Gajula UmaMaheswar

Drama

5.0  

Gajula UmaMaheswar

Drama

క్విజ్ మాస్టర్

క్విజ్ మాస్టర్

8 mins
444


సాయంత్రం ఏడవుతోంది. 

ఆడిటోరియమ్ కేకలతో హోరెత్తుతోంది. పక్కనే ఆఫీస్ రూమ్ ప్రశాంతంగా వుంది. ఆడిటోరియమ్ లో ఆనందంగా చిందులేస్తున్నారు. పక్కనే ఆఫీస్ రూమ్ లో క్విజ్ మాస్టర్ మూర్తి ఏకాంతంగా ఆలోచిస్తూ కూర్చున్నాడు. ఎంత నియంత్రించుకుందామన్నా ఆ ఆలోచనలు ఒకదానికొకటి పెనవేసుకుంటూ అలా సాగిపోతూనే ఉన్నాయి. అంతవరకూ గంభీరమైన అలల్లా వున్న మానసిక స్థితిని , అరగంట క్రితం జరిగిన సంఘటన పోటెత్తిన అలలలా అతలాకుతలం చేసింది. 

“జర్ జర్ ర్ ర్ ర్ ... ర్ర్ర్ర్ర్ ర్ర్ ర్ర్ .........” బజర్ తన గుండెల్లోమోగినట్లయి ఉలిక్కిపడ్డాడు మూర్తి. ఇంతకు ముందు క్విజ్ లో జరిగిన బజర్ రౌండ్ ఇంకా తనను వెంటాడుతూనే వుంది. తనకిక్కడ ఉండాలని లేదు. ఎప్పుడెప్పుడు వెళ్ళి పోదామా అని చూస్తున్నాడు. తనను ఇక్కడకు ఆహ్వానించిన సైన్స్ టీచర్ కనబడితే చెప్పి వెళదామని ఆగాడు. 

 “మిత్రులారా , ఇంతకు ముందే అత్యంత ఆసక్తికరంగా సాగిన క్విజ్ కార్యక్రమం ముగిసింది కదా, కొద్ది క్షణాల్లో సభా కార్యక్రమం ప్రారంభించుకుందాం. ఈ లోగా మరో డాన్స్ ఐటెమ్ ను ప్రెజెంట్ చేయడానికి మనముందుకొస్తున్నారు ....” ఆఫీస్ రూమ్ ని ఆనుకుని వున్న ఆడిటోరియమ్ నుండి ప్రకటన. 

 “ఆసక్తికరంగా సాగిన క్విజ్ కార్యక్రమం” 

క్విజ్ మాస్టర్ మూర్తి పెదాలపైన నిరాసక్తమైన నవ్వు. తన కాలేజీ రోజుల్లో కూడా కొన్ని వందల క్విజ్ లలో పాల్గొన్నాడు. ఏ నాడైనా ఇలా జరిగిందా ? కొత్త విషయాలు నేర్చుకోవాలనే తహతహ , అవతలవాడి కంటే తమకు ఎక్కువ సమాచారం తెలిసివుండాలనే తాపత్రయం ఉండేవి. అంతా పుస్తకాలపురుగులు. ఆ రోజుల్లో క్విజ్ అంటే ప్రాణం . అదొక పిచ్చి, నిద్రాహారాలు మాని క్విజ్ పోటీల్లో పాల్గొనేందుకు తయారయేవాళ్ళు. కొత్త స్నేహాలు, కొత్త ప్రదేశాలు, కొత్త అనుభవాలు కొత్త ప్రయోగాలు. పోటీ జరుగుతున్నంత సేపు ప్రత్యర్థుల్లా ఉన్నా, ఒక్క సారి పోటీ అయిపోయాక ఛలోక్తులతో, వ్యంగ్య వ్యాఖ్యలతో చాలా సరదాగా , బాగా ఆత్మీయంగా ఉండేది వాతావరణం .ఇరవై ఐదేళ్ల క్రితం ఇంకా టీవీలు అంతగా వ్యాపించని రోజుల్లో సిధ్ధార్ధ బసు క్విజ్ టైమ్ పోటీలో పాల్గొనడం అతని జీవితంలో మరచిపోలేని అనుభవం. 

అన్ని సున్నితమైన అనుభవాల మధ్య ఈ సాయంత్రం జరిగిన క్విజ్ పోటీ అతన్ని భయపడేలా చేసింది.  

సాయంత్రం నాలుగు గంటలకు క్విజ్ కార్యక్రమం ప్రారంభించే ముందు చివరి సారిగా ప్రశ్నల ఆర్డర్ సరిగా ఉందో లేదో చూసుకుందామని ఫైల్ తెరచాడు. మొదట రాపిడ్ ఫైర్ రౌండ్ .రెండవది జనరల్ రౌండ్. ఆడియో విజువల్ మూడవ రౌండ్. చివరిగా ఐదు ప్రశ్నలతో బజర్ రౌండ్. ఒక వేళ టై అయ్యే సందర్భం వస్తే దాన్ని ఎదుర్కోవడానికి మరో ఐదు ప్రశ్నలు. ప్రక్షకుల కోసం మధ్య మధ్యలో కొన్ని ప్రశ్నలు. అన్నీ సక్రమంగానే ఉన్నాయని నిర్ధారించుకుని నిర్వాహకుల పిలుపు కోసం ఎదురుచూస్తున్నాడు మూర్తి.  

మరో ఐదు నిముషాల్లో అందరికీ స్వాగతం పలుకుతూ క్విజ్ నిర్వహించవలసిందిగా మూర్తిని , ఆరు టేయములను వేదిక మీదకు ఆహ్వానించాడు యాంకర్. 

మూర్తి అతనికి కృతజ్ఞతలు చెప్పి , ఈ క్విజ్ లో మొత్తం ఎన్ని రౌండ్స్ వుంటాయో, ఏ రౌండ్ లో ఎన్ని ప్రశ్నలుంటాయో, వాటికి ఏ రౌండ్ లో ఎన్ని మార్కులుంటాయో వివరించాడు. అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్పి, ఆల్ఫబెటికల్ ఆర్డర్ లో కూర్చున్న టీముల్లో , మొదటి టీముకు మొదటి ప్రశ్న అంటూ తన యజ్ఞాన్ని ప్రారంభించాడు. 

ప్రశ్నల తయారీకి మూర్తి చాలా కష్టపడతాడు. ఏవో తన స్టాక్ లో ఉన్న ప్రశ్నలు కొన్ని రాసేస్తే అయిపోదా ? అని మిత్రులెవరైనా అంటే నవ్వి వదిలేస్తాడు. తను నిర్వహిస్తున్న ప్రోగ్రాం ఎవరి కోసం, వాళ్ళ వయస్సు, వాళ్ళ నేపధ్యం ఇవన్నీ దృష్టిలో వుంచుకుని, వీలైనంత సందర్భోచితమైన, విషయ పరిజ్ఞానాన్ని అందించే ప్రశ్నలనేరుకుంటాడు. అందుకే మూర్తి క్విజ్ మాస్టర్ గా ఉంటే , ప్రోగ్రాం చాలా ఆసక్తికరంగా ఉంటుందని, నాలుగు విషయాలు తెలుస్తాయని నిర్వాహకుల నమ్మకం. 

మొదటి రౌండ్ పూర్తయింది. అందరిలోకి D గ్రూప్ అన్ని ప్రశ్నలకూ సమాధానాలు చెప్పి , ఇరవై ఐదు పాయింట్లతో మొదటి స్థానంలో వుంది. మూడు టీములు ఇరవై పాయింట్స్ తో, మిగతా రెండు టీములు పదహైదు పాయింట్స్ తో ఉన్నాయి.  

రెండో రౌండ్ చాలా ఆసక్తిగా సాగుతుంది. ఇందులో ప్రశ్నను పక్క టీం కు పాస్ చేసే అవకాశం ఉంటుంది. ఎవరి ప్రశ్నకి వారు సరైన సమాధానం చెబితే పది పాయింట్లు , పాస్ లో వచ్చిన పక్క వాళ్ళ ప్రశ్నను ఆన్సర్ చేస్తే ఐదు పాయింట్లు వుంటాయి. 

మరోగంట గడిచింది. 

ఈ రెండు గంటలు అక్కడ ఎన్నో రసవత్తరమైన ఘటనల పరామర్శలు చోటుచేసుకున్నాయి. ఆశ్చర్యమనిపించే సంగతులు, అద్భుతమనిపించే విషయాలు, నమ్మలేని నిజాలు, కష్టసాధ్యమైన ప్రక్రియల్లో విజేతలై నిలిచిన వాళ్ళ సాహసాలు అన్నిటినీ పరామర్శించుకున్నారు. ఫ్రెంచ్ విప్లవం తో ప్రపంచాన్ని ఆకర్షించిన నెపోలియన్ పిల్లులకు భయపడే వ్యాధితో బాధ పడే వాడని తెలిసి నవ్వుకున్నారు. మన దేశంతో పాటు ఆగస్ట్ 15 వ తేదీ స్వాతంత్ర్య సంబరాలు జరుపుకునే మరో దేశం పాకిస్తాన్ అనుకుని , అది కాదు దక్షిణ కొరియా అని తెలిసి నాలిక్కర్చుకున్నారు. జపాన్ వాళ్ళు అరిష్టంగా భావించే 13 సంఖ్యను ఇటలీ వాళ్ళు అదృష్టంగా భావిస్తారని , ఈ భూమ్మీద బుల్ ఫ్రాగ్ అసలు నిద్రపోని జంతువని తెలుసుకుని ఔరా అని ముక్కున వేలేసుకున్నారు. బహ్రైన్ దేశపు జాతీయగీతం లో కేవలం సంగీతమే తప్ప పదాలు లేవని, పియానో లో 88 కీస్ ఉంటాయని ..... ఇలా అనేకానేక సంగతులు .

మరో అర్థ గంట గడిచింది. 

చివరి అంకమైన బజర్ రౌండ్ మాత్రమే మిగిలివుంది. 

మూర్తి స్కోర్ బోర్డ్ చూశాడు. ఇది విజేతని నిర్ణయించే రౌండ్. A, E జట్లు నలభై మార్కులతో, F జట్టు నలభై ఐదు మార్కులతో, B , C జట్లు అరవై ఐదు మార్కులతో ఉండగా, D జట్టు అందరికంటే అత్యధికంగా ఎనభై ఐదు మార్కులతో మొదటిస్థానంలో వుంది. 

అందరినీ పరికించి చూస్తూ 

“ఫ్రెండ్స్, ఈ రౌండ్ లో కేవలం ఐదు ప్రశ్నలు మాత్రమే ఉంటాయి . ప్రతి ప్రశ్నకు సరైన సమాధానానికి మీకు 10 మార్కులు వస్తాయి అదే మీ సమాధానం తప్పయితే మీరు 5 మార్కులు కోల్పోతారు. ప్రశ్న పాస్ చేయడం జరగదు. మీ సమాధానం చెప్పడానికి మీకు కేవలం పది సెకన్ల సమయం మాత్రమే ఉంటుంది. కాబట్టి మీకు కాన్ఫిడెంట్ గా కరెక్టు సమాధానం తెలిస్తేనే బజర్ నొక్కండి , లేకపోతే అనవసరంగా మార్కులు పోగొట్టుకుంటారు. ఆల్ ద బెస్ట్” 

మొదటి ప్రశ్న వెలువడిన వెంటనే F గ్రూప్ బజర్ నొక్కి సరైన సమాధానంతో 10 మార్కులు గెలుచుకుంది. 

రెండవ ప్రశ్నకు B టీం వాళ్ళకు పది మార్కులు వచ్చాయి. 

మూడో ప్రశ్నకు ఎవరూ బజర్ నొక్కలేదు. క్విజ్ మాస్టరే దానికి సమాధానం చెప్పవలసి వచ్చింది. 

అభ్యర్థులలో ఒత్తిడి, ఆందోళన వాళ్ళ ముఖాలలో ప్రస్ఫుటమౌతోంది. 

మూర్తి అడిగిన నాలుగో ప్రశ్నకి C టీమ్ బజర్ నొక్కడమూ , 10 మార్కులు వాళ్ళ ఖాతాలో వేసుకోవడమూ సెకన్లలో జరిగిపోయింది. 

ఇప్పుడు స్కోర్ బోర్డ్ లో D గ్రూప్ ఎనభై ఐదు మార్కులతో, B,C లు డెబ్భై ఐదు మార్కులతో ఉన్నాయి. F పది పెంచుకుని యాభై ఐదు కు చేరుకోగా, A, E లు 40 మార్కులతో పాత స్కోర్ నే కొనసాగిస్తున్నాయి. 

క్విజ్ పోటీ పరాకాష్టకు చేరుకుంది. చిట్టచివరి ప్రశ్న. 

ఆడిటోరియమంతా ఉద్విగ్నమయమైపోయింది. అందరూ ఊపిరి పీల్చడం కూడా వాయిదా వేసుకుని మూర్తి నోటి నుండి బయటకొచ్చే ప్రశ్న కోసం రెప్పలార్పకుండా కాసుక్కూర్చున్నారు. కొందరి చేతులు అప్రయత్నంగానే కుర్చీ హాండిల్స్ ని బలంగా నొక్కిపెడుతున్నాయి. అభ్యర్ధులంతా తమ తమ టీమ్ మెంబర్లతో చిరుసవ్వడితో మాట్లాడుతూ గుస గుస లాడుకుంటున్నారు.  

సర్వత్రా ఉత్కంఠ నెలకొన్న ఆ సమయం లో 

మూర్తి , చివరి ప్రశ్నఉన్న కార్డ్ తీసుకుని కళ్ళతో ఒకసారి ప్రశ్నను చూశాడు. అభ్యర్ధుల వైపు తిరిగి ప్రశ్న  చదవడానికి నోరు తెరచి “ తాము ..” అని అన్నాడో లేదో – 

“జర్ జర్ ... జర్ ర్ ర్. ర్ ర్ ర్ ర్...”. మని బజర్ సౌండ్ వినిపించింది.     

మూర్తి చదవడం ఆపాడు. వాళ్ళ క్రమశిక్షణా రాహిత్యానికి లిప్తపాటులో వెయ్యి వోల్టుల కోపం వచ్చింది. 

ఎందుకింత తొందర పడతారు? ఇంకా ప్రశ్న సగమైనా పూర్తి కాక ముందే పూర్తి ప్రశ్న ఏమైఉంటుందో ఎలా ఊహిస్తారు ? ఏం సమాధానం చెబుతారు ? అనవసరంగా మార్కులు పోగొట్టుకోవడం తప్ప – అనుకుంటూ , ఇంతకీ ఎవరు బజర్ నొక్కారో చూశాడు.  అది – D గ్రూప్. 

ఆశ్చర్యపోయాడు. వేరే ఎవరో అయితే, గెలవాలనే వత్తిడిలో నొక్కారనుకోవచ్చు, వీళ్ళెందుకు చేసారీ పని ? 

వాళ్ళ వైపు చూసేంతలో వెంటనే – అందులో ఒకడు ప్రశ్నకు సమాధానం చెబుతున్నట్టుగా – “ అమెరికా “ అన్నాడు. 

అలా అన్నాడో లేదో, రెండో వాడు బొటనవేలు పైకెత్తి చూపుతూ ఒక్క ఊపులో మొదటివాడిని కౌగలించుకున్నాడు. ఇద్దరూ రెండు చేతులతో కిందకీ , పైకీ చప్పట్లు కొట్టుకుంటూ, విజయోత్సాహాన్ని పంచుకుంటున్నారు.           

అన్నీ సెకన్లలో జరిగిపోయాయి. జరిగినదేంటో మూర్తికర్థమైంది. జనానికంతా అర్థమయ్యేందుకుగాను స్కోర్ బోర్డ్ మార్చారు – టీమ్ D , చివరి ప్రశ్నకు తప్పు సమాధానం చెప్పి , ఐదు మార్కులు కోల్పోయి ఎనబై మార్కులతో తన ఆధిక్యాన్ని నిలుపుకుని విజేతగా నిలిచింది. B, C టీమ్ లు డెబ్భై ఐదు మార్కులతో రెండవ స్థానంలోనే ఉన్నాయి. ప్రేక్షకులలో ఒక్కసారి కలకలం, వెంటకే D టీమ్ ను అభినందిస్తునట్లుగా కరతాళధ్వనులు ...  

మూర్తి దీన్ని జీర్ణించుకోలేకపోతున్నాడు.

B , C లలో ఎవరైనా ఎక్కడ కరెక్ట్ సమాధానం చెప్పి తమతో సమానమౌతారో , ఆ తరువాత జరిగే టై బ్రేక్ లో ఒక వేళ తాము ఓడిపోతామేమోనని ....... కనీసం ప్రశ్న ఏంటో వినకుండా , సమాధానం ఏమిటో తెలుసుకోకుండా ఎదుటి వాళ్ళకి కనీసం ప్రశ్న వినే అవకాశం కూడా ఇవ్వకుండా , ఎదుటివాళ్ల విజయావకాశాల మీద దెబ్బ కొట్టిన D టీమ్ మీద చాలా కోపం వచ్చింది. 

మూర్తి ఏదైనా మాట్లాడదామని నోరు తెరిచేలోపే, యాంకర్ మైకు నిండా గట్టిగా అరుస్తూ – 

“ సో , లేడీస్ అండ్ జెంటిల్మన్ , ఈ రోజు విజేతలు – మన D –టీమ్. చివరి నిముషంలో వాళ్ళు ప్రదర్శించిన తెలివితేటలు , సమయస్ఫూర్తి మరువలేనివి. అమోఘం , అద్భుతం.” అన్నాడు.

ఇంతలో ఎవడో మొబైల్ నుండి టపాకాయల చప్పుడు ప్లే చేయడం మొదలుపెట్టాడు. కింద నుండి D టీమ్ వాళ్ళ శ్రేయోభిలాషులు బొటనవేలు పైకెత్తి విజయసంకేతాలను వ్యక్తం చేస్తున్నారు. ఫేస్ బుక్ లో పెట్టడం కోసం కాబోలు ఒకడు ఫోన్ లోనే స్కోర్ బోర్డ్ ను, వాళ్ళ మిత్రులను ఫోటో తీస్తున్నాడు. చివరి ప్రశ్న ఏమిటో తెలుసుకుందామన్న ఆసక్తి ఎవరికీ ఉన్నట్టు కనబడడం లేదు.  

మూర్తి అక్కడ ఉండలేకపోయాడు. మెల్లగా మెట్లు దిగి కిందకొచ్చి కుర్చీలో కూర్చున్నాడు. 

ఇంతలో యాంకర్ 

“మిత్రులారా, మీరంతా ఒక ఉద్విగ్నభరితమయన , ఉత్సాహభరితమైన, మరిచి పోలేని అపూర్వమైన మ్యాచ్ చూశారు. ఇక కొన్ని నిముషాల్లో బహుమతి ప్రదానం జరుగుతుంది. ఇప్పుడు కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు- ముందుగా ........ .” 

మూర్తికి అక్కడ కూర్చోవాలనిపించలేదు. ఒక్కడే నడచుకుంటూ ఆడిటోరియమ్ దాటి పక్కనే వున్న ఆఫీస్ రూమ్ కి వచ్చాడు. 

అప్పటినుండీ సైన్స్ సార్ కోసం ఎదురుచూస్తూ ఆఫీస్ రూమ్ లో కూర్చుని వున్నాడు. అతనింకా బజర్ రౌండ్ కి సంబంధించిన ఆలోచనలో వుండగానే -ఆడిటోరియమ్ లో నుండి యాంకర్ గొంతు వినబడింది. 

“ఫ్రెండ్స్ , ఇప్పుడు సభ ప్రారంభం కాబోతోంది” అంటూ పెద్ద పెద్ద వాళ్లందరినీ విశేషణాలతో సహా పేరు పేరునా , వేదిక మీదకు ఆహ్వానించాడు . ఆఫీస్ రూమ్ లోకి ఆడిటోరియమ్ లోని మాటలు స్పష్టంగా ప్రవహిస్తున్నాయి. 

కళాశాల ఛైర్మన్ మాట్లాడుతూ క్విజ్ తో తనకున్న అనుబంధాన్ని నెమరేసుకుని, ఈ రోజు జరిగిన పోటీ లో D టీమ్ కనబరచిన పరిణితి, గెలవాలన్న ఆకాంక్ష , గెలుపుమీద వారికున్న పట్టుదల బహుధా ప్రశంసనీయమని చెప్పాడు.

మూర్తి మనసుని ఈ మాటలు మరింత గాయపరుస్తున్నాయి. ఆ పిల్లలు గెలుపు మీద కోరికతో ఆ పని చేశారా? ఓటమని తట్టుకోలేని భయంతో చేశారా? అవతల వాడు గెలుస్తాడేమోననే అభద్రత , తమ స్థానాన్ని కోల్పోతామేమో అనే భయంతో ఎదుటివారి విజయావకాశాలని తుంచేయడం ఎంత వరకూ విజ్ఞతో, అలాంటి ఆలోచనలు ఎంత ప్రమాదకరమో చెప్పాల్సింది పోయి, ఆ పిల్లలని వీళ్ళు గొప్ప హీరోలని చేసేస్తున్నారు.  

వక్త మారాడు. ఎల్ సీ ఎస్ ఎం‌డి కాబోలు మాట్లాడుతున్నాడు – 

“ మొత్తం ఎపిసోడ్ లో నాకు నచ్చిన అంశం - చివర్లో ఈ పిల్లలు తీసుకున్న వ్యూహాత్మక నిర్ణయం. అంత తక్కువ సమయంలో , అన్ని వత్తిడుల మధ్య - ఏవో వందల కోట్ల వ్యాపార లావాదేవీలలో మేం అనుసరించే వ్యూహాన్ని వీళ్ళు ఇంత తక్కువ వయస్సులో అమలుచేయడం చాలా గొప్ప విషయం. ఈ సంఘటన వీళ్ళ భవిష్యత్తు గురించి మంచి ఆశలు కల్పిస్తోంది. మేం వ్యాపారంలో కిల్లింగ్ ఇన్ స్టింక్ట్ అంటుంటాం. అది ఈ చిన్నారుల్లో పుష్కలంగా వుంది. .......” 

మూర్తికి చికాకుగా వుంది. భారంగా వుంది. తల పగిలిపోయేలా వుంది. కొంచెం సేపు బయట గాలిలో ఉంటే ఈ బరువు తగ్గుతుందని బయటకు నడిచాడు.     

ఎల్ సీ ఎస్ ఎం‌డి మాట్లాడుతున్న మాటలకు ప్రజలు చప్పట్లు కొడుతున్నారు. అదేంటి , ఇంత మంది లో ఒక్కరంటే ఒక్కరైనా ఈ పిల్లలు గెలిచిన మాట వాస్తవమే కానీ , గెలిచిన తీరు మాత్రం అభ్యంతరకరం అని చెప్పరేమిటి ? పిల్లలు తెలిసో తెలియకో చేశారు. దానిని ఇంత మంది సమర్ధించడం , పైపెచ్చు పొగడడం మూర్తికి బొత్తిగా నచ్చలేదు. కోట్ల లావాదేవీలలో ఆ పెద్ద మనిషి మనసు చెదలు పట్టి ఉండవచ్చు. కానీ అమాయకమైన పసి మనసుల్లో ఆ విష బీజాలను ఏరి పారేయక , నీళ్ళు పోసి పెంచడమేమిటి ? విజయం కంటే విలువలు గొప్పవని , సాధించిన విషయంతో పాటు సాధన మార్గం కూడా ముఖ్యమైనదని ఆ పిల్లవాళ్ళకు ఎవరూ చెప్పడంలేదెందుకు ? ఉన్నత స్థానానికి ఎగబ్రాకే క్రమంలో ఉదాత్తతని విస్మరించడం తప్పని వాళ్ళు ఎప్పుడు తెలుసుకుంటారు ? 

“ఇప్పుడు ఎమ్మెల్యే గారు విజేతలకు బహుమతి ప్రదానం చేస్తారు, ఆ తరువాత క్విజ్ మాస్టర్ ని శాలువాతో సత్కరిస్తారు. ” స్పీకర్ లో నుండి యాంకర్ మాటలు. 

ఎమ్మెల్యే ని తలచుకోగానే అప్రయత్నంగా పిరదౌసి లోని “నీచే పూజితుండైనచో అల్లాకున్ సుఖమే” వాక్యం మనసులో మెదిలింది మూర్తికి. 

గెలుపు కోసం ఈ పిల్లలు చేసిన పనిని ఈయన పెద్ద మొత్తంలో చేశాడు. ఇరవై ముప్ఫై యేళ్ళ నుండి పార్టీ ని నమ్ముకున్న వాళ్ళకు కాకుండా వ్యాపారాలు నడిపే తనకి టికెట్ ఇప్పించుకున్నాడు. అప్పోజిషన్ క్యాండేట్ కి నమ్మకమైన ఇద్దరు అనుచరులను ప్రలోభపెట్టి తన వైపు తిప్పుకున్నాడు. ఓటుకు వెయ్యి రూపాయలు పంచి ఎదుటి క్యాండేట్ ని బలహీనుణ్ణి చేశాడు. అవును, ఇలాంటి వాళ్ళకు ఈ రోజు ఆ పిల్లలు చేసింది గొప్ప వ్యూహమనిస్తుంది. ఈ రోజు ఆ పిల్లలు క్విజ్ లో గెలిచిఉండవచ్చు. కానీ వాళ్ళ ప్రవర్తన వల్ల క్విజ్ ఓడిపోయింది. 

ఈ ఆలోచన రాగానే మూర్తి ఆడిటోరియమ్ దాటి , ఆఫీస్ బిల్డింగ్ దాటి పార్కింగ్ వేపు అడుగులేస్తున్నాడు. 

ఇందాకటి నుండి ఒక ప్రశ్న మనసును తొలుస్తోంది. ఇంతకీ D టీం వాళ్ళు చేసిన పనికి మూలకారణమేమిటి ? విజయం పట్ల మనకున్న విపరీత వ్యామోహమా? విలువల పట్ల మనకున్న సర్దుబాటు ధోరణా ? వేగం మీది కోరికతో వాళ్ళ వివేకాన్ని హరించిన తన బజర్ రౌండా ? ఎదుటి వాడు ఏమైనా ఫరవాలేదు, మనం బాగుంటే చాలనే స్వార్ధమా ? కొన్ని వేల ప్రశ్నలకు అవలీలగా సమాధానాలు చెప్పగలిగిన మూర్తికి ఈ ప్రశ్నకు సమాధానం దొరకడం లేదు.  

బండి స్టార్ట్ చేయాలని చూస్తుంటే ఇందాకటి నుండి తన చేతిలో ఉన్న పేపర్ అడ్డొచ్చింది. తిప్పి చూశాడు. 

అది ఆ క్విజ్ లో అడగకుండా ఆపివేయబడ్డ చిట్ట చివరి ప్రశ్న - 

“తాము ఓడిపోతామని , తద్వారా సెమీస్ లో అర్హత కోల్పోతామని తెలిసినా , క్రీజు బయట నిలబడిన ప్రత్యర్ధి బ్యాట్స్ మెన్ ను ఔట్ చేయకుండా తన క్రీడా స్ఫూర్తిని చాటుకున్న వెస్టిండీస్ క్రీడాకారుడెవరు ?”

    *****


Rate this content
Log in

Similar telugu story from Drama