కాశీవిశ్వనాధం పట్రాయుడు

Children Stories Inspirational

4  

కాశీవిశ్వనాధం పట్రాయుడు

Children Stories Inspirational

చిలుక చెప్పిన పాఠం

చిలుక చెప్పిన పాఠం

2 mins
14


చిలుక చెప్పిన పాఠం

***********************


ఒకరోజు శీనుగాడు విచారంగా గుమ్మం మీద కూర్చున్నాడు. "ఏమైందిరా శీను అలా ఉన్నావు" అని అడిగింది పెద్దమ్మ. "ఏం లేదు" అని ముఖం తిప్పేసుకున్నాడు శీను. జామ పళ్ళు తిందువుగాని రా! అని పెరట్లో ఉన్న జామచెట్టు దగ్గరికి తీసుకువెళ్ళింది. ఆ చెట్టుమీద ఉన్న చిట్టి చిలకమ్మ శ్రీనుని చూడగానే “ తియ్యని జామపండు ఇస్తాను తింటావా” అని అడిగింది. మాట్లాడే చిలుకను చూసి ఆశ్చర్యపోయాడు శీను. చిలుక శ్రీనుకి ఎన్నో కబుర్లు చెప్పింది. పాటలు నేర్పింది. అలా వారిద్దరి మధ్య స్నేహం చిగురించింది. ఒకరోజు సాయంత్రం బడి నుంచి ఏడుస్తూ పెద్దమ్మ ఇంటికి వచ్చాడు శీను. అది చూసిన చిలుకమ్మ “ఎందుకు ఏడుస్తున్నావు శీను?” అని అడిగింది. “బడిలో చెప్పిన పాఠాలు అర్థం కావడం లేదు, లెక్కలు అంటే భయం వేస్తోంది” అని చెప్పాడు. “ ఓస్ అంతేనా ఆ మాత్రం దానికే ఏడుస్తూ కూర్చుంటే చదువు వస్తుందా?” అంటూ పాటలతో పాఠాలు చెప్పడం మొదలుపెట్టింది. ఆటలతో లెక్కలు నేర్పింది. వేళ్ళమీద ఎక్కాలు చెప్పింది. కాకి తెచ్చిన ఆకులతో, కోతి తెచ్చిన పళ్ళతో, ఉడుత ఇచ్చిన విత్తనాలతో నేలమీద అక్షరాలు రాయించింది. పదే పదే వల్లె వేయించి పద్యాలను కంఠస్థం చేయించింది. ఆనందంగా ఆడుతూ, పాడుతూ ఆసక్తిగా నేర్చుకున్నాడు. కొన్నాళ్ళకి శీనుగాడు అన్నిటిలో తోపు అయ్యాడు. లెక్కలంటే భయం పోయింది. చదువు మీద ఆసక్తి పెరిగింది. శీను ధైర్యంగా బడికి వెళ్ళాడు. ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలు విన్నాడు. వారు అడిగే ప్రశ్నలకు తడుముకోకుండా సమాధానాలు చెప్పాడు. తరగతిలో ప్రధముడిగా నిలిచాడు. శ్రీను తెలివికి ఉపాధ్యాయులంతా ఆశ్చర్యపోయారు. జరిగిన విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. పెద్దమ్మ పెరట్లో చెట్టుమీద ఉన్న చిలుకమ్మ చెంతకు చేరారు. ఆటపాటల ద్వారా చెప్పే చిలకమ్మ పాఠాలు విన్నారు. అందులో ఉన్న గమ్మత్తుని గ్రహించారు.పాఠశాలలో విద్యార్థులకు ఆటపాటల ద్వారా కృత్యధార బోధనచేసారు. పిల్లలంతా ఎగిరే పక్షుల్లా, రంగు రంగుల సీతాకోక చిలుకల్లా, గల గలపారే సెలయేరులా, హరివిల్లులా హాయిగా, స్వేచ్చగా, ఆనందంగా నేర్చుకున్నారు. ఆకాశమే హద్దుగా ఆలోచించడం మొదలు పెట్టారు. ఎగిరే గాలిపటంలా ఊహలకు రెక్కలు తొడిగారు. ప్రతీ సాయంత్రం పెద్దమ్మ ఇంట్లో చెట్టుకింద కూర్చుని చిలుకమ్మ చెప్పిన కథలు వింటూ, పాటలు పాడుతూ, పిల్లలంతా సరదాగా గడిపారు. శీను లో మార్పుని చూసి పెద్దమ్మ పొంగిపోయింది . 


(ప్రజాశక్తి దినపత్రిక చిన్నారి శీర్షికలో 8-12-2023 న ప్రచురితమైంది.)


Rate this content
Log in