Kanthi Sekhar

Abstract

5.0  

Kanthi Sekhar

Abstract

మధురమైన కానుక

మధురమైన కానుక

5 mins
357


"అమ్మలూ అన్నం తినరా.... " తల్లి గారాం చేస్తున్నా ఏడేళ్ల స్వీటీ పట్టించుకోకుండా... "నాకేం వద్దు... పడుకుంటా..." అంటూ ఆవిడ ఒళ్ళో ఒదిగిపోయింది.

" అమ్మా... సోషల్ క్లాస్ లో ఇవాళ సర్ చాణక్యుడి వల్లే చంద్ర గుప్తుడు అలెగ్జాండర్ సేనాపతి ని ఓడించాడు అని చెప్పారు. కానీ చాణక్యుడు రాజు అవ్వకుండా చంద్ర గుప్తుడిని రాజు ని ఎందుకు చేయాలి... " తన అనుమానాన్ని బయటపెట్టాడు పదేళ్ల చందు.

"అదేంటి రా చెల్లాయి అన్నం తినలేదు నువ్వేమో ప్రశ్నలు..." ముద్దుగా విసుక్కుంటూనే అన్నం ముద్ద స్వీటీ నోట్లో పెట్టాలని చూసింది తల్లి విద్య.

"అన్నయ్య డౌట్ కి ఆన్సర్ చెబితే నేను అన్నం తింటా... " పైకి లేచి మఠం వేసుకుని కూర్చుని ఆసక్తిగా తల్లి వంక చూసింది స్వీటీ.

"నాకు నువ్వేం అడిగి పెట్టక్కర్లేదు తింటే తిను లేకపోతె పో... "ఉడుక్కుంటూ అన్నాడు చందు.

"ఉండండి రా... కథ చెప్తాను... ఇది చరిత్ర పుస్తకాల్లో ఉండదు కానీ మా నానమ్మ చెప్పేది... చాణక్యుడు పుట్టుకతోనే పన్ను తో పుట్టాడట. పన్ను తో పుడితే రాజు అవుతాడని ఇది వరకు నమ్మేవారు. చాణక్యుడి తల్లికి ఆయన రాజు ఐతే కుట్రలు కుతంత్రాలు నేర్చుకుని పాడైపోతాడని భయం. ఒకసారి అదే విషయం తండ్రితో చెప్పి ఆవిడ బాధపడటం చాటుగా విన్నాడు చాణక్యుడు. తన కారణంగా తన తల్లి బాధపడటం ఇష్టం లేని చాణక్యుడు దగ్గరే ఉన్న రాయితో తన ప్రత్యేకమైన పన్ను ని ఊడగొట్టుకున్నాడు. నెత్తురు ఓడుతున్న నోటిని లెక్క చేయకుండా నిండుగా నవ్వి తన పన్ను చూపించాడు... తల్లికి. "నీకు ఇష్టం లేనిది ఏది నా దరిదాపులకు రాదమ్మా... అది రాజ్యమైనా ఏమైనా.. నేనెప్పటికీ నీ కొడుకునే... " అంటున్న కొడుకుని చూసి గర్వ పడాలో బాధ పడాలో అర్ధం కాలేదు ఆ తల్లికి. తల్లికి ఇచ్చిన మాట ప్రకారం ఆజన్మ బ్రహ్మచారిగా, చంద్ర గుప్తుడికి మంత్రిగానే ఉండిపోయాడు చాణక్యుడు. " తల్లి కథ చెప్పటం పూర్తి అవుతూనే నిద్ర లోకి జారుకున్నాడు చందు. చిన్నారి స్వీటీ మనసులో మాత్రం ఒక మెరుపు లాంటి నిర్ణయం.


"అబ్బా అలగకు ప్లీజ్... ఆఫీస్ కి తొందరగా వెళ్ళాలి... పడుకుంటాను .... రేపు ఫోన్ చేస్తా కదా... సాయంత్రం కలుద్దాము నెక్లెస్ రోడ్ దగ్గర. ఓకే నా.. నా బంగారం కదా... నువ్వు కూడా అలా అంటే ఎలా... జీవితాంతం నీతోనే కదా... " ఒకప్పుడు ప్రియుడు, ఇప్పుడు కాబోయే భర్త రాజ్ ని ఫోన్ లో బతిమాలుతోంది స్వీటీ.

"నువ్వు లేట్ గా వెళ్తే కంపెనీ మూసేస్తారు కదా... సరే మీ జేమ్స్ బాండ్ లేస్తాడేమో... నేను ఫోన్ పెట్టేస్తా... "అవతల నుంచి అలిగినట్టు వినపడిన రాజ్ గొంతు విని బుజ్జగించాలని ఉన్నా తన అన్న ని అనేసరికి చిరు కోపంతో... "మాట్లాడితే మా అన్నయ్య ని అంటావ్... నేను కూడా మీ అక్క ని లేడీ హిట్లర్ అంటే ఊరుకుంటావా... " చివాలున అనేసింది.

"అమ్మా తల్లీ... బుద్ధి తక్కువ అయి అన్నాను... మీ గోరింటాకు బంధానికి ఒక నమస్కారం... ఫైన్ గా నీకు వంద ముద్దులు ఇస్తా సరేనా... క్షమించేయి నన్ను... "కొంటెగా అన్నాడు రాజ్.

"ఫైన్ ఆ రిమాండ్ ఆ రేపు కలిసినప్పుడు డిసైడ్ చేస్తా... " ఇంకా చిలిపిగా అని ఫోన్ పెట్టేసింది స్వీటీ. భవిష్యత్తు గురించి తీపి కలలతో నిద్ర లోకి జారుకుంది.


"ఇరవై నాలుగు గంటలు ఫోన్లు మాట్లాడటం తప్ప ఆడపిల్ల పని ఒక్కటీ చేయవు... అమ్మ, నేను, నువ్వు ముగ్గురం ఉద్యోగాలకి వెళ్ళాలి... కంది పప్పుకి సెనగ పప్పుకి తేడా తెలీకుండా పెంచింది అమ్మ నిన్ను... నీతో రాజ్ గారు ఎలా వేగుతారో..." టిఫిన్ ప్లేట్ చెల్లెలి చేతికి అందించి ఆఫీస్ కి బయలుదేరటానికి బైక్ కీస్ అందుకున్నాడు చందు.

"నువ్వు తిన్నావా.. క్లాస్ లు బాగా చెప్తున్నావ్... నీ లెక్చర్లు కాలేజీ లో పెట్టుకో... ఇంట్లో ఆ నీతులు పాటించు. " కౌంటర్ ఇచ్చింది స్వీటీ. తన హ్యాండ్ బాగ్ లో కాగితాలు అన్న కంట పడకుండా అలమరాలో దాచేస్తూ...

"బాక్స్ లో పెట్టుకున్నాలేరా... ఇల్లు జాగర్తగా లాక్ చెయ్యి... టిఫిన్ తినకుండా వెళ్ళకు ..." జాగర్తలు చెప్పి బయల్దేరిపోయాడు చందు.


"ఇంకో నెల రోజుల్లో ఈ మెరుపు తీగ మెళ్ళో నేను మూడు ముళ్ళు వేసేస్తా... " నెక్లెస్ రోడ్ దగ్గర సూర్యుడు కెంజాయ లోకి మారుతుండగా పార్క్ లో కొంచెం జనం తక్కువ ఉన్న దగ్గర కూర్చున్నాక స్వీటీ ని ఒళ్ళోకి తీసుకుంటూ అన్నాడు రాజ్. "అప్పటి దాకా తొందర ఎందుకు మరి... " అతని స్పర్శలో వెచ్చదనాన్ని అనుభవిస్తూనే కొంటెగా తన కళ్ళల్లోకి చూస్తూ అంది స్వీటీ.

"ఇందుకు ... " అంటూ చిన్నగా ఒంగి సుతారంగా ఆమె నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు.

"చాలు చాలు... మిగతా తొంబై తొమ్మిది పెళ్లయ్యాక ఇద్దువుగాని... అన్నయ్య , అమ్మ ఫోన్ చేస్తారు ఇంక... ఏడవుతోంది ... "వదలలేక వదలలేక సున్నితంగా అతన్ని విడిపించుకుంది.

"నా దగ్గరకి వచ్చేస్తావని ఆనందమా... కొంచెం ఒళ్ళు చేసావ్ రెండు వారాల్లో... " మాట మారుస్తూ అన్నాడు రాజ్. "హమ్మయ్య... అలుగుతావ్ అనుకున్నా... లేదు... థాంక్స్ బంగారం... " అతని జుట్టు గారంగా చెరుపుతూ అంది స్వీటీ.

"ఇలా ఉంటె ఓకే... ఇంకా అయితేనే.... " కొంటెగా అన్నాడు రాజ్.

"ఇంకా ఐతే... వదిలేస్తావా... " కళ్ళల్లో బుగ్గల్లో ఎరుపు ఛాయలు వస్తుండగా అంది.

"అది కాదురా... నాకు సిగ్గేస్తోంది... " అప్పటికి మాట దాటేస్తూ అన్నాడు రాజ్.

అప్పటికి సర్దుకుంది కానీ అతని మాటలు ఆలోచనలో పడేశాయి స్వీటీ ని.


"ఇలాగే తింటే లావు ఐపోతావు... నీ పెళ్లి ఇంకా మూడు వారాల్లోనే ..." తల్లి మందలింపు గుచ్చుకోలేదు కానీ రాజ్ మాటలు చెవుల్లో గింగురుమంటున్నాయి స్వీటీ మనసులో.

"నిన్ను నువ్వు కేర్ చేయకపోతే ఎలా రా... పెళ్లి పెట్టుకుని వర్క్ అని తిరుగుతున్నావు... పచ్చిగా అనాలంటే బాధగా ఉంది... నలుగురిలో పరువు తీసేలా ఉన్నావు... " నిన్న ఐస్ క్రీం షాప్ లో అతని కళ్ళల్లో ఇన్నేళ్ల ప్రేమలో కనపడని విసుగు కనపడింది.


"నీకు నాకు సెట్ కాదు రాజ్... లెట్స్ బ్రేక్ అప్.... " చెప్తున్నప్పుడు ఆమె కళ్ళల్లో నీళ్లు... అతని కళ్ళల్లో నిర్లిప్తత.

"ఏమైంది ఇప్పుడు... ఒక మాటకే ఇన్నేళ్ల కమిట్మెంట్ ని బ్రేక్ చేస్తావా... " ఆఖరి సారి అన్నట్టు అడిగాడు. అది బతిమాలాటంలా లేదు... వదులుకున్నా పర్లేదు అన్నట్టు ఉంది.

"నీ పరువు తీయకుండా నేనే నిర్ణయం తీసుకున్నా... " నిక్కచ్చిగా అంది స్వీటీ.

తన కన్నీళ్లు బయటపడకుండా వెనుదిరిగి వెళ్ళిపోయింది.

అతను ఆపే ప్రయత్నం చేయలేదు ఇంక . నిజమైన ప్రేమని ఎన్నేళ్లు అయినా కొందరు గుర్తించలేరు. నాగుపాములు గంధం చెట్టుని ఎప్పుడూ చుట్టుకునే ఉన్నా గంధం పరిమళం వాటికీ అంటుకోదుగా.


"అమ్మా... అన్నయ్యా... భోజనాలకి రండి... డైనింగ్ టేబుల్ మీద అన్నీ సర్దుతూ తల్లిని అన్నని పిలిచింది స్వీటీ, ఏమి జరగనట్టే. వారి దగ్గర నుండి స్పందన లేకపోయేసరికి తన కంచం లో వడ్డించుకుని తినటం మొదలు పెట్టింది. "ఇంత గొడవ అయినా ఇలా ఎలా తినగలుగుతున్నావే... "తల్లి మందలింపు ని వినీ విననట్టు ఊరుకుంది.

"నీ తిండి యావ పాడు కాను... ఒక పూట తినకపోతే చచ్చిపోతావా... "కోపంగా చెల్లెలిని కొట్టటానికి లేచిన చందు కడుపులో మెలిపెట్టిన బాధతో అమ్మా... అంటూ కుప్పగూలిపోయాడు.

పొరుగింటి వారి సాయంతో అతన్ని లేవదీసి హాస్పిటల్ కు పరుగు తీశారు తల్లీ కూతుళ్లు.


"ఏమ్మా... స్వీటీ... మీ అన్నయ్యకి లివర్ టిష్యూ డొనేట్ చేయాలనీ మూడు నెలల క్రితం అతనికి ఫీవర్ అని తీసుకొచ్చినప్పుడే చెప్పా... నువ్వు డొనేట్ చేస్తా అన్నావు... టెస్ట్ లకి రెడీ అవ్వు... " హడావుడిగా అంటున్న ఫామిలీ డాక్టర్ మాటలకి విస్తుపోయి చూసింది విద్య.

"కామెర్ల కోసం టెస్ట్ చేస్తే ఇంకా పెద్ద సమస్య ఉందని తేలింది మీ అబ్బాయికి. మీ అమ్మాయి అండర్ వెయిట్ ఉంది అని, పది కేజీలు పెరగాలని చెప్పాను... మీ అమ్మాయి మీకేం చెప్పలేదని మీ మొహం చూస్తే తెలుస్తోంది... ఇది జాగ్రత్తలు తీసుకుంటే పెద్ద సమస్య కాదు... ధైర్యంగా ఉండండి. "

డాక్టర్ మాటలకి ధైర్యం వచ్చినా అక్కడి పరిస్థితులు అర్ధం కావట్లేదు. గుడ్ల నీరు కక్కుకుంటూ దేవుడిని ప్రార్థిస్తూ కూర్చుంది. అసలేమీ జరగనట్టు తన పనులు తాను చేసుకుంటున్న కూతురుని చూసి అనుకుంది... "వీళ్ళని కడుపుతో ఉన్నపుడు ఇష్టమైనా కాకపోయినా ఏదోకటి తినేదాన్ని. ఇది వాళ్ళ అన్నయ్య కోసం ఇలా చేసిందని తెలుసుకోలేకపోయా. రక్త సంబంధాలు నీడలాంటివే. వెలుగులో ఉన్నపుడు అవి ఉన్నట్టు తెలుస్తుంది. చీకటిలో ఉన్నపుడు నీడ మనకి కన్పడకపోయినా అక్కడే ఉందిగా. దాని అల్లరి చూసా కానీ ఒకత్తే వయసుకి మించిన బరువు మోస్తుందని తెలుసుకోలేదు. పిచ్చిపిల్ల..." అనుకుంది.


దేవుడి దయ వల్ల చందు కి చేసిన ట్రీట్మెంట్ మంచి ఫలితం ఇచ్చింది. ఎప్పటిలాగే ఉద్యోగానికి వెళ్ళటానికి తయారవుతున్న స్వీటీ తో అంది విద్య... "ఇలాగే తింటే నిన్నెవరూ చేసుకోరు బాబు... " అని.

"తల్లీ... ఆపుతావా నీ పెళ్లి గోల... " చిలిపిగా నమస్కారం చేసినట్టు అన్న స్వీటీ ని ఒక్క మొట్టికాయ వేసింది విద్య.


కొండలెక్కితేనో అడవులు దాటితేనే సాహసం అనుకుంటారు చాలా మంది. కుటుంబం కోసం అరకొర చదువులతో ఆగిపోయేవాళ్లు, తమకున్న దాంట్లో తోటి వారి కోసమో ఆత్మీయుల కోసమో తెగించేవారు చేసే సాహసాలు చాలా వరకు గుర్తింపు లేకుండానే మిగిలిపోతాయి. తల్లి విద్య వేసిన మొట్టికాయ కన్నా విలువైన బహుమతి స్వీటీ చేసిన సాహసానికి మరొకటి ఉండదేమో.


Rate this content
Log in

Similar telugu story from Abstract