Nageswara Rao NDSV

Comedy Drama Inspirational

4.5  

Nageswara Rao NDSV

Comedy Drama Inspirational

ఎగతాళి

ఎగతాళి

3 mins
426


"రెక్కలు ఉన్నాయి కానీ పక్షి కాదు. వేళ్లాడుతుంది గానీ గబ్బిలం కాదు. ఏంటో చెప్పుకోండి చూద్దాం." కన్నబాబు వాళ్ళ ఇంట్లోకి వస్తూనే పొడుపు కథ విసిరాడు కూర్మారావు. అతని యిల్లు కన్నబాబు ఇంటి వీధి చివరలో ఉంటుంది.


"రెక్కలు ఉండి కూడా, మా మీద వేళ్లాడిపోయేది ఇంకెవరు మీరే" విసుక్కున్నాడు కన్నబాబు.


"మీరు మరీ సార్! జోకులన్నీ నామీదే వేస్తారు."

"నా మీద నేను జోకులేసుకునేంత వెర్రివాడిని కాదు. అందుకే మీ మీద వేశాను."

"అవన్నీ నేను పట్టించుకోనండి. ఇంతకీ నా పొడుపు కథకు సమాధానం చెప్పలేదు మీరు."

"నాకు అంత ఓపిక లేదండి. అయినా మీరు అడుగుతున్నారు కాబట్టి, రెక్కలు ఉన్నాయంటున్నారు, వేళ్లాడుతుంది అంటున్నారు కాబట్టి, దానికి సమాధానం రోజూ ఉదయాన్నే మా ఇంటి మీద వాలిపోయే మీరు కాకపోతే, వారానికి ఒకసారి వాలిపోయే మా బామ్మర్ది."


"అబ్బబ్బ, ఇటు తిరిగి అటు తిరిగి మా వాళ్ల మీద పడతారేం?" కోపంగా అరిచింది కన్నబాబు భార్య శోభ.

"నేనేం అనలేదే. ఆయన ఏదో ప్రశ్న అడిగాడనీ, సమాధానం చెప్పకపోతే వదలడనీ, మీ తమ్ముడి పేరు చెప్పాను. అంతే."

"ఇలా పనికిరాని ప్రశ్నలు అన్నిటికి మేం గుర్తు వస్తాం. అదే మంచి విషయం అయితే మేము గుర్తు రాము."

"అమ్మా, చెల్లెమ్మా! అటు తిప్పి, ఇటు తిప్పి, నా ప్రశ్నలు పనికిరానివి అని మీ మొగుడు పెళ్ళాలు తేల్చేశారు."

"అబ్బే మీరు పనికిరారనీ, మీ ప్రశ్నలు పనికిరావనీ, మేం అనలేదండి బాబూ...."

"మీరు ఏమనుకున్నా, నా ప్రశ్నకు జవాబు చెప్పేదాకా నేను వదలనుగా."

"ప్రశ్నకి జవాబు చెప్పేదాకా వదలరా, లేక కాఫీ టిఫిన్ అయ్యేదాకా వదలరా."

"కన్నబాబు గారు మరీ చతుర్లు వేస్తారు. ఇట్టే పట్టేస్తారు విషయం."


"సరి సర్లెండి. ఇది రోజూ ఉన్న విషయమే కదా. ఏదో ఒక పొడుపు కథ పట్టుకుని రావడం, కాఫీ టిఫిన్ అయ్యేదాకా కాలక్షేపం చేయడం, ఆ తర్వాత జవాబు చెప్పకుండా పారిపోవడం. ఏరోజైనా ఒక్క ప్రశ్నకి మీరు సమాధానం చెప్పారా?"

"అయ్యా! తెలిస్తే మిమ్మల్ని ఎందుకు అడుగుతాను చెప్పండి. ఎవరో నన్ను అడుగుతారు. అబ్బో, మీరు చాలా తెలివైన వాళ్ళు అని చెప్పి, నేను మిమ్మల్ని అడుగుతాను. మీరేమో అడ్డదిడ్డంగా జవాబులు చెప్పి, నన్ను వెర్రి వాడిని చేసి, పక్కకి తప్పుకుంటారు."

"అంటే ఏంటి మీ ఉద్దేశ్యం? నేను తెలివి లేని వాడిననా, లేక తెలివి లేదు అన్న విషయం తెలియకుండా ఉండడానికి తప్పించుకు తిరుగుతున్నానని మీరు అంటున్నారా?"


"అయ్యా ఒక్క పది నిమిషాలు టిఫిన్ పూర్తయ్యేదాకా మాట్లాడదల్చుకోలేదండి."


"అవున్లెండి. నా ప్రశ్నకు ఇప్పుడు మీరు సమాధానం చెప్తే, దానికి నాకు గనుక కోపం వస్తే, ఎక్కడ టిఫిన్ ప్లేటు లాగేసుకుంటానో అని మీ భయం."

"ఎంతైనా మీరు ఊహు ఆహా యే నండీ."

"మళ్లీ ఇదేంటి?"

"అబ్బే అదే చెప్పాను కదా. టిఫిన్ చేసేటప్పుడు మాట్లాడకూడదు అని....."

.......

.......

"ఓకే మీ ప్రశ్నకి నేను సమాధానం చెప్పలేదు కానీ, నా ప్రశ్నకు సమాధానం చెప్పండి. తాను కరిగిపోతున్నా, మంచి పంచి పెడుతూ, అంతరించిపోతుంది. ఏమిటది?" అడిగాడు కన్న బాబు.

"అయ్యా, ఇట్టే చెప్పేస్తాను. ఇప్పుడే మీ ఫ్రిడ్జ్ లోంచి తీసి యివ్వగా, నేను తింటున్న యీ ఐస్క్రీమ్."

"మీ తిండి బుద్ధి పోనిచ్చుకున్నారు కాదు. నేను అడిగిన ప్రశ్నకి సరైన సమాధానం కొవ్వొత్తి. అంటే నాలాంటిది అన్న మాట. జేబులో డబ్బు కరిగిపోతున్నా, అందరికీ పంచి పెడుతూ, అంతరించిపోతారే, నాలాంటి వాళ్ళు."


"ఓహో! అలా దెబ్బ కొట్టారన్న మాట. సరేలెండి బాబు. నేను అడిగిన ప్రశ్నకు కూడా ఈరోజు సమాధానం చెప్పేస్తా. రెక్కలున్నాయి గాని పక్షి కాదు, వేళ్లాడుతుంది కానీ గబ్బిలం కాదు, అంటే నేనూ, మీ బామ్మర్దీ కాదండీ బాబు, మీ ఇంట్లో వేళ్లాడుతున్న ఫ్యాన్." చెప్పాడు కూర్మారావు.


"సరే సరే. మీరు మీరు కబుర్లు చెప్పుకోవడమే, నాతో పనులు చేయించుకోవడమే. నేనూ అడుగుతాను ఓ పొడుపు కథ. జవాబు చెప్పండి" అంది శోభ.

"అడుగమ్మా చెల్లాయి. తెలిస్తే చెప్పేస్తాం. తెలియకపోతే తెలియదు అని ఒప్పేసుకుంటాం" అన్నాడు కూర్మారావు.

"తాళికాని తాళి ఏమిటది చెప్పండి చూద్దాం."


"ఇంకేముంది ఎగతాళి. ఇప్పుడు మీరు చేస్తున్నారే అదే. కానీ, ఒక విషయం ఒప్పుకోవాలి. ఎవరూ లేక, ఒంటరిగా మిగిలిన నాకు ఉదయాన్నే ఇంత టిఫిన్ చేసి పెట్టడం కడుపుకి సంతృప్తి కలిగిస్తోంది. అదే సమయంలో, పిల్లలు దూర తీరాల్లో సెటిల్ అయ్యి, వాళ్ళు రాక తల్లడిల్లి పోతూ, తిండి తిప్పలు మానేసిన మీ జంట, నా కోసం బలవంతం గానే అయినా శ్రద్ధగా వండుకొని తినడం మనసుకి సంతృప్తి కలిగిస్తోంది. ఈ జీవితానికి యిది చాలు. మన సంభాషణ ఎదుటి వారికి వింతగా అనిపించినా, మీ మాటలు రేపటి వరకు నాకు జీవితం పై ఆశను నిలబెడతాయి. కాబట్టి, ఇదే ఇంట్లో మరో పొడుపు కథతో రేపు కలుద్దాం. అంత వరకూ సెలవు. మీ కూర్మారావు."


ముగ్గురూ చిరు నవ్వులు నవ్వుకుంటూ ఎవరి పని లోకి వాళ్ళు వెళ్ళిపోయారు.



Rate this content
Log in

Similar telugu story from Comedy