శానాపతి(ఏడిద) ప్రసన్నలక్ష్మి

Inspirational

4  

శానాపతి(ఏడిద) ప్రసన్నలక్ష్మి

Inspirational

కట్టుబాటు

కట్టుబాటు

2 mins
649


             కట్టుబాటు

            -శానాపతి(ఏడిద)ప్రసన్నలక్ష్మి


   అంతలా అరవడం ఆయన్నేప్పుడూ చూడలేదు. నేనూ, నాకూతురూ బిక్కసచ్చిపోయాం. 

   

   నిజానికి చాలా నెమ్మదస్తుడు మావారు. ఆయన పనేదో చూసుకుంటూ తలొంచుకుని వెళ్లిపోవడమే గానీ ఎవరినీ తలెత్తికూడా చూడరు. మాకు ఒకబ్బాయి, ఒకమ్మాయి. చూడముచ్చటైన కుటుంబం అని అందరూ అంటూ ఉంటారు. 


  అబ్బాయికీ, అమ్మాయికి వయసులో రెండేళ్లు తేడా. అబ్బాయి ముందు పుట్టినా అమ్మాయే పెద్దదానిలా కనిపిస్తుంది. ఆమధ్య కూతురు పెద్ద మనిషయ్యిందని చిన్న ఫంక్షన్ కూడా చేసి అపార్ట్మెంట్ లో అందరినీ పిలిచాము. అప్పటికీ ఇప్పటికీ మాఅమ్మాయిలో ఎంత మార్పు వచ్చేసిందో. ఆడపిల్లలు ఇట్టే ఎదిగిపోతారనిపించింది. 


   ఇంతకీ అసలు విషయం చెప్పలేదు కదా...బంధువుల ఇంట్లో పెళ్లి ఉందని..కూతురు ఇష్టపడినట్లు...నిన్న షాప్ కి వెళ్లి బట్టలు తీసాను. ఆ బట్టల విషయంలోనే నన్నూ, నాకూతురూ శ్రీలక్ష్మినీ కూడా గట్టిగా కేకలేసారు.


  ముందు ఆబట్టలన్నీ షాపులో మార్చేసిరాకపోతే అగ్గిపుల్ల వేసి తగలెట్టేస్తానని పెద్దపెద్ద కేకలు పెట్టారు. వాటిని చూడగానే అంతకోపం వచ్చింది ఆయనకు.


   "అసలు ఈ డాడీతో ఎలా మమ్మీ...? పాతకాలం బట్టలన్నీ వేసుకోమంటారు. మా ఫ్రెండ్స్ అంతా నన్ను చూసి నవ్వుతున్నారు. నాకు ఫ్యాషన్ గురించి తెలీదని. నాకెంత అవమానంగా ఉంటుందో తెలుసా అంది" కూతురు కళ్ళ నిండా నీళ్లు నింపుకుంటూ.


   కూతురు ఎదిరింపుతో మరింతగా కేకలేశారు నన్ను. "చూసావా? అదెలా సమాధానం చెప్తుందో? అదంతా నువ్విచ్చిన లోకువే. తల్లివై ఉండి ఎలాంటి బట్టలు వేసుకోవాలో, ఎలాంటి బట్టలు వేసుకోకూడదో నువ్వు కూతురికి చెప్పుకోవాల్సింది పోయి, ఇంట్లో ఎదిగిన కొడుకు వున్నాడన్న జ్ఞానం కూడా లేకుండా అది అడిగింది కదాని ఒంటిని సగం సగం కప్పే డ్రెస్సుల్ని నువ్వు మాత్రం ఎందుకు కొన్నావు...? దాన్ని ఫ్యాషన్ అనరు. బరితెగింపు అంటారు. జబ్బలు కనిపిస్తూ, ఒంటికి అతుక్కుపోయే బట్టలతో పెళ్ళంతా తిరుగుతూ ఉంటే, అందరిచూపులూ దానిమీదే ఉండటానికా?" అన్నారు చాలా జుగుప్సగా.


   "ఆగండి డాడీ! అలాగైతే శ్రీను మావయ్య పెళ్లికి నేను లంగా ఓణీ వేసుకున్నా గానీ అందరూ నన్నే చూసారు. పిలిచి మరీ పలకరించేవారు. ఇప్పుడు మాత్రం చూస్తే ఏమయ్యింది? అంటూ కూతురు ఎదురు ప్రశ్న వేసింది. 


  అమాయకంగా వేసిన దాని ఎదురుప్రశ్నకు నాకు పెదాలవరకూ నవ్వొచ్చినా చటుక్కున ఆపేసుకున్నాను.


  ఆయన మాత్రం శివ తాండవమే ఆడారు. "ఎందుకా? ఆ సాంప్రదాయమైన లంగా ఓణీలో నువ్వు లక్షణంగా కనిపించావు కాబట్టి, పద్దతిగా తెలుగుతనంతో ఉట్టిపడుతున్నావు కాబట్టి, చూసారు. ఆ చూపులో నిండైన గౌరవం ఉట్టిపడుతుంది."


   "ఇప్పుడీ చాలీ చాలని బట్టలు, ఒంటికి అతుక్కుపోయే డ్రస్సులతో ఉన్న నువ్వు బరితెగించావని నిన్ను వెకిలిగా చూస్తారే తప్ప, గౌరవంగా మాత్రం చూడరు.అది నీకిష్టమా చెప్పు?" అన్నారు ఆయన.


   మా కూతురికి ఏమర్థమయ్యిందో ఏమిటో...అక్కడ నుంచి మౌనంగా గదిలోకి వెళ్ళిపోయింది. 


   మర్నాడు ఆయనకు ఇష్టం లేని ఆబట్టల్ని మార్చేసి మంచి పట్టులంగా సెట్ కొనిచ్చి చక్కగా కుట్టించాను.


   బంధువుల పెళ్ళిరానే వచ్చింది...


   "ఎంతైనా...ఈరోజుల్లో ఇలా లంగా ఓణీలు ఎవరూ వేసుకోవడం లేదు. వసుధ మాత్రం తీరువుగా పెంచుతుంది. మన సాంప్రదాయపు కట్టుబాట్లు ఉట్టిపడేలా కూతుర్ని ఎంతో చక్కగా తీర్చిదిద్దుతుంది . చూడ్డానికి ఆపిల్లలో లక్ష్మీ కళ ఉట్టిపడుతుందనుకో." అంటూ చాలా మంది మా కూతుర్ని చూస్తూ ముచ్చటపడి మాట్లాడుకుంటూ, ఆక్రెడిట్ అంతా నాదే అనుకుంటున్నారు.


   వారి మాటలు మావారి చెవిన కూడా పడినట్టున్నాయి. గర్వంతో ఆయన ఛాతీ పొంగడం నాకళ్లకు బాగా తెలిసింది.ఆ పెళ్లి సందడిలో, కాళ్ళ కున్న మువ్వల పట్టీలు సవ్వడి చేస్తూ...ప్రేమగా మా ఇద్దరి మధ్యకూ వచ్చి కూర్చుంది మా అమ్మాయి శ్రీలక్ష్మి...!! 


(ఫోటో గూగుల్ నుంచి సేకరించింది)


   


   

   

   


Rate this content
Log in

Similar telugu story from Inspirational