శానాపతి(ఏడిద) ప్రసన్నలక్ష్మి

Inspirational

4  

శానాపతి(ఏడిద) ప్రసన్నలక్ష్మి

Inspirational

ఎదురుచూపు

ఎదురుచూపు

2 mins
338


             ఎదురుచూపు

          -శానాపతి(ఏడిద)ప్రసన్నలక్ష్మి


  కార్తీక్ ఆలోచిస్తున్నాడు...!

   

  సంధ్యతో పెళ్ళై రెండుసంవత్సరాలు అయ్యింది...! ఇద్దరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా ఉద్యోగం చేసి ఎంత సంపాదిస్తున్నా... నెల గడిచేసరికి...వెనకేసుకున్నదేమీ కనిపించట్లేదు. ఈ ఐటీ ఉద్యోగాలు ఉంటాయో ఊడతాయో తెలీదు. ఏం సంపాదించినా ఉద్యోగంలో ఉన్నంత వరకే. ఆతర్వాత పెన్షన్స్ లాంటివేమీ వచ్చేది లేదు గనుక...ఏం చేసినా ఇప్పుడే ఏదో ఒకటి చేసి బాగా సంపాదించుకోవాలి...అనుకున్నాడు దృఢంగా.


   మనసులో ఎన్నో కోరికలు....

    

   ఎంతలేదన్నా...ఉండటానికి మంచి ఫ్లాట్ కొనుక్కోవాలి. తిరగడానికి ఓ కార్ కొనాలి. బాబుని మంచి స్కూల్లో వేయాలి. ఇవన్నీ...లక్షల్లో కూడుకున్నవే. ఎంతో సంపాదిస్తేనే గానీ...ఇవి తీరేవి కాదు. లోన్ పెట్టుకుని కొనుక్కుందామనుకున్నా... ఒకళ్ళ జీతం అప్పులకు కట్టేస్తే...రెండో వాళ్ళ జీతంతో సరిపెట్టుకోవాలి. మళ్లీ అది సాధ్యమవుతుందో లేదోనని భయం. కోరికలు చంపుకోలేని జీవితం. భవిష్యత్తులో యే ఇబ్బంది లేకుండా ఉండాలంటే...అమెరికా వెళ్ళిపోయి బాగా సంపాదించుకు రావాలి...ఈ ఆలోచన సబబుగా అనిపించింది కార్తీక్ కి.


   "సంధ్యా...మనం అమెరికా వెళ్లిపోదామా'...? భార్యను సడన్ గా అడిగేసరికి అదిరిపడింది. 


   అదేంటి కార్తీక్....నీకేమైనా మతిపోయిందా...? నీకూ పేరెంట్స్ వున్నారు...నాకూ పేరెంట్స్ వున్నారు. వీళ్ళను వదిలేసి...అమెరికా వెళ్లకపోతే ఏంటి...? పైగా బాబుకి కూడా నెలల వయసు"...భర్త మాటను పెద్దగా పట్టించుకోలేదు సంధ్య. 


   "నేను చెప్పేది కూడా విను సంధ్యా. చూస్తూనే ఉన్నావు కదా..మనిద్దరం ఉద్యోగం చేస్తున్నా...ఈ హైదరాబాద్ సిటీలో ఇంటద్దెకు, ఇంటి మైంటైనెన్సు , క్యాబ్ లకూ, బండి పెట్రోళ్లకూ , వారంలో ఒకరోజు మన సరదాలకు తక్కువేమీ అవ్వడం లేదు. ఇప్పుడు బాబు పుట్టాకా వాడి ఖర్చు కూడా పెరిగింది. ఇంకో రెండేళ్లు పోతే లక్షల్లో డొనేషన్ కడితేనే వాడికి స్కూల్లో సీటు వచ్చేది. ఇప్పడు తండ్రిగా వాడి బాధ్యత కూడా నాకు పెరిగింది. వాడికి యే లోటూ రాకుండా పెంచుకోవాలని నాన్నగా నా మనసెందుకో తాపత్రాయపడుతుంది. మనం జీవితంలో మంచిగా స్థిరపడాలంటే...ఓ ఐదేళ్లు అక్కడ ఉండి వచ్చేద్దాం. ఎంతైనా రూపాయిలకూ డాలర్లకూ తేడా ఉంటుంది కదా"...అంటూ భార్యలో కూడా ఆశ చూపించాడు. 


   అనుకున్నది సాధించాడు కార్తీక్. అమెరికాలో ఒక కంపెనీలో పనిచేయడానికి వీసా సంపాదించాడు. ముందుగా తానెళ్లి ఒక ఆరు నెలలు పోయాకా భార్యా బిడ్డని తీసుకెళ్లాలని అనుకున్నాడు. ప్రయాణం రోజు రానే వచ్చింది. సంపాదన కోసం వెళ్లాలని ఉబలాటపడ్డాడు గానీ...అందర్నీ విడిచివెళ్తుంటే మనసెంతో భారంగా అయిపోయింది. 


   కార్తీక్ అమెరికా వెళ్లి ఆరునెలలయ్యింది. లక్షల్లో సంపాదన. భార్యా బిడ్డకు వీసా కోసం డాక్యుమెంట్స్ పంపించాడు. ఇంకో ఇరవైరోజుల్లో వీసా ఇంటర్వ్యూ అనగా....అనుకోని ఆపద ఈదేశాన్నే కాదు...ప్రపంచాన్ని చుట్టేసింది. వీసాలు ఆపేయడమే కాదు....విదేశీ విమానాలతో సహా...మొత్తం ట్రాన్స్పోర్ట్ ఆపేశారు. ఎక్కడి వాళ్ళక్కడే అంటూ లాక్డౌన్ విధించారు. జనజీవనం స్థంభించిపోయింది. మహమ్మారి కరోనా అన్ని కుటుంబాల్లో కల్లోలం సృష్టించింది.


  ఎప్పుడు ఎవరికి ఎగబాకుటుందో తెలీని వైరస్ నుంచి తప్పించుకోడానికి గృహానిర్బంధాలు తప్పనిసరి అవుతున్న తరుణం....


  కార్తీక్ మనసు మనసులో లేదు...డబ్బు బాగా సంపాదిస్తున్నాను అనుకున్నంతలో...ఈ కరోనా నుంచి తాను కాపాడుకోవడం ఎలా వున్నా...ఇండియా లోని భార్యా బిడ్డ మీదే కాదు... తల్లిదండ్రుల మీద కూడా బెంగ మొదలయ్యింది. అక్కడ వాళ్ళు ఏమైపోతారో అని. ఎంత ఫోన్లో మాట్లాడుతున్నా...వీడియో కాల్స్ చేస్తున్నా...తృప్తి కనిపించడం లేదు. పిల్లవాడు కూడా ఎదిగిపోతూ...వాడి ముద్దుముచ్చట్లకు దూరం అయిపోతున్నాడు. ఇప్పట్లో కరోనా అంతమవ్వదు...భార్యా బిడ్డకు వీసా కూడా వచ్చే పరిస్థితి ఎప్పుడో...? అప్పటి వరకూ ఒంటరిగా భయంతో చస్తూ బ్రతకడం నావల్ల కాదనుకున్నాడు.


    కార్తీక్ ఆలోచన మారింది...

    

   సంపాదనకంటే అనుబంధాలు ముఖ్యమనుకున్నాడు. 

మనిషిని చంపడానికి వెంటాడుతూ పరిగెట్టిస్తున్న రోజులు వచ్చాయి. మనిషి ప్రాణం కంటే విలువైనది ఏదీ లేదు. లగ్జరీస్ మాట దేవుడెరుగు. ఆరోగ్యంగా ఉన్నప్పుడే...జీవనం సజావుగా సాగేది. బ్రతికుంటే బలుసాకైనా తినొచ్చని...తిరిగి ఇండియా వెళ్లిపోవాలనే నిశ్చయానికొచ్చాడు. తనబిడ్డను ఎప్పుడెప్పుడు గుండెలకు హత్తుకుందామా అని....విదేశీ విమానాలు ఎప్పుడెప్పుడు ఎగురుతాయా అనే ఎదురుచూపులో వున్నాడు ఆపిచ్చి నాన్న. 

    

    కార్తీక్...తనలో తనే నవ్వుకుంటున్నాడు...

    

   2019 లో వచ్చిన ఆలోచనలు...2020 లో  మారిపోయినందుకు. ఒక్కోసారి కొన్ని ఆలోచనలు ముళ్లదారివైపు నడిపించినా....మరికొన్ని పూలబాటవైపే స్వాగతం పలుకుతాయి. 


   ఎందరో జీవితాల్లో... నాన్నలు దగ్గరయ్యారంటే.... ఈమార్పుకి కరోనా లాక్డౌన్ ఉపకారమే చేసిందేమో...!!*


           ***       ***      ***


 


   


    


    


    


    


    


    


   


Rate this content
Log in

Similar telugu story from Inspirational