Sai Krishna Guttikonda

Abstract

4  

Sai Krishna Guttikonda

Abstract

కష్టమూ, సుఖమూ కలిస్తేనే జీవితం

కష్టమూ, సుఖమూ కలిస్తేనే జీవితం

4 mins
22


అమ్మానాన్నలకి మేము అయిదుగురు పిల్లలం, నాకు ఇద్దరు అక్కలు, ఒక తమ్ముడు, ఒక చెల్లి. నేను మధ్యలో దానిని. నాన్నకి ఒక ఎకరం పొలం ఉండేది. ఆ ఎకరం పొలంతో అందరినీ పోషించాలి అంటే కష్టం, అందరూ తినాలి అంటే అందరూ పని చెయ్యాలి. అలాగే వయసుతో సంబంధం లేకుండా అందరం పనిచేసే వాళ్ళం. తెల్లవారగానే నాన్న వెంటే సైన్యంలాగా అందరం బయలుదేరే వాళ్ళం, చిన్న వయసులోనే అక్కలు ఇద్దరికీ పెళ్ళి జరిగింది, ఆ తరువాత నాకు కూడా 14 సంవత్సరాల వయసులోనే పెళ్ళి చేసేసారు. ఆ వయసులో పెళ్ళి చేయడం అప్పట్లో మామూలు విషయమే.

పెళ్ళి అయిన కొన్నాళ్ళకి మా బంధువుల ఇంట్లోనే పనికి కుదిరాను, కొన్నాళ్ళు పని చేసాక మా ఆయన దగ్గరకి వెళ్తాను అంటే వాళ్ళు ఒప్పుకోలేదు, ఏం పెట్టి పోషిస్తాడు నిన్ను ఇక్కడే ఉండిపో పని చేసుకుంటూ అన్నారు. నేను వినలేదు. ఆయన తాపీ పని చేసేవాడు, ఒకరోజు వాళ్ళ స్నేహితుడితో నాకు కబురు పంపాడు, రేపు ఉదయాన్నే ఫలానా చోటుకు వచ్చేయ్ నేను తీసుకెళ్తాను అని, మాములుగా ఇంట్లో నుండి బయటకు వచ్చినట్టే వచ్చి మా ఆయనతో కలిసి ఇంటికి వెళ్ళిపోయాను. నేను అలా వచ్చేసానని మా బంధువులు నాన్న వాళ్ళతో మాట్లాడడం మానేశారు. అయినా మా ఇంటికి నేను వచ్చేసాను కాబట్టి నా తప్పు ఏం లేదనే అన్నారు నాన్న కూడా. కొన్నాళ్ళు అలా గడిచిపోయాయి. మధ్యలో అప్పుడప్పుడూ నాన్న దగ్గరకి వెళ్లి వస్తూ ఉండేదానిని. ఓసారి అలాగే మాములుగా పుట్టింటికి వచ్చాను. ఒక వారం ఉండి వెళ్లొచ్చు అని. కానీ ఈసారి నేను వచ్చాక గుండె జబ్బుతో నా భర్త చనిపోయారు, ఆ విషయం నాకు చెప్పమని మా భర్త తరుపు బంధువులు మా బంధువులతో చెప్పారు. కానీ మా మీద కోపంతో ఆ విషయం చెప్పలేదు మా బంధువులు. ఆయన చనిపోయిన మూడు రోజులకి ఎవరి ద్వారానో తెలిసింది ఆ విషయం. ఒక్క నిమిషం ఎవరికీ ఏమీ అర్ధం కాలేదు. అది నిజం అని నమ్మలేకపోయాము. నాన్న అప్పటికప్పుడు బయలుదేరి వెళ్ళి కనుక్కుని వచ్చారు, నిజమే కానీ ఏం చెయ్యాలి ఏడవడం తప్ప? నా భర్త చివరి చూపు కూడా దక్కలేదు. మిగిలిన కార్యక్రమాలు మా ఇంటి దగ్గర నుండే జరిపించారు నాన్న.

మళ్ళీ ఆ ఇంటికి పంపించడానికి నాన్న ఒప్పుకోలేదు, అప్పటికి 20 సంవత్సరాలు కూడా రాలేదు నాకు. అమ్మానాన్నల దగ్గర ఉంటూనే రోజూ పొలం పనికి వెళ్లేదానిని, అలాగే నాలుగైదు సంవత్సరాలు అక్కడే ఉన్నాను. తర్వాత ఇంకో సంబంధం చూసి పెళ్ళి చేసారు. పెళ్ళైన రెండు మూడు సంవత్సరాలకి మా ఆయనకి విపరీతమైన జబ్బు చేసింది, మళ్ళీ మనకు దక్కడు అన్నారు చాలామంది, కొంతమంది ఏసుక్రీస్తు ని నమ్ముకో దేవుడే బ్రతికిస్తాడు అన్నారు, ఆయన కోసం మతం మారాను, ఏ నమ్మకమో నాకు తెలియదు రెండు నెలల్లో మాములు మనిషి అయిపోయాడు, హాస్పిటల్ నుండి తీసుకొచ్చేసాము. అప్పటి నుండి ఇద్దరం కలిసి పొలం పనికి వెళ్ళడం, సాయంత్రం ఇంటికి వచ్చి వండుకుని తినడం ఇదే మా జీవితం, మాకు పిల్లలు లేరు. కానీ ఆ బాధ ఎప్పుడూ లేదు ఇద్దరికి నా తోబుట్టువుల పిల్లలు సొంత పిల్లల లాగానే ఉండేవారు, అప్పటికీ ఇప్పటికీ అదే ప్రేమ వారిలో.

అలాగే ఓ చిన్న ఇల్లు కట్టుకున్నాం, మా పని మేము చేసుకుంటున్నాం, అన్నీ బావున్నాయి అనుకుంటున్నప్పుడు వచ్చాయి దివిసీమ వరదలు. ఊర్లకి ఊర్లు అన్నీ మునిగిపోయాయి, ఉప్పెన వస్తుంది అని తెలుసుకునేలోపు మా ఊరు సగం మునిగిపోయింది, ఆ నీళ్లలోనే ఇంట్లో సామాన్లు అందినంత వరకు అటక మీద పెట్టి బయటకు వచ్చేలోపు మెడ వరకూ వచ్చేసాయి నీళ్ళు. ఆ లోతు నీళ్ళల్లో నడుస్తూనే కొంచెం ఎత్తులో ఉన్న ఇళ్లల్లోకి చేరాము అందరం. ఎటు వెళ్ళడానికి లేదు అంతా నీళ్ళే, అక్కడే ఉన్నాం అందరం. అంత పెద్ద వరదల్లోనూ కొంచెం డబ్బు ధాన్యం కలిగి ఉన్న కుటుంబాలు అందరికీ భోజనాలు ఏర్పాటు చేసారు, ఊర్లో ఏ ఒక్కరినీ ఆకలితో పడుకోనివ్వలేదు, ఎవరెవరు ఎక్కడ ఉన్నా వెతుక్కుంటూ వచ్చి భోజనానికి తీసుకెళ్ళేవారు. గవర్నమెంటోళ్ళు పైనుండి పులిహోర పొట్లాలు విసిరేసినా సగం నేలపాలే అయ్యేవి, మిగతా సగం మాలో ఒక పది శాతం మందికే సరిపోయేవి కాదు. కానీ ఆకలితో ఎవరూ ఇబ్బంది పడకుండా చూసుకున్నారు ఊర్లో అందరూ. వరద తగ్గాక ఇంటి పైకప్పు మాత్రం మిగిలింది మట్టిగోడలు దాదాపు కొట్టుకుపోయాయి, ఆసరాగా పెట్టిన కర్రల మీద అలా నిలిచింది ఇల్లు. అంత వరదల్ని ఎప్పుడూ చూడలేదు నేను.

అలా దెబ్బ తగిలిన ప్రతీ సారీ లేచి నిలబడడం, లేచి నిలబడ్డ ప్రతీసారీ ఎదో ఒక దెబ్బ తగలడం అలవాటు అయిపోయింది, అయినా ఎవరి మీదా ఆధారపడకుండా మా జీవితం అలాగే సాగింది, ఇక్కడకి వచ్చిన నలభై సంవత్సరాలలో నాలుగైదు సార్లు వరదలు వచ్చి ఇళ్ళు సాంతం కొట్టుకుపోయే పరిస్థితి, ఏ గవర్నమెంటూ పులిహోర ప్యాకెట్ల పంపకం కంటే ఎక్కువ ఆలోచించలేదు. అయితే వారి సహాయం కోసం మేము ఎదురు చూడలేదు. మా జీవితం మాదే, ఒక్కో కాలంలో ఒక్కో పని, నాట్లు వెయ్యడం, పసుపు కొయ్యడం, తమలపాకులు కట్టడం, వరి పైరు కొయ్యడం, అరటి గెలలు కొయ్యడం, కలుపు మొక్కలు తియ్యడం, ఇవే మా జీవితం. ఏ వరదలో వచ్చి పొలాల్ని ముంచేస్తే తప్ప మా పని మాకు ఎప్పుడూ ఉండేది. అంతకు మించి ఎప్పుడూ ఎక్కువ ఆశ పడలేదు. 40 సంవత్సరాలు నాతో కలిసి బ్రతికాక ఆరోగ్యం దెబ్బ తిని నా భర్త చనిపోయారు. ఆయన చనిపోయి ఏడు సంవత్సరాలు అవుతుంది, అప్పటి నుండి ఒంటరే. అప్పుడప్పుడూ పిల్లలు వచ్చి చూసి వెళ్తారు, నేను వాళ్ళ ఇంటికి వెళ్తే వదలరు, ఉండిపొమ్మంటారు. కానీ ఇక్కడే అలవాటు నాకు ఇక్కడ ఉండడమే ఇష్టం. ఎవరి ఇంటికి వెళ్లినా రెండు, మూడు రోజులకంటే ఎక్కువ ఉండను.

ఒంటరి జీవితాన్ని అలవాటు చేసుకుని ఇలా ఉంటున్న సమయంలో పక్కింట్లో జరిగిన ఎదో పొరపాటు వలన వాళ్ళ ఇళ్ళతో పాటు మా ఇల్లు కూడా నిప్పుకి బూడిద అయ్యింది, దాదాపు కట్టు బట్టలతో ప్రాణాలతోనూ బయటపడ్డాను. ఎం.ఎల్.ఏ గారు వచ్చి 5000 ఇచ్చి ఫోటో దిగి వెళ్ళారు, ఇక ఒక్కదానికే ఇళ్ళు కట్టుకునే ఓపిక లేదు. ఇక ఉన్నదాంట్లో అలా చెయ్యగలిగిన పని చేస్తూ బ్రతికేస్తున్నా. నేను ఉన్నంత కాలం ఎవరికీ భారం కాకుండా ఉండాలనే అనుకుంటున్నాను, ఇక తర్వాత ఎలా జరుగుతుందో దేవుడికే తెలియాలి…



Rate this content
Log in

Similar telugu story from Abstract