

9 mins
564


“వారం రోజులయ్యింది, కొత్త సినిమా వచ్చింది నన్ను, బాబు ను తీసుకెళ్లండి అని ఎన్ని సార్లు అడగాలి, ఈరోజు సండే కదా తీసుకెళ్తారా లేదా?”


“నాకు చిన్న పని ఉందే!” (చేతి లో లాప్టాప్)


“మీకు నా పై ప్రేమ తగ్గిపోయింది, అనవసరంగా మా వాళ్ళు మీకిచ్చి చేశారు”


“ఏం మాట్లాడుతున్నావ్, వారానికో సినిమా అంటే ఎవరి వల్ల అవుతుంది. నేను బిజీ రేపో, ఎప్పుడో వెళ్దాం”


“మీ మాటల్లోనే అర్థం అవుతుంది, నా పై ప్రేమ లేదని”,


“ఆ మాటకొస్తే మా వాళ్లకు బుద్దిలేక నీ కిచ్చి పెళ్లి చేశారు.”


“అవునా అలా అయితే పెళ్లి చూపుల నాడు, నన్ను చూడగానే అందరూ చూస్తుండగా నన్ను కౌగలించుకొని, నేనంటే ఇష్టమని, వారం లో పెళ్లి చేసేయ్యండి అని అన్నారెందుకో??”


“బుద్ధి లేక..!!”


“అవునా..!! ఒక్క నిమిషం ఆగండి, మరి ఇదేంటి, నా మీద ఎంత ప్రేమ లేకపోతే ఈ షర్ట్ ఇంకా మీ దగ్గరే, వాడకుండా, నలపకుండా జాగ్రత్త గా ఉంచారు.” అని లోనికి వెళ్లి ఓ షర్ట్ పట్టుకొచ్చి చూపిస్తూ అంది.


ఆ షర్ట్ చూడగానే ఒక్క క్షణం నా తొలిప్రేమ నాకు గుర్తొచ్చింది.


***


కాలేజీ అయిపోయాక, జాబ్ రాక ముందు, తిరుపతి కి మొక్కు ఉంటే వెళ్ళవలసి వచ్చింది. జాగ్రత్త గా వెళ్లి జాగ్రత్త గా వచ్చేయాలి అనుకుని ట్రైన్ ఎక్కాను. ట్రైన్ కదిలింది అదే సినిమాల్లో అయితే ఈ సమయానికి హీరోయిన్ వచ్చేసేది, కానీ జీవితం సినిమాలా నాటకీయంగా ఉండదు కదా.! విండో నుండి చూస్తున్నా నా పక్క సీట్ ఖాళీ గానే ఉంది. ఎవరైనా అమ్మాయి వస్తే బాగున్ను! కుర్రోళ్ళం కదా మా ఆలోచనలు ఇలాగే ఉంటాయి, అలా అనుకోగానే ఎర్రగా ఒకమ్మాయి “ఆ సీట్ ఖాళీ ఆ” అని అడిగింది. కొవ్వూరు చెరుకు, తాపేశ్వరం కాజా, ఆత్రేయపురం పూతరేకుల కన్నా తియ్యగా ఉన్నాయి తన మాటలు. వచ్చి రాని ఇంగ్లీష్ లో “హ ఖాళీనే రండి కూర్చోండి” అంటూ కాస్త జరిగాను. అమ్మాయి చాలా అందంగా ఉంది. నవ్వుతూ కూర్చుంది, కాసేపు నేనేదో సాధించినట్టు చాతి ముందుకెట్టి చిన్నగా నవ్వుతున్నాను,


“థాంక్స్ అండి”, “అయ్యో పర్లేదండి, తోటి ప్రయాణికులకు సాయం చెయ్యడం నాకు చిన్నప్పటి నుండి అలవాటే!” అన్నాను.


నా మాటలకు కాస్త చిన్నగా నవ్వింది.


“ఎంత వరకూ!”, చేతులు రెండూ జోడించి తిరుపతి కి అన్నట్టు సైగ చేసింది. అయ్యబాబోయ్! ఏంటో నాకు అన్నీ ఇలా కలిసొచ్చేస్తున్నాయి అనుకున్నాను. తల వెంట్రుకలను చేతివేళ్ళతో దువ్వుతూ, ఉన్న కాస్త గడ్డాన్ని నిమురుతూ ఆనందంగా లైన్ వేస్తున్నాను. కాసేపటికి, పచ్చ వోణి సరిచేసుకొని, ముఖం కడుక్కున్నాక తడిచిన ముందు కురులను వెనక్కి పెడుతూ, ఓ.. కె పర్లేదు అనిపించేట్టు ఒకమ్మాయి మా ముందుకు వచ్చి, “లెగండి ఇది నా సీట్” రెండు చేతులూ నడుం పై పెట్టుకొని అడిగింది. తన చూపులు నా పక్క ఉన్న అమ్మాయి వైపే ఉన్నాయి. అప్పుడే సగం ప్రేమించడం మొదలు పెట్టేసాను మధ్యలో ఏంటి ఈ అంతరాయం అనుకున్నాను.


“ఏంటి ఇది మీ సీటా? ఏదీ మీ టికెట్ చూపించండి” కాస్త చిరాగ్గా అడిగాను,


“మీరేమైన టీ టీ ఆ..! మీకెందుకు చూపించాలి”,


నాకు కోపం మమ్మూలుగా రాలేదు,


“హెల్లో ఇప్పుడు మీకు మీ సీట్ కావాలంటే చూపించాలి మరి!” అన్నాను. అటు పక్క తిరిగి బోలెడంత గాలి తీసుకొని, కొంత కార్బోడైయాక్సిడ్ వదిలి, సీట్ కింద ఉన్న తన బాగ్ జిప్ ఓపెన్ చేసి టికెట్ చూపించింది. తన వైపు చూసి సారి అని సైగ చేసాను. వెంటనే లేచి బాగ్ తీసుకొని ఆ ఎర్ర పిల్ల అక్కడ నుండి వెళ్ళిపోయింది. తర్వాత, ఆ పచ్చవోణి అమ్మాయి నా పక్కనే కూర్చొని చిప్స్ తింటుంది. ఆ కర్ కర్ మనే శబ్దం ఇంకా చిరాకు తెప్పిస్తుంది. వొళ్ళు మండిపోయింది, చా..! తిరుపతి వెళ్ళేలోగా మంచి కాలక్షేపం అనుకున్నాను. దీని వల్ల చ ఛ.! చాలా వరకూ చిరగ్గానే ఉన్నాను. కొంత నా వైపు తను కూడా చిరాకు తోనే ఉంది. మా దగ్గర లో మా వయసు కు దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరూ లేరు.తన వైపు చూసాను, తను నా వైపు చూసింది, హు..! అన్నట్టు మూతి తిప్పి మరి చూడలేదు.


కాసేపటికి అకస్మాత్తుగా కేర్ కేర్ మని ఒక చిన్న పాప ఏడుపు మా బోగి నుండి వినిపించింది, అందరి నిశ్శబ్దాన్ని లాగేసుకున్న పాప ఏడుపు ఊరుకోబెట్టాలి అని దగ్గర లో ఉన్న వాళ్ళు అందరూ ప్రయత్నించారు. మరి అదేం మహత్యమో నాకు తెలీదు, ఆ పాప ను నేను అలా ఎత్తుకోగానే ఏడుపు ఆపేసింది. అవును నేను విజయం సాధించాను, మా అమ్మ నాకు పెట్టిన పేరు కి ఇప్పుడు జస్టిఫికేషన్ జరిగింది అన్నట్టు నవ్వుతున్నాను గర్వాంగా.. మరి కాదా..!! ఎవరి వల్లా కానీ పాప ఏడుపు ని ఆపేసాను కదా..! తను నా దగ్గర ఏం పవర్స్ ఉన్నాయో అన్నట్టు పెదవి ముడిచి కనుబొమ్మలని ఎగరేస్తూ చూసింది. హీరో లా స్టిల్ ఇచ్చాను, “చూసావా నేనేం సాధించానో” అన్నట్టు తనను చూస్తున్నాను పాపను ఎత్తుకొని. కాసేపటికి పాప పడుకుంది. పాప పడుకుంది ఒకే, కానీ కొంప ముంచింది, చివరి లో పాసు పోసేసింది. ఎవ్వరూ గమనించలేదు అనుకున్నాను, తను చూసేసింది. అప్పుడు మొదలయింది గంట వరకూ పగలబడి నవ్వుతూనే.. ఉంది. నిజానికి తను నవ్వుతుంటే పాప ను వదిలేసి ఆ నవ్వు నుండి రాలుతున్న తెల్లటి ముత్యాలు పట్టుకోవాలనిపించింది. అంత అందంగా నవ్వుతుంది. కాసేపటికి నేను కూడా నవ్వేసాను.


“థట్ వాస్ సో ఫన్నీ” అంటూ నాతో మాట్లాడటం మొదలు పెట్టింది. నేనూ మాటలు కలిపాను. తను బలే మాట్లాడుతుంది. పరిచయం లేని వ్యక్తులు మాట్లాడే మాటలు కావు అవి. ఏవేవో, ఒకటి కి ఒకటి మాట్లాడే అంశాన్ని పదాల సాయంతో మారుస్తూ మారుస్తూ మాట్లాడుతూనే ఉన్నాం. “రైలు ఎగురుతూ పోతుంది అప్పుడే రెక్కలొచ్చిన సీతాకోక చిలుక లా! ఊహలు ఊరేగుతున్నాయి మనసంతా, ఇది తారలు దిగివచ్చే వేలేమో మరి. ఈ సమయానికి తగుమాటలు ఏమిటో తెలిసేదెలా, అనిపించే అందమైన భావం తెలిసి ఎదో అనడం కంటే, సాగే కబుర్లతో కాలం మరిచి సరదా పడితే సరిపోదా” అని మనసు మాటలను ముందుకెట్టడం లేదు. రాత్రి తినే సమయం వరకూ మా మాటల ఇంధనం తో కాలం తో పాటు రైలు ని వేగం గా లాక్కొచాం. మా మాటలకు మాలో భావాలు లోలకం లా ఊగాయి. తన చూపుల పౌనుపుణ్యాన్ని తట్టుకున్న నా హృదయం మహా పుణ్యం చేసుకుంది.


ట్రైన్ లో ఫుడ్ గురించి మీకో విషయం చెప్పాలి. మొన్నోసారి ట్రైన్ లో నుండి వస్తూ అనవసరంగా అమ్మ కరాజ్ కట్టిన విషయం మర్చిపోయి ట్రైన్ లో ఎదో బిర్యానీ తీసుకున్నాను, బయటకు వస్తూ, పాపం ఎన్నాళ్ళయిందో తిని అనిపించి ఒక అడుక్కునే వాడికి ఆ బిర్యానీ పాకెట్ ఇవ్వబోయాను,


“బాబూ.. ఇది ట్రైన్ లో కొనిందా!!”


“హ అవును!”,


“వద్దు బాబు, నాకో రూపాయి ఇవ్వుచాలు!” అని ఆ నూట ఇరవై రూపాయల బిర్యానీ కి పక్కనున్న చెత్త కుండీ వైపు దారి చూపించాడు, నా కళ్ళు పెద్దవైపోయాయి ఒక్క క్షణం, అప్పటి నుండి ట్రైన్ లో వాటర్ కూడా కొనకూడదు అని నిశ్చయించుకున్నాను. అందరూ ఎవరు తెచ్చుకున్న ఫుడ్ వాళ్ళు తింటున్నారు, ఈ పచ్చవోణి అమ్మాయి పులిహోర బాక్స్ ఓపెన్ చేసి నా వైపు చూసింది. నేనేం తెచ్చుకోలేదు, తినకపోవడం గమనించింది. బాక్స్ కప్ లో కొంచం పులిహోర వేసి పక్కన పెట్టింది నా కోసమే ఏమో అనుకున్నాను. అరే తినేస్తుంది కానీ తింటారా అని అడగటం లేదేంటి? మనసులో అనుకోగానే, “తినండి! మీకోసమే” అన్నట్టు సైగ చేసింది. మనసులో వెంటనే అందుకొని తినాలని ఉన్నా, “వద్దండి ఆకలి గా లేదు” అన్నాను, అడగగానే తీసుకొని తినేస్తే బాగోదేమో అని.


“అయ్యో అదేంటి తినండి పర్లేదు, ఆ తర్వాత ఆకలి వేసినా ఇంకేం దొరకదు”


“వద్దండి థాంక్స్!” అన్నాను మొహమాటం తోనే,


“అయితే తినరా?” వద్దు అన్నట్టు సైగ చేసాను.


“ఆర్ యు సూర్”


“అయ్యో నిజంగా మీరు తినేయండి” అన్నాను. ఇంకొక్క సారి అడిగితే తినేద్దామని ప్రిపేర్ అయ్యాను. కానీ నాకు దరిద్రం బాగా ఉంది తను మొత్తం తినేసింది. మళ్ళీ కాసేపు మాట్లాడుకున్నాం. కొత్తగా పరిచయం అయిన వాళ్ళ మధ్య ఏర్పడ్డ చిరు స్నేహం అద్భుతం గా ఉంటుంది. కొంత సరిహద్దుల్లో ఉండే చనువు, అప్పుడే ఏర్పడే నమ్మకం, అందమైన అభిమానం. “పొరపాటున కూడా ఈ అందమైన స్నేహాన్ని మరిచిపోకు నేస్తమా, నేనేదో భ్రమ లో నీ స్నేహాన్ని పొద్దున్న మర్చిపోతే చిన్నగా నవ్వుతూ నేను పోగొట్టుకున్న నన్ను వెతికి పెట్టు” మనసులో అనుకుంటూ తననే చూస్తూ ఉన్నాను. అక్షరం రాని వాడు ప్రేమిస్తే కవితలు రాయడం ఏంటి? నవ్వుకునే వాడిని తేలిగ్గా తెలీక. కానీ ఇప్పుడే తెలుస్తోంది ప్రేమ గొప్పదేనేమో.. లే!!


మెరిసే వెన్నెల లా తన నవ్వు చాలా బాగుంది. అది చూస్తుంటే నాకు ఇంకా బాగుంది. నిద్ర వస్తుంది, “మీకు రేపు ఉదయం ఐదింటికి మెలుకువ వస్తే నన్ను మేల్కొలపండి” అంది. “ఓ తప్పకుండా!” అన్నాను. టైం పన్నెండు దాటింది. అప్పుడు మొదలయింది అసలు కథ, తను పడుకుంది, నేను కోపాన్ని అయినా ఆపుకుంటానేమో కానీ ఆకలి కి ఆగలేను. ట్రైన్ ఎదో స్టేషన్ దగ్గర ఆగింది, దిగి చూసాను తినేవేవి ఎక్కడా లేవు. ట్రైన్ ఎక్కేసాను. టైం రెండు అవుతుంది. అంతా బాగా నిద్ర లో ఉన్నారు. కడుపు లో ఎదో అవుతుంది. చాలా చాలా ఆకలి గా ఉంది, పచ్చి గడ్డి అయినా పరవన్నమే ఈ సమయం లో, అటూ ఇటూ తెగ తిరిగాను, ఆకలికి గింజుకున్నాను.


“మా అమ్మ నేను ఆకలికి ఆగలేను, తిండిబోతు ని అని చాలా ఎక్కువ కట్టేసింది” అని ఇంతకుముందు మాటల మధ్యలో తను అన్న మాటలు గుర్తొచ్చాయి. మెల్లగా తన బ్యాగ్ వైపు చూసాను. ఇంకా తినడానికి ఏమైనా ఉంటుందేమో!! ఎదురుగా పడుకున్న తన వైపు చూసాను, వెంటనే బాగ్ వైపు చూసాను.


“నువ్వేం చేస్తావో నాకు అనవసరం, నువ్వెలా పోతే నాకేంటి, నీ చావు నువ్వు చావు, నన్ను మాత్రం చంపకు” అని ఆకలి తనకున్న గొంతుతో గట్టిగా అరుస్తుంది. ప్రపంచం నన్ను దొంగ అన్నా ఫర్వాలేదు అని చేసేదేం లేక, మెల్లగా తన బ్యాగ్ తెరిచాను, తనవైపు చూసాను, తనకళ్ళు చూసాను సూపర్ తను పడుకునే ఉంది. పక్క చూసాను, అందరూ గాఢ నిద్ర లో ఉన్నారు, నిశబ్ధం గోల చేసేస్తుంది, ఆ పాప కూడా పడుకుంది. మెల్లగా బ్యాగ్ జిప్ ఒపెన్ చేసాను, ఏవో రెండు మూడు బాక్స్ లు ఉన్నాయ్. బరువు గా ఉన్న బాక్స్ తీసాను, తిరుపతి వెంకన్న స్వామి కనిపించాడు చపాతీ, బంగాళదుంప కూర రూపం లో కళ్ళకు అద్దుకొని తింటున్నాను, త్వరగా తినేస్తే బెటర్ అని గబ గబా తింటున్నాను. తన వైపు చూసాను హమ్మయ్య తను పడుకునే ఉంది! అయిదు చపాతీలు మొత్తం తినేస్తున్నాను. అప్పుడు అస్సలు ఊహించనిది జరిగింది. తేలు కుట్టిన దొంగ సైలెంట్ గా ఉంటాడేమో.. కానీ అదే దొంగకు ఎక్కిళ్లు వస్తే అస్సలు కష్టం. అదే జరిగింది. జ్ఎగ్.. జెఎగ్.. ఎక్కిళ్లు వస్తున్నాయి. కంటికి దగ్గరలో నీరు కనపడటం లేదు, కంటి నుండి నీళ్ళు వచ్చేలా ఉన్నాయి.. అటు ఇటు చూసాను, అటూ ఇటూ పోయాను నీటి నీడ లేదు, ముఖం ముందు నీళ్ల బాటిల్ ప్రత్యక్షం అయ్యింది. వెంటనే తాగేసాను, వెక్కిళ్లు నోరు మూసుకున్నాయి. చిన్నగా నవ్వుతూ చేతులు ముడుచుకొని తను చూస్తుంది. బాటిల్ ఇచ్చింది తనే అని ఆ తర్వాత అర్థం అయింది. సారి కూడా చెప్పలేకపోయాను. తల కిందకి వంచి సైలెంట్ గా ఉన్నాను.


“అయ్యో ఇంత ఆకలి దాచుకొని అంత మొహమాటం తో ఎలా ఉన్నారండి!” అంది నవ్వుతూ, హమ్మయ్య కోప్పడలేదు ఎంత మంచిది. “క్షమించండి, తప్పుగా అనుకోవద్దు వేరే దారి లేక ఇలా చేసాను”, “హయ్యో పర్లేదండి, ఆకలి తీరిందా!! పై జిప్ లో పూతరేకులు కూడా ఉన్నాయి. మళ్ళీ ఆకలేస్తే తీసుకోండి. నీళ్లు సిద్ధం చేసుకోండి.” అని చెప్పి పడుకుంది. ఎంత బాగా మాట్లాడిందో, ఇది చాలదా!! కుర్రాళ్ళ కు నిద్ర పోనివ్వకుండా చేయడానికి. మంచి నవ్వు, మంచి మాట. బలహీనమైన మనసు తేలిగ్గా ప్రేమలో పడిపోయింది. నిద్రిస్తున్న చీకటి లో పండు వెన్నెల లాంటి తనని చూస్తూ ఆ అమృతం లాంటి పూతరేకులను తింటూ..తింటూ.. అలా రాత్రి మొత్తం ఉండిపోయాను. సాయంత్రం పరిచయం, రాత్రి సన్నివేశం, మధ్యలో మా మాటలు ఉదయానికి మమ్మల్ని మంచి స్నేహితులను చేసాయి.


నా కళ్ళ ముందు తను కళ్ళు మూసుకొని ఉంది. తన కలలో ఉన్నది నేనేనేమో.. చిలిపి గా ఊహించుకోవడం అన్యాయం కాదు గా.


తెల్లవారింది. ఇద్దరం కలిసే తిరుపతి గుడికి వెల్దామని స్టేషన్ నుండి బయటకు వచ్చాము. గుడి లోపలకు కూడా వెళ్తున్నాం. మాటల మధ్యలో.. కాసేపటికి.. “ఏవండి.. ఏవండి.. ఏంటండీ.. అండి..అండి.. మీ పేరు చెప్పండి” అని తనను అడిగాను.


“ఈ పరిచయం వ్యర్థం అయినదే, దర్శనం అయిపోయాక ఎవరిదారి వాళ్లదే గా, ఆ మాత్రానికి పేరు తో పనేంటి అండి.”


అసలు ఈ అమ్మాయిలు ఉన్నారే.!! అప్పటి వరకు బాగానే ఉంటారు. ఉన్నట్టుండి వాళ్లకేదో అవుతుంది. అస్సలు పరిచయం లేనట్లు ప్రవర్తిస్తారు. ఆడ గజినీలు.


“అదేంటండి అలా అనేశారు! నిన్న కాస్త పరిచయం అయ్యింది గా సాయంత్రం, రాత్రి కూడా బాగానే మాట్లాడారు గా, అండి అండి అనలేకపోతున్నా అండి మీ పేరు చెప్పండి...!!” క్యూ లో ఉన్న తను,ఆగి అటు ఇటు నెమ్మది గా చూసి “అలా అయితే నా పేరు పద్మావతి, మీ పేరు వెంకటేశ్వర స్వామి ఒకే నా.. మనం ఎవరి దారిన వాళ్ళం వెళ్ళేవరకూ అవే మన పేర్లు.” మంచి ఆలోచన “లైన్ కదిలింది ముందుకు పదండి” అన్నాను. కాసేపు అలా నడుస్తూ ఉన్నాం, మొదటిసారి అనిపించింది క్యూ లైన్ ఇంకొన్ని కిలోమీటర్ల దూరం ఉంటే ఎంత బాగున్ను అని.


అక్కడ మైక్ లో చెప్తున్నారు. “ఈరోజు చాలా మంచి రోజు స్వామి వారిని పద్మావతి అమ్మ వారు కలుసుకుని ప్రేమించిన రోజు!!”, చా..!! వినే వాళ్ళు ఉంటే భారతం అంతా చెప్తారు నవ్వుతూ తన కు వినిపించేలా అన్నాను. “చప్! చేతలు ఇలా పెట్టండి, కొన్ని నమ్మాలి లేదంటే ఊరుకోవాలి అంతే కానీ వేళాకోళం చెయ్యకూడదు తప్పు” దండం పెట్టేలా చేతులు చూపించి చెప్తుంది పద్మా వతి. తను నన్ను అలా చనువు గా గసరడం నాకు బలే అనిపించింది. ప్రేమించిన వాళ్ళ చేత తిట్టించుకోవాలని ఎవరు కోరుకోరు చెప్పండి!! సరే అని చిన్న నవ్వుతో తలూపాను.


మైక్ లో ఆ పూజారి ఎవరో సరిగ్గా మా గురించే చెప్తున్నట్టు అనిపించింది. స్వామి వారు అమ్మవారిని కొంటె గా చూడటం, అలా సిగ్గు తో అమ్మ వారు తల వంచడం. అంతా మా మధ్య మా చూపుల మధ్య, మా భుజాల మధ్య జరిగే సంఘటనలే.


క్యూ లో ఎక్కువ మంది జనం మమ్మల్ని చాలా దగ్గర చేశారు, ఒకరి ముక్కు ఒకరికి తగిలేంత దగ్గరగా వచ్చేసాం, ఊపిరి అందట్లేదు, ఇద్దరం ఏమి మాట్లాడలేదు. తన కళ్ళు, నా కళ్ళు ధనావేశానికి రునావేశం తోడైనట్టు కాసేపు అలా చూసుకొని ఉండిపోయాం. కాసేపటికి అంతా సద్దుకుంది. అక్కడ వేంకటేశ్వరస్వామి, పద్మావతి పేర్లు కనిపించాయి, కాసేపటికి తను నా వైపు చూసి నవ్వింది. నేను కూడా.. మీతో చెప్పడానికి సిగ్గెందుకు కూల్ గా, సైలెంట్ గా లైన్ వేస్తున్నా.. ఆ వెంకటేశ్వర స్వామి ఆ పద్మావతి దేవిని ఎలా ప్రేమ లో పడేసాడో తెలిస్తే బాగుణ్ణు. బయటకు వచ్చేసాం, అఖండమైన అద్భుతమైన దేవాలయం చక్కటి అనుభూతిని ఇచ్చింది.


“స్వామి దర్శనం బాగా జరిగింది కదా..!”


“హుమ్.. కానీ దేవి దర్శనం నాకు సరిగ్గా జరగలేదు” తననే సూటి గా చూస్తూ అన్నాను. తను ఏం మాట్లాడలేదు, మౌనం గా ఉంది. ప్రసాదం తీసేసుకొని తిరిగి వస్తున్నాం.


“తిరుపతి లో నా ఫ్రెండ్ ఉంది. తనని కలిసి వెళ్తాను, మీరు వెళ్లిపోండి” అంది. తిరిగి వెళ్లే జర్నీ లో తనని ఎలా అయినా ప్రేమ లో పడెయ్యాలి అనుకుంటే ఇలా అందేంటి..!!


“అరే సరిగ్గా నాకు కూడా తిరుపతి లో ఒక ఫ్రెండ్ ఉన్నాడు.. మీ ఫ్రెండ్ ఉండేదెక్కడ!”


“మధూ.. హేయ్ మధూ..!” అంటూ తన ఫ్రెండ్ తనను మేమున్న చోటే కలిసింది. కొంచం వెనక్కి జరిగాను, కాసేపటికి నా దగ్గరకు వచ్చి, సరే అండి “నైస్ టు మీట్ యు” అంది. అబ్బా ఆ నవ్వు చంపేస్తుంది కదా!, నాకు తన మాటలు అర్థం అయ్యాయి, నన్ను పొమ్మంటుంది, కానీ తన కళ్ళు చూస్తుంటే అర్థం అవుతుంది. నేను కూడా తనకు నచ్చానని! కేవలం అమ్మాయిలకు మాత్రమే సాధ్యం విశ్వమంత ప్రేమ కేవలం కళ్ళతో చూపించడం.


దేవుని గుడి వైపు చూసి చేతులు జోడించి మొక్కుకున్నా! “థాంక్స్ స్వామి, నీ కై వస్తే నాకు ప్రసాదం తో పాటు ప్రేమ ను కూడా ఇచ్చావు, నేను ఇప్పుడు తనకి ప్రోపోస్ చేస్తా.. నువ్వే ఒప్పించాలి” అని మొక్కాను. మేము మాత్రమే లేము కదా.. చాలా మంది జనం ఉన్నారు. ఠక్కున తాను మాయం అయిపోయింది.. అటు పరిగెత్తా..ఇటు పతిగెత్తా. చాలా సమయానికి అర్థం అయ్యింది తాను తప్పి పోలేదు, తప్పించుకు పోయింది అని, చా.. ఎన్ని కలలు కన్నాను! అదృష్టవశాత్తు గుండు కొట్టుకోలేదు. దురదృష్టవశాత్తు ఆ దేవుడే నాకు గుండు కొట్టాడు. చాలా నిరుత్సాహంగా వచ్చిన దారిలో నే ఇంటికి వచ్చాను. ఆ తీపి జ్ఞాపకాలు మనసులో, తిరుపతి ప్రసాదం బ్యాగ్ లో పెట్టుకొని.


ఆ తర్వాత జాబ్, పెళ్లి అలా అలా కాలం తో అయిపోయాయి.


***


“పిచ్చిదాన నువ్వంటే నాకెప్పుడూ ప్రేమే నే!!, రెడీ అవ్వు మూవీ కి వెళ్దాం” అన్నాను. ఎంతో మురిసిపోయి, ముద్దిచ్చి, ముస్తాబు అవ్వడానికి లోనికి వెళ్ళిపోయింది మధు.



Rate this content
Log in

Similar telugu story from Romance