gowthami ch

Comedy

3  

gowthami ch

Comedy

రాం భీమ్

రాం భీమ్

5 mins
306


సుబ్బారావు కి భీముడు , రాముడు అని ఇద్దరు పిల్లలు. తల్లి లేని పిల్లలని ఎంతో ప్రేమగా పెంచుకున్నాడు. మాములుగా వాళ్ళ ముగ్గురు కలిసి ఎక్కడికైనా వెళ్లాలంటే ఒక లారీ కావలసిందే, ఇంక దేంట్లో ఈ ఆకారాలు పట్టవు. వీళ్ళ మధ్యలో వాళ్ళ నాన్న ని నిలపెడితే రెండు గుమ్మడికాయల మధ్యలో చీకేసిన మునక్కాయ లా ఉంటాడు అంతటి భారీ శరీరాలు వాళ్ళవి.


అంత లావు ఉండటం మంచిది కాదని వాళ్ళ లావు తగ్గించడానికి సుబ్బరావు నానా కష్టాలు పడతాడు. ఒకరోజు బజార్ పనులు ముగించుకొని ఇంటికి వచ్చిన సుబ్బారావుకి కొడుకులని చూసి నవ్వాలో ఏడవాలో అర్ధం కాలేదు. ఇద్దరూ ఒకరి మీద ఒకరు పోటీ పడి , కొట్టుకుంటూ ఇంట్లో ఉండే పప్పులు , ఉప్పులని కూడా తింటుంటారు. "బజార్ కి వెళ్లి కొంచెం ఆలస్యంగా వచ్చాను , అంతే అప్పటికే ఆకలికి తట్టుకోలేక పోయారా! ఇలా అయితే మీరు వెయిట్ తగ్గడం కష్టం" అని ఎలాగైనా వీళ్ళని తీసుకొని హాస్పిటల్ కి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు.


రాం, భీమ్ లని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళాలి, కానీ వీళ్ళని చూస్తే ఆటో వాడు ఎవ్వడూ ఎక్కించుకోడు. ఇప్పుడు ఎలా !అనుకోని మొదట సుబ్బరావు ఒక ఆటో ని ఆపి " హాస్పిటల్ కి వెళ్ళాలి వస్తావా" అని అడిగాడు.


"నేను మనుషులని మాత్రమే తీసుకెళ్తాను ఆస్థిపంజారాలని కాదు" అంటాడు వెటకారంగా.


సుబ్బారావు అటు ఇటు చూసుకొని "ఎవర్ని చూసి ఏం మాట్లాడుతున్నావ్ నన్ను చూస్తే అస్థిపంజరంలా ఉన్ననా నీ కళ్ళకి , వస్తావా రావా ముందు అది చెప్పు" అంటాడు.


"వస్తాను కానీ సూక్ష్మజీవులు , అల్పప్రాణుల కోసం ఆటో లో పెట్రోల్ వృధా చేసుకోను. కొంచెం సేపు వెయిట్ చెయ్యి ఇంకెవరైనా వస్తే వాళ్ళతో పాటు ఒక మూల కూర్చుందువు కానీ , అది కూడా కాదంటే ఇక్కడే ఇలాగే నిలబడు , కొంచెం సేపటికి ఈ వాహనాల వేగంకి వచ్చే గాలితో పాటు కోట్టుకుంటూ హాస్పిటల్ కు వెళ్లిపోవచ్చు ఫ్రీ గా" అంటాడు.


"ఇప్పుడేమంటావ్ నన్ను ఒక్కడినే అయితే ఎక్కించుకోవు అంతేగా అలా అయితే నా పిల్లల్ని కూడా పిలుస్తాను ఉండు" అంటాడు.


వీడే పీనుగులా ఉంటే వీడి పిల్లలు అంటే ఇంకెలా ఉంటారు , చీకేసిన ఐస్ పుల్లలా ఉంటారు అని మనసులో అనుకోని "సరే అయితే రమ్మను" అంటాడు.


"అయితే ఒక ఒప్పందం. మా పిల్లల్ని చూసిన తరువాత కూడా ఇదే మాట మీద ఉండాలి లేదంటే

ఆ తరువాత ఎం జరిగినా నాకు సంబంధం లేదు" అంటాడు సుబ్బారావు.


"సరే సర్ అలానే కానివ్వండి నేను ఇచ్చిన మాట తప్పును" అంటాడు ధీమాగా.


"ఒరే రాం , భీమ్ ఇంక రండి" అని పిలుస్తారు సుబ్బారావు. ఇద్దరు ఎదురుగా వస్తుంటే వాళ్ళని చూసిన ఆటో డ్రైవర్ కి కళ్ళు తిరిగి , ఫిట్స్ వచ్చినట్లుగా కింద పడి కొట్టుకుంటుంటాడు.


మొహం పై నీరు జల్లి లేపుతాడు సుబ్బారావు. ఆలోపు రాం , భీమ్ ఇద్దరు ఆటోలోకి వాల్ల శరీరాలని ఎక్కించడానికి తెగ కష్టపడుతుంటారు. అది చూసిన ఆటో డ్రైవర్ "సర్ ఇది అన్యాయం , మీ పర్సనాలిటీ చూపించి నన్ను మోసం చేశారు. అయ్యో పాపం నా ఆటో మీ గజ వాహనాలని మోయలేక మట్టిలో కూరుకొని పోతుంది. దయచేసి దిగమని చెప్పండి సర్" అని ప్రాధేయపడతాడు.


ససేమిరా అని ముగ్గురూ అందులోనే ఇరుక్కుని కూర్చుంటారు. ఆటో వాడు వాళ్ళ వాలకం చూసి భయపడి ఇప్పుడు వీళ్ళని నేనేమైనా అన్నానంటే , ఒక్క తొక్కు తొక్కితే చాలు డైరెక్ట్ పాడె కట్టాల్సిందే నాకు అనుకోని ఆటోలో కూర్చొని స్టార్ట్ చేసాడు ఇంతకీ ఆటో ముందుకు కదలకపోను పైకి లేస్తుంది. చూసి చూసి ఇంక వల్ల కాక ఒక నలుగుర్ని సహాయం అడిగి చిన్నగా ఆటోని రిక్షాని లాక్కుని వెళ్లినట్లు హాస్పిటల్ కి లాక్కుని వెళ్లాడు.


ఆటో లో నుండి వాళ్లిద్దరూ దిగుతుంటే ఆటో గాలిలో తెలిపోతున్నట్లు పైకి లేసింది. జీవితంలో ఇంకెప్పుడూ ఎవర్ని తక్కువ అంచనా వేయను అనుకోని లెంపలు వేసుకొని ఒక్క కిక్కుతో ఆటో స్టార్ట్ చేసి వేగంగా వెళ్ళిపోయాడు.


సుబ్బారావు పిల్లళ్ళిద్దర్నీ హాస్పిటల్ లోపలికి పంపి బయట వెయిట్ చేస్తూ కూర్చున్నాడు. ఇంతలో ఏదో ఫోన్ రావడంతో అక్కడ వాళ్ళతో పిల్లలకి విషయం చెప్పమని చెప్పి బయటకి వెళ్లిపోయాడు.


కొంత సేపటికి హాస్పిటల్ కి వచ్చిన సుబ్బారావు కి పిల్లలు కనపడలేదు వెంటనే రిసెప్షన్ లో అడిగితే ఎదురుగా ఉన్న హోటల్ లో ఉన్నారని చెయ్యి చూపించింది. అక్కడికి వెళ్లి చూసేసరికి రాం , భీమ్ ఇద్దరు ఆండాల నిండా ఇడ్లీ ,సాంబార్ , వడలు వేసుకొని తింటున్నారు.


దగ్గరకి వెళ్ళి "డాక్టర్ పని అయిపోయిందా" అడిగాడు సుబ్బారావు.


"ఓహ్.. ఎప్పుడో...అయిపోయింది నాన్న..మీరు రావడం లేట్ అవ్వడంతో ఆకలి వేసి ఇలా వచ్చాము" అని సమాధానం చెప్పారు ఇద్దరు.


"మరి డాక్టర్ ఏం చెప్పారు రాం" అని అడిగాడు సుబ్బారావు రాం వైపు చూస్తూ.


"నన్నేమో లైట్ ఫుడ్ తీసుకోమన్నారు నాన్న అందుకే లైట్ కింద కూర్చుని తింటున్నాను" అంటూ ఒక అండా నిండా ఇడ్లీలు పెట్టుకొని నాలుగు అండాల సాంబార్ అందులో పోసుకొని పిసికి పిసికి తింటూ సమాధానం చెప్పాడు. అతను అలా పిసుకుతుండటం చూసిన పక్క బెంచ్ లో అతను వాంతు వచ్చి అక్కడి నుండి వెళ్ళిపోయాడు.


ఆ సమాధానం విన్న సుబ్బారావు కి నవ్వాలో ఏడవాలో తెలుయక బిక్క మొహం వేసుకొని భీమ్ వైపు చూసి "నీకేం చేయమని చెప్పారు? నాయన" అడిగాడు భయంగా.


"తినే ఫుడ్ లో ఆయిల్ శాతం తగ్గించమన్నారు నాన్న అందుకే గారెల్ని న్యూస్ పేపర్ లో పెట్టి ఒత్తి ఆయిల్ పోయాక తింటున్నాను" అన్నాడు 10 గారెల్ని పేపర్లో పెట్టి ఒత్తుతూ.


"మీకు ఇలా అర్ధమైందా నాయనా అయితే ఇంక మీరు లావు తగ్గినట్లే!" అని ఇద్దర్నీ చూసి ఒక నవ్వు నవ్వుకొని బిల్ కట్టి అక్కడి నుండి వెళ్ళిపోయాడు.


తరువాతి రోజు , డాక్టర్ ప్రయోగం ఫలించేలా లేదు అనుకోని నెట్ లో చూసి లావు తగ్గడానికి ఏవేవో యోగాలు , excersize లు లాంటి ఎన్నో ప్రయోగాలు చేయించాడు అయినా లావు తగ్గలేదు.


సహజ సిద్ధంగా లావు తగ్గించే పధకం ఒకటి ఎవరో చెప్పగా విని తిండి పెట్టడం తగ్గించి ఏవేవో ఓట్స్ అని బ్రౌన్ రైస్ అని ఫ్రూట్స్ అని కొవ్వు తక్కువగా ఉండేవి అని ఏవేవో చేసి ఒక నిర్దిష్ట సమయం నిర్ణయించి ఆ సమయంలో మాత్రమే అవి పెట్టి మిగతా సమయం అంతా పస్తు ఉంచుతూ వచ్చాడు.


ఆ నిర్దిష్ట సమయం కోసం జైల్ లో ఎదురుచూసే ఖైదీలలాగా గడియారం వైపు చూస్తూ నాన్న ఆకలి అంటూ కూర్చున్నారు ఇద్దరూ. తినే సమయం అవ్వడం ఆలస్యం మంచి నీళ్ళ కుళాయి దగ్గర ఆడవాళ్లు కొట్టుకున్నట్లు ముందు నేనంటే ముందు నేను అంటూ తోసుకుంటూ నిలబడ్డారు. పెట్టిన ఆ కొంత ఆహారం వాళ్ళకి దైవ ప్రసాదంలా కనపడింది. దాన్నే కళ్ళకి అద్దుకొని ఆత్రంగా తిన్నారు.

ఇలా ఒక ఆరునెలల్లో 10 కిలోల బరువు తగ్గారు.


దానికే ఎంతో సంబర పడిపోయాడు సుబ్బారావు. కానీ వాళ్ళ ఆరోగ్య పరిస్థితిని గమనించలేదు. వాళ్లలో ఇంతకు ముందు ఉన్న ఉత్సాహం , ఓపిక ఏమి లేవు తిండి లేక నీరసించి పోయి తిండి కోసం నోరు బయట పెట్టి ఎదురు చూసే కుక్క లాగా అయిపోయారు.


అండాలు ఆండాలు తినే వారికి ఒక్క పూట కూడా కడుపు నింపకుండా పస్తు ఉంచడంతో ఒంట్లో గ్యాస్ ఎక్కువయ్యి గ్యాస్ట్రిక్ ట్రబుల్ వచ్చింది. ఇవేమీ సుబ్బారావు కి కనపడలేదు.


ఇలా కొంత కాలం గడిచిన తరువాత ఇద్దరూ బరువు అయితే తగ్గారు కానీ ఆకారం పుష్టి నైవేద్యం నస్థి అన్నట్లుగా శరీరాలు బయటకి బాగానే ఉన్నా ఒంట్లో చుక్క నెత్తురు లేదు. ఎక్కడికి వెల్లాలన్నా "నువ్వు పోరా రాం అంటే నువ్వు పోరా భీమ్" అనుకుంటూ కూర్చునే వారే తప్ప ఒక్క అడుగు వేసేవారు కాదు ఒకవేళ వేసినా ఒంట్లో ఓపిక లేక పడిపోయేవారు.


ఇంట్లో నుండి అడుగు బయట పెట్టేవారు కాదు. కొత్త కొత్త రోగాలు రావడం మొదలయ్యాయి. ఇవన్నీ గమనించిన సుబ్బారావు స్నేహితుడు ఒకడు సుబ్బారావు దగ్గరకి వెళ్ళి "చూడు సుబ్బారావు మీ పిల్లలు బరువు తగ్గాలన్న ఆలోచనలో పడి వాళ్ళ ఆరోగ్యం పట్టించుకోలేదు. చూడు ఎలా ఉండే వాళ్ళు ఎలా ఐపోయారో అయినా, అది తినడం వల్ల వచ్చిన శరీరాలు కాదు వంశ ప్పారంపర్యంగా వచ్చిన ఒళ్ళు. మీ భార్య , మీ మామగారు , అత్తగారు , మీ నాన్న గారు ఇలా మీ రెండు ఇళ్లల్లో అందరూ లావు ఉన్న వాళ్లే ఎక్కువ. అందువల్లనే వీళ్ళకి అదే శరీరం వచ్చింది తప్ప నువ్వనుకుంటున్నట్లు ఏం కాదు.


అనవసరంగా లావు తగ్గాలని ప్రయత్నించి వాళ్ళ జీవితాల్ని నాశనం చేయకు." అన్న మాటలు విని "అవును నువ్వు చెప్పింది నిజమే ఇప్పుడిప్పుడే నాకు అర్ధమవుతుంది ఇక మీదట తిండి పెట్టకుండా ఇలా పస్తు ఉంచడం లాంటి పిచ్చి పనులు చేయను" అని వాళ్ళ పిల్లల మొహాలు చూసి బాధపడ్డాడు.


ఆ విషయం విన్న రాం , భీమ్ కి ఎక్కడ లేని ఆనందం కలిగింది. వెంటనే వాళ్ళ నాన్న దగ్గరకి పరిగెత్తుకొని వెళ్లి వాళ్ళ నాన్న నిర్ణయం కోసం చూసారు. వాళ్ళ నాన్న నవ్వుతూ ఇద్దర్నీ దగ్గరకి తీసుకొని నన్ను క్షమించండి ఇన్ని రోజులు తిండి పెట్టకుండా మీ కడుపు మాడ్చాను అని కన్నీరు పెట్టుకున్నాడు.


"నాన్న తర్వాత తీరిగ్గా ఏడవవచ్చు కానీ ముందు తినడానికి ఏమైనా పెట్టు అని వాల్ల నాన్న చెయ్యి పట్టుకొని దీనంగా అడిగారు". ఇద్దర్నీ తీసుకొని హోటల్ కి వెళ్లి వాళ్ళకి కావలసినంత పెట్టమని అక్కడి వారికి చెప్పాడు. వాళ్ళు అలా ప్లేట్ తెచ్చి పెట్టి వెళ్లే లోపు కాళీ ఐపోయేవి వెంటనే "ఇంకో ప్లేట్" అనేవారు. కొంత సమయంలోనే హోటల్ లో భోజనం అయిపోయి హోటల్ మూసేసారు. వాళ్ళు అలా తింటుంటే అక్కడి వారంతా వింత జంతువుల్ని చూసినట్లు చూసారు వాళ్ళని. అంతే మరలా ఒక 2 నెలలలొనే మునుపటి శరీరాలలోకి వచ్చేసారు.











Rate this content
Log in

Similar telugu story from Comedy