కాశీవిశ్వనాధం పట్రాయుడు

Children Stories

3  

కాశీవిశ్వనాధం పట్రాయుడు

Children Stories

నీటిమీద రాతలు

నీటిమీద రాతలు

2 mins
8


నీటిమీద రాతలు

****************


పుణ్యగిరి గ్రామం లో హరి, సౌమ్య దంపతులు నివసిస్తూ ఉండేవారు. వారి కొడుకు పేరు రుద్రాంశ్. ముగ్గురు కలిసి ఒక ఆదివారం సాయంత్రం విశాఖ సముద్ర తీరానికి వెళ్ళారు. సముద్ర తీరమంతా పర్యాటకులతో రద్దీగా ఉంది. జొన్నపొత్తులు, తినుబండారాలు ఎక్కడికక్కడే అమ్ముతున్నారు. చూసిన ప్రతీదీ కొనమని పేచీ పెట్టాడు రుద్రాంశ్. వాడిని మాటల్లో పెట్టి మరిపించింది సౌమ్య. అలా కొంతదూరం నడిచాక

ఎగసిపడే అలలను చూస్తూ, చల్లని గాలిని పీలుస్తూ సముద్రపు ఒడ్డున కూచున్నారు ముగ్గురూ. దూరంగా సముద్రం లో పడవలు కనిపించాయి. అవి ఎక్కుతానని మారాం చేశాడు రుద్రాంశ్. "నువ్వు పెద్దవాడిని అయ్యాక ఎక్కుదువు గాని" అని సముదాయించి జొన్నపొత్తు కొని తెచ్చాడు హరి. అలలను చూడటంలో నిమగ్నమైన రుద్రాంశ్ తండ్రి రాకను గమనించలేదు. అలలు పాదాల దగ్గర వరకు వచ్చి మళ్లీ సముద్రం లోకి వెళ్లి పోయాయి. అలా అలలు రావడం వెనక్కి వెళ్ళిపోవడం ఎంతో విచిత్రంగా అనిపించింది రుద్రాంశ్ కి.. అల వెనక్కి వెళ్ళిపోగానే తడి ఇసుకలో తన పేరు రాసుకున్నాడు రుద్రాంశ్. ఇంతలో అల వచ్చింది. ఆ అలల తాకిడికి రుద్ర రాసిన పేరు చెరిగిపోయింది. మళ్లీ రాశాడు. మళ్లీ అల వచ్చి కొట్టుకుపోయింది. అమ్మ పేరు, నాన్న పేరు రాశాడు. నువ్వు వచ్చావంటే కొడతానన్నాడు. అయినా అల రావడం మానలేదు. రుద్రాంశ్ కి ఏడుపొచ్చింది. అలల మీద కోపమొచ్చింది. కొడుకుని చూసి ముసిముసిగా నవ్వుకున్నారు హరి, సౌమ్య. 


"ఎందుకలా నవ్వుతున్నారు?" అని అడిగాడు రుద్రాంశ్.


 "వీటినే నీటిమీద రాతలు అంటారు" అంది సౌమ్య.

"అంటే"

"నువ్వు రాసిన రాతలు నీటివల్ల ఎలా చెరిగిపోయాయో అలాగే కొంతమంది చెప్పిన మాటలు కార్యరూపం దాల్చవు. అలాంటి సందర్భంలో ఈ సామెత వాడుతారు. ఇందుకు ఉదాహరణగా ఒక విషయం చెప్తాను విను. పూర్వం నారాయణపురం లో  పేదరాశి పెద్దమ్మ అనే పూటకూళ్లవ్వ ఉండేది. ప్రతీ రోజూ ఆమె ఇంటికి ఎంతోమంది యాత్రీకులు, బాటసారులు వచ్చి తృప్తిగా భోజనం చేసి వెళ్లేవారు. ఎవరికి తోచిన సాయం వారు చేసేవారు. శివపురికి చెందిన వరహాలు శెట్టి అనే వ్యాపారి పరమ పిసినారి. వ్యాపార నిమిత్తం ప్రతీ వారం నారాయణపురానికి వచ్చి పని ముగించుకుని పూటకూళ్లవ్వ ఇంట్లో

భోజనం చేసి వెళ్ళేవాడు. వెళ్ళేటప్పుడు అవ్వా "ఈ సారి వచ్చేటప్పుడు కూరలు తెస్తానులే అని ఒకసారి, చింతపండు తెస్తానులే" అని ఒకసారి చెప్పేవాడు కానీ ఎప్పుడూ ఏదీ తెచ్చేవాడు కాదు. ఇచ్చేవాడు కాదు. విని విని విసిగిపోయిన పెద్దమ్మ ఓసారి "నీ వన్నీ నీటిమీద రాతలే" అంది. అప్పటి నుంచి చేస్తానని చెప్పిన పని చేయకపోయినా, ఇచ్చిన హామీ నిలబెట్టుకోకపోయినా, ఈ సామెత చెప్పేవారు. అలా ఈ సామెత వాడుకలోకి వచ్చింది.” అని చెప్పింది సౌమ్య. 


“బావుంది బావుంది” అన్నాడు రుద్రాంశ్ జొన్నపొత్తు తింటూ.


(లీడర్ దినపత్రిక లో29-3-24 న ప్రచురించబడింది.)


Rate this content
Log in