gowthami ch

Tragedy

4.7  

gowthami ch

Tragedy

నా గమ్యం?

నా గమ్యం?

4 mins
864


"ప్రేమ ఈ సంవత్సరం మన చదువులు అయిపోయాయి కదా మనకు జాబ్స్ కూడా వచ్చాయి. ఇంకా ఎందుకు ఎదురుచూడటం , ఇంట్లో మన ప్రేమ విషయం చెప్పి పెళ్లి చేసుకుందాం. అప్పుడు ఇలా దొంగతనంగా కలుసుకోవలసిన అవసరంగాని ,ఒకర్ని విడిచి ఒకరం దూరంగా ఉండవలసిన అవసరం గాని ఉండదు. ఏం అంటావ్ " అని అడిగాడు హృత్విక్.


"ఏం లేదు హృత్విక్ నాకు ఈ పెళ్లి మీద అంత నమ్మకం లేదు. పెళ్లికి ముందు ఉన్న ప్రేమ పెళ్లి తర్వాత ఉండదు మీ మగవారికి. పెళ్లి అవ్వడంలేటు ఇంక నేనేమి చేసినా నన్ను విడిచి ఎక్కడికి వెల్లదులే అనే ఓవర్ కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది మీకు. తాళి అనే ముడుముళ్ల బంధంతో మమ్మల్ని కట్టి పడేస్తారు. ఏమైనా అంటే నువ్వు ఆడదానివి భర్తని ఎదిరించకూడదు తొక్క తోటకూర కట్ట అని అందరూ సిద్ధమైపోతారు నీతులు చెప్పడానికి. అదే పెళ్లి చేసుకోకుండా ఇలానే ఉంటే ఏ గొడవా ఉండదు జీవితాంతం ఆనందంగా ప్రేమించుకోవచ్చు." అని హృత్విక్ కళ్ళలోకి చూస్తూ అంది.


"నువ్వు చెప్పింది అంతా నిజమే కానీ ఇలా పెళ్లి చేసుకోకుండా కలిసి ఉంటే సమాజం ఏమనుకుంటుందో తెలుసా!" అడిగాడు హృత్విక్.


"సమాజం కోసం నా జీవితాన్ని నేను నాశనం చేసుకోలేను కదా!"


"అవుననుకో! అయినా , ఒకసారి ఆలోచించు. ఇవన్నీ చెప్పుకోవడానికి , సినిమాలో చూడటానికి బాగుంటాయి కానీ నిజంగా అలా ఉండటం కష్టం. దీనిని ఎవ్వరు ఒప్పుకోరు. "


"అందరి గురించి నాకు అనవసరం నీకు ఇష్టమే కదా! లేదు అంటే చెప్పు. ఇంకెప్పుడూ నీకు నా మొహం చూపించను. ఇష్టం అయితే చెప్పు వెంటనే ఎక్కడికైనా వెళ్ళిపోయి ఆనందంగా ఉందాం. నిర్ణయం నీదే. " అంది ప్రేమ.


"నాకు కొంచెం సమయం కావాలి ఆలోచించి చెప్తాను. దయచేసి నేను చెప్పే వరకు ఈ విషయం ఎవరితో చెప్పకు. "


"అలాగే హృత్విక్. కానీ రేపు ఇదే సమయానికి ఏదో ఒక నిర్ణయంతో నువ్వు ఇక్కడికి రావాలి. లేదంటే నీ ఇష్టం. "అని అక్కడి నుండి వెళ్ళిపోయింది ప్రేమ.


రాత్రంతా ఆలోచించాడు హృత్విక్ , ఒకవేళ నేను దీనికి ఒప్పుకోకపోతే ప్రేమ నాకు దక్కదు. ఒప్పుకుంటే నిదానంగా అయినా ప్రేమని పెళ్లికి ఒప్పించవచ్చు అనుకుని, తరువాతి రోజు ఒక గంట ముందుగానే వచ్చి ప్రేమ కోసం ఎదురుచూస్తున్నాడు హృత్విక్.


"పర్లేదే! నాకంటే ముందే వచ్చావంటే ఏదో నిర్ణయంతోనే వచ్చి ఉంటావు. అదేంటో త్వరగా చెప్పు" అడిగింది ప్రేమ.


"నువ్వు చెప్పింది ఏదైనా కానీ నాకు మాత్రం నువ్వు కావాలి , నీ ప్రేమ కావాలి దాని కోసం నేను దేనికైనా సిద్దమే. నేను దీనికి ఒప్పుకుంటున్నాను అని ప్రేమ చేతిలో చెయ్యి వేసి" అన్నాడు.


ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఈ ఊరు వదిలి వెళ్లిపోదాం. అని దానికి తగిన ప్లాన్ వేసుకుని అక్కడినుండి వెళ్లిపోయారు.


ఇంట్లో వాళ్ళకి చెప్పారు . వాళ్ళు ఒప్పుకోరని ముందుగానే తెలుసు గనుక ఇద్దరూ పెద్దగా పట్టించుకోలేదు. ఇల్లు , ఊరు వదిలి వెళ్లిపోయారు.


ఒక ఇల్లు తీసుకొన్నారు ఇద్దరూ జాబ్ లలో చేరిపోయారు. ఒక 2 సంవత్సరాలు ఎలా గడిచిందో కూడా తెలియలేదు, అంతలా ఎంజాయ్ చేశారు. సమాజం దృష్టిలో వీరికి పెళ్లి అయినట్లే ఉన్నారు.


"ప్రేమ ఇప్పటికైనా నీకు నా ప్రేమ మీద నమ్మకం కలిగితే మనం పెళ్లి చేసుకుందాం. "


"నీకు ఎన్ని సార్లు చెప్పాను హృత్విక్ నాకు ఈ పెళ్లి మీద నమ్మకం లేదని. ఇప్పుడు ఎందుకు నీకు ఆ ఆలోచన వచ్చింది. ఇప్పుడు మనం బాగానే ఉన్నాం కదా."


ఉన్నామనుకో ! కానీ !


హా.. కానీ...?


ఏం లేదులే. ఎన్ని చెప్పినా వినదు అనుకోని నీ ఇష్టం అన్నాడు. అలా కొన్నాళ్ళకి ఒక బలహీన క్షణంలో ఇద్దరూ ఒక్కటయ్యారు. జీవితాంతం కలిసి ఉండాలని నిర్ణయించుకోవడం, ఒకరి పట్ల ఒకరికి నమ్మకం ఉండడం మూలంగా వాళ్ళకి ఇది తప్పుగా అనిపించలేదు.


ప్రేమ తల్లికాబోతుందని తెలిసి ఇద్దరూ ఎంతో సంతోషించారు. ప్రేమని కంటికి రెప్పలాగా చూసుకున్నాడు. 7 నెలల తర్వాత ప్రేమ ఆఫీస్ కి లీవ్ పెట్టి ఇంటి పట్టునే ఉంది. తనకి తోడుగా ఒక మనిషిని నియమించాడు హృత్విక్.


9 నెలల తర్వాత పండంటి కవల పిల్లలకి జన్మ నిచ్చింది ప్రేమ. వాళ్ళ ఆలనా పాలనా చూసుకొని పెద్దలు లేకపోవడం , పిల్లల్ని పెంచే విషయంలో కొంత చిరాకు , అసహనం ఎక్కువయ్యి ఇద్దరికి ఏవో చిన్న చిన్న మనస్పర్ధలు రావడం మొదలయ్యాయి. తర్వాత... తర్వాత పిల్లల వయస్సుతో పాటు వాళ్ళ మధ్య దూరం కూడా పెరిగింది.


ఇలా కొన్ని నెలలు గడిచాయి వాళ్ళ మధ్య మునుపటి ఏకాంతం కరువైంది. ప్రేమకి పిల్లలతోనే సమయమంతా సరిపోయేది . ఈ కారణం చేత భర్తని పట్టించుకోవడం తగ్గింది. వీళ్ళ మధ్య మాటలు కరువయ్యాయి. హృత్విక్ కి కూడా ప్రేమ మీద ప్రేమ తగ్గడం మొదలైంది. పిల్లల ఏడుపులు , అరుపులు ఇష్టపడని హృత్విక్ ఇంట్లో కంటే బయటే ఉండడం ఇష్టపడేవాడు.


ఆఫీస్ పని మీద నెలలో ఎక్కువ రోజులు బయట ఊర్లోనే ఉండేవాడు. ఎప్పుడో ఒకసారి వచ్చి వెళ్తుండేవాడు. ప్రేమ "ఎందుకిలా చేస్తున్నావ్?" అని అడిగితే "నా ఇష్టం నేను మొగోడిని ఎన్నో పనులుంటాయి. అన్ని నీకు చెప్పవలసిన అవసరం నాకు లేదు. "అని అరిచి వెళ్లిపోయేవారు.


కొన్ని రోజులకి అడగడం కూడా మానేసింది ప్రేమ. తరువాత పూర్తిగా ఇంటికి రావడం మానేశాడు. ఫోన్ కూడా చేయడం మానేసే సరికి అనుమానం వచ్చి ఎక్కడికి వెళ్లాడో ఆరా తీయగా ఇంకొకర్ని పెళ్లి చేసుకున్నాడని తెలిసి గుండె పగిలేలా ఏడ్చింది. ఏం చేయాలో అర్థం కాలేదు. హృత్విక్ ని కలిసి తిరిగి రమ్మని బ్రతిమాలింది. కానీ అదంతా కుదరదు అని బయటకి గెంటేశాడు. ఎంతమంది లాయర్లని కలిసినా పెళ్లి కాకుండా కలిసి ఉంటే మేమేమి చేయలేము అని , అది చాలా పెద్ద తప్పుగా మాట్లాడేవారే తప్ప తన బాధని అర్ధం చేసుకునే వాళ్ళు కనపడలేదు ప్రేమకి.


అప్పుడు వాళ్ళ తల్లి దండ్రులు గుర్తొచ్చి పరిగెత్తి వాళ్ళని చేరి అంతా వివరించాలి అనుకుంది కానీ "ఇన్ని సంవత్సరాల తరువాత ఏ మొహం పెట్టుకొని వెళ్ళాలి? ఒకవేళ వెళ్లినా నా ఈ పరిస్థితిని వివరించి వాళ్ళకి మరింత మానసిక క్షోభ మిగల్చలేను.


"డిఎన్ఏ టెస్ట్ చేయించినా కూడా బలవంతంగా నా బిడ్డలకు తండ్రిని ఇవ్వగలనేమో గానీ వాళ్ళకి నిజమైన తండ్రి ప్రేమని ఇవ్వగలనా? నేను భర్తని పొందగలనేమో కానీ అతని నిజమైన ప్రేమని పొందగలనా? ఈ సమాజం నా పిల్లల్ని గౌరవంగా చూస్తుందా? ఆ క్షణంలో నా బిడ్డలు అడిగే ఎన్నో ప్రశ్నలకి సమాధానం కూడా చెప్పలేను. "అని తనని తాను ప్రశ్నించుకొంది.


"ఇదంతా నా చేతులారా చేసుకున్నాను మొదట్లోనే తను పెళ్లి చేసుకుందాం అంటే వద్దు అన్నాను . తర్వాత కూడా ఎన్నో సార్లు అడిగాడు నేనే నా పంతంకొద్ది ఒప్పుకోలేదు అదికూడా కాకుండా పిల్లల విషయంలో పడి నేనే తనని సరిగా పట్టించుకోలేదు. ఇప్పుడే తెలుస్తుంది పెళ్లి లోని గొప్పతనం. అదే మాకు పెళ్లి అయ్యి ఉంటే ఇలాంటి ఆలోచన వచ్చి ఉండేది కాదు కదా. ఎంత తిట్టుకున్నా , కొట్టుకున్నా కలిసే ఉండేవాళ్ళం. మంచిగా పెద్దవాళ్ళు చెప్పినట్లుగా పెళ్లి చేసుకుని ఉంటే ఇప్పుడు నాకు ఈ దుస్థితి వచ్చి ఉండేది కాదు ఒకవేళ ఏవైనా ఇబ్బందులు ఉన్నా పెద్దవాళ్ళు , చుట్టూ ఉన్న సమాజం ఎంతో అండగా నిలబడే వారు , కానీ ఇప్పుడు అందరూ ఉన్న ఒంటరిగా , గమ్యం తెలియని బాటసారిగా ఉన్నాను " అని ఎంతో కుమిలి కుమిలి ఏడ్చింది.


Rate this content
Log in

Similar telugu story from Tragedy