కాశీవిశ్వనాధం పట్రాయుడు

Children Stories

4  

కాశీవిశ్వనాధం పట్రాయుడు

Children Stories

పన్నెండులో మూడు తీస్తే సున్నా

పన్నెండులో మూడు తీస్తే సున్నా

2 mins
5


పన్నెండు లో మూడు తీస్తే సున్న

******************************


ఆరోజు ఆదివారం అయినా రుద్ర అలికిడి లేదు. పెద్దమ్మ కి ఏమి ఊసుపోలేదు. సాయంకాలం అయింది. రుద్ర పెద్దమ్మ దగ్గరికి వచ్చాడు.


"ఉదయం నుంచి కనపడలేదు ఎక్కడికి వెళ్లావురా రుద్రా?." అని అడిగింది పెద్దమ్మ.


"మా అమ్మ చదువు కోడానికి నారాయణ రావు పంతులు గారి ఇంటికి వెళ్ళమంది. ఇప్పటి దాకా పంతులు గారి ఇంటిదగ్గర చదువుకుని ఇప్పుడే వస్తున్నాను." అన్నాడు రుద్ర.


"ఏమేమి నేర్చుకున్నావ్!" అని ఆరా తీసింది పెద్దమ్మ. 


"ఏంటో పెద్దమ్మా! ఉదయం నుంచి చైత్రం, వైశాఖం, అంటూ తెలుగు నెలల పేర్లు, అశ్వని, భరణి అంటూ నక్షత్రాల పేర్లు వల్లె వేయించారు. ఆఖర్లో ‘పన్నెండు లోంచి మూడు తీసివేస్తే ఎంత?’ అని అడిగారు పంతులుగారు. నేను ‘తొమ్మిది’ అని సమాధానం చెప్పాను. కాదు ‘సున్న’ అన్నారు. పంతులు గారికి లెక్కలు రావు పెద్దమ్మా." అన్నాడు రుద్ర.


రుద్ర మాటలు విని ఫక్కున నవ్వింది పెద్దమ్మ.


"ఎందుకలా నవ్వు తున్నావ్?" అని అడిగాడు రుద్ర.


"నీ ముదురు మాటలు వింటే ఎవరికైనా నవ్వొస్తుంది. పన్నెండు లోంచి మూడు తీస్తే సున్న.

పంతులు గారు చెప్పింది నిజమే" అంది పెద్దమ్మ.


"అదెలా!" ఆశ్చర్యంగా అడిగాడు రుద్ర.


"సంవత్సరానికి ఎన్ని నెలలో నీకు తెలుసా?” అని అడిగింది పెద్దమ్మ.


“పన్నెండు.” అని ఠక్కున సమాధానమిచ్చాడు.


“వాటిలో ఆషాఢ, శ్రావణ, భాద్రపద మాసాలు అత్యంత కీలకమైనవి.” అంది పెద్దమ్మ.


“ఎందుకో చెప్పవా!” అని అడిగాడు రుద్ర.


“‘మృగశిర లో కురిస్తే ముసలి ఎద్దు రంకె వేస్తుందని’ సామెత. రైతులు పొలాలకు ఎరువు వేసి, దుక్కి దున్ని నారు కోసం విత్తనాలు చల్లుతారు. తొలకరి వానతో నారుపుట్టి ఏపుగా పెరుగుతుంది. తరువాత ఉభాలు ప్రారంభమవుతాయి. ‘కలుపు తీయని మడి దేవుడు లేని గుడి ఒకటే’ అన్నారు. పంట బాగా పండాలి అంటే కలుపు తీయాలి. వర్షాలు బాగా పడితే పంట బాగా పండుతుంది. ఈ మూడు నెలల్లో వర్షం పడక పోతే పంట చేతికి రాదు. మనకి తిండి ఉండదు. పన్నెండులో మూడు తియ్యడమంటే ఇదే. వర్షాకాలం ప్రాధాన్యతని ఒక లెక్కలా చెప్పారు మీ నారాయణ రావు పంతులు గారు.” అని వివరించింది పెద్దమ్మ.


“ఓహో ఈ లెక్క వెనుక ఇంత అర్థముందా!” అని నోరెళ్ళబెట్టాడు రుద్ర.


నోట్లో రాగిలడ్డు కుక్కింది పెద్దమ్మ.


(ప్రజాశక్తి చిన్నారి 19-3-2024)


Rate this content
Log in