Sai Krishna Guttikonda

Abstract Drama Children

2.2  

Sai Krishna Guttikonda

Abstract Drama Children

రాములోరి దర్శనం

రాములోరి దర్శనం

4 mins
176


 ఏదో పని ఉంది అని కొరియర్ ఆఫీస్ కు వచ్చి అక్కడి నుండి మా ఇంటికి వచ్చాడు ఫ్రెండ్. ఎండకు భయపడి 10 గంటలకు ఇంటి తలుపు కూడా తీయకుండా ఇంట్లోనే కూర్చున్న నిన్నటి వరకూ. అదేంటో ఇవాళ మధ్యాహ్నం 12 అవుతున్నా కూడా తెల్లవారుజామున 5 అయినట్టు సూర్యుడు బయటకు కనిపించడం లేదు, చిన్నగా వర్షం కూడా మొదలు అయ్యే లాగా ఉంది. అప్పుడు వచ్చాడు వాడు, మా మాటలు ఎక్కడ మొదలు అయ్యి ఎక్కడికి వెళ్తాయో మాకు కూడా తెలియదు.


 అలా మాటల్లో భద్రాచలం వెళ్ళాలి ఎండలు తగ్గాక అన్నాను. అప్పటి వరకూ ఎందుకు ఇప్పుడే వెళ్దాం అన్నాడు వాడు. ఏం చెప్పాలా అని ఆలోచిస్తున్నాను. " నేను కరెక్ట్ గానే ఉన్నాను, నువ్వే చెప్పు" అన్నాడు వాడు. ఇంకేం లేదు ఆలోచనలు ఎగిరిపోయాయి. సరే పద అన్నాను. ఏలూరు నుండి షుమారు 160 కిలోమీటర్లు, నేను రూట్ మ్యాప్ గురించి ఆలోచించే లోపు వాడు వెళ్ళి ఒక జత బట్టలు పెట్టుకుని బైక్ వేసుకుని వచ్చేశాడు. 


పావు తక్కువ ఒంటి గంటకు ఏలూరు ఆర్.ఆర్ పేట లో చినుకులతో పాటు మా ప్రయాణం స్టార్ట్ చేసాము. అక్కడి నుండి చింతలపూడి రోడ్డు ఎక్కాము, బలివే కు తిన్నగా వచ్చే వరకూ చిన్న చిన్న చినుకులు తప్ప పెద్ద వర్షం ఏమీ లేదు. కానీ ధర్మాజీగూడెం దాటిన తర్వాత వర్షం కొంచెం పెద్దది అయ్యింది. ముందే అనుకున్నాం వర్షం వచ్చినా తడుస్తూనే వెళ్దాం అని, దాంతో ఆ వర్షంలోనే చింతలపూడి వరకూ వచ్చాం. వర్షంలో ఫోన్లు తడుస్తాయి అని కవర్ లో పెట్టి బ్యాగ్ లో వేసేసాం. చింతలపూడి తర్వాత మాకు దారి తెలియదు. 


అక్కడ ఆగి ఒక పెద్దాయన ను భద్రాచలం వెళ్లడానికి దారి అడిగాము. ముందు ఆయనకు అర్థం కాలేదు మళ్ళీ అడిగాం " బాబాయ్ భద్రాచలం కు ఎటు వెళ్ళాలి" ఆ మాటలు విన్న ఆయన కళ్ళల్లో ఒక మెరుపు అప్పటికప్పుడు ఒక నవ్వు పుట్టుకు వచ్చాయి. మనకి ఇష్టమైన పని ఇంకొకరు చేస్తూ ఉంటే కలిగిన ఆనందం ఆయనలో కనిపించిది. 


ఎటూ తిరగాల్సిన అవసరం లేదు తిన్నగా వెళ్ళిపొండి బాబు అని నవ్వుతూ చెప్పాడు. కొంచెం ముందుకు వెళ్ళి వెనక్కి తిరిగి చూసాం ఆయన మమ్మల్ని అలాగే చూస్తూ ఉన్నాడు. బహుశా రాములోరి దర్శనం కోసం చూసే చూపులు అనుకుంటా అవి. 


ఇక ఆయన గురించే కాసేపు మాట్లాడుకుంటూ ఓ పది పదిహేను కిలోమీటర్లు వచ్చాక రోడ్డు మీద రోడ్డు ఎక్కడ ఉందో వెతుక్కోవాల్సిన పరిస్థితి పెద్ద పెద్ద గుంతలు ఉన్నాయి. అమ్మో ఈ రోడ్ ఏంటి రా బాబు ఇలా ఉంది అనుకునే లోపే ఒక బోర్డు వచ్చింది, తెలంగాణ రాష్ట్రంలోకి స్వాగతం అని. అప్పటి వరకు గోతుల్లో గుంటల్లో ఇబ్బంది పడినా తెలంగాణ లోకి రాగానే దాదాపు ఎక్కడా గుంతలు కనిపించలేదు. రోడ్డు అంతా చాలా బావుంది. అదేంటో రాష్ట్రం మారగానే రోడ్డు మారినట్టు వాతావరణం కూడా మారింది. అప్పుడు దాకా ఉన్న వర్షం మొత్తం ఆగిపోయి చల్లగా ఉంది. ఎండ కూడా ఎక్కువ లేదు. వెళ్తున్న అంత సేపు రోడ్డుకి రెండు పక్కలా మామిడి మొక్కల నర్సరీలు చాలా కనిపించాయి. అదేంటో మూత పడిన ధాబా లు కూడా చాలా కనిపించాయి. దూరంగా కొండలు కనిపిస్తూ భలే అందంగా ఉంది. అప్పుడే అడవిలోకి వచ్చేసాం రా అనుకున్నాం మేము. ఇంకో పది కిలోమీటర్లు అలా వచ్చాక దమ్మపేట చేరుకున్నాం. టీ తాగుదామని అనుకున్నాం కానీ మాటల్లో పడి ఊరు దాటేసాం. ఆ ఊరు దాటిన కాసేపటికి మొదలు అయ్యింది అసలు అటవీ ప్రాంతం. రోడ్డు మీద మేము తప్ప ఎవరూ లేరు. ఎటు చూసినా పచ్చదనం , ఇంకొంచెం దూరం వెళ్ళాక చాలా కోతులు కనిపించాయి. దారి పొడవునా కోతులు కనిపిస్తూనే ఉన్నాయి, జింకలు కానీ ఎప్పుడూ చూడని పక్షులు కానీ కనిపిస్తాయి ఏమో అని ఆశ పడ్డాం కానీ అవేమీ కనిపించలేదు. 


కాస్త దూరం వెళ్ళాక చిన్న చిన్న ఊర్లు తగిలాయి, జగన్నాథ పురం అని ఒక ఊరిలో ఆగి పునుగులు, మిరపకాయ బజ్జీలు లాగించి మళ్ళీ బయలుదేరాం. విచిత్రం ఏంటంటే "ఇప్పుడు మన ఊరిలో 5G సేవలు కూడా లభించును " అని బోర్డు పెట్టి ఒక అతను సిమ్ కార్డులు అమ్ముతున్నాడు కానీ మాకు అక్కడ 2G సిగ్నల్ కూడా దొరకలేదు. మళ్ళీ బయలుదేరిన తర్వాత మళ్లీ అడవే ఆ చెట్లను పచ్చదనాన్ని చూస్తూ కాసేపటికి పాల్వంచ చేరాము. 


అక్కడి నుండి ఒక అరగంట లో వచ్చాక ముందు గోదావరి తల్లి కనిపించింది. నీళ్ళు ఉంటాయి అనుకున్నాం కానీ మొత్తం ఇసుకే, మధ్య మధ్యలో పెద్ద పెద్ద బండరాళ్లు. గోదావరి బ్రిడ్జి

ఎక్కగానే అటువైపు ఉన్న రాములోరి గుడి కనిపించింది. దగ్గరకు వచ్చేసాం రామయ్య అనుకుంటూ పది నిమిషాల్లో అక్కడికి గుడి దగ్గరకు వెళ్ళిపోయాం. అక్కడ గోదావరిలో చాలా తక్కువ నీళ్ళు ఉన్నాయి. అందులో స్నానం చేసి దర్శనానికి వెళ్ళాం. జనం కూడా పెద్దగా లేరు. రాముల వారిని సీతమ్మ తల్లిని , లక్ష్మణుడిని తనివితీరా చూసుకున్నాం. మేము ఎక్కువ సేపు ఉండవచ్చా లేదా అని ఆలోచిస్తూ ఉంటే పూజారి గారే ఎవరూ లేరు కదా ప్రశాంతంగా కావల్సినంత సేపు ఉండండి అన్నారు. అలా దాదాపు పావుగంట సేపు రాములోరిని చూసుకుని వెనక్కి వెళ్ళి భద్రుడు కొండగా మారిన ప్రదేశం అక్కడ రాములోరి పాదాలు చూసి అక్కడే కాసేపు కూర్చుని పావు తక్కువ ఆరింటికి మళ్ళీ ఏలూరు బయలుదేరాం. ఈసారి అశ్వారావుపేట మీద నుండి వద్దాం అనుకున్నాం కానీ మళ్ళీ తెలియని దారిలో ఎందుకు అసలే సిగ్నల్ ఉండదు అని ముందు వచ్చిన దారిలోకి వచ్చాం. పాల్వంచ దాటి దమ్మపేట రోడ్డులోకి తిరిగే అప్పటికే చీకటి పడిపోయింది. కొంచెం ముందుకు వచ్చే అప్పటికి బాగా చీకటి అంతా అడవి మనిషి అనేవాడు కనిపించడం లేదు, మహా అయితే టైం 7 కూడా అవ్వదు ఏమో కానీ మాకు మాత్రం అర్థరాత్రి పన్నెండో ఒకటో అయినట్టు ఉంది. ఇద్దరికీ లోపల కొంచెం భయంగానే ఉంది. వెళ్ళే అప్పటి కంటే వచ్చే అప్పుడే ఎక్కువగా రాముల వారిని మరీ ముఖ్యంగా ఆంజనేయ స్వామి ను తలుచుకుంటూ ముందుకు వచ్చాం. దమ్మపేట వచ్చాక హమ్మయ్య దగ్గరకు వచ్చేసాం అనుకుని అక్కడ ఆగి టీ తాగి మళ్ళీ బయలుదేరాం. మళ్ళీ ఆంధ్రా లోకి రాగానే గుంతలు స్వాగతం పలికాయి. గంటకు 40 కిలోమీటర్ల స్పీడ్ వెళ్లడానికి కూడా అవ్వడం లేదు. అలాగే మెల్లగా చింతలపూడి వచ్చే అప్పటికి 9 అయ్యింది. అక్కడ ఆగి నాలుగు దోశలు కడుపులో వేసుకుని 10:30 కు ఇంటికి చేరాం. అలా మధ్యాహ్నం 12:30 కు మొదలు అయ్యి రాత్రి 10:30 కు 10 గంటల్లో భద్రాచలం చూసి వచ్చాం. అప్పటికీ మాకు నమ్మకంగా లేదు నిజంగా భద్రాచలం వెళ్ళి వచ్చేశాం రా భలే అనుకున్నాం. ఎన్నో నెలలు నుండి అనుకుంటున్నా కూడా అవ్వని దర్సనం ఇవాళ మాత్రం అనుకోగానే అయిపోయింది. అంతే మరి ఆయన దగ్గరకు వెళ్లడానికి దారి ఎప్పుడూ అలాగే ఉంది అడుగు వేయాల్సింది మనమే కదా మరి…


Rate this content
Log in

Similar telugu story from Abstract