kottapalli udayababu

Drama Classics Inspirational

4  

kottapalli udayababu

Drama Classics Inspirational

మనసు చేసిన న్యాయం  - 8 వభాగం

మనసు చేసిన న్యాయం  - 8 వభాగం

3 mins
13


మనసు చేసిన న్యాయం - 8 వభాగం

అమ్మ కంగారు పడిపోయింది. అమ్మ నేను వదినను జాగ్రత్తగా మంచంమీద పడుకోబెట్టాము. తువ్వాలు ఒక చివర తడిపి తెచ్చి అమ్మకి ఇచ్చాను. అమ్మ వదిన ముఖం దానితో తుడిచింది. ఊఁ అని నీరసంగా కదిలింది గాని వదిన కళ్ళు తెరవలేదు. నాన్నగారు వెంటనే పక్కవీధిలో ఉన్న ఆయుర్వేదం హాస్పిటల్ కి వెళ్లి పదినిముషాల్లో డాక్టర్ అంకుల్ ని వెంటబెట్టుకువచ్చారు. ఆ వూరు వచ్చినప్పటినుంచి అంకుల్ మా కుటుంబ స్నేహితుడు అయిపోయారు. వాళ్ళ అమ్మాయి నాతోనే చదివేది.

ఆయన వదిన నాడి పట్టి చూసి '' మరేం కంగారు పడవలసిన పని లేదండీ...అమ్మాయి నీళ్లోసుకుంది.మీరు తాత కాబోతున్నారు.'' అన్నారు సంతోషాతిరేకంతో . నాన్నగారి ముఖం ఆనందంతో వెలిగిపోయింది.

''ఎంత శుభవార్త చెప్పారు అన్నయ్యగారు.ఉండండి..మీకిష్టమైన కాఫీ తెస్తాను'' అని అమ్మ సంతోషంతో వంటింట్లోకి వెళ్ళింది.

అమ్మ ఆయనకి చిక్కటి కాఫీ ఎక్కువ పంచదార వేసి ఇచ్చింది. ఆయనకీ అలా తాగడం చాలా ఇష్టం. నాన్నగారికి వదినకి బోర్నవిటా కలిపి తెచ్చింది. 

ఈలోగా వదిన కళ్ళు తెరిచింది.

''అమ్మా..విజయా...ఎలా ఉంది?బాగా నీరసంగా ఉన్నావు. ముందు ఇది తాగు.'' అని అమ్మ వదినను లేపి కూర్చోబెట్టి పొదివి పట్టుకుని వేడి బోర్నవిటా కలిపి దగ్గరుండి తాగించింది . వదినకు కాస్త ఓపిక వచ్చింది. అపుడు వదినను అమ్మ ఎందుకో పరిశీలనగా చూసింది. ఏదో అర్ధమైనట్లు, వదినను అడుగుదామనుకుని ఆసమయంలో అడిగితే బాగుండదేమో అని ఆగిపోయినట్లు అనిపించింది నాకు. 

''హార్దికాభినందనలు అమ్మాయి.'' అన్నారు డాక్టర్ అంకుల్.

వదిన అర్ధం కానట్టు చూసింది. అపుడే అన్నయ్య కూడా సరిగ్గా అపుడే లోపలికి అడుగుపెట్టాడు.

''హార్టీ కంగ్రాట్యులేషన్స్ ప్రభాకర్...నువ్వు తండ్రివి కాబోతున్నావయ్యా'' అని అన్నయ్యతో కరచాలనం చేసి ''మరి నేను వెళ్ళొస్తాను. అవసరమైతే అబ్బాయి చేత కబురు పంపండి సర్. వచ్చి చూస్తాను.'' అనేసి వెళ్లిపోయారాయన. 

''పెద్దాడా ! విజయని లోపలి తీసుకెళ్లి పడుకోబెట్టు. కాసేపు నువ్వు పక్కనే ఉండు. తనకి ధైర్యంగా ఉంటుంది.'' అంది అమ్మ అన్నయ్యతో.

అన్నయ్య కళ్ళల్లోకి భయంగా చూసి తలవంచుకున్న వదినను అన్నయ్య మెల్లగా తన గదిలోకి తీసుకువెళ్లాడు. వారిద్దరిలోను తాము తల్లి తండ్రులవుతున్నామన్న ఆనందం మాత్రం ఎక్కడా కనిపించలేదు.

***********

ఆ మరునాడు వదినను అమ్మ అడిగింది.

''అమ్మాయి...అన్నట్టు నిన్నొక విషయం అడుగుదామనుకున్నానమ్మా..'' అంది 

''అడగండి అత్తయ్యా..''

''కన్యాదానం చేసినప్పుడు నీ మెళ్ళో పెట్టిన గొలుసు..?''

'' ఇది మాత్రం మీరు అడగకుండానే చెబుదామనుకున్నా అత్తయ్యా...మా చెల్లెలికి పెళ్లిచూపులు చూస్తున్నారట. ఇదే మోడల్ గొలుసు చేయిస్తాను...కబుర్లలో పడితే మర్చిపోతాను...అని నిన్న పొద్దున్న అమ్మ వస్తూనే ముందు గొలుసు అడిగి తీసుకుంది అత్తయ్యా.అక్కడకీ మీతో చెప్పి ఇస్తాను అన్నాను. మళ్ళీవారం తెచ్చి ఇచ్చేస్తానమ్మా..ఈ ఒక్కసారికి ఆవిడతో చెప్పకు. ప్లీజ్ అని అడిగింది. ఇంతలోనే పెద్ద గొడవ జరిగిపోయింది. ఎవరేమనుకున్నా తాను అనుకున్న పని చేసేస్తుంది. ఆతరువాత ఎదుటివాళ్లతో దెబ్బలాడేస్తుంది. వాళ్ళు మంచివాళ్లైతే రెచ్చిపోతుంది. వాళ్ళు ఒక ఆకు ఎక్కువ చదివిన వాళ్ళైతే 'పొరపాటైపోయింది. ఈసారికి మన్నించండి.ఇంకోసారి ఇలాంటి పొరపాటు చెయ్యను.'అని కాళ్ళు పట్టుకుంటుంది. నాన్నగారు అలా ఎందరికో అమ్మ లేకుండా సారీలు చెప్పుకున్నారు పాపం. ఇపుడు మా అమ్మ తరపున నేను మీకు క్షమాపణ చెబుతున్నా అత్తయ్యా..నన్ను ఈసారికి క్షమించండి. మళ్ళీ మరోసారి ఇలాంటి పొరపాటు జరిగే అవకాశం నిజంగా రానివ్వను.'' అంది వదిన కళ్లనీళ్లు పెట్టుకుని.

''తప్పమ్మా. నీళ్లుపోసుకున్న దానివి. నువ్వు అలా కంటతడి పెట్టడం ఈ ఇంటికి, నీకు కూడా శుభం కాదు. ఈసారి వచ్చినపుడు అడిగి తీసేసుకో. పెళ్ళిలో కన్యాదానం చేసినపుడు పెట్టిన బంగారం మాత్రం ఎవరు అడిగినా ఇవ్వకూడదు. మర్చిపోకు. ఇవ్వకపోతే నీ తరపున నేను అడుగుతాను. సరే. ఇవేవీ మనసులో పెట్టుకోకుండా నీకు ఏం తినాలనిపించినా నాతో చెప్పు. చేసిపెడతాను.'' అంది అమ్మ వదిన తలనిమురుతూ.

''మీరెంత ,మంచివారత్తయ్యా?''అంది వదిన ఆరాధనగా.

''నాకు ఆడపిల్లలు లేరమ్మా.కూతురివి అయినా, కోడలివి అయినా నువ్వే నాకు.''అంది అమ్మ. 

**************

నాన్నగారు వదిన గర్భవతి అన్న విషయం మర్యాదపూర్వకంగా అన్నయ్య మావగారి ఉత్తరం ద్వారా తెలియపరిచారు. 

ఈసారి మావయ్యగారు ఒక్కరే ఆ తరువాత ఆదివారం వదినను చూడటానికి వచ్చారు. 

''వదిన రాలేదేం అన్నయ్య గారు?'' అని అడిగింది అమ్మ.

''తనకి ఒంట్లో బాగుండలేదమ్మా.మళ్ళీ నాకు ఎపుడు కుదురుతుందో తెలీదు. ఈసారి నుంచి ఢిల్లీ వరకు పెంచేశారమ్మా డ్యూటీ. ఒకసారి ఇంట్లోంచి కదిలితే వారమేసి రోజులకు గానీ ఇంటికి రావడమే కుదరడం లేదు. 

వదినకు రకరకాల పళ్ళు, స్వీట్లు, అన్నయ్యకీ వదినకు కొత్త బట్టలు అన్నీ తెచ్చారు. సాయంత్రం వరకు కూతురితో అల్లుడితో ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉన్నారు. ''నీకేం కావాలిరా తల్లీ..మొహమాట పడకుండా చెప్పు.ఏది తినాలనిపించినా నాకు ఒక్క కార్డు ముక్క రాసి పడేయ్. అన్ని చోట్లకి తిరుగుతుంటాను కదా...తెచ్చిపెడతాను. నాకు మాత్రం పండంటి మనవరాలిని ఇవ్వమ్మా...'' అని పదే పదే అడిగారు. 

'' ఆయన నాకు ఏం కావలసినా తెచ్చిపెడతారు నాన్నా..అయినా నాకు కావాలనిపించినపుడు నీకు ఉత్తరం రాస్తాలే ' అంది వదిన. 

'' అమ్మాయి ఆరోగ్యం జాగ్రత్త బాబు...అది మా అమ్మ చాటున పెరిగిన పిల్ల. పట్నపు తెలివితేటలూ తక్కువ. ఇద్దరూ ఒక్కమాటగా కాపురం చేసుకోండి. అదే చాలు.'' అని మా ఇంట్లో అందరికి, చివరకి నాకు కూడా ''మీ వదినను జాగ్రత్తగా చూసుకోవయ్యా..'' అని జాగ్రత్తలు చెప్పేసి వెళ్లిపోయారు.

అత్తయ్యగారికి ఈయనకి ఎంత వ్యత్యాసం ? అని నేను మనసులో అనుకున్న మాట నాన్నగారు ''ఆయన చాలా మర్యాదస్తుడు. ఎలా వేగుతున్నాడో...మహాతల్లితో ''అని అమ్మతో వంటింట్లో అంటూండగా విన్నాను.

*******

ఆ మళ్ళీ ఆదివారం అత్తయ్యగారు పిల్లల్ని కూడా తీసుకురాకుండా ఒక్కర్తీ  వచ్చారు మా ఇంటికి. ఒక పాత చీర కట్టుకుని, ఏ విధమైన షోకు లేకుండా సాదా మనిషిలా ఉందామె ఇప్పుడు. 

అమ్మ మంచినీళ్లు ఇచ్చినా, కాఫి ఇచ్చినా ఆవిడ తీసుకోలేదు.

''నావల్ల మీకెందుకులే శ్రమ వదినా.. పిల్ల నీళ్లోసుకుందని మీరు ఉత్తరం రాసారటగా. ఆయన చెప్పారు. ఆ వార్త తెలిసినప్పటినుంచి పిల్ల కళ్ళల్లో మెదులుతూనే ఉంది. మొన్న ఆయన వచ్చినపుడు నేనూ వద్దామనుకున్నాను. నాకు ఒంట్లో బాగోలేదు..గుండె దడ. ఆయాసం.రాలేకపోయాను. వారం మధ్యలో వద్దామంటే పిల్లలకు ఈ వెధవ కాన్వెంట్ చదువులు. ఇక ప్రాణం ఉండబట్టలేక పిల్లని చూద్దామని వచ్చాను. ''అని వదినను ఒళ్ళంతా పదిసార్లు తడిమి చూసుకుంది. ఆవిడ కళ్ళల్లో ఒక మెరుపు మెరవడం చూసాను నేను. దానికి అర్ధం అప్పుడు తెలియలేదు నాకు. 

కానీ ఆవిడ ఎంతటి ఘటికురాలో మరో పావుగంటలోనే తెలిసింది.

(మిగతా 9 వ భాగంలో)



Rate this content
Log in

Similar telugu story from Drama