శానాపతి(ఏడిద) ప్రసన్నలక్ష్మి

Inspirational

5.0  

శానాపతి(ఏడిద) ప్రసన్నలక్ష్మి

Inspirational

30.వృక్షో రక్షతి రక్షితః

30.వృక్షో రక్షతి రక్షితః

2 mins
735



    "చెట్లు మాట్లాడితే ఎలా ఉంటుంది..."? ఆ వేసవిలో వేపచెట్టు కింద మడత మంచంపై పడుకుని...చెట్లనే తదేకంగా చూస్తూ ....భార్య భూమికను అడిగాడు ఆకాష్. 

     

    ఆ మాటకు భర్తను పిచ్చివాడిలా చూసింది. ఇది మరీ బాగుందండీ...చెట్లూ...పుట్టలూ ఎక్కడైనా మాట్లాడతాయా... ? ఆ పక్కనే మరో మడత మంచంపై పడుకున్న భూమిక అంది భర్తతో. 


    "మరేం లేదోయ్....ఈ ఇల్లు కట్టినప్పటినుంచీ మనతో పాటూ పెరుగుతూ వచ్చిన ఈ వేపచెట్టూ...మామిడి చెట్టూ...కొబ్బరి... ఉసిరి...జామ ఇవన్నీ నా మనసులో ఆప్తుల్లా నిలిచిపోయాయి. మనింటిని మరింత పెద్దది చేయాలంటే...వీటన్నింటినీ నరికేయక తప్పదు. కానీ వీటిని తీసేయడమంటే నాకు చేతులు రావడం లేదు. ఇంతకాలం మనకెన్నో ఫలాల్ని ఇచ్చాయి...గాలి నిచ్చాయి... పొయ్యిలోకి పుల్లల్ని ఇచ్చాయి కదా...! కళకళలాడే పచ్చదనాన్ని పోగొట్టుకుంటామనిపిస్తుంది.  నాకెందుకో...ఈ చెట్లను చూస్తుంటే.... దిగులుగా కనిపిస్తున్నాయి.  మీకేమైనా ద్రోహం చేస్తున్నామా అని నిలదీసి అడుగుతున్నట్టే అనిపిస్తుంది...అన్నాడు వాటిని పెంచిన ప్రేమతో ఆకాష్. 


   భూమిక పకపకా నవ్వింది....! ఇక చెట్లపై జాలిపడింది చాలు. పళ్ళు కావాలంటే కొనుక్కోవచ్చు. ఇల్లు పెద్దది కొనాలంటే కోట్లమీద ధరలున్నాయి. ఉన్న ఇంటినే పెద్దది చేసుకోడానికి మిగిలియున్న ఈజాగాను ఉపయోగించుకుంటే చక్కగా సరిపోతుంది. ఇప్పుడు ఇళ్ళు కట్టేవాళ్ళంతా ఎక్కడా ఒక్క గజం కూడా వదలకుండా కడుతున్నారు. చాలా పొద్దుపోయింది...ఇంక పడుకోండి". అంటూ తాను చెప్పాల్సిన విషయం టూకీగా చెప్పేసి...నిద్రలోకి జారిపోయింది భూమిక. 


    వారిద్దరి మాటలూ మౌనంగా వింది వేపచెట్టు. ఇంటి యజమాని తమ గురించి ఎంతో విశాల హృదయంతో మాట్లాడాడు. కానీ...ఇంటి యజమానురాలికి తమపై దయ లేదనిపించించి వాపోయింది. ఆ ఇంటిన పెరిగే చెట్లన్నిట్టి తరపునా...తానే తమ మనసును యజమానురాలికి విన్నవించుకోవాలనుకుంది.


    వేపచెట్టు దేవతా వృక్షం కదా...! ఆ ప్రభావంతో.... నిద్రిస్తున్న భూమిక కల్లోకి ప్రవేశించింది.....


   "అమ్మా...భూమికా....! నేనే చెట్టుని మాట్లాడుతున్నాను. మీ ఇంటి విస్తరణ కోసం...మీతోపాటూ జీవిస్తున్న మమ్మల్ని హతమార్చడం ఎంతవరకూ న్యాయం...?

    

   మనిషిని కూడా చెట్టంత ఎదిగాడని మాతోనే పోలుస్తారు కదా.  ఈ విశ్వం అంతా పంచ భూతాత్మకమైనదే. మా వేర్లు భూమి...మా ఉపరితలం ఆకాశం...మేము వీచే గాలి వాయువు...మా రసమే జలము... మా కలపే అగ్ని. అలాగే మాకూ మనిషిలో ఉన్నట్లే పంచేంద్రియాలూ ఉన్నాయి. మనిషిలాగే వినడం, వాసన, రసం, స్పర్శ, దృష్టి అన్నీ ఉన్నాయి. అవి ఇతర జంతువులు లాగ  పైకి కనిపించక పోవచ్చు. అంతమాత్రం చేత అవి మాకు లేవు అని అనటానికి వీలు లేదు. మాలోనూ ఆకాశమనేది ఉంది. మాకూ స్పర్శను పొందే లక్షణముంది . అలాగే గాలి వీచినప్పడు, పిడుగులు పడ్డప్పుడు కలిగే ధ్వనులకు పువ్వులు, పండ్లు రాల్చేస్తాము. అంటే ఆ ధ్వనిని వినే శక్తి మాకుందనే. తీగలతో వేటినైనా చుట్టుకొని, లేదంటే పందిరికి ఎగబాకుతూ ముందుకు సాగిపోతుంటాము. ముందుకు పోవాలంటే, ముందు ఏముందో అర్థం కావాలంటే ఎంతో కొంత దృష్టి ఉండాలి. ఈ తీగలు సాగే స్థితిని చూస్తే మాకు దృష్టి కూడా ఉంది అనే విషయం మీకర్థమవ్వాలి. పవిత్రమైన గంధం కానీ, ధూపం కానీ మాకు సోకినప్పుడు మేము చక్కగా ఎదుగుతుంటాయి. సుఖ దుఃఖాలను పొందే లక్షణం మకూ కలిగి ఉంది . మనిషిలో ఎలా పరిణామ క్రమం ఉంటుందో మాలోనూ అలాంటి పరిణామక్రమమే ఉంటుంది. మొలకెత్తటం, పెరిగి పెద్దవ్వటం, పుష్పించి ఫలాలను ఇవ్వటం, కొంత కాలానికి వయస్సుడిగి నశించటం ఇవన్నీ చూస్తే ప్రాణం ఉన్న మనిషిలాగే మేము కూడా ఉంటాము. వాయువును గ్రహించటం, తీసుకున్న ఆహారాన్ని జీర్ణం చేసుకోవటం, ఆహారం మారినప్పుడు తరగటం, పెరగటం ఇవన్నీ మాలోనూ కనిపిస్తుంటాయి. వ్యాధి సోకితే మనిషి బాధపడినట్లే చీడపీడలు సోకిన మేము కూడా బాధ పడుతున్నట్లు నీరసించినట్లు ఉంటుంది. చీడపీడలు వదలగానే రోగం తగ్గిన మనిషి లాగే నవనవలాడులతో మేమూ ప్రకాశిస్తాము. మీకు ప్రాణవాయువు నిచ్చి మీ ఆయుష్హుని పెంచే మామీదెందుకమ్మా నీకింత నిర్దాక్షిణ్యం...?దయచేసి మమ్మల్ని రక్షించు".అంటూ....ఆమె కల లోంచి అంతర్థానమయ్యింది వేపచెట్టు.


   ఉదయం నిద్రనుంచి లేచిన భూమికకు ఏదో అవగతమై ...కలలో కనిపించి చెప్పిన వేపచెట్టును ప్రేమగా చూసింది. 


   ఇంకా నిద్రలేవని భర్తని లేపుతూ....  

  "ఏవండోయ్...మనింట్లో ఇంకో రెండు మొక్కలు పట్టే జాగా ఉంది. సపోటా...పనస మొక్కలు కూడా తీసుకురండి. వాటిని కూడా ఈరోజే పాతేస్తాను" అంది భూమిక.


   "మరి ఇల్లు"...అన్నాడు అర్థం కాని ఆకాష్.


    "ఇల్లూ లేదూ....పాడూ లేదు. మనకున్న ఇల్లు చాలు గానీ... చెట్టును మనంకాపాడితే ఆ చెట్టు మనల్ని కాపాడుతుంది . వృక్షో రక్షతి రక్షతః" అంది భూమిక.

    

    ఆకాష్ చెట్లవైపు సంతోషంగా చూస్తూ మనసుతోనే కావలించుకున్నాడు చెట్లను....!!*


        ***         ***         ***





     



    


Rate this content
Log in

Similar telugu story from Inspirational