Nagmani Talluri

Drama

4.5  

Nagmani Talluri

Drama

గాయత్రి

గాయత్రి

5 mins
590


గతం తాలూకు జ్ఞాపకాలు గుండెను పట్టి పిండేస్తుంటే కళ్ళకు కునుకు కరువైంది చక్రధర్ కి.


"నువ్ ఎక్కడ ఉన్నావో తెలిసిన ఈ ఐదేళ్ళలో నిన్ను రమ్మని పిలుస్తూనే ఉన్నాను .నువ్ ఇక్కడకు రాకపోవడానికి రాలేక పోవడానికి నీ కారణాలు నీకుండి ఉంటాయ్.


పూర్వ విధ్యార్ధుల సమ్మేళనం ఏర్పాటు చేసాడు ప్రకాష్ నీకు ఇన్విటేషన్ పంపబోతున్నారు. ప్రపంచానికి ఆ కారణం చూపించుకో !


ఎందుకు రావాలో? ,వస్తే ఏం దొరుకుతుందో నీకు చెప్పక్కరలేదని నా నమ్మకం."


మధ్యాహ్నం తన స్నేహితుడు వెంకట్ చేసిన వాట్సప్ మెసేజ్ పదో సారి చదువుకున్నాడు. 


డిగ్రీ పూర్తి చేసుకుని ఆ ఊరు వదిలి వచ్చి అప్పుడే పాతికేళ్ళు గడిచినా జ్ఞాపకాలు మాత్రం చక్రధర్ ని వీడిపోలేదు.


అపరాధ భావమో అవమాన భారమో ఇదమిద్దం గా తేలని ఓ సందిగ్ధావస్థ లో తనా ఊరు విడిచి వచ్చేసాడు.


విఫలమో ,అర్థ సఫలమో తెలీని ఓ వింత ప్రేమ లో మునిగి తేలి దాని తాలూకూ చేదునంతా మూట గట్టుకుని జీవితమనే సముద్రంలో ఈదులాడుతున్నాడు.


కళ్ళు గట్టిగా మూసుకున్నాడు. "గాయత్రీ "అంటూ మనసు మూలిగింది. 


వద్దంటున్నా మనసు బలవంతంగా గతం లోకి లాక్కెళ్ళింది.


మొదటి సారి తనని చూసినపుడు కలిగిన మధురానుభూతి మనసును ఇంకా కుదిపేస్తూనే ఉంది. 


చీకట్లు తొలగని ఉదయాన ,మంచు దుప్పటిని చీల్చుకుంటూ తను వెళుతుంటే అర విరిసిన మందారం లాంటి సోయగాన్ని వెదజల్లుతూ వాకిట్లో రంగ వల్లులద్దుతూ చెదిరిన ముంగురులను నాజూగ్గా సర్థుకుంటూ ఆమె! మొదటి చూపులోనే తనను ఆకర్షించింది .సైకిల్ బెల్ చప్పుడుకు కళ్ళెత్తి తన వైపు చూసిన ఆ చూపు గుండె లోతుల్లో మానని గాయాన్ని చేసింది. ఆ దృశ్యం మదిలో చిత్ర పటం గా మారి నిలబడిపోయింది.


డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతూ నెల క్రితమే ట్యూషన్ కి చేరాడు. అక్కా బావతో కలసి ఉంటున్నాడు.


ప్రతి క్షణం ఉషోదయం కోసమే నిరీక్షణ ,తన దర్శనం కోసమే తపన .

తను కనపడని రోజు దిగులై ,గుండె గుబులై ,నిద్ర కరువై మనశ్శాంతి కనుమరుగైపోయేవి.


తనను గమనించిందో లేక , తన దైనందినం అదేనో తెలీదు ,కాని ప్రతి రోజూ ట్యూషన్ కి వెళ్ళేటపుడు ముగ్గు వేస్తూనో ,పూజకు పూలు కోస్తూనో కనిపించేది.


సైకిల్ చప్పుడు వినగానే ఒక్క క్షణం కళ్ళు కలిపేది .ఆ కళ్ళలో వేనవేల దీపాల వెలుగులు గోచరించేవి. మరుక్షణం చూపులు మరల్చి తల వాల్చుకుని తప్పుకునేది.


ఆ క్షణం కోసమే ఎదురు చూసే తను మనసు నిండా ఆమె రూపాన్ని ముద్రించుకుని కదిలేవాడు.


ముకుళించిన కలువ క్రమంగా వికసించినట్లు ఆ పెదాలు నెమ్మదిగా విచ్చుకోవడం ఆరంభమైంది. మొదట్లో చిరు మందహాసంగా మొదలై చిలిపి నవ్వు దాకా చేరుకుంది.


ఆ మాత్రం చాలు ఏ మగాడికైనా తను ఆ అమ్మాయికి నచ్చాను అని రూఢీ పరుచుకోవడానికి.


"ఒరేయ్ పూజారి గారమ్మాయ్ నీకు అంత ఈజీగా పడదు ప్రయత్నాలు మానుకో" అంటూ ఆ వీధి చివర ఉండే మరో మిత్రుడు హెచ్చరించాడు కూడా!


మంచి చెడు విచక్షణ ,సాధ్యాసాధ్యాల వివేచన తెలీని ప్రాయమది .


ఆమె సోగ కళ్ళలో తన గుండె చిక్కుకుందని ,ఆ వాలుజడ తో తన మనసును కట్టేసుకుందని ,ఆ పెదవి ఎరుపులో ,ఆ సన్నని నడుము ఒంపులో తను చిక్కుకు పోయిన సంగతి ఎలా చెబితే వాడికి అర్థమౌతుంది అనుకుని ఊరుకున్నాడు.


వెంకట్ రాయబారం ఫలించింది .ఆమె పచ్చ జెండా ఊపింది. ఏకాంతమే దొరకని ప్రేమ ! స్కూల్ ఫైనల్ తో చదువు ఆపేసింది .సంసారం పెద్దది సంపాదన చిన్నదీనూ ! ఆమె గడప దాటలేదు ,తను కలుసుకోలేడు. ఉత్తరాలే శరణ్యమయ్యాయి .వాటిని చేరవేసే ఓ బుడ్డి బుడతడు .ఎన్ని ప్రేమ లేఖలో! వాటి నిండా ఎన్ని కబుర్లో !మనసు నిండి పోవడం అంటే ఏంటో అప్పుడే అర్థం తెలిసింది తనకు.


ఒక్కసారి తనను ఏకాంతం గా కలవాలన్న కోరిక ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. తన ఎదురుగా నిలబడాలి తన కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తూ బోలెడు ఊసులు చెప్పాలి కాని ఎలా? పరిష్కారం తనే చూపెట్టింది సాయం వేళ గుడికి రమ్మని వర్తమానం పంపింది


భయం వేసినా ఉడుకు రక్తపు దుడుకుతనం దాన్ని కమ్మేసింది. చీకట్లు చిక్కగా కమ్మేస్తున్న వేళ కోనేటి వడ్డున విరిసిన కమలం లా ఆమె.


జనం పెద్దగా లేరు ఉన్నా చూసే ఆస్కారం కూడా లేదు. గుండె గుబగుబలాడుతుండగా దరి చేరాడు. 


చేయి జాపి తన చేయి పట్టుకున్న వేళ చిగురుటాకులా రెపరెపలాడింది. తొలి పురుష స్పర్శ ఆమెకది .నడుము పట్టుకుని దగ్గరకు తీసుకున్నపుడు సిగ్గుల మొగ్గ అయింది అక్కడ వరకూ వచ్చాక వయసు వేడి ఊరుకోనిస్తుందా తొలి ముద్దు రుచి చూడాలని తహతహ. వద్దని ఆమె ఎంత వారిస్తున్నా వినకుండా తన గులాబీ పెదవుల రుచి చూశాడు అధరామృతాన్ని తనివి తీరా తాగేశాడు ఆ తమకంలో ఆ మైకంలో ఆమె నోటి వెంట చక్రీ అన్న తన పేరు వింటూ మత్తెక్కిపోయాడు.


వదల లేక వదలి వచ్చాడు రాత్రి తీయని కలలు నిద్రను దరికి రానివ్వలేదు. ఉదయం అవకముందే పరుగున వచ్చాడు దేవీ దర్శనం కోసం! కాని కనపడలేదు

పనిలో ఉందో లేక తనలాగే నిద్ర లేని రాత్రి గడిపి తెల్లవారే వేళ నిద్ర పోయిందేమో అనుకున్నాడు.


కాని ఆమె మళ్ళీ కనపడలేదు పిచ్చి పట్టినట్లయింది. రోజులు గడుస్తున్నా జాడ లేదు .స్నేహితుని సాయం కోరాడు .తను ఊరు వెళ్ళిందని మాత్రమే తెలిసింది, కాని ఎక్కడికెళ్ళిందో ?ఎందుకెళ్ళిందో ?తెలిపే నాధుడు లేడు.


ఆశ నిరాశల మధ్య కొట్టుమిట్టాడుతుండగా ఓరోజు మార్కెట్ లో వాళ్ళ నాన్న గారు ఎదురుపడి చూసిన చూపు ఆ కళ్ళలోని క్రోధం, అసహ్యం చూసాక అర్థమైంది జరిగిందేమిటో ఆమెను ఊరు దాటించారని అర్ధమై తీవ్రమైన మనస్థాపానికి గురి అయ్యాడు.


అక్కడ ఉండాలనిపించలేదు మూడు నెలల్లో వచ్చిన ఫైనల్ పరీక్షలు రాసి అక్కా బావకు వీడ్కోలు చెప్పి వచ్చేసాడు. మరల ఆ ఊరు వెళ్ళలేదు. నిదానంగా తెలిసింది తనను మేనత్త ఇంట్లో దాచారనీ, బంధువుల అబ్బాయితో పెళ్ళి జరిపించారనినూ!


దిగులుతో మంచం పట్టక పోయినా తనను కోల్పోయానన్న బాధ తన మూలంగా ఆమెకు ఇష్టం లేని వివాహం జరిగిందన్న ఆవేదన దహించాయి చాన్నాళ్ళు! ఉద్యోగం లో చేరగానే పెద్దలు కుదిర్చిన పెళ్ళి చేసుకున్నాడు.


ఆనందం గానే ఉన్నా గుండె లోతుల్లో మానని గాయం సలుపుతూనే ఉంది .అందుకే ఇన్నాళ్ళూ ఆ ఊరికీ మనుషులకు దూరంగా ఉన్నాడు


తల గట్టిగా విదిల్చాడు చక్రధర్. ఈసారి వెళ్ళక తప్పేలా లేదు వెంకట్ అంత ఒత్తిడి చేస్తున్నాడు ఏమై ఉంటుందో


* * * * * * *


గాయత్రి ఇక్కడే ఉందిరా వెంకట్ మాటకి తుళ్ళిపడ్డాడు చక్రధర్ 

అవునురా ముందే చెబితే ఫంక్షన్ ఎంజాయ్ చేయలేవేమో అని ఆగాను ఇందుకే నిన్ను రెండు రోజులు ఉండేలా రమ్మన్నది కూడా .


ఈ మధ్యే భర్త పోయాడని పుట్టిల్లు చేరింది. ఆడపిల్లకు పెళ్ళి చేసిందట, అబ్బాయి చదువుకుంటున్నాడంట. తండ్రి పక్షవాతం తో మంచాన పడితే సేవ చేస్తూ ఆ పాత ఇంట్లోనే ఉంటోంది. మొన్న గుడిలో కనిపించింది.


ఏం మాట్లాడాలో కూడా తోచలేదు చక్రి కి ఎక్కడ ఉన్నా ఆమె ఆనందంతో ఉంటే అంతే చాలు అనుకున్నాడు ఇన్నాళ్ళూ! కానీ ఆమె జీవితం మోడు వారిందని తెలిసీ తనను తాను క్షమించుకోలేకున్నాడు


ఆరోజు వాళ్ళ నాన్న గారితో మాట్లాడాల్సింది, కాళ్ళు పట్టుకు బ్రతిమిలాడాల్సింది. నేను మోసగాడిని కాదు ఖచ్చితంగా పెళ్ళిచేసుకుంటాను అని చెప్పాల్సింది.


ఎంత పశ్చాత్తాప పడినా ఏమి ప్రయోజనం జరగాల్సిన ఘోరం జరిగాక!

"గాయత్రిని ఒక్కసారి చూడాలిరా "గొంతు పెగల్చి ఆ ఒక్క మాట అనగలిగాడు గుండెల్లో బాధ సునామీ లా పొంగుతుండగా.


"రేపు వెళదాం "అన్నాడు వెంకట్


ఇల్లు ఏం మారలేదు కాకపోతే పెంకుటిల్లు రేకుల ఇల్లుగా రూపాంతరం చెందిందంతే


మందారాలు గన్నేరులు తలలూపుతున్నాయి గేటు తీసుకు వెళుతుంటే !మనసు మెలిపెట్టింది వాటిని చూడగానే


తలుపు తీసింది కొట్టిన రెండు నిముషాలకు. ఆ రెండు నిముషాలే రెండు గంటల్లా అనిపించాయి .


ఒక్క నిముషం తేరిపారా అతన్ని చూసాక ఆమెలో కలిగిన అలజడి చక్రి దృష్టిని దాటిపోలేదు.

గుర్తు ఉన్నానన్న మాట అనుకున్నాడు


లోపలికి వెళ్ళి కూర్చున్నారు. మౌనం దే రాజ్యమక్కడ! తల ఎత్తి ఆమె వంక చూడలేక పోతున్నాడు. ఆమె కూడా అంతే !గుండెల్లో ఎగిసిన కెరటాల్లాంటి ఆలోచనలను తట్టుకోవడానికి కాస్త సమయం కావాలి కదా!


"ఒరేయ్ నాక్కాస్త పనుంది మళ్ళీ వస్తా "అంటూ వెళ్ళిపోయాడు వెంకట్


ఆమె వంక చూడక తప్పలేదింక


నిశ్చలమైన సెలయేరు లా ఉంది .


కవ్వించే ఆ కళ్ళు తమ లక్షణాన్ని కోల్పోయాయేమో మరి ప్రశాంతతనే కురిపిస్తున్నాయి కొద్దిగా మార్పు కనబడుతోంది కానీ మరీ గుర్తు పట్టలేనంత కాదు.


ఎలా ఉన్నావ్ అడిగాడు


బానే ఉన్నాను నువ్వెలా ఉన్నావ్ పిల్లలెంతమంది?


పర్వాలేదు బాగున్నా. ఇద్దరబ్బాయిలు


అదృష్టవంతుడివి అని నవ్వింది .

జీవం లేని నవ్వు 

నవ్వక పోతేనే బాగుండు అనిపించింది



బెరుకు తగ్గిందేమో మాటలు మొదలెట్టారు. నవ్వుకున్నారు ,పరిచయం పెరిగినట్లనిపించింది.


" మీ నాన్న మీద కోపంగా లేదా" అన్నాడు


" వచ్చి మాత్రం ఏం ఉపయోగం. ఆయన బాధ ఆయనది 

ఓ మామూలు తండ్రి ఆయన .తన కూతురు తప్పు చేయకుండా కాపాడుకున్నాను అనే భ్రమలో ఉన్నాడు

నా మనసు చచ్చిపోయిందని ఆయనకు అర్థం కాదు. అందుకే నిర్లిప్తత అలవాటు చేసుకున్నాను 


ఎవరి పరిధి లో వాళ్ళు తాము చేసిందే ఒప్పు అనుకుంటారు కదా" అంది


తన జీవితం గురించి చెప్పింది .భర్త చాలా మంచి వాడట, ఆక్సిడెంట్ లో పోయాడట .తమ్ముడు ఆర్థికం గా అండగా నిలబడ్డాడని కృతజ్ఞత గా తండ్రి భాధ్యత తీసుకున్నానని చెప్పింది

వెనక గదిలో నుండి ఉండీ ఉండీ వినిపిస్తున్న దగ్గు మీకు ఇంకా స్వేచ్చ రాలేదని చెబుతోంది.


"ఏదైనా అవసరం ఉంటే కబురు చెయ్యి "అంటూ విజిటింగ్ కార్డు తీయబోతుండగా వద్దని వారించింది.


"కన్నీళ్ళను తోడుగా చేసుకుని కష్టాల కడలిని ఈదేస్తున్నాను. అలవాటు అయిపోయింది


నాలో కొత్త ఆశలు రేకెత్తించకు. నీ మీద ఆధారపడేలా చేయకు .ఒకసారి నీ సాయం పొందడం అలవాటు అయితే మనసు మాట వినదు. ప్రతిసారీ కావాలంటుంది ఈ కొత్త స్నేహమేంటి ?అని పిల్లలు నన్ను అడిగితే జవాబు చెప్పలేని స్థితికి నేను దిగలేను ఏమనుకోకు" స్థిరంగా అంది.


ఏమనాలో, ఏంచేయాలో తోచక లేచి నిలబడి వెళ్ళొస్తాను అని వెనుదిరిగాడు.


"చక్రీ "వెనక నుండి ఆమె పిలుపు మార్థవంగా


నమ్మలేక పోయాడు . వెనుదిరిగి చూసాడు.


కన్నీళ్ళతో నిలబడి వుంది "ఈ క్షణం కోసం పాతికేళ్ళుగా ఎదురు చూస్తున్నాను 

నా ప్రాణం పోయేలోపు నిన్ను ఒక్క సారి చూడాలనుకున్నాను. పూర్తిగా అలసిపోయాను చక్రి! ఎదురు తిరిగి పోరాడలేక ,తల వంచి మనసు చంపుకుని బ్రతక లేక ప్రతి క్షణం నరకమనుభవించాను.


అంత బాధ లోనూ ఒకటే ఊరట నీ జ్ఞాపకాలు, నీ ఆలోచనలు .వాటిని ఆసరా చేసుకుని ఇన్నాళ్ళూ బ్రతికేసాను ,ఇక ముందు కూడా బ్రతుకుతాను.



కాని ఒక్క కోరిక మిగిలి ఉంది తీర్చగలవా?


నేను నీ జ్ఞాపకాల్లో ఉండాలి. ఎప్పటికీ సజీవంగా నిలిచి ఉండాలి, కానీ నువ్వెక్కడుండేది నాకు తెలీనివ్వకు .నా మనసు బలహీన పడనివ్వకు ,మాట ఇవ్వు చక్రీ"


మనసు ఆర్ద్రమవగా తన చేయి పట్టుకుని దగ్గరకు తీసుకుని ఆమె నుదుటిపై చుంబించి గిరుక్కున వెను తిరిగి వెళ్ళిపోయాడు.


Rate this content
Log in

Similar telugu story from Drama