Praveena Monangi

Inspirational

4  

Praveena Monangi

Inspirational

నాన్న కి ఒక లేఖ

నాన్న కి ఒక లేఖ

4 mins
316


“కాఫీ అడిగి ఎంత సేపు అయింది సుమతి! నిన్నే... వినపడిందా?” అని హాల్లో పేపర్ చదువుతూ భార్యని పిలుస్తున్నాడు రాఘవరావు. భర్త పిలుపుతో వంటగది నుండి

"మీకు రోజూ రెండవ సారి కాఫీ తాగడం బాగా అలవాటైపోయింది, అది కూడా ఒక్క క్షణం ఆలస్యమైనా ఆగరు" అంటూ కాఫీ కలుపుకుంటూ వచ్చి భర్తకి అందించింది సుమతి. తిరిగి వంటగదిలోని కి వెళ్లబోతుండగా కాలింగ్ బెల్ మోగింది. “ఎవరయ్యుంటారబ్బా!’’ అని తలుపు తెరిచే సరికి పోస్ట్ అంటూ.. పోస్టు మేన్ ఉత్తరం ఇవ్వడంతో ఉత్తరాన్ని అందుకుని తలుపు వేసింది సుమతి. భార్య చేతిలో ఉత్తరం చూసిన రాఘవరావు

"ఈ రోజుల్లో కూడా ఉత్తరాలు వ్రాస్తున్నారా? అది కూడా మనకి ఎవరు వ్రాసి ఉంటారు, అడ్రస్ ఎవరిదో సరిగ్గా చూసావా!" అన్నాడు.

"అదే నేను చూస్తున్నాను అండి, ఇది మీ పేరు మీద వచ్చింది"

"నా పేరు మీదా? ఎవరి వద్ద నుండి వచ్చిందో చూడు సుమతి"!

"అబ్బా! చూస్తున్న ఉండండి మీకు అంతా కంగారే, ఉత్తరం మీద చిరునామా చూస్తూ... హా! రాసింది మీ గారాల పట్టి, మీ కూతురు".

"ఎవరు మన అమ్మాయి వ్రాసిందా?? నిన్న రాత్రే కదా మాట్లాడుకున్నాం"

"నాకేం తెలుసు మీ తండ్రి కూతుర్ల మధ్య రహస్యాలు తీసుకోండి వ్రాసింది మీకు కదా"! అంటూ భర్త చేతిలో ఉత్తరం పెట్టి వంట గదిలోనికి వెళ్ళిపోయింది సుమతి.

ఇంతలోనే ఉత్తరమా! నిన్న రాత్రి ఫోన్ లో మాట్లాడినపుడు ఉత్తరం విషయమే చెప్పలేదు అమ్మాయి, అసలు విషయం ఏమయ్యి ఉంటుందబ్బా! అనుకుంటూ రకరకాల ఆలోచనలతో ఉత్తరం తెరిచి ఆత్రంగా చదవసాగాడు రాఘవ రావు.

“పూజ్యనీయులైన నాన్నగారికి, మీ కూతురు రమ్య వ్రాయునది అంతా క్షేమమే, కంగారు పడకండి ఫోన్ లో రోజూ మాట్లాడుకుంటున్నాం కదా! మరల ఈ ఉత్తరం ఏమిటి అనుకుంటున్నారా? కొన్ని విషయాలు మాటల్లో చెప్పలేము నాన్న! అది సంతోషమైన, దుఃఖమైనా! కంగారు పడకండి ఇప్పుడు నేను మీకు చెప్పబోయే విషయం సంతోషకరమైన విషయమే, మీ అల్లుడు గారు నన్ను బాగా మెచ్చుకుంటున్నారు నాన్న.

నిన్న ఏదో సందర్భంలో మీ నాన్నగారికి, అదే! మా మామగారికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి అన్నారు. అది ఎందుకు అని అడిగితే, నీలాంటి సుగుణాల రాశిని నా కోసం కని, నాకు ఇచ్చి పెళ్లి చేసినందుకు అన్నారు. ఈ రెండేళ్లలో ఆయనకి నా మీద కలిగిన అభిప్రాయం అది, ఈ రోజులలో ఆడపిల్లలలో ఇన్ని సుగుణాలు ఉన్నాయి అంటే అది ఖచ్చితంగా తండ్రి పెంపకం వల్లనే సాధ్యమవుతుంది అంటూ.... మన ఇద్దరినీ మెచ్చుకున్నారు నాన్న! ఈ వార్త చదువుతుంటే మీ కళ్ళల్లో మెరిసే మెరుపు నాకు కనిపిస్తుంది నాన్న! నీకు సంతోషమేనా నాన్న? ఉత్తరం చదువుతూ ఉంటే రాఘవరావు కళ్ళు ఆనందంతో చెమర్చాయి. భుజాన ఉన్న తువ్వాలుతో కనులు తుడుచుకొని మిగతా ఉత్తరం చదవసాగాడు..

ఈ సందర్భంగా చనువుతో నీకు ఒక ప్రశ్న అడగనా మరి!

అమ్మ సుగుణాల రాశి కాదా నాన్న?? గడిచిన 27 సంవత్సరములలో అమ్మ మీద ఏనాడు నీకు ఆ అభిప్రాయం కలగలేదా నాన్న? ఉత్తరం చదువుతున్న రాఘవరావు ముఖకవళికలు ఒక్కసారిగా మారాయి. ఆశ్చర్యంతో చదవసాగాడు... నాన్న, మరి తాతయ్య నీకు మంచి అమ్మాయిని ఇవ్వలేదా? నాకు తెలిసినంతవరకూ నువ్వు ఎప్పుడూ తాతయ్యని ఏదో ఒకటి అంటూనే ఉంటావు. కట్నం ఎక్కువ ఇవ్వలేదు, పండుగకి ఉంగరం ఇవ్వలేదు, ఇంటికి వెళ్ళినప్పుడు మర్యాదలు చేయలేదు, మనవలకి బొమ్మలు కొని ఇవ్వలేదు.... ఇలా ఏదో ఒకటి అమ్మ తో నువ్వు తాతయ్యని అంటూ ఉండటం నేను విన్నాను. ఏరోజైనా ఇంత మంచి భార్యని ఇచ్చాడే మామయ్య అని నీకు అనిపించలేదా? ఇందులో అమ్మ తప్పేముంది చెప్పు! నిన్ను నమ్ముకొని వచ్చి తన సర్వస్వాన్ని ధారపోసి నీకు సేవ చేసింది కదా! అదే ఆమె చేసిన తప్పా! నువ్వు అమ్మని బాగా చూసుకున్నావు, నేను కాదనడం లేదు. కానీ తాతయ్యని నువ్వు అలా అంటూ వుంటే అమ్మకి ఎంత బాధగా ఉంటుందో ఒక్కసారైనా ఆలోచించావా! తాతయ్య ఇవ్వకపోతే ఏమి నీకు లేవా డబ్బులు? వాళ్లకు తోచింది వాళ్ళు ఇచ్చారు. వాళ్లకు మాత్రం కూతురికి ఇవ్వాలని ఉండదా? అక్కడ పరిస్థితులు ఏమిటో మనకు ఎలా తెలుస్తుంది! ఈ మాటలు విన్న నేను ఎన్నో సార్లు నిన్ను అడుగుదామని ముందుకు వచ్చాను. కానీ అమ్మ నన్ను వారించింది నాన్నగారికి ఎదురు వెళ్ళవద్దు అన్నది. ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి అడుగుతున్నా! ఏనాడైనా అమ్మని మెచ్చుకున్నావా? మెచ్చుకోలుగా తాతయ్య తో మాట్లాడావా? ఇంత మంచి అమ్మాయిని ఇచ్చినందుకు తాతయ్యకి థాంక్స్ చెప్పనక్కర్లేదు, కృతజ్ఞత నువ్వు మనసులో చెప్పుకో నీ కళ్ళల్లో, మనసులో ఆయన పట్ల మీకు ఉన్న అభిప్రాయం మారుతుంది ఒక్కసారి ఆలోచించు నాన్న.. నువ్వుతాతయ్యని మాట అన్న ప్రతీ సారి అమ్మ ఎంత వేదన చెంది ఉంటుందో కదా! నువ్వు ఎన్ని మాటలు అన్నా, అమ్మ నీకు ఎదురు తిరగలేదు ఎందుకో తెలుసా! అది కూడా తాతయ్య నేర్పిన సంస్కారం. ఆలోచించు నాన్న! నువ్వు అమ్మని బాగా చూసుకుంటావు. అడిగింది ఇస్తావు నన్ను,తమ్ముడిని ప్రేమగా చూసుకుంటావు. అందమైన పొదరిల్లు మనది. అమ్మా ,నువ్వు చాలా అన్యోన్యంగా ఉంటారు మీ ఇద్దరిని చూసి నేను చాలా నేర్చుకున్నాను. ఇన్ని మంచి విషయాలు ఉన్నాయి నీలో, మరి ఆ ఒక్క విషయంలో ఎందుకు? నీకు ఉన్నది కోపమో, భాదో నాకు తెలీదు నువ్వు తాతయ్య నుండి ఏమి ఆశిస్తున్నావో తెలియదు. కానీ నీలో మార్పు రావాలి నువ్వు తాతయ్య నుండి ఏమి ఆశిస్తున్నావో అవి మొదట నువ్వు ఇచ్చి చూడు నీకే తిరిగి వస్తాయి. మార్పు మీ ఇద్దరిలో వస్తుంది నేను ఇలానే ఉంటాను అని గిరి గీసుకుని కూర్చోకూడదు. ఈ సంక్రాంతికి అమ్మని తాతయ్య దగ్గరికి తీసుకు వెళ్లు తాతయ్య కోసం కాకపోయినా అమ్మ సంతోషం కోసం వెళ్ళండి .అందరూ సంతోష పడతారు తేడా మీరే గమనిస్తారు. ఏంటి నాన్న! ఎక్కువగా మాట్లాడేసానా? సోరీ నాన్న! ఎప్పటినుండో చెప్పాలనుకుంటున్నాను ఇప్పుడు చెప్పేసాను.ఉంటాను నాన్న! మీ అల్లుడు గారు వచ్చే టైం అయింది అమ్మని అడిగానని చెప్పండి బాయ్ నాన్న! మీ ఆరోగ్యం జాగ్రత్త”.

ఉత్తరం చదువుతున్న రాఘవ రావుకి కళ్ళనీళ్ళు ఆగడంలేదు. ఆలోచనలో పడ్డాడు వయసులో చిన్నదైన కూతురు ఎంత మంచి విషయాన్ని చెప్పింది అని లోలోపలే మెచ్చుకున్నాడు తాను చేసిన తప్పును తెలుసుకో సాగాడు కూతురు చెప్పింది నిజమే కదా సుగుణాల రాశి అయిన భార్యని ఇచ్చింది తన మావగారే కదా! ఇలా చాలా సమయం ఆలోచనలో గడిపాడు. ఇంతకీ మీ గారాల పట్టి ఏమి రాసింది అంటూ హాల్లోకి వచ్చి అడిగిన సుమతి పిలుపుతో ఉలిక్కిపడ్డాడు రాఘవరావు.

"మా తండ్రీ కూతుళ్ల మధ్య చాలా ఉంటాయి అవన్నీ నీకు ఎందుకు!" అంటూ భార్య ఎక్కడ ఉత్తరం చదువుతుందో అనుకొని మడిచి జేబులో పెట్టుకున్నాడు.

"అయితే నాకు చెప్పనవసరం లేదు లెండి" అంటూ బుంగమూతి పెట్టుకుని కూర్చున్న సుమతి చుబుకాన్ని పట్టుకుని “ఆ విషయాన్ని పక్కన పెట్టు ఇప్పుడు నేను ఒక విషయం చెబుతాను విను అంటూ రాఘవరావు సుమతి కళ్ళల్లోకి చూస్తూ ఈసారి సంక్రాంతికి మన అమ్మాయి ,అల్లుడు సింగపూర్ వెళ్తున్నారు అంట! మీ నాన్న గారి ఇంటికి అదే మామ గారి ఇంటికి మనమిద్దరం వెళ్దామా" అని అడగగానే సుమతి కళ్ళల్లో ఆశ్చర్యంతో కూడిన ఒక అందమైన మెరుపుని గమనించాడు రాఘవరావు. గడిచిన 27 ఏళ్లలో తన భార్య కళ్ళల్లో ఏనాడూ చూడలేదు అంతటి ఆనందాన్ని.. మనసులో తన కూతురికి కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. ఎంతైనా ఈ నాన్నలున్నారే! భార్యలు చెప్పిన దానికన్నా కూతురు చెప్పిందే వింటారు లెండి. అంతే అంటారా??.



Rate this content
Log in

Similar telugu story from Inspirational