gowthami ch

Drama

5.0  

gowthami ch

Drama

కొత్త ప్రారంభానికి పాత ముగింపు

కొత్త ప్రారంభానికి పాత ముగింపు

2 mins
381


ఏమండీ.... ఒదిన గారు, కాస్త కందిపప్పు ఉంటే ఇస్తారా? రేపు సరుకులు రాగానే ఇచ్చేస్తాను." అంటూ ఇంట్లోకి అడుగుపెట్టింది పక్కింటి పంకజం.


"రండి రండి వదినగారు, అవేం మాటలు! ఇరుగు- పొరుగు అన్నాక ఆ మాత్రం సహాయం చేసుకోకపోతే ఎలాగండి. మీకెంత కావాలంటే అంత , ఏవికావలంటే అవి నిర్మోహమాటంగా అడగండి." అంటూ వంటింటిలోనుండి పప్పు తెచ్చి ఇచ్చింది కనకం.


"మీది ఇంత మంచి మనసు కాబట్టే మీకు అంత మంచి భర్త లభించాడు."


"ఏదో అంతా మీ అభిమానం." అంటూ కూర్చోడానికి కుర్చీ వేసి కూర్చోమని సైగ చేసింది కనకం.


"అవును వదిన గారూ...మన ఎదురింట్లో కొత్తగా ఎవరో చేరినట్లున్నారుగా ! మీరేమన్నా పలకరించారా?" అడిగింది పంకజం.


"ఆ... ఆమధ్య కూరగాయల మార్కెట్ లో కలిశారండి అంతే, ఆ తరువాత మరలా కుదరలేదు. ఎక్కడా!! ఇంట్లో పనితోనే సరిపోతుంది రోజంతా."


"మంచిపని చేశారు, ఒకవేళ పొరపాటున ఆవిడ పలకరించినా మాట్లాడకండి. వాళ్ళు ఏదో తేడాగా ఉన్నారు."


"అంటే ఏంటండి మీరు చెప్పేది!!?" అంటూ ఆశ్చర్యంగా ఆడిగింది కనకం.


"వాళ్ళింటికి ఎవరో ఒక కుర్రాడు రోజూ వస్తూ పోతూ ఉన్నాడండి. వాళ్ళ అమ్మాయితో చాలా చనువుగా మాట్లాడతాడు. అప్పుడప్పుడు బయటకి కూడా తీసుకెళ్తాడు. ఒక్కోసారి మరీ రాత్రుళ్ళు కూడా వాళ్ళింట్లోనే ఉండిపోతాడు. అసలు ఎవరండి వాడు అంత అసహ్యంగా.


"వాడంటే సరే కుర్రాడు, కనీసం ఆ ఇంట్లో వాళ్ళకైనా బుద్ధి ఉండక్కర్లేదా మగదిక్కులేని ఇల్లు కదా ఇలా ఎవడు పడితే వాడు రోజూ వస్తూ పోతూ ఉంటే బయట నలుగురూ ఏమనుకుంటారో ఏమో అనే ఇంగితం అయినా ఉండక్కర్లేదా.


"పైగా పెళ్లి కావలసిన పిల్లాయే... ఇలా పరాయి మగడితో బైక్ మీద తిరుగుతుంటే రేపు ఆ పిల్లని పెళ్లి ఎవరు చేసుకుంటారు." అంది పంకజం.


"ఇంక చాల్లే ఆపండి వదిన గారు.. వాళ్ళ గురించి ఇంకొక్క మాట మాట్లాడినా బాగుండదు చెప్తున్నా." అంటూ కోపంగా పైకి లేచి నించుంది కనకం.


"ఏమైంది వదిన గారు మీకెందుకు అంత కోపం వస్తుంది వాళ్ళని అంటే?"


"మరి మీరిలా నోటికొచ్చినట్లు మాట్లాడుతుంటే ఏం చేయమంటారు. అసలే భర్త చనిపోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆవిడని ఓదార్చే వాళ్ళు లేక పొగ భర్త చనిపోయిన ఆడది అని ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడే మనుషుల నుండి దూరంగా ఉండడం కోసం ఊరు మారితే ఏమన్నా వాళ్ళ బ్రతుకులు బాగుపడతాఏమో అని భావించి ఇలా వచ్చి వాళ్ళ జీవితాలని కొత్తగా ప్రారంభించాలి అనుకున్నారు. అటువంటి వాళ్ళ మీద మీరు ఇలా లేని పోని అభాండాలు వేస్తుంటే తట్టుకోలేకపోతున్నాను.


"ఆ పిల్లాడు ఎవరో కాదు ఆవిడ కొడుకే. స్వయానా ఆ అమ్మాయికి అన్నయ్య.


"పై చదువుల కోసం అబ్బాయి పట్నంలో ఉంటూ చదువుకుంటున్నాడు. ప్రతి వారం ఇంటికి వచ్చి అవసరాలు చూసి వెళ్లిపోతుంటాడు. " అంది కనకం.


"ఈ వివరాలన్నీ మీకెలా తెలుసు వదిన గారు?" అడిగింది పంకజం.


"ఆవిడ మొన్న కూరగాయల మార్కెట్ లో కలిస్తే మాట్లాడాను అని చెప్పాను కదా, అప్పుడే చెప్పారు ఈ వివరాలు అన్ని. ఇంకా నయం నేను ఆవిడతో మాట్లాడకుండా ఉండి ఉంటే మీరు చెప్పేది నిజమని అనుకొనేదాన్ని.


"కాలంతో పాటు ఎన్నో మారుతున్నాయి. మనుషుల జీవన విధానం , ఆలోచనా శైలి అన్నింటిలో ఎంతో మార్పు వచ్చింది. కానీ మీలాంటి కొంతమందిలో మాత్రం ఎటువంటి మార్పు రాలేదు. ఇంకా ఆ పాత కాలపు ఆలోచనా విధానం మీలో అలానే ఉండిపోయింది. ఎన్నో కొత్త తరాలు మారుతున్నా ఇంకా అవే పాత ఆలోచనలు. ఎవరైనా ఇద్దరు ఆడ మగ కొంచెం చనువుగా ఉంటే చాలు ఏవేవో ఊహించేసుకుంటారు.


"ఎవరిగురించైనా పూర్తిగా తెలియకుండా అలా అనుకోవడం పొరపాటు. దయచేసి నన్ను తప్పుగా అనుకోకండి." అంది కనకం.


"నన్ను క్షమించండి వదిన గారు నేనే ఆ అమ్మాయిని తప్పుగా అర్ధం చేసుకున్నాను." అని క్షమాపణ అడిగి అక్కడినుండి వెళ్ళిపోయింది పంకజం.



Rate this content
Log in

Similar telugu story from Drama