స్వాతి సూర్యదేవర

Inspirational

3.7  

స్వాతి సూర్యదేవర

Inspirational

కడుపుపంట

కడుపుపంట

4 mins
347


"మరీ అంత మొహమాటం పనికిరాదు అమ్మాయ్!" అన్నది బామ్మ.

తన మాటకి చిన్నగా నవ్వి ఊరుకుంది ధరణి.

చెట్టు మీద కాయలు తెంపుతూ... "ఇంతకీ ఎన్నో నెల" అని అడిగింది బామ్మ.

"మూడు బామ్మగారు..." అని సిగ్గుపడుతూ చెప్పింది.

"ఓసి నీ సిగ్గు సంతకెల్లా ఎన్నో నెల అంటేనే ఇంతలా సిగ్గు పడుతున్నావ్! ఇక నా మనవడి సంగతి ఎలాగో!" అని ఆటపట్టించింది బామ్మ.

"పో...బామ్మ మీరు మరీను" అంటూ ఇంకా సిగ్గుల మొగ్గ అయ్యింది ధరణి.

కోసిన కాయలకు గోడమీదగా ధరణి చేతికి అందిస్తూ "ఇటువైపు కాయలు రంగు తేలాయి కానీ, మీ ఇంటి వైపువి ఇంకా రంగు తేలలేదు. ఒక వారం ఆగితే అవి కూడా పంటకి వస్తాయి. అప్పుడు నన్ను అడిగే పనీలేకుండా కోసుకొని తిను" అని నారింజ పండ్లు ధరణి చేతికి ఇచ్చింది.

థాంక్స్ బామ్మ. పొద్దుటినుంచి చెట్టు చూస్తుంటే నోరూరుతుంది. మిమ్మల్ని అడగలేక చాలాసార్లు గోడ దగ్గరికి వచ్చి లోపలికి వెళ్ళిపోయాను. బహుశా మీరు పిలవకపోతే అడిగేదాన్ని కాదేమో!" అంటూ కాయలు కొంగులో వేసుకుంది.

"అద సంగతి అయితే! నిజమే ధరణి పొద్దునుంచి నేను మీ తాతగారు ఇద్దరం నిన్ను గమనిస్తూనే ఉన్నాం. గోడ దగ్గరికి వస్తున్నావు, వెళ్లి పోతున్నావు కానీ, ఏం అడగాలనుకుంటున్నావో మాకు ఉండేదేమో!!" అని పక్కున నవ్వింది బామ్మ.

తను కూడా నవ్వుతూ "థాంక్యూ బామ్మ" అని మరోసారి చెప్పింది.

"మీ థాంక్యూ లవి నాకు వద్దు కానీ, మూడో నెల అంటున్నావ్ వేవిళ్ళు మొదలై ఉంటాయి .సాయంగా పెద్ద వాళ్ళు ఎవరూ రాలేదా!?"బామ్మ మాటకి కంటి నిండా నీళ్ళతో తల దించుకుంది ధరణి.

ధరణినీ గమనించిన బామ్మ "ఏమైందమ్మా నేనేమైనా తప్పుగా అడిగానా లేదే" అంటూ అయోమయంగా చూసింది.

కళ్ళు తుడుచుకుని "అయ్యో అదేం లేదు బామ్మగారు... మాది ప్రేమ పెళ్లి అండి. మా పెద్దవాళ్ళు ఒప్పుకోలేదు అందుకే ఇద్దరం ఇంట్లో నుంచి వచేసి పెళ్లి చేసుకున్నాం. వాళ్ళు ఇంకా మా పెళ్లి ఒప్పుకోలేదు అందుకే....."

"ఓహ్... అలాగా తెలియక నిన్ను అడిగాను. మీ మనసు నొప్పించి ఉంటే మన్నించమ్మా..!! ఇంతకీ అబ్బాయి ఆఫీస్ కి వెళ్లాడా!"

"అయ్యో అంతమాటనకు బామ్మ..ఆయన ఆఫీసుకి వెళ్ళారు బామ్మ_

"చూస్తుంటే నీరసంగా వున్నావు...ఏమైనా తిన్నావా అసలు"

"పొద్దున్నే కళ్ళు తిరిగి ఇబ్బందిగా అనిపించింది బామ్మ. రాజీవ్ ఏమీ చెయ్యిద్దులే అని ఆఫీస్ లో తింటాను అని వెళ్ళిపోయాడు. కొంచెం వుప్మ చేసుకున్నాను కానీ తినబుద్ధికాక బయటకు వచ్చాను. అప్పుడే చెట్టుమీద నారంజ కాయలు కనిపించి తినాలనిపించింది." అని నవ్వింది.

"ఈ సమయంలో ఏవేవో తినాలనిపిస్తుంది ధరణి. నీకెందుకు నేను నీకేం కావాలన్న చేసిపెడతాను సుబ్బరంగా తిని పండంటి బిడ్డనీ కనీ మీ ఆయన చేతిలో పెట్టు. రోజు ఈ నారింజ చెట్టు కాయలు తిని నారింజ పండు లాంటి బుజ్జిగాన్ని మాకు ఆడుకోడానికి ఇవ్వు."

"అయ్యో మీకెందుకు శ్రమ .అట్లాంటివన్ని ఏమీ వద్దు... అంత మాట అన్నారు అదే చాలు."

"ఈ మోహమాటాలే వద్దంటున్నాను అమ్మాయి. ఈ సమయంలో గట్టి ఆహారం తీసుకుంటే రేపు పిల్లలకి ఆరోగ్యం మంచిగా ఉంటుంది. నువ్వు ఫ్రీ గా ఉంటావు రేపు ప్రసవ సమయంలో ఎలాంటి ఇబ్బందులు రావు"

"తప్పకుండా బామ్మ.... రాత్రి చాలా అనిపించింది అమ్మ దగ్గర ఉంటే ఎంత బాగుండు అని. కానీ ఏం చేయను కోరుకున్న జీవితం కోసం కన్నవాళ్ళని వదిలేయాల్సి వచ్చింది."

"జీవితంలో అన్నీ అందరికీ దక్కవు ధరణి. ఒకటి కావాలంటే ఇంకొకటి వదులుకోవాలి. ఇప్పుడు మా పరిస్థితి చూడు ఇన్నాళ్లు కష్టపడ్డాం, కాస్త స్థిమితంగా కూర్చుని తినే సమయానికి పిల్లలు విదేశాల్లో స్థిరపడి ఇక్కడ ఒంటరి వాళ్లమయ్యాము. పిల్లలు వాళ్ళ పిల్లల కోసం వెళ్ళక తప్పలేదు. మాకు పిల్లలతో వుండాలనున్న మా మనవళ్ళకి వాళ్ళ తల్లిదండ్రులు కావాలని అర్ధం చేసుకుని వాళ్ళకి స్వేచ్ఛ ఇచ్చాం. జీవితం అంటే అంతే కోరుకునేది దొరికే సమయానికి ఏదో ఒక కారణంతో ఇంకొకటి దూరం అవుతుంది .నువ్వేమీ కంగారు పడకు, బాధపడకు.మీకు మేమున్నాం.మీ పెద్దవాళ్ళు రాలేదని ఆలోచించకు. ఇప్పుడేగా శుభవార్త చెప్పింది .నీ ప్రసవ సమయానికి మెల్లిగా వాళ్లే నిన్ను దగ్గరకు తీసుకుంటారు. ఈ ఆలోచనలతో నీ మనసు పాడుచేసుకుని, మనవణ్ణి ఇబ్బంది పెట్టకు."

"అలాగే బామ్మ. మీలాంటి వాళ్ళు తోడుగా ఉండగా ఇంకా నాకేం భయం. మీ సూచనలు తీసుకుంటూ మీ సలహాలు పాటిస్తూ నా కడుపు పంటని పండించుకుంటాం."

"అలా అన్నావ్ బాగుంది. కాసేపు ఆగు నీ కోసం నిమ్మకాయ పులిహార చేసి తీసుకొస్తాను .నోటికి రుచిగా ఉంటుంది" అంటూ నిమ్మచెట్టు వైపు కదిలింది పార్వతమ్మ.

వెళుతున్న పార్వతమ్మ ని చూస్తూ ఆమె అభిమానానికి ముగ్ధురాలే అయ్యింది ధరణి.

"ఏంటి ధరణి మీ బామ్మని అలా చూస్తున్నావు" అంటూ వచ్చారు శ్రీనివాసరావుగారు.

"ఎం లేదు తాతగారు.... బామ్మ మంచి మనసుని చూస్తున్నాను."

"మీ బామ్మ ఎప్పుడు అంతేనమ్మా, మనుషుల్ని, మనసుల్ని గెలుచుకుంటుంది. అందుకనే పెళ్లై ఇన్నేళ్లయిన మీ బామ్మ మీద నాకు ప్రేమ రవ్వంత కూడా తగ్గలేదు." అని నవ్వుతూ చెప్పారు శ్రీనివాసరావు గారు.ఆయన నవ్వుకి ఒక జత కలిపింది ధరణి.

"సరే చాలాసేపు అయింది ఇంట్లోకి వెళ్ళమ్మా.అసలే వట్టి మనిషివి కూడా కాదు. ఇలా ఎక్కువ సేపు ఎండలో ఉండకు. కావాలంటే మీ బామ్మ, నేను అటువైపుకి వస్తాము కావాల్సినంత సేపు మాట్లాడుకోవచ్చు"

"అలాగే తాతగారు" అని నవ్వుతూ ఇంట్లోకి వెళిపోయింది ధరణి.

"ఏవండీ అమ్మాయి వెళ్ళిపోయిందా..!?"

" ఎండ వస్తుందని నేనే వెళ్ళమన్నాను పార్వతి. చేతిలో ఏంటవి?"

"ఇవా... మన పెరట్లోవే ఆకుకూరలు. అమ్మాయికి చాలా మంచిదని. ఇక నుంచి మన ఇంట్లోవే ఇస్తాను వండుకోవడానికి. ఇలాంటివి తింటేనే పుష్టిగా వుండే సంతానం కలుగుతుంది."

"మంచిది. కానీ ధరణి మీద ఇంత ఆప్యాయత ఏంటా అని"

"ఎక్కడో విదేశాల్లో ఉన్న మనవరాలికి ఏది నా చేతులతో చేసిపెట్టే అవకాశం లేదు కదా, ఆ ముచ్చట ధరణి దగ్గర తీర్చుకుంటున్నాను అనుకోండి." అని నవ్వి "నేను అమ్మాయికి పులిహోర చేసి పెడతాను అని చెప్పాను నాకు పని ఉంది నేను లోపలికి వెళ్తున్నాను" అని లోపలికి వెళ్ళిపోయింది పార్వతమ్మ.

    ధరణికి బాగోలేదని లీవ్ పెట్టి ఇంటికి వచ్చిన రాజీవ్ పార్వతమ్మ మాటలు విని చాలా సంతోష పడ్డాడు. వాళ్లకి ఒక పెద్ద దిక్కు దొరికిందని అనుకున్నాడు.పార్వతమ్మ గారి సూచనలు పాటిస్తు... ఆవిడ మాటలకు విలువ ఇస్తూ ఆవిడ చెప్పినట్టు చేస్తూ రోజులు గడిపారు ధరణి , రాజీవ్ లు.

    కాలం పరుగు తీసి ధరణికి డెలివరీ రోజు రానే వచ్చింది. కంగారు పడుతున్న రాజీవ్ కి శ్రీనివాస్ గారి తోడుంటే, ధరణికి పార్వతమ్మగారు ధైర్యంగా ఉన్నారు.

   నాలుగు రోజుల తర్వాత కవల పిల్లలతో ఇంటికి వచ్చిన ధరణికి దిష్టితీసి ఆహ్వానం పలికారు పార్వతమ్మ గారు.మనస్ఫూర్తిగా ఆ దంపతులకి తమ కృతజ్ఞతలు తెలుపుకున్నారు ధరణి, రాజీవ్ లు.బామ్మ సాయంతో పిల్లలను ఎలా చూసుకోవాలో తెలుసుకుంటూ ధరణి,ధరణి పిల్లల దిగులు లేకపోవడంతో సంతోషంగా తన వర్క్ చేసుకుంటున్నాడు రాజీవ్.

    ఇక బుజ్జిగాళ్ల ఆలనా, పాలనతో రోజులు నిముషాల్ల గడిపేస్తున్నారు శ్రీనివాసరావు, పార్వతమ్మలు.

అటు ధరణి రాజీవ్ లకి,ఇటు శ్రీనివాసరావు,పార్వతమ్మలకి మరో వసంతోత్సవం వచ్చింది ఆ చిన్నారుల రాకతో.

ఆడపిల్లకు వసంతకాలం అంటే మరో జన్మ.తేలిక కాదు.

              ★★★★★★


సమాప్తం


Rate this content
Log in

Similar telugu story from Inspirational