పంజరపు జీవితం
పంజరపు జీవితం
ఎన్నాళ్ళు పంజరపు జీవితం...!!
సృష్టించాలని చూస్తున్నాం మరో స్వర్గము
నేలపై వెతికినా దొరకని బంగారపు సౌధాన్ని
కట్టుబాట్ల ఊచలను తొలగించే ప్రయత్నంలో
చిట్టి గుండెకు బరువు లేని ప్రయాణం కోసం..
కఠిన శిలను మార్చాలనే నిత్య ప్రయత్నం
మానవత్వపు ఉలితో సహజత్వం పోసి
కాలి కింద పడ్డ బండరాయిని శిల్పంలా చెక్కి
గుడిలో దైవాన్ని చెయ్యాలని చూస్తున్నాం..
కాలం విసిరేయబడ్డ బడుగు జీవానికి
రుధిరపు తనువుకు పరిమళాన్ని అద్ది
చెమట చుక్కల స్వేదం విశ్వానికి వెదజల్లుతూ
కాయలు కాసిన చేతులకు స్వర్ణం తొడగాలని....
ఎన్నాళ్ళు పంజరపు జీవితాల బేరాలు
ప్రపంచం కుగ్రామమై నేడు నడుస్తుంటే
అగ్నిపర్వతాలు చల్లదనం కోసం ఏడుస్తుంటే
ప్రపంచ వింతలు గతి తప్పి ప్రవర్తిస్తున్నాయి..
ప్రపంచపుపైపూతగా కప్పబడిన వనపర్వతం
ప్రాణాపాయ స్థితిలో ప్రాణవాయువు కోరుతుంటే
నిలువునా చీలిన మనిషి నిద్రావస్థలో ఉంటే
లోక కళ్యాణం నేలపైన ఘనంగా జరగాలంటే ఎలా..
దివ్యాంగుల్లా తిరుగుతుంది నేడు భూమాత
అశుద్ధంతో శుభ్రత కోల్పోయి బ్రతుకుతూ
విషం అంతా తిని విషాద వదనంతో తిరుగుతూ
అరచేతి ప్రాణాలతో వైకుంఠం చూస్తుంది..
కాలపు బుతువులు గతులు తప్పి నర్తించే
మూడు కాలాలు ముచ్చట్లను మరిచిపోయి జీవించే
ప్రకృతి స్థానభ్రంశాలతో దారులు తప్పుతుంది
తప్పిదం చేసిన బ్రతుకు భారంగా ఏడుస్తుంది.