Sridevi Somanchi

Drama

4.8  

Sridevi Somanchi

Drama

ఇంకో మజిలీకి

ఇంకో మజిలీకి

8 mins
515


ఇంకో మజిలీకి

ఫిబ్రవరి యిరవై తొమ్మిది.

రాజారావు సర్వీసులో ఆఖరి రోజు. రిటైరవబోతున్నాడు. ముందురోజు రాత్రంతా అదే ఆలోచనతో నిద్రపట్టలేదు. అప్పటిదాకా కలకల్లాడుతూ కనిపించిన జీవితం వెలిసిపోయిన కేన్వాస్ లా వెలవెలబోతూ మనోనేత్రాలకి తోచింది.

అప్పుడే తనకి అరవయ్యేళ్లు నిండాయా? విస్మయంగా అనిపించింది. నిన్న మొన్న కెరీర్

ప్రారంభించినట్టుంది. ఉద్యోగం, పెళ్లి, పిల్లలు, బాధ్యతలు... అన్నీ అయి ఆఖరి అధ్యాయంలా ఈ రిటైర్మెంటు. దాహం వేస్తోందని దోసిలి నిండా నీళ్లు తీసుకుని తాగేలోగా చుక్క చుక్కగా కారిపోయి ఖాళీ చేతులు మిగిలినట్టు క్షణాలన్నీ జీవితపు దోసిట్లోంచి జారిపోయాయి. తృష్ణ ఒక్కటే మిగిలింది. 

ఏం సాధించాడని? ఏం మిగిలిందని? రేపేమిటని? ఎలాగని?

అతి పెద్దదైన ఈ వ్యవస్థ నడవటానికి అవసరమయ్యే అసంఖ్యాకమైన నట్లూ బోల్టుల్లో తనొకడు. ఆరుగుదలే తప్ప ఎదుగుదల వుండదు.

హౌ వోల్డ్ ఆర్యూ?

నువ్వెంత పాతబడ్డావు? అలా పాతబడి, చివికి, శిథిలమై ఏమీ లేకుండా పోవటడమే జీవితమా? జనాంతికంగా జరిగిపోయే ఈ ప్రక్రియ మొత్తమే జీవితమనుకుంటే తనకెందుకీ అశాంతి?

"ఇంకా నిద్రపోలేదా?” పక్కనే వున్న భార్య అడిగింది.

"రేపటితో రిటైరవుతాను" అన్నాడు మననం చేసుకుంటున్నట్లు. అప్పటికది ఎన్నోసారో, ఆమెతో ఆ విషయం అని. 

"దానికింత ఆలోచనెందుకు?ఉద్యోగంలో చేరాక రిటైరవక తప్పుతుందా? ఎందరు రిటైరవటం లేదు? మీరొక్కరేనా? ఉరుకులూ పరుగులూ లేకుండా నిశ్చింతగా వుంటాం” ఓదార్చింది . 

ఆమె మాటలకి ఉపశమనం కలగలేదు.

“డబ్బంతా కలిపి పది లక్షలొస్తుందా?"

“వస్తుందేమో?

"ఏం చేద్దాం ?"

రాజారావు చిన్నగా నవ్వాడు. “ఆదాయం సగానికి తగ్గిపోతుంది " గుర్తుచేసాడు.

"మనిద్దరికీ అంతకన్నా ఖర్చేం వుంటుంది? నార్త్ టూర్ వెళ్లాలని ఎప్పటినుంచో కోరిగ్గా వుంది. మా అన్నయ్యా వాళ్లూ వెళ్లినప్పుడు మననీ రమ్మన్నారు. గుర్తుందా? మనకి కుదర్లేదు.”

"పిల్లల డిమేండ్స్ ఏం వుంటాయో?"

"ఇన్నాళ్ళూ అంటే మీకు చేతినిండా జీతం వుండేది. వాళ్లేం అడిగితే అదిచ్చాం . ఇప్పుడలా ఎలా కుదురుతుంది? ఈ డబ్బు వాళ్లకి పంచేస్తే ముందు ముందు మన అవసరాలకీ ఎలా? ఇప్పటిదాకా గడిపిన జీవితం వాళ్లది. ఇక మీదట గడపబోయేది మనిద్దరిదీ. కష్టమైనా

సుఖమైనా మనిద్దరమే పంచుకోవాలి”

రాజారావు చకితుడయ్యాడు. లోకానికి బిన్నంగా ఆలోచిస్తోందేమిటి తన భార్య? ఇంత డబ్బు తన చేతికి వస్తోంటే వాళ్లు అడగకుండా వుంటారా? అడిగాక తను ఇవ్వకుండా వుండగలడా? ఇవ్వకపోతే వూరుకుంటారా?

"పిల్లలు వాళ్ళ దగరకొచ్చి వుండమంటున్నారు. మీరు తొందరపడి మాటివ్వద్దు. ఇప్పటినుంచీ మన అనుబంధాన్ని పరాయీకరణ చేయొద్దు” స్పష్టంగా తన అభిప్రాయాన్ని చెప్పింది.

అప్పటిదాకా రాజారావు ఈ విషయం గురించి ఏమీ అనుకోలేదు. అతనికి ముగ్గురు సంతానం. ఇద్దరు కొడుకులు, ఒక కూతురు. అందరికీ పెళ్లిళ్లయ్యాయి. రెండేసి జీతాలు. రిటైరయాక

ఏ కొడుకు దగ్గరకో వెళ్లి వుండడం అనివార్యం అనే భావన అంతర్లీనంగా కదులుతుండేది ఆ క్షణందాకా. భార్య ఆలోచన దాని మూలాల్ని కదిలించింది. అతని ఆలోచనలు కొత్త దారిలోకి మళ్ళాయి.

తమకీ పిల్లలకీ ఒక తరం అంతరం వుంది. సెంటిమెంట్సుకీ, అనుబంధాలకీ

ప్రాధాన్యతనిచ్చి వ్యక్తిగత సౌఖ్యాలని పెద్దగా లెక్కించని తరం తమది. తన వరకూ తను సుఖంగానూ

తటస్థంగానూ వుంటే చాలనుకునే తరం ఇప్పటివాళ్లది. డిటాచిమెంటు వాళ్లకి అలవాటు. బహుశా

ఒకటి కారణం కావచ్చు. బతుకుపోరాటంచాలా తీవ్రతరంగా మారింది . ఒకప్పటి జీవితగమ్యం

“ప్రాప్తం' అనే పదంలో నిక్షిప్తమై వుండేది. దొరికిన దాంతో సరిపెట్టుకునేవారు. ఇప్పుడలా కాదు.ప్రతివారూ ప్రతీదీ కోరుకుంటున్నారు. అనర్హుడు అర్హుడికి పోటీ ఇస్తున్నాడు. ఈ నేపథ్యంలో మనిషిలో స్వార్థం పెరిగి మెటీరియలిజానికి చోటిచ్చి, మానవసంబంధాలలోని సున్నితమైన

అంశాలు దెబ్బతింటున్నాయి. అలాంటప్పుడు తను కొడుకుల దగ్గరికి వెళ్లి వుండడం అంత సమంజసం కాదేమో!

"ఇప్పటికిప్పుడు ఆలోచించి నిర్ణయించుకోవలసినంత తొందరేమీ లేదు. మనసులో వుంచుకోండి చాలు. మనిద్దరికీ వయసేం మించిపోలేదు. ఇంకా ఓపిగ్గా వున్నాం. అంతా ఎనభైలూ , తొంభైలూ బతుకుతున్నారు. ఇప్పటినుంచీ వెళ్లి వాళ్లమీద వాలిపోవడం దేనికి? దూరంగా

వున్నంతసేపే ఏ అనుబంధాలైనా నిలుస్తాయి. వాటిని తొందరపడి తెంచుకోవటంకన్నా వున్నచోటే వుండి నిలబెట్టుకోవటం మంచిది. మన గురించి మనం ఆలోచించుకోవటంలో తప్పు లేదు. రిటైర్మెంట్ ఆఖరి మజిలీకాదు. ఆ తర్వాత ఇంకా చాలా ప్రయాణం వుంటుంది. అప్పటిదాకా 

ఎవరూ మన బరువు మొయ్యలేరు. అలా ఆశించడమూ తప్పే. ఇంక పడుకోండి" అనేసి నిద్రలోకి జారుకుంది.

...

“ఈవేళ కూడా ఇన్ని ఫైల్సేసుకుని కూర్చున్నారేంటిసార్? రాజారావు దగ్గర చనువున్న జూనియర్ క్లర్కు అడిగాడు.

“ఈ ఒక్కరోజేగా?” రాజారావు గ్లూమీగా జవాబిచ్చాడు. ఎంత వద్దనుకున్నా ఎక్కడో ఏదో నిరాశ అతన్ని మామూలుగా వుండనివ్వటంలేదు.

"అదేమిటి భాయ్? సర్వీసంతా వర్కు చెయ్యకుండానే జీతం తీసుకున్నారా, ఈ ఒక్కరోజే అంటున్నారు ? " రెండేళ్లు

సర్వీసు మిగిలున్న ఇంకో కొలీగ్ జోక్ చేసాడు. అంతా ఎంజాయ్ చేసారా జోక్ ని. పెద్దగా నవ్వేసారు. రాజారావు కూడా నవ్వేడు... బలవంతంగా. .

మేనేజరు దగ్గరనుంచీ పిలుపు వచ్చిందతనికి. ఎందుకోననుకున్నాడు. తన దగ్గర మిగిలిపోయిన ముఖ్యమైన ఫైల్సేమున్నాయో గుర్తుతెచ్చుకున్నాడు. అలాంటివేమీ జ్ఞాపకానికి రాలేదు.

ఆలోచిస్తూనే వెళ్లాడు.

 “కూర్చోండి" సాదరంగా ఆహ్వానించాడు మేనేజరు. చాలా చిన్నవాడు.రాజారావు

వయసులో సగం వుంటుంది. ఎంబియ్యే చేసి డైరక్టుగా ఈ పోస్టులోకి వచ్చాడు. ఆయన్తో రాజారావుకి వ్యక్తిగతమైన ఇంటరాక్షన్ తక్కువేగాని ఆయన వచ్చాక ఆఫీసులో సమస్యలు చాలావరకూ తగ్గాయనేది

అతను గుర్తించిన విషయం. అదొక్కటే కాదు, తన పిల్లల్లో కనిపించని పార్శ్వాన్ని ఆయనలో చూస్తాడు రాజారావు. ఏ మార్పులైతే కుటుంబంలోని బాంధవ్యాలని దెబ్బతీస్తున్నాయిని రాత్రి

మధనపడ్డాడో అవే మార్పులు సోషల్ రిలేషన్స్ ని బాగుపరుస్తున్నాయనేది అర్థమవుతుంది అలా చూసినప్పుడు. 

“ఏంటి? చాలా డిప్రెస్డ్ గా కనిపిస్తున్నారు? రిటైరవుతున్నానని బాధపడుతున్నారా?” రాజారావు మనసు చదివినట్టు అడిగాడు.

ఇబ్బందిగా నవ్వాడు రాజారావు. ఆయన్నుంచి అలాంటి ప్రశ్నని ఆశించలేదేమో జవాబు చెప్పలేకపోయాడు.

“రిటైర్మెంటు తర్వాతి లైఫ్ ఎలా ప్లాన్ చేసుకున్నారు? ఇక్కడే వుంటారా?

పిల్లల దగ్గరికి వెళ్లిపోతారా? ఏం చేస్తుంటారు మీపిల్లలు?” అంటూ ఎన్నో అడిగి, తన గురించి కూడా కొన్ని

చెప్పాడు. ఆఖర్లో అన్నాడు-

“రిటైర్మెంటు జీవితానికి డెడ్ ఎండ్ అనుకుంటారు చాలామంది. అది తప్పని నా అభిప్రాయం. వయసు కారణంగా రిటైర్ చెయ్యటమనే పద్దతికే నేను వ్యతిరేకిని. అనరుడైనా

అరవయ్యేళ్లదాకా సర్వీసులో వుంచడం, అప్పటి దాకా ఎంతో బాగా పనిచేస్తూ వచ్చిన వ్యక్తిని ఆ ఒక్క కారణాన్నా తొలగించడం... నాక్కొంత అసంబద్ధంగా అనిపించినా... కానీ... బాధ్యత నుంచి

మనిషికి ఏదో ఒకరోజు విముక్తి కావాలి. కాబట్టి తప్పదు” అని ఆగి, మళ్లీ కొనసాగించాడు.

రాజారావుకి ఆ ఆలోచనా సరళి నచ్చింది. రిటైర్మెంటు ఆలోచన తనలో ప్రవేశించాక ఎంతగా ఆవేదన పడ్డాడో? తనకి తెలుసు. తనలా ఆ ఆలోచన ప్రవేశించిన వాళ్లకి తెలుసు. ఆలోచనకి దూరంగా వున్న వారికి తెలీదు. ఇక్కడ దగ్గరా దూరం అనేది కాలం కొలతలో.

“మీ పని నేను చాలా నిశితంగా గమనించాను. చాలా ఇంప్రెసయ్యాను. మీకు ఆసక్తి వుంటే చెప్పండి... నాఫ్రెండొకతను ప్రైవేటు ఫర్మ్ నడుపుతున్నాడు. మీలాంటి అనుభవంగల వారికోసం చూస్తున్నాడు”

పెద్ద కెరటం వచ్చి బలంగా తాకినంత విభ్రాంతి కలిగింద రాజారావుకి. మనిషి

సంపాదించిన డబ్బుకి కాదు, దాని వెనకున్న స్కిల్ కి గుర్తింపు రావాలి. మేనేజర్ కి వుద్వేగంగా కృతజ్ఞతలు చెప్పి ఇవతలికొచ్చాడు. ఆ వుద్యోగంలో తను చేరతాడోచేరడో అది వేరే విషయం .తనింక మీదట ఎందుకూ పనికిరాడనే భావన తొలగిపోయి క్రమంగా చైతన్యం చోటు చేసుకుంది.

అది చాలా ముఖ్యమైనది. భార్య ఓదార్పు కూడా ఇవ్వని శక్తినిచ్చింది. అతనిలో సుస్పష్టమైన మార్పు. సాయంత్రందాకా సరదాగా తిరిగాడు. తర్వాత ఫేర్ వెల్ పార్టీ ఇచ్చి అదయ్యాక ఇంట్లో వదిలిపెట్టారు.

ఇంటి దగ్గర మరో సర్ ప్రయిజ్..

కొడుకులు, కోడళ్లు, కూతురు, అల్లుడు, ఒక్కగానొక్క చెల్లెలితో సహా అందరూ వచ్చి వున్నారు. అతని కోసం ఎదురుచూస్తున్నారు.

“మీరెప్పుడొచ్చార్రా?" అభిమానంగా అడిగాడు.

“రాత్రంతా నువ్వు బాధపడ్డావని వదిన ఫోన్ చేసి చెప్పింది. అంత బాధేముంది? బాధ్యతలు తీరాయి. హాయిగా ఏ క్లబ్ లోనో మెంబర్షిప్ తీసుకుని ఓపికున్నన్నాళ్లూ సరదాగా గడపండి.

పిల్లలున్నారు. వాళ్ల దగ్గరకెళ్లండి. అంతేగాని బాధెందుకు?" పిల్లల జవాబు వెంబడే చెల్లెలి మందలింపు.

"మాతో వచ్చేయ్ తాతయ్యా! ఇంక ఆఫీసుకి వెళ్లక్కర్లేదటగా?" అడిగాడు పదేళ్ళ పెద్దమనవడు. అందరి చూపులూ అటు తిరిగాయి. రాజారావేం జవాబిస్తాడోనని. కానీ అతను నవ్వేసి వూరుకున్నాడు. 

రాజారావు చెల్లెలు అదే రోజు తిరిగి వెళ్లిపోయింది. వాళ్లది ఆ వూరే. రాత్రి భర్త వచ్చి, తీసుకెళ్లాడు. తర్వాతి రెండురోజులు సరదాగా గడిచాయి. మూడోరోజు రాత్రి రాజారావు వంటరిగా

కూర్చున్నప్పుడు వెళ్లి అడిగాడు శ్యామ్ - పెద్దకొడుకు.

"తర్వాతేం చేద్దామనుకుంటున్నారు నాన్నా?" అని తండ్రి నుంచి జవాబేం రాకపోవటంతో తనే మళ్లీ అన్నాడు - "ఇక్కడ మీరిద్దరే ఎందుకు? మా దగ్గరకొచ్చేయండి. అక్కడ నాకు కోపరేటివ్ సొసైటీలో స్థలం ఎలాటైంది. నాలుగ్గదులు వేసుకుంటే హాయిగా వుండచ్చు. మీ బెనిఫిట్స్ ఎంతుండవచ్చు?"

రాజారావుకి ఇబ్బందిగా అనిపించింది. "ఇంకా ఏమీ ఆలోచించుకోలేదు" ముక్తసరిగా అన్నాడు. అంతేగానీ భార్య తనతో అన్న మాటల్ని ఫ్రీగా కొడుకుతో చెప్పలేకపోయాడు.

తండ్రి ధోరణికి శ్యామ్ హర్టయ్యాడు. తనని నమ్మలేకపోతున్నాడా? దిగ్ర్భాంతిగా రిటైరవబోతున్నాడనగానే తన దగ్గరికో తమ్ముడి దగ్గరికో వచ్చేస్తాడనే అనుకుంటున్నాడతను. రిటైర్మెంటు బెనిఫిట్సు ఎంతొస్తాయో కచ్చితంగా తెలీదతనికి. దరిదాపులో

వూహించుకున్నాడు. మూడు భాగాలు చేస్తే తలో రెండు లక్షలు వస్తుండవచ్చు. వాటితో ఇంటిపని మొదలుపెడితే లోనుతో పూర్తిచేయవచ్చని లెక్కలేసుకున్నాడు. కాని తండ్రి.. ఇలా? సంభాషణ ఎలా పొడిగించాలో తెలీక కొద్దిసేపు అలాగేవుండి, లేచి వెళ్లిపోయాడు.

“నువ్వన్నట్టే శ్యామ్ తన దగ్గరకి రమ్మంటున్నాడు. డబ్బిస్తే ఇల్లు కడతాడట” ఆ తర్వాత వచ్చిన భార్యకి చెప్పాడు రాజారావు.

“మీరేమన్నారు?” ఆతృతగా అడిగిందామె.

“ఏమీ చెప్పలేదు”

శ్యామ్ తండ్రినడిగిన విషయం ఇంకా అలా అపరిష్కృతంగా వుండగానే అతని మామగారికి హార్టెటాక్ వచ్చిందని ఫోనొచ్చింది. వెంటనే భార్యని తీసుకుని బయల్దేరాడు. అక్కడ జరిగిన విషయాలు అతన్ని బాధపెట్టాయి. జరిగిన విషయాలంటే ఏదీ జరగకపోవటడమే.

అక్కడికి చేరగానే అతని భార్య రాధ ముందు తల్లిని పట్టుకుని ఏడ్చింది. తర్వాత అన్నని వదినని చూసి మళ్లీ ఏడ్చింది. ఐసీసీయూలో వున్న తండ్రిని బయటినుంచీ చూసి ఇంకోమారు ఏడ్చింది.

ఇరవైనాలుగ్గంటల ఆబ్బర్వేషన్ తర్వాత ఏ ప్రమాదం లేదని చెప్పారు డాక్టర్లు. ప్రస్తుతానికి ఆపరేషన్ కూడా అవసరం లేదన్నారు. పేషెంటుని స్పెషల్ రూంకి మార్చేదాకా వుండి, మళ్లీ వస్తామని తిరిగొచ్చేసారు రాధ, శ్యామ్.

ఆయన పట్ల తమ బాధ్యత ఇంతేనా? శ్యామ్ కి ఆశ్చర్యం కలిగింది. పదే పదే అదే ప్రశ్నని వేసుకున్నాడు. రాధతో అన్నాడు - "నువ్వేనా ఇంకో రెండు రోజులుండి రావల్సింది” అని.

“ఎందుకు? ప్రమాదం లేదన్నారుగా! అమ్మా అన్నయ్యా వదినా ముగ్గురున్నారు. వాళ్లు

చూసుకోగలరులెండి. పిల్లల పరీక్షలవగానే మళ్లీ వెళ్తాను” అంది.

“డబ్బేమైనా అవసరమేమో అడిగావా?”

రాధ ఆశ్చర్యంగా చూసిందతన్ని. తర్వాత నింపాదిగా అంది- “మనం దేనికి పెడతాం? నాన్న పొలం అమ్మిన డబ్బంతా అన్నయ్యకే ఇచ్చాడు. అన్నయ్యే ఈ ఖర్చులన్నీ చూసుకుంటాడు”

జీవితమంటే డబ్బూ లెక్కలేనా? అతనికి కలుక్కుమంది. తండ్రి తనకి జవాబివ్వకపోవడం గుర్తొచ్చింది. దానిక్కారణం కూడా ఈ లెక్కలేనా? అలా అడిగి తొందరపడ్డాననిపించింది.

“ఎలా వుందమ్మా, మీ నాన్నగారికి?” అడిగింది రాజారావు భార్య, కోడల్ని. “వీలుచూసుకుని మేం కూడా వెళ్లి చూసివస్తాం” అని కూడా అంది. రాధ కళ్లనీళ్లు పెట్టుకుంటే దగ్గరకి తీసుకుని ఓదార్చింది. ఇంట్లో మిగిలిన వాళ్లు కూడా వచ్చి రాధని పరామర్శించారు. అక్కడితో ఆ ప్రకరణ ముగిసింది.

ఆ హడావిడంతా సద్దుమణిగాక శ్యామ్ తమ్ముడు భరత్ అన్నాడు, "నాన్నగార్ని కొంత డబ్బు సర్దమందామని అనుకుంటున్నాననయ్యా! ఫ్లాట్ కొనాలని ఆలోచన” అని అప్పుడు వాళ్లిద్దరే రాజారావు ఎటో వెళాడు.

శ్యామ్ వులిక్కిపడ్డాడు. తనకు కలిగిన ఆలోచనలాంటిదే తమ్ముడికికూడా కలిగిందన్నమాట. చెల్లి మనసులో ఏముందో! అందరికీ పంచి ఇవ్వడానికి తండ్రి ఒప్పుకుంటాడా? ఇంత ధీమాగా ఆయన డబ్బు అడుగుతున్న తాము చివరిదాకా ఆయన బాధ్యత అంతే ధీమాగా మొయ్యగరా? 

చివరిదాకా... శ్యామ్ ఆలోచనలు అక్కడ ఆగిపోయి గజిబిజిగా అయ్యాయి. ఆయన డబ్బంతా తీసుకుని "చివర" ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసే పరిస్థితిని కల్పించబోతున్నారా , తామంతా? తల గిర్రున తిరిగినట్టైంది. 

"ఏంటన్నయ్యా, మాట్లాడవు? పదిలక్షలదాకా వస్తుందేమో! ఎందుకు, వాళ్ల దగ్గర అంత డబ్బు వుంచటం?ఈ వయసులో వాళ్ళకి అంత అవసరాలేం వుంటాయి? ఎలాగా మనమే చూడాలి వాళ్లని. ఇప్పుడే ఏదో ఒకటి నిర్ణయిస్తే బావుంటుంది" అన్నాడు భరత్.

వున్నారక్కడ. మిగిలిన వాళ్లంతా ఎవరి పనుల్లో వాళ్లున్నారు. రాజారావు ఎటో వెళ్లాడు.

“నాన్నగారితో మాట్లాడావా?” అడిగాడు శ్యామ్.

“ఉహూ.. అమ్మ దగ్గర అన్నాను”

“ఏమంది?"

“ఇంకా ఆలోచించుకోలేదట”

తల్లితండ్రుల మనసులో ఏముందో శ్యామ్ గ్రహించగలిగాడు. వాళ్లకి స్వతంత్రంగానే వుండాలనుంది.

* * *

ఆరోజే శ్యామ్ తండ్రితో మాట్లాడాడు.

“తొందరపడి మీ దగ్గర డబ్బు ప్రసక్తి తీసుకొచ్చాను. సారీ, నాన్నగారూ!” అన్నాడు తలొంచుకుని.

“ఎందుకలా అనుకుంటున్నావు?” అడిగాడు రాజారావు.

“రాధా వాళ్లింట్లో జరిగినవి చూసాక నాలో ఆలోచన మొదలైంది”

“ఏం జరగిందక్కడ?”

“ఏమీ జరగలేదు”

“సరిగ్గా చెప్పు”

“రాధకి తన తండ్రిపట్ల బాధ్యతేం వుండదా?”

“అంటే?”

“ఇలాంటి టైములో దగ్గరుండడం, డబ్బు సర్దడం...”

“నువ్వొప్పుకోవనుకుందేమో”

“అడిగితే కదా?”

“పోనీ నువ్వే ఇవ్వకపోయావా?”

“నేనా?” తెల్లబోయాడు శ్యామ్.

రాజారావు చిన్నగా నవ్వాడు. “నువ్వే. ఏం? మీ మామగారేగా?” అని ఒక్క క్షణం ఆగి, “కొంతమందికి కొన్ని తెలీవురా. అందరికీ అన్నీ తెలీవు. మీ అమ్మ చెప్పేదాకా నాకూ కొన్ని తెలీవు. సాపేక్ష సిద్ధాంతాన్ని కనిపెట్టి ప్రపంచాన్ని కుదిపిన ఐన్‌స్టీన్ కి అన్నం వండడం ఎలాగో తెలుస్తుందంటావా? ప్రతి మనిషికీ అవగాహనా పరిధి వుంటుంది. కొందరికి అది విస్తృతంగానూ, 

మరి కొందరికి ఇరుగ్గానూ వుంటుంది. ఆ పరిధి అవతల వున్నది మనకి తెలీనిది.

చెప్తుంటే తెలుసుకోవడం ద్వారా కొంతమేరకి విస్తరించుకోవచ్చు. అలా చెప్పినా తెలుసుకోలేనివి వుంటాయి. అహంచేత కొంత, తెలీడం వల్ల వచ్చే మార్పులకి భయపడి ఇంకొంత.

మానవసంబంధాలన్నీ ఈ రెండు చీకటి కోణాల్లోనే కొట్టుకులాడుతున్నాయి. నీ మామగారికి స్వతంత్రించి ఏమీ చెయ్యలేకపోయావో మా విషయంలో కోడళ్లూ అంతే. ఐతే వాళ్లకి సాంప్రదాయం కొంత చెప్తుంది కాబట్టి అదొక బలవంతపు బాధ్యతగా చేస్తారు, తప్పించి అందులో అంత:స్పర్శ 

వుండదు. మాకు ఓపిక తగ్గాక ఎలాగా తప్పదు”

"..."

"ఈరోజున నేనో రెండు లక్షలిస్తే ఇల్లు మొదలు పెట్టాలని నీ ఆలోచన. ఫ్లాట్ కి

ఎడ్వాన్సివ్వాలని భరత్ ఆలోచన. ఆ రెండు లక్షలూ ఇవ్వటమనే ప్రక్రియ పూర్తయి దాని ప్రభావం తగ్గాక మన మధ్య సంబంధాలు ఎలా వుంటాయనేది నా ప్రశ్న” 

“........”

“నువ్వు, రాధ, పిల్లలు... అది నీ కుటుంబం. అలాగే భరత్. మీరంతా కలిస్తే నా కుటుంబం. కానీ మనం ఉమ్మడి కుటుంబంగా ఎప్పుడూ వుండలేదు. ఎవరికి ఎక్కడఉద్యోగాలొస్తే

అక్కడ, ఎవరి అవసరాలకీ అవకాశాలకీ వీలుగా వుండిపోయాము. వేర్వేరు కుటుంబాలుగానే ఊవుండిపోయాము. సాంప్రదాయం అనేదొకటి తప్పిస్తే మనం కలిసి వుండడానికి అనువైన అంశాలు

ఇంకేవీ లేవు. ప్రస్తుతానికి మేం విడిగానే వుందామనుకుంటున్నాం”

“మీ ఇష్టం నాన్నగారూ" అన్నాడు శ్యామ్.

“ఇంక డబ్బు విషయానికొస్తే... మీ జీతాలతో పోలిస్తే నాకొచ్చే బెనిఫిట్స్ చాలా తక్కువ. ముగ్గురు పిల్లల్ని పైకి తీసుకొచ్చి, ఈ రోజుకి అప్పులేమీ చెయ్యకుండా మిగిలి, సక్సెస్ ఫుల్ పర్సన్నని నా తోటివాళ్లచేత అనిపించుకున్న నేను.. ఆ డబ్బు విషయంలో తెలివితక్కువగా వుంటానని అనుకోవద్దు" చాలా స్పష్టంగా తన మనసులో విషయాలన్నీ చెప్పాడు రాజారావు. ప్రత్యక్షంగా

శ్యామ్ తనతో అన్నవాటికీ, భరత్ అన్నాడని భార్య తనతో చెప్పినవాటికీ కూడా జవాబిచ్చాడు.

"నేను నా డబ్బుని దండగ ఖర్చు పెట్టను. భయపడద్దు"

రిటైరవక ముందుకీ ఇప్పటికీ తండ్రిలో ఎలాంటి తేడా కనిపించలేదు శ్యామ్ కి. అదే వ్యక్తిత్వం. అదే ఆలోచన. ఎలాంటి తడబాటూ లేకుండా తమకి దారి నిర్దేశించేలా.

...

రాజారావు ప్రకటించిన నిర్ణయానికి యూనియన్ బడ్జెట్ తర్వాత పారిశ్రామికవేత్తలు వెలువరించే మిశ్రమస్పందనలాంటిది వ్యక్తమైంది. అలాంటిదే ఇంకాస్త బలీయంగా వ్యక్తమైంది,అతను మనవలందరి పేర్నా కొంత డబ్బు ఫిక్స్ చేసి, తమ బతుకు తమదని చెప్పాక.

...

“వచ్చేందేదో పంచిచ్చేస్తే ఆయనకొచ్చే కష్టం ఏమిటట? కట్టకట్టుకు తీసికెళ్తారా? ఈ ముసలాళ్ల ఖర్చుకి పెన్షను చాలదా?” రుసరుసలాడింది భరత్ భార్య. ఆమె భావాలు భరత్ లో ప్రతిబింబించాయి. ముభావంగా ఉన్నాడు.

శ్యామ్ కి ఈ విషయంలో అసంతృప్తేమీ లేదు. రాధకీ లేదు. ఇప్పట్నుంచీ వచ్చి తమ దగ్గర వుంటాననకుండా మామగారు స్వతంత్రంగా వుంటాననడం ఆమెకి సంతోషాన్నిచ్చింది. భరత్

భార్య వాళ్ల బాధ్యత తీసుకోదు. ఆమెకెంతసేపూ తీసుకోవడమేగానీ ఇవ్వడం తెలీదు. భరత్, భార్యకి

తందానతాన. పెద్దకొడుకు, కోడలిగా తమకి తప్పదు. ఇప్పట్నుంచీ ఎందుకు? అదీకాక మామగారు డబ్బు దుబారా మనిషికాదు. వచ్చిందాంట్లో ఓ వంతు అప్పుడే పిల్లల పేర పెట్టేసారు.

ఇంకేముంటుంది? తాము పంచుకోవడానికి, వాళ్లు పంచివ్వడానికి అనుకుంది.

ఆడపిల్లలకి ఆస్తిహక్కు వుందంటారుగానీ అన్నదమ్ములేం పడనిస్తారు? అనుకుంది.

రాజారావు కూతురు. వాళ్ళందరి స్పందనకి ప్రతిస్పందించలేదు రాజారావు దంపతులు.

...

"నాన్న రిటైరయ్యారని మీరు రావటానికి మొహమాటపడకండి. ఎప్పట్లాగే.. ఎప్పుడు రావాలనిపించినా రండి. పిల్లల్ని పంపించండి" అని అంది రాజారావు భార్య.

అంతా తిరుగు ప్రయాణమయ్యారు.

రాజారావు ప్రస్థానం ఆ మజిలీని దాటి, తదుపరి మజిలీకి మొదలైంది.

(ఆంధ్రభూమి, 2004- సింధూరి కధలసంపుటి లో వున్న కథ)


  

 




Rate this content
Log in

Similar telugu story from Drama