RAMYA UPPULURI

Tragedy Inspirational Children

4  

RAMYA UPPULURI

Tragedy Inspirational Children

ఎప్పుడూ మన స్వార్థమే ముఖ్యమా

ఎప్పుడూ మన స్వార్థమే ముఖ్యమా

3 mins
320


"నానమ్మ ఆస్తి ఒద్దు అన్నావుట, నిజమేనా శ్యామలా !!"


అనడిగింది తన బాబాయి కూతురు ప్రియ.


"అవును ఒద్దన్నాను."


అన్నది శ్యామల.


"అదే ఎందుకు వద్దు అన్నావు ?"


అని అడిగింది ప్రియ.


"కారణం మీకు తెలుసు కదా !! తెలిసి కూడా మళ్ళా ఎందుకు అడుగుతున్నావు ?"


అన్నది శ్యామల కాస్త ఇబ్బందిగా.


"తెలుసు, కానీ అప్పుడు నువ్వు చెప్తూ ఉంటే, ఏదో మాట వరుసకు అన్నావు అనుకున్నాము తప్ప, నిజంగా చేస్తావు అనుకోలేదు.


అందుకే ఆశ్చర్యంగా అనిపించి, మళ్ళీ అడుగుతున్నాము."


అన్నది ప్రియ.


"ఇందులో ఆశ్చర్యం ఏముంది ? నేను చెప్పిందే చేస్తాను. తొంభై శాతం నా మాటలు చేతలు ఒకటేలా ఉండేలా చూసుకుంటాను. ఒక పది శాతం అటూ ఇటూ అవ్వొచ్చు ఏమో కానీ, ఎక్కువ శాతం మాత్రం చెప్పింది చేయడమే నాకు అలవాటు."


అన్నది శ్యామల.


"నీలా ఎవరూ ఆలోచించరు శ్యామలా !! నువ్వు అనవసరంగా ఎక్కువ ఆలోచిస్తున్నావు. అంత అవసరం లేదు. నలుగురూ ఎలా ఉంటే, నువ్వూ అలా ఉండటం అలవాటు చేసుకో.


అయినా మేము అందరం ఒక మాట మీద ఉన్నప్పుడు నువ్వు మాత్రం ప్రత్యేకంగా ఉండాల్సిన అవసరం ఏముంది ? అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకోవచ్చు కదా !!"


అన్నది ప్రియ.


"ఇదే మాట నేను ఆ రోజు అడిగినప్పుడు మీరు ఎవరూ కాదు అన్నారు కదా !!


ఆ రోజు మన అమ్మానాన్నలు బామ్మను వృద్ధాశ్రమంలో పెడుతూ ఉంటే, ఒద్దు అని చెప్పమని మీ అందరినీ నేను ఎంతో వేడుకున్నాను.


కానీ, మీలో ఒక్కరు కూడా నా మాటను ఒప్పుకోలేదు.


మీ తల్లిదండ్రులు చేస్తున్నది తప్పని చెప్తే, మీకు, మీ తల్లిదండ్రులకు ఉన్న బంధం ఎక్కడ ఇబ్బంది పడుతుందో అన్న భయంతో, ఒక్కరు కూడా బామ్మ తరపున మాట్లాడలేకపోయారు.


పాపం ఆ పిచ్చి తల్లి, ఏమీ చదువుకోలేదు కనుక, తన పిల్లలు చెప్పింది ప్రతీదీ నమ్మి మోసపోయింది. తాతయ్య తన బాధ్యతలు తీరగానే, సంతోషంగా, ప్రశాంతంగా, బామ్మను ఒక్క దానిని ఈ లోకంలో వదిలిపెట్టి తను చక్కగా స్వర్గానికి వెళ్ళిపోయాడు.


తాతయ్య పెన్షన్ బామ్మకు వస్తుంది కనుక, ఏనాడూ ఆమె డబ్బుకు ఇబ్బంది పడాల్సిన అవసరం రాలేదు. కానీ డబ్బు ఒక్కటే ఉంటే సరిపోదు కదా !!


అందులోను బామ్మ చదువుకోలేదు. పుట్టినప్పుడు తల్లిదండ్రులు చెప్పినట్టు విన్నది. పెళ్ళి అయ్యాక, అత్తమామలు, భర్త చెప్పినట్టు నడుచుకుంది. ఆ తరువాత కొడుకులు, కూతుళ్ళు, కోడళ్ళు చెప్పినట్టు నడుచుకుంది. చివరికి మనవరాళ్ళ మయిన మనం చెప్పినట్టు కూడా విన్నది.


ఇలా తనని అవసరానికి తగ్గట్టుగా అందరం ఉపయోగించుకున్నామే తప్ప, ఒక్కరం కూడా తనకు ఉపయోగపడలేదు.


చివరికి తన డబ్బు అంతా కొడుకులు, కూతుళ్ళు తీసుకొని తనని వృద్ధాశ్రమంలో పెడుతూ ఉంటే, ఇంత మంది మనవరాళ్ళం ఉండి కూడా చూస్తూ ఊరుకున్నామే తప్ప, ఒక్కరం కూడా మన తల్లిదండ్రులకు ఎదురు చెప్పలేకపోయాము.


ఆ రోజున, నేను మీ అందరినీ ఎంతో బ్రతిమాలాడాను, బామ్మను వృద్ధాశ్రమంలో పెట్టకుండా అడ్డుకుందాము అని. కానీ, మీలో ఒక్కరు కూడా నా వెంట రాలేదు. నా ప్రయత్నంలో నేను ఓడిపోయాను. మీ అందరూ కలిసి గెలిచారు. బామ్మను వృద్ధాశ్రమంలో పెట్టేశారు.


ఆ రోజు వృద్ధాశ్రమంలో బామ్మ చూసిన చూపు, నాకు ఇవాళ్టికీ గుర్తు ఉంది. నన్ను ఇంటికి తీసుకు వెళ్ళమని మీ నాన్నకు చెప్పమ్మా అని ఎన్నిసార్లు అడిగిందో తెలుసా !!


ఆ రోజే నాకు మొదటి సారి తాతయ్య మీద చాలా కోపం వచ్చింది. తను ఈ లోకాన్ని విడిచి వెళ్ళేటప్పుడు, తనతో పాటు బామ్మని ఎందుకు తీసుకెళ్లలేదు అని అడగాలి అనిపించింది.


అందుకే ఆ రోజే నిర్ణయించుకున్నాను. బామ్మకు నేను ఎటువంటి సహాయం చేయలేక, చాలా పెద్ద తప్పు చేసేను. అటువంటిది రేపు బామ్మ తదనంతరం, తన ఆస్తిలో నాకు వచ్చే వాటాని తీసుకొని మరో తప్పు చేయకూడదు అనుకున్నాను.


అయినా ఆ రోజు, బామ్మ సమస్యలో ఉన్నప్పుడు, ఎవరి స్వార్థాన్ని వారు చూసుకొని, ఆ సమస్యను పరిష్కరించడానికి మీరెవ్వరూ ఒకటి కాలేకపోయారు.


కానీ, ఇవాళ మళ్ళా అదే స్వార్థంతో, బామ్మ ఆస్తి పంచుకోవడానికి మాత్రం మీరందరూ ఒకటయ్యారు.


మీరు ఒకటయి ఇలాంటి తప్పు చేస్తోంది కాక, ఆ తప్పులో నేను భాగస్వామిని కానందుకు నన్ను తప్పు పడుతున్నారు.


ఇదెక్కడి న్యాయం ? మీరే ఆలోచించండి."


అంటూ ఏడుస్తూ తన ఆల్బమ్ లో ఉన్న బామ్మ ఫోటో దగ్గరకు వెళ్ళి,


"బామ్మా, నువ్వంటే నాకు చాలా చాలా ఇష్టం. నాకు నువ్వెన్నో చేసేవు. కానీ నేను తిరిగి నీకు ఏమీ చేయలేకపోయాను. నేను ఎంతో ప్రయత్నం చేసేను. కానీ నీ పిల్లలు నా కన్నా బలవంతులు. అందువల్ల నేను ఓడిపోయాను. నన్ను క్షమించు బామ్మ.


అందుకే ఇవాళ మిగతా అందరిలా నా స్వార్థం కోసం నీ ఆస్తిని తీసుకుంటే, నా మనస్సాక్షి నన్ను ఎప్పటికీ క్షమించదు.


నాకు రావలసిన నీ ఆస్తిని నువ్వున్న ఆ వృద్ధాశ్రమానికే ఇవ్వమని నీ పిల్లకు చెప్పాను.


ఇదంతా వినడానికి నువ్వు ఇపుడు ఈ లోకంలో లేవు.


కానీ ఎక్కడి నుంచో నన్ను చూస్తూ ఉంటావు అని మాత్రం తెలుసు.


ఎక్కడ ఉన్నా నన్ను మర్చిపోకు. నీ అశీస్సులు నాకు కావాలి బామ్మ !!"


అంటూ తన బామ్మ ఫోటోను గట్టిగా ముద్దు పెట్టుకుంది......



Rate this content
Log in

Similar telugu story from Tragedy