madhuri Reddy

Tragedy

4  

madhuri Reddy

Tragedy

ఎదురుచూపు

ఎదురుచూపు

4 mins
999


''ఎదురుచూపు..""

అది కావలి రైల్వే స్టేషన్.. స్టేషన్ మొత్తం రద్దీగా ఉంది ఎవరి హడావిడిలో వాళ్ళు ఉన్నారు.. వచ్చే వాళ్ళు వస్తున్నారు వెళ్లేవాళ్లు వెళ్తున్నారు, టీ స్టాల్ వాళ్ళు, టిఫిన్ స్టాల్ వాళ్ళు, వాల్ల వాల్ల వ్యాపారాల్లో బిజీగా ఉన్నారు.. అంత బిజీగా ఉన్న స్టేషన్లో.. ఒక బల్లా పై

ఉదయం నాలుగు గంటల నుంచి ఒక ఆవిడ అలాగే కూర్చుని వచ్చిపోయే రైళ్ళను చూస్తూ ఉంది..

అప్పటికే సమయం సాయంత్రం 7 దాటింది.. అయినా తను అక్కడ నుంచి కదలడం లేదు..

సమయం 7:30 కావస్తోంది , రంగి పద ఇంటికి పోదాము.. సీకటి పడుతుండాది ఎప్పుడో సూరిడు రాకముందు వొచ్చొండావు పొద్దు పోయుండాది, ఊర్లో దీపాల ఏసే యాల అయింది.. ఇంకాసేపు ఆగితే దీపాలు ఆర్పే యాల కూడా అవుతాది , ఊరంతా సద్దుమణిగింది.. ఇడ నుంచి నాలుగు మైళ్ళు నడిస్తే కానీ మన ఊరు రాదు , ఈ యాలలో రిక్షా కూడా దొరకదు నడిసె పోవాల, మీ అమ్మ ఇంటి కాడ నీకోసం ఎదురుసుత్తా ఉంటాది. నా మాటిని పద రంగి పోదాము..

ఆగు నాయనా.. ఇంకో ట్రైన్ ఉండాదంట అది చివరి ట్రైన్ అంట.. ఆ ఒక్క ట్రైన్ లో చూసి పోదాము నాయనా..

ఏడాది నుంచి సుత్తానే ఉండావు కదఅమ్మా.. ఊరిలో జనాలందరూ మీ రంగి కి పిచ్చి పట్టింది.. ఒక మంచి ఆసుపత్రిలో సుపెట్టు అని యాలకొలం అడుతుండారు..

వాళ్లకె పిచ్చి పట్టింది నాయనా, ఆ సివరి ట్రైన్లో నా మావ వత్తాడేమో, నేను ఎదురు యెళ్లకపోతె నా రంగి నాకోసం బెంగెసుకొని ఎదురు సుత్తా ఉంటాది అనుకుంటే, కనీసం ఎదురయిన పడలేదు అనుకుంటాడు నాయనా.. ఇంకా సేపు ఆగు నాయనా పోదాము.. అని జాలిగా బతిమిలాడుతున్న రంగి వంక , బాధ నిండిన కళ్ళతో రత్తయ్య అలాగే చూస్తూ కాదనలేక ఉండిపోయాడు..

సమయం ఎనిమిది కావస్తుండాది , ట్రైన్ ఆనవాళ్లే కనిపించడం లేదు.. ఏంటి నాయనా ఇంకా ట్రైన్ రాలేదు రోజు ఎనిమిదింటికల్లా ట్రైన్ వెళ్ళిపోయేది..ఇంకా ఎందుకు రాలేదు కూసింత స్టేషన్ మాస్టర్ దగ్గరికి పోయి కనుక్కొని రా పో..

రత్తయ్య స్టేషన్ మాస్టర్ దగ్గరికి వెళ్లి.. సారూ ఎనిమిది గంటలకు వచ్చే ట్రైన్ ఇంకా రాలేదు.. ఏమైంది అయ్యా.. అని అడిగాడు.

మధ్యలో ఏదో చిన్న ప్రాబ్లం ఉండి ఆపేశారుఅంట.. ఇంకో గంట సేపు ఆగితే కానీ ట్రైన్ బయలుదేరి రాదు.. అని స్టేషన్ మాస్టర్ సమాధానమిచ్చాడు..

రత్తయ్య రంగి దగ్గరికి వెళ్లి. ట్రైన్ ఆలస్యం అవుతాది అంట అమ్మ.. ఇంకో గడియ పడతాద అంట. పోదాం పా తల్లి సీకటి పడిపోతుండాది..

ఆగు నాయన ఆఖరి టైన్ పోయాక పోదాము.. ఇంకా రంగి చెప్తే వినెల లేదు అని.. రత్తయ్య రంగి పక్కన అలాగే కూర్చుండిపోయాడు..

ఒక పది నిమిషాల తర్వాత.. స్టేషన్ మాస్టర్ రూమ్ లో నుంచి బయటకు వచ్చి.. రంగి పక్కన ఉన్న టీ కొట్టులో టీ తీసుకుని తాగుతూ.. టీ స్టాల్ అతని తో మాట్లాడుతున్నాడు..

మస్తాన్ ఎవరీ అమ్మాయి రోజు ఉదయం నాలుగు గంటల నుంచి.. సాయంత్రం లాస్ట్ ట్రైన్ వెళ్ళిపోయే వరకు.. ఎదురు చూసి చూసి వెళ్ళిపోతుంది.. నేను వారం నుంచీ చూస్తూనే ఉన్నాను..??

మీరు ఈ మధ్య వచ్చారు కదా సారు.. వారం నుంచి ఏంటి.. ఏడాది నుంచి ఈ పిల్ల ఇలాగే చూస్తా ఉండాది.. మీరు కొత్త కదా స్టేషన్ కి.. మీకు తెలీదు లేండి సారు..

అసలు ఏమైంది మస్తాను..??

ఏముంది సారు.. ఎటు చూసినా బీడు భూములు.. వ్యవసాయం చేసుకుని బతుకుదాం అంటే.. చెరువులో సుక్క నీరు లేకపాయె, ఏదన్నా పని చేసుకుని బతుకుదాం అంటే.. చేయడానికి ఏం పని లేక పోయే.. ఏదో పొట్టకూటి కోసం కడుపు తిప్పల కోసం.. పెళ్ళాం పిల్లలని పస్తూ ఉంచ లేక.. ఏదో ఒక ఏజెంట్ ని నమ్ముకొని.. దుబాయ్ వలస పోయి, ఆడ గంజొ గాసమె తాగి.. రూపాయి రూపాయి కూడా పెట్టుకొని.. ఈడ పెళ్ళాం పిల్లలకి పంపి.. వాళ్ళు కడుపునిండా భోజనం చేశారని తెలిసి.. వాళ్ళ కడుపు నింపుకొని.. ఎట్టొ కట్ట కష్టాలు పడి బతుకుతున్నారు..

రంగి మొగుడు కూడా.. ఇలాగే దుబాయ్ పోయాడు.. మూడేండ్లు దుబాయిలో ఉండి.. తీరా బయల్దేరి.. మన దేశానికి వచ్చే టప్పుడు.. ఎయిర్పోర్ట్ కి ఆయన ఉండే తావు కి.. మూడు గంటల పయాణం అంట.. మన దేశం వాళ్ళు.. ఆ బస్సులో 20మంది దాకా ఉండారంట.. అయితే దారిలో ఏమైందో ఏమో.. ఎవరో టెర్రరిస్ట్ లు అంట అయ్యా.. ఇళ్లందరినీ బస్సు తో గుడా ఎత్తుకెళ్లి పోయారు అంట.. అల్ల మనిషి ఎవురొ మనోళ్ళ తాట ఉన్నాడంట.. ఆయనను ఒగ్గితె గాని.. మనోళ్ళును ఇడిసీపెట్టమని .. అంటున్నారంట.

మన గోవర్నమెంట్ వోళ్ళు.. వాళ్లతో మాసానికి  ఓసారి మంతనాలు జరపడం.. అవి పెద్దగా.. ఫలించక పోవడం.. మనోళ్ళనీ నెలకు ఒక్కరిని చంపి.. పార్సల్ చేసి పంపడం.. ఏడాది నుంచి ఇదే జరుగుతుండాది.. ఈ రంగి ఏమో పిచ్చిదాని లాగా.. ఏడాది నుంచి ఇలాగే.. రోజు వచ్చే ఎదురు సుత్తా ఉండాది.. దాని మావ పాణాలతో నే తిరుగోత్తాడో.. పెట్టెలో తిరుగొత్తాడొ.. ఎటి అవుతాదో ఏంటో..

ఇదంతా విన్న స్టేషన్ మాస్టర్ గుండె తరుక్కుపోయింది.. తనకి తెలియకుండానే తన కళ్ళల్లో నుంచి సన్నని నీటి దార.. ఈ రోజుల్లో కూడా ఇంతగా ప్రేమించి ఎదురు చూసే వాళ్ళు ఉన్నారా.. అనుకున్నాడు ఒక్కక్షణం..ఆ దేవుడి దయ వల్ల అతనికి ఏమీ కాకుండా వస్తే బాగుండు.. ఒకవేళ తనకు ఏమైనా అయితే ఈ అమ్మాయి బతకదు.. అని మనసులో అనుకుంటూ రంగి కూర్చున్న దగ్గరికి వెళ్ళాడు.

అమ్మ ఇప్పుడే.. దుబాయ్ నుంచి ఫోన్ వచ్చింది.. ఎవరో రంగి మావ అంట.. పేరేదో చెప్పాడు మర్చిపోయాను..

ఏంటి సారు మా మావ ఫోన్ చేశాడా.. రంగి అంటే నేనే అయ్యా.. ఏమన్నాడు.. అవతల ట్రైన్ లో ఉన్నాడు అంట నా.. అని ఆత్రుతగా ఆశ నిండిన కళ్ళతో.. స్టేషన్ మాస్టర్ ని అడుగుతుంది..

అది కాదమ్మా.. దుబాయ్ లో ఫ్లైట్ కి.. ఏదో రిపేర్ ఉందంట.. అక్కడ వర్షం పడుతుంది అంట.. వర్షం తగ్గగానే రేపు మాపొ వచ్చేస్తా అని చెప్పమన్నాడు..

అయ్యో అవునా సారు. మా మావ ఫోన్ చేసినప్పుడు నన్ను పిలిత్తె నేను మాట్లాడే దాన్ని కదా..

అది చాలా దూరం నుంచి వచ్చిన ఫోన్ కదమ్మా.. నిన్ను పిలిచిన వచ్చేలోపు కట్ అయిపోయింది..?

మళ్లీ ఫోన్ చేస్తే.. మీ రంగి నీ కోసం ఎదురు సుసి సుసీ పోయిందని చెప్పు సారు..

సరే అమ్మ తప్పకుండా చెప్తాను.. నువ్వు ఇంక ఇంటికి వెళ్ళు..

రత్తయ్య స్టేషన్ మాస్టర్ వంక.. ఒక కృతజ్ఞతాభావంతో చూసి.. నమస్కారం పెట్టి.. రంగి ని తీసుకొని ఇంటి దారి వైపు కదిలాడు..

స్టేషన్ మాస్టారు.. వీళ్లు కనిపించే కనుచూపుమేర వరకు అలాగే చూస్తూ నిలబడిపోయాడు..

రంగి మాత్రం దారిపొడవునా.. తన మామ కబుర్లు చెప్తూ ఉంది వాళ్ళ నాన్నతో.. నాయనా నువ్వు సలిలో.. వణుకుతూ పొలంలోకి పోతున్నావు అని. మావ కి చెప్పాను.. నీకోసం ఒక మంచి. రగ్గు కొన్నాడు అంట.. అలాగే ఒక సెల్లుల లైట్ కూడా కొన్నాడు అంట.. అమ్మ కేమో.. కళ్ళు సరిగా కనిపించడం లేదు కదా.. కళ్లద్దాలు కొన్నాడంట..

మరి నీకు ఏమి కొన లేదా రంగి..

నీకేం కావాలి అని అడిగాడు నాయనా.. నాకేమీ వొద్దు మామ.. నువ్వు రా అదేసాలు అని సెప్పాను.. మామ వొత్తే ఇంక ఎల్లనియ్య గూడదు నాయనా.. ఇక్కడే ఉండి ఏదో ఒక పని చేసుకుని బతుకుదాం అని సెబుతాను.. అని రంగి దారిపొడుగునా చెప్తూ పోతూనే ఉంది..

రత్తయ్య ఉబికి వస్తున్న దుఃఖాన్ని ఆపుకోని.. అలాగే వింటూ పోతూ ఉన్నాడు.. రంగి ఎదురుచూపు ఎదురుచూపు గానే మిగిలిపోతుందా...,?? లేదా విధి ఇద్దరిని కలుపుతుందా??



Rate this content
Log in

Similar telugu story from Tragedy