శానాపతి(ఏడిద) ప్రసన్నలక్ష్మి

Inspirational

4.0  

శానాపతి(ఏడిద) ప్రసన్నలక్ష్మి

Inspirational

అమ్మ మనసు

అమ్మ మనసు

2 mins
547


           అమ్మ మనసు

           -శానాపతి(ఏడిద)ప్రసన్నలక్ష్మి


   'నీ విలువ ఇప్పుడు తెలుస్తోంది' అదే పనిగా అమ్మ గుర్తుకొస్తుంటే ...మనసులో ఎన్నిసార్లు అనుకున్నాడో. తల్లిని విడిచివచ్చి పదిరోజులే అయినా...యుగాలు గడిచినట్టుగా అనిపిస్తున్న వేదనతో కళ్ళు చెమ్మబారుతున్నాయి ఆనంద్ కి.


   " వద్దురా కన్నా! నువ్వెళ్ళిపోతే నువ్వక్కడ వుండగలవో లేదో...? నేను మాత్రం నిన్ను విడిచి వుండలేనురా. ఆ చదువులేవో మన ఇండియాలో ఉండవా? అంటూ అమ్మ ఎంత మొత్తుకున్నా సరే.. నేననుకున్నట్టు ఎంఎస్ చేయడానికి అమెరికాకి ఎగురుకుంటూ వచ్చేసాను. అమ్మ దూరమైన విలువ ఇప్పుడు అర్థమవుతుంది. మంచంపై బోర్లా పడుకుని తనలో తనే అప్పటి విషయాన్ని గుర్తుచేసుకుంటున్నాడు. 


   మళ్లీ ఒక్కసారి ఆలోచించుకోరా? నువ్వొక్కడికి వెళ్లే తీరాలా? అని తల్లి బేలగా అడిగినప్పుడు..."అబ్బా నువ్వూరుకోవే! వాడేమీ చిన్న పిల్లాడు కాదు. ప్రతీ విషయానికీ బెంబేలెత్తిపోకూడదు. ఒకసారి బయటకు వెళ్లి చదువుకోవడం అంటూ జరిగితే మన ఇండియాలో చదివినా ఒకటే విదేశంలో చదివినా ఒకటే" అంటూ కొడుకుని వెనకేసుకొచ్చాడు తండ్రి.


   "ఆ...అదీ. బాగా చెప్పారు నాన్నా! మా స్నేహితులందరూ చక్కగా ఎంఎస్ చేయడానికి అమెరికా వెళ్తున్నారని నేనూ సరదాపడుతున్నాను. నన్నేమో ఇండియాలోనే పాతుకుపోమని అమ్మ ఒకటే గోల. అక్కడకెళ్లి చదువుకుని ఉద్యోగం చేస్తే ఇక్కడ సంవత్సరంలో సంపాదించేది అక్కడ నెలలోనే సంపాదించొచ్చు. నేను ఆర్ధికంగా స్థిరపడాలనుకోవడం నీకిష్టం లేదన్నమాట" తల్లిని దెప్పిపొడిచినట్టు అనేశాడు ఆనంద్.


   కొడుకు మాటలకు నోరు నొక్కుకుంది. 

   "అదేంటిరా అంత మాటేనేసావు. ఏ తల్లైనా పిల్లలు వృద్ధిలోకి రావాలనేగా కోరుకుంటుంది. నా బెంగల్లా...నువ్వు అక్కడ ఎలా గడుపుతావో అనే. అక్కడేమో మంచు కురుస్తూ ఉంటుందంట. మనం తినే తిండి ఉండదు. బ్రెడ్డు ముక్కలూ, పిజ్జా ముక్కలూ, బర్గర్లూ వీటితోనే కడుపు నింపుకోవాలి. నీకేమో చిన్న చలిగాలి వీచినా జలుబు చేసేస్తూ ఉంటుంది. నీ ఆరోగ్యం ఎక్కడ పాడైపోతుందో అనే బెంగ. నేను పెట్టే పచ్చళ్ళు, పులుసులు, బిర్యానీలు, కూరలు, పిండివంటలూ అంటే ఎంతో ఇష్టంగా తింటావు. నువ్వెళ్ళిపోతే అవన్నీ తినలేకపోతున్నావని నాకు బాధగా ఉండదా చెప్పు? వాటిని చేసినప్పుడల్లా నువ్వే కళ్ళలో మెదులుతావేమో...? తల్లి ఎప్పుడూ కొడుకు సంపాదన చూడదురా. కడుపు మాత్రమే చూస్తుంది" అంది కళ్ళు తుడుచుకుంటూ.


    "అమ్మా! నువ్వు మరీ అంత ఆలోచించకమ్మా. నేను ఒక్కడినే వెళ్లడం లేదు కదా. నా స్నేహితులం నలుగురు కలిసి వెళ్తున్నాం. నాకు వంట రాకపోయినా వారందరికీ వంట వచ్చు. వేళకు తింటాం. పడుకుంటాం. రోజూ వీడియో కాల్లో మాట్లాడతా కదా" అంటూ తల్లిని ఒప్పించి మరీ అమెరికా వచ్చేశాడు ఆనంద్.


   కానీ...ఎంత స్నేహితులతో వున్నా...ఏదో ఒక్కపూట తినీ, ఒక పూట తినక గడుపేస్తుంటే... అమ్మ చేతి వంటా, అమ్మ ప్రేమే మనసుని కెలికేస్తూ ఉందిప్పుడు ఆనంద్ కి.


  ఎందుకో ఆక్షణం అమ్మను చూడాలనిపించింది...

  వెంటనే తల్లికి వీడియో కాల్ చేసాడు ఆనంద్.

  ఇలాంటి కాల్స్ కొన్నాళ్లే. అక్కడ అలవాటైపోయాకా రాను రాను తగ్గిపోతాయన్న విషయం ఆనంద్ కి కూడా తెలీదు.

  కొడుకు ఫోన్ కాల్ కోసం ఆపిచ్చితల్లి ఎదురుచూపులు మాత్రం కొనసాగుతూనే ఉంటాయి. అమ్మ మనసు కదా...!!*

     


   


    


Rate this content
Log in

Similar telugu story from Inspirational