Thanneeru Sasi

Drama

3  

Thanneeru Sasi

Drama

ఇక్కడ అందరూ నడవాల్సిన దారి ఒకటే

ఇక్కడ అందరూ నడవాల్సిన దారి ఒకటే

4 mins
455


       

హితా ఎలా ఉన్నావు?అవునులేమ్మా ఇన్ని రోజులు మర్చిపోయి ఇప్పుడు పెద్ద పలకరింపులు. ఏమీ వద్దుపో,అని అలుగుతున్నవా?ఆ చిన్నప్పటి అలక హిత నాలుగు దశాబ్దాల జీవితం దాటేసినా ఏమీ మారలేదా పాపం,నిజంగా నాకు నవ్వు వస్తుంది.నా దృష్టిలో నువ్వు నా చిన్నప్పటి హిత వే!//సరే సరే మళ్లీ అలగకు,ఇప్పుడు వ్రాసేది నీకోసమే కదా,జీవితం లో ఆడవాళ్లకు తమ అవసరాలు లాస్ట్ ప్రిఫరెన్స్ కదా.సరే సీరియస్ విషయాలలో కూడా నవ్వుతాను సీరియస్ గా తీసుకోను అని గొడవ వేస్తుంటావు కదా నాతో,ఎందుకు నవ్వుతానో చెప్పేదా?//నా ఉద్యోగ రీత్యా ఎప్పుడూ క్వార్టర్స్ లో ఉండేవాళ్ళం కదా.మాది క్రింద పోర్షన్.పాములు వస్తుండేవి. అప్పుడు మా అమ్మ,తులసి చెట్లు చుట్టూ పెంచు,అప్పుడు పాములు రావు అని చెప్పింది.నేను మా క్వార్టర్స్ పక్క నుండి అవతలి వారి క్వార్టర్స్ పక్క గోడ దాకా నీట్ చేసి మధ్యలో మురికి కాలువ ఉంటే దానిపై బండలు వేసి తులసి చెట్లు ఎక్కువగా వేసి దానిని ఒక తోటలాగా కష్టపడి మార్చాను.పాప కోసం రెండు చిన్న రోజా చెట్లు,నా కోసం ఒక ముళ్లగోరింట పూల చెట్టు..... ఓయ్ నీకు గుర్తు ఉందా చిన్నప్పుడు డిసమ్బరాలు పూలు,పసుపులో ఉండే మూళ్ళ గోరింట పూలు ఓపికగా కట్టుకొని పెట్టుకునే వాళ్ళం.మీ అమ్మ భలే చిక్కగా కట్టేది.ముందు నాకే పెట్టేది అని ఇదిగో ఇప్పటి అలకల హిత లాగే అలిగేదానివి.😊//ఇంకా తోటలో ఆకుకూర,మెంతి కూర,బీరకాయలు ఇలాగా వేసేదాన్ని.నేల పెద్దగా సారం లేక పోయినా మా వరకు సరిపోతాయి.ముఖ్యం గా రోజా చెట్టు మొగ్గ వేసిన రోజు భలే హ్యాపీ నాకు.రోజు చూసేదాన్ని.ఆ మొక్కలతో మాట్లాడేదాన్ని.అదిగో నువ్వు నవ్వుతున్నావా నా పిచ్చి చూసి.నాది నీకు పిచ్చి అయితే నీది నాకు పిచ్చి అంతే!పది రోజులు ఆ మొగ్గతో ఎన్ని కబుర్లు మౌనంగా చెపుతూ ఉండేదాన్ని.అది కూడా తల ఊపి ఊ కొట్టేది.ఇక రేపు పూస్తుంది అనుకుంటే నాకు రాత్రంతా భలే సంతోషంగా ఉంది.ఉదయాన్నే వెళ్ళిపోయాను కోసి పాపకు పెడదాము అని.అక్కడ పువ్వు ఏది?ఒక్క తొడిమ తప్ప. నిజంగా ఈ ప్రేమ పెంచుకోకూడదు దేని మీద.నిజంగా లోపల ఒక విరక్తి.ఇక అక్కడ పెద్దగా తిడుతూ కోపం అనే డ్రామా వేయాలి.బహుశా కోసిన వాళ్ళు నా కోపం కోసం ఎదురు చూస్తూ ఉండవచ్చు.కానీ నేను వెళ్లి ఆలోచించాను.అది కామన్ ప్లేస్,ఎవరికైనా హక్కు ఉంది.నేను కష్టపడ్డాను కాబట్టి నాకు హక్కు ఉంది అనేది వాళ్ళు ఆమోదించాలి.అది నేను క్లైమ్ చేసుకోలేను. వాళ్ళు మామూలు మనుషులు.పువ్వు దొరికింది తీసుకెళ్లారు అంతే.ఈ రోజు నుండి నాకు వాళ్ళకి ఉపయోగపడే పువ్వులు వేయాలి.అంతే పెద్ద నందివర్దనం చెట్టు,పసుపు గంటల చెట్టు,దారికి ఇరువైపులా బంతి చెట్లు పెంచాను. ఇప్పుడు అందరికీ పూలు.వాళ్ళు అందరూ నీళ్లు పోసి సహాయం చేసారు.సన్నజాజుల చెట్టు,మునగ చెట్టు,కార్తీక మాసం కోసం ఉసిరి చెట్టు,దాని క్రింద తులసి చెట్టు, కూర్చోవడానికి ముందు బండలు వేసుకున్నాము.కార్తీక మాసం వస్తే ఎవరో ఒకరు దీపం పెట్టేవాళ్ళు.అక్కడే పూజ చేసుకొని అందరం చేసుకున్న ప్రసాదాలతో వాన భోజనాలు, పిల్లల ఆటలు అక్కడే జరుపుకునే వాళ్ళం.ఒక్క క్షణం నా నవ్వు ఇప్పటి సామూహిక సంతోషానికి కారణం అయింది.ఇంకా వ్రాయమంటావా తల్లి,నీకేంటి చదివితే చదువుతావు లేకుంటే పక్కన పడేస్తావు.కానీ నీ కోసం వ్రాయడం అనే విషయాన్ని ఎంత శ్రద్ధగా చేస్తానో నీకు తెలీదు.కష్టానికి గౌరవం ఇయ్యని వారి దగ్గర నేను ఏమీ చెప్పను.//సరే ఇంకొకటి నీ కోసం.ఇంకో బడికి ట్రాన్స్ఫర్ అయినపుడు జరిగింది.అక్కడ మూడు అంతస్తుల బడి అది.కింది అంతస్తులో మా పదో తరగతి.కిటికీ పక్కనే ఓవర్ హెడ్ టాంక్ ఓవర్ ఫ్లో నీళ్లు పదేవి.మగ పిల్లలు యూరినల్స్ కి అక్కడే వాడుతూ ,ఆ వాసన అంతా నాకు పాఠం చెప్పే మూడ్ చెడకొట్టేది. ఆ నీరు వృధాగా పోకూడదు అని ఆలోచించి మా హౌస్ పిల్లలతో ఒక మడి చేయించి ఇంటి దగ్గర నుండి జునియా పూల నారు తీసుకెళ్లి వేయించాను.నీళ్లు పొసే పని లేదు.చక్కగా పూలు పూసి,సీతాకోక చిలుకలతో నవ్వుతుంటే నేను ,పిల్లలు నవ్వుకునే వాళ్ళం.పై అంతస్తు లోని టీచర్స్ కూడా పై నుండి చూస్తే ఈ తోట హాయిగా ఉంది మేడం అని మెచ్చుకునేవాళ్ళు.ఒక రోజు కిటికీ నుండి చూసేసరికి మొత్తం పూలు కోసేసి ఉన్నారు.నాకు గుండె ఆగినంత పని అయింది.మరి ఆ తోటను గుండెల్లోనే దాచుకున్నాను కదా.నా మౌనం పిల్లలకు అర్ధం అయింది.వారికి బాధగా ఉంది.వెంటనే ఎంక్వైరీ చేసారు. వాచ్ మాన్ కోసుకెళ్లి దేవుడికి పెట్టుకున్నాడు అని తెలిసింది.కంచె చేను మేస్తే కాపు కాసేది ఎవరు?శ్రీరాముడి ధనుస్సు కిందే నలిగితే కప్ప ఇంకెమని అరుస్తుంది?ఇప్పుడు నేను ఆయనను పిలిచి గొడవపడాలి. ఏమిటి దేవుడు అంటే ఇంత పిచ్చి ఆయనకు,నాకు నవ్వు వచ్చింది.మరి తోట అంటే నాకు పిచ్చి కాదా?ఎవరి పిచ్చి వాళ్లకు ఆనందం!ఒకరి అభిప్రాయాలు ఒకరం గౌరవించుకోవాల్సిందే.ఆయనను పిలిచి తోట ఎందుకు వేసానో చెప్పాను.నువ్వే కొస్తే,పిల్లలు కొస్తారు కదా అని చెప్పాను.సరేమ్మా,ఇంక కోయను అని చెప్పి వెళ్లిపోయారు.చిన్న పిల్లలాగా వెంటనే గొడవ వేసుకోకుండా కొంచెం నవ్వడం అవతలవారితో సహానుభూతి కలిగించి వాస్తవాన్ని చక్కగా అర్ధం చేయిస్తుంది//అన్నీ తోటలు,పూలు మాత్రమేనా?మనుషులతో గొడవలు లేవా,అంటావా?ఉన్నాయి.చూడు నీకు నా గురించి ప్రతీ విషయం తెలుసు కదా.నాకు ఉద్యోగం వచ్చి న ఏడేళ్ల వరకు ఈయనకు ఉద్యోగం రాలేదు.మధ్యలో బాబు పుట్టాడు.వాడిని పెంచడానికి ఈయన ప్రైవేట్ ఉద్యోగం మానేసారు. అప్పుడు మేము ఎన్ని కామెంట్స్ ఎదురుకున్నామో తెలుసా!ఎప్పటి విషయం,పాతికేళ్ళ క్రిందటిది.నేనే మా వాళ్లందరిలో మొదట ఉద్యోగానికి వచ్చిన మహిళను.ఆడవాళ్లు ఉద్యోగం చేస్తే,మగవాళ్ళు పిల్లలను చూసుకోవడం,ఇప్పుడే ఎగతాళి చేస్తారు.ఇక అప్పుడు కాలం లో ఇది ఘోరావమానం కదా.వీళ్ళ వాళ్లని ఎవరైనా మీ అబ్బాయి ఏమి చేస్తూన్నాడు అంటే పిల్లలను చూసుకుంటున్నాడు అని చెప్పాలి అంటే ఎంత నామర్ధ. కానీ మేము ఇద్దరం అలాగే డెసిషన్ తీసుకున్నాము,పాపకు నా పాలు లేక చాలా ఇబ్బంది పడ్డాము,బాబుకు పాలు ఉన్నాయి కాబట్టి ఇస్తూ ఆరోగ్యంగా పెంచాలి అనుకున్నాము. ఏదైనా కామెంట్స్ అన్నీ ఈయనకే తగిలేవి.దగ్గర బంధువులు కూడా "మా అమ్మాయిని కూలికి పంపించి నువ్వు తింటున్నావా?"అని అడిగిన వాళ్ళు ఉన్నారు.పిల్లల మీద ప్రేమే ఈయనకు అంత సహనాన్ని ఇచ్చింది.అప్పుడు కూడా నవ్వుకున్నాను, ఆటల్లో ఓడిన చిన్నపిల్లలు చేసిన కామెంట్స్ లాగా ఉన్నాయి ఆని. వాళ్ళ దృష్టి తో చూస్తే చిన్న అసూయ,వాళ్ళు ఎంత సంపాదిస్తున్నా ఇంట్లో ఇద్దరికీ పెద్దగా గొడవలు.మరి ఈయన సంపాదించకున్నా గొడవలు లేవే, అని మామూలు మనిషికి ఉండే బాధ.అందరం మామూలు మనుషులం, అసూయ తో మాటలు,తప్పులు చేయడం సహజం కదా//ఇప్పుడు అర్ధం అయిందా తల్లి,ఒక సమస్య వచ్చినపుడు నా నవ్వు వలన నాకు ఎన్నిగొడవలు తప్పి పోయాయో😊//ఎప్పుడూ లేఖ వ్రాయను అని తిడుతావు కదా, ఇప్పుడు భాషా సినిమాలో రజనీకాంత్ స్టయిల్ లో, నేను ఒక్క లెటర్ వ్రాస్తే వంద వ్రాసినట్లే?వంద ముక్కలు చేసి చదువుకో.నా బిజీ అర్ధం చేసుకోకుండా విసిగించావే అనుకో,నీతో ఖటీఫ్. తెలుసు కదా శశి చిన్నప్పటి నుండి ఖటీఫ్ అంటే ఇక జీవిత కాలం మొత్తం ఫ్రెండ్స్ లిస్ట్ లో పేరుకు ఇంటూనే.హుష్,ఇప్పుడు కోపపడ్డాను అని అలిగావాకు తల్లి,దగ్గర వాళ్ళ మీద మాత్రమే ప్రేమ,కోపం చూపగలం.మిగిలిన వారి దగ్గర ఫార్మాలిటీ గౌరవం.నీ విశేషాలు తొందరగా వ్రాయి.లేదు అనుకో అలగడం నీకే కాదు పెద్ద,నాకు వచ్చు.

ఆత్మీయ స్నేహం తో,

శశికళ.

@@@@

#లేఖ పోటీకి



Rate this content
Log in

Similar telugu story from Drama