Varun Ravalakollu

Drama Romance Thriller

4.9  

Varun Ravalakollu

Drama Romance Thriller

లవ్ ఇన్స్టిట్యూట్ ( పార్ట్ -2 )

లవ్ ఇన్స్టిట్యూట్ ( పార్ట్ -2 )

6 mins
580


“ఇక్కడ మీరు చూస్తున్నవి ఆస్ట్రియాలోని గ్యాస్టియన్ హీలింగ్ గుహలు. ఈ గుహలే నా రిసర్చ్ కి ప్రేరణ. ప్రకృతి పరంగా ఏర్పడ్డ కొన్ని ప్రత్యేక పరిస్థితుల కారణంగా అక్కడ కెమికల్ రియాక్షన్ జరిగి ఒక రకమైన గ్యాస్ ఫామైంది. పూర్వం బంగారం కోసమని ప్రజలు ఆ గుహాల్లోకి వెళ్ళి అన్వేషణ చేసేవారట. అలా వెళ్ళిన వాళ్ళు అక్కడ గ్యాస్ పీల్చటం వల్ల వారి అనారోగ్య లక్షణాలు తగ్గిపోవటం జరిగింది. ఇప్పుడు ఏటా 75 వేల మంది దాకా ఆ గుహాల్లోకి వెళ్ళి వారి దేసీసెస్ని క్యూర్ చేసుకుంటున్నారు” చెప్పి ప్రజెంటేషన్ ముగించాడు. లైట్స్ ఆన్ చేయించి అందర్నీ ఒకసారి చూసి,

“ఆ గుహల్లోని పరిస్థితులని మనం ఇక్కడ కృత్రిమంగా సృష్టించి పేషెంట్ ని టచ్ చేయకుండా క్యూర్ చేయొచ్చు. అదే నా రిసర్చ్ యొక్క మెయిన్ పాయింట్. దీని కోసం నేనే స్వయంగా ఆస్ట్రియా వెళ్ళి అక్కడి గుహల మీద పరిశోదన చేసి వచ్చాను. ఇప్పటిదాకా గైడ్ లైన్స్ ప్రకారం జంతువుల మీద పరీక్షలు జరిపి 100 పర్సెంట్ విజయం సాధించాను. ఇప్పుడు మీరు అప్రూవ్ చేస్తే మనుషుల మీద కూడా ప్రయోగించి విజయం సాధిస్తాననే నమ్మకం నాకుంది. ఈ ట్రీట్మెంట్ గనుక వాడుకలోకి వస్తే ఫ్యూచర్ లో ఏ ప్రాంతంలోనైనా అంటు వ్యాధులు ప్రబలినప్పుడు, మనం ఆ ప్రాంత ఎట్మాస్పియర్ లో మెడికేటెడ్ గ్యాస్ ని విడుదల చేసి చాలా క్విక్ గా రిసల్ట్స్ పొందవచ్చు. సేమ్.. మనం వర్షాలు పడాలని మేఘమధనం కోసమై ఆకాశంలో ఎలాగైతే గ్యాస్ ని రిలీజ్ చేస్తామో, అలాగే ఈ గ్యాస్ ని రిలీజ్ చేస్తాము. మీకేమన్నా ఫర్ధర్ గా డౌట్స్ ఉంటే మీ ముందు నేను సబ్మిట్ చేసిన థీసిస్ ఉన్నాయి, చూడచ్చు” ముగించాడు శేఖర్. శేఖర్ ముఖం సంతోషంతో వెలిగిపోతుంది. అన్నీ తననుకున్నట్టు జరిగాయనే సంతోషమది. అతడి కళ్ళల్లో గర్వం, కోరుకుంది సాధించబోతున్నాననే గర్వమది. డి‌.సి‌.జి సమాధానం కోసం ఎదురు చూస్తున్నాడు.

శేఖర్ ఆరాటం గమనించిన డి‌.సి‌.జి తన సమాధానం ఇవ్వడానికి ఎక్కువ సమయమేం తీసుకోలేదు. టేబుల్ మీద ఉన్న థీసిస్ బుక్ అందుకుని క్షణకాలం కన్నా తక్కువ సేపే చూసి తిరిగి టేబుల్ మీద పడేశాడు. దీర్ఘంగా శ్వాస పీల్చి,

“మిస్టర్ శేఖర్ మీ రిసర్చ్ చాలా గొప్పది. ఒప్పుకుంటాను. కానీ దీన్ని ఫర్ధర్ స్టేజ్ కి అప్రూవ్ చేయటం కుదరదు. నిజానికి ఈ విషయం చెప్పటానికే మిమ్మల్ని ఆఫీసుకి బదులు ఇక్కడికి రమ్మన్నాను” డి‌.సి‌.జి పూర్తి చేసే లోపే కల్పించుకున్నాడు శేఖర్. ఊహించని సమాధానం ఎదురవడంతో,

“ఎందుకు కుదరదు?” సూటిగా అడిగాడు. అతడి ముఖంలో రంగులు మారాయి. కళ్ళు తీక్షణమయ్యాయి.

“మిస్టర్ శేఖర్, మీరు తయారు చేసిన ఫార్ములా హ్యూమన్ బీయింగ్స్ తట్టుకోలేరు. ప్రాక్టికల్ గా కుదరదని మా అభిప్రాయం. అప్రూవ్ చేయటం కుదరదు” డి‌.సి‌.జి పక్కన కూర్చున్న వ్యక్తి సమాధానమిచ్చాడు.

“వాట్ ఆర్ యు టాకింగ్ మిస్టర్ కామత్? 100 పర్సెంట్ విజయం సాధించిన ఫార్ములాని అనుమానిస్తున్నారా?” ఉబికివస్తున్న ఆవేశాన్ని అణుచుకోవటానికి ప్రయత్నిస్తున్నాడు.

“అఫ్కోర్స్, మీరు 100 శాతం సక్సెస్ రేట్ సాధించారు. కానీ ఆ 100 శాతం సక్సెస్ రేట్ మనుషుల పై సాధించింది కాదని గుర్తుంచుకోండి. మీరు తయారు చేసిన కెమికల్ స్ట్రక్చర్ హ్యూమన్ నర్వస్ సిస్టమ్ ని దెబ్బ తీసే అవకాశం ఉంది. మీరు ప్రతిపాదించిన కెమికల్ స్ట్రక్చర్ తోనే గతంలో వేరే డ్రగ్స్ తయారు చేసినప్పుడు సైడ్ అఫెక్ట్స్ రావటంతో వాటిని గవర్నమెంట్ బ్యాన్ చేసిన సంగతి మీకు తెలియంది కాదు”

“నో... నో! ఇప్పుడలాంటిదేమీ జరగదు. ఈ ట్రీట్మెంట్ మీద నాకు నమ్మకం ఉంది. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి”

“నమ్మకాలు వేరు, నిజాలు వేరు మిస్టర్ శేఖర్. 100 పర్సెంట్ సేఫని తెలియకుండా అప్రూవ్ చేయటానికి రూల్స్ ఒప్పుకోవు. వాటి గురించి మీకు వివరించనక్కర్లేదనుకుంటా”

“హెల్ విత్ ద రూల్స్!” విచక్షణ కోల్పోయిన శేఖర్ అరిచాడు.

అతడి అరుపుకు అక్కడివారందరు నివ్వెరపోయారు. శేఖర్ కళ్ళు పూర్తిగా ఎరుపెక్కాయి. ముఖం రాక్షసంగా కనిపించింది వాళ్ళకి. డి.సి.జితో పాటు ఉన్న అందరి వెన్నులో చిన్నపాటి కుదుపు. శేఖర్ అరుపు అలా ఉంది మరి! విచక్షణ కోల్పోయిన అతడు ఇంకేం చేస్తాడో అని అందరూ ఎదురు చూస్తున్నారు. ఇంతలో డీ.సీ.జీ,

“వాట్ ఈజ్ దిస్ మిస్టర్ శేఖర్? బిహేవ్ యువర్ సెల్ఫ్. దిస్ ఈజ్ నాట్ ద వే ఫర్ ప్రాపర్ బిహేవియర్. సారీ” అంటూ కుర్చిలోంచి లేచాడు డి‌.సి‌.జి. అతనితోపాటు మిగతా నలుగురు కూడా లేచారు. అందరూ వెళ్లిపోతే కామత్ మాత్రం శేఖర్ దగ్గరికొచ్చి,

“మీ పరిస్థితిని అర్థం చేసుకోగలను మిస్టర్ శేఖర్. కానీ..”

“ఇది నా ఎమినిదేళ్ళ కృషి డాక్టర్. దీనికి ఫలితమే లేదా?”

“ఉంటుంది. కాకపోతే మీ రిసర్చ్ 100 పర్సెంట్ సేఫని మాకు నమ్మకం కలిగించాలి”

“ఒకే డాక్టర్. నేను ఓటమిని అంగీకరించను. మళ్ళీ మొదట్నుంచి పరిశోధన మొదలుపెడతా. 100 పర్సెంట్ సేఫని నిరూపిస్తా”

“మిస్టర్ శేఖర్ ఈ స్థితిలో మీకు చెప్పలేకపోతున్నా, కానీ తప్పడం లేదు. హెల్త్ మినిస్ట్రీ నుంచి ప్రెజర్. మీ రిసర్చ్ కి ఫండ్స్ బ్లాక్ చేయమని. ఇక మీదట మీ రిసర్చ్ కి గవర్నమెంట్ నుండి ఎటువంటి ఫైనాన్షియల్ ఆసిస్టెన్స్ అందదు” శేఖర్ సబ్మిట్ చేసిన థీసిస్ ని అతని చేతికందిస్తూ అన్నాడు కామత్. అక్కడి నుండి వెళ్లిపోయాడు. శేఖర్ పిడికిలి బిగుసుకుంది. ఉబ్బిన నరాలు, ఎరుపెక్కిన కళ్ళు రక్తపు వేడిని సూచిస్తున్నాయి. గుండె వేగం పుంజుకుంది. ఈసారి అతడు పూర్తిగా విచక్షణ కోల్పోయాడు. చేతిలోని బుక్ నేలకెసి విసిరికొట్టాడు. ఆ విసురుడికి బైండ్ చేయబడిన బుక్ లోంచి ఊడి చెల్లా చెదురైన పేపర్లను చూస్తే అతడి మానసిక తీవ్రత అర్థమవుతుంది.


ఫ్లయిట్ హైదరాబాద్ చేరుకుందని మైక్ లో అనౌన్స్ చేసినప్పటికీ గాని ఆలోచనల నుంచి బయటికి రాలేదు శేఖర్. లాండింగ్ గేర్లు భూమిని తాకినప్పుడు ఏర్పడ్డ టచ్ డౌన్ ఒత్తిడిని ఫ్లయిట్ కి ఉన్న ప్రతి సెట్ ఆఫ్ వీల్స్ కి ఏర్పరిచిన షాక్ అబ్సార్బర్లు అడ్డుకున్నప్పటికి, తప్పించుకున్న ఒత్తిడి ప్రయాణికులని చేరగా, అప్పుడు తేరుకున్నాడు. అతడి ఆలోచనలు స్తంభించాయి. వర్తమానంలోకి వచ్చి మరుక్షణం భవిష్యత్తుకు మళ్ళాయి. వేగంగా సీట్ లోంచి లేచాడు. అంతకంటే వేగంగా కదుల్తున్నాడు. ఫ్లయిట్ ఎక్కినప్పుడు ఉన్న అతడి బాడి లాంగ్వేజ్ కి పూర్తి విరుద్ధంగా ఉంది ఇప్పుడున్న బాడి లాంగ్వేజ్.

“ఏం జరిగింది? అప్రూవ్ చేశారా?” ఆతృతగా అడిగాడు రాఘవ్. రాఘవ్, శేఖర్ రిసర్చ్ టీమ్ లో మెంబర్. శేఖర్ సమాధానం కోసం అరగంట ముందుగానే ఎయిర్ పోర్ట్ కి వచ్చి వెయిట్ చేస్తున్నాడు. శేఖర్ మాట్లాడలేదు. మౌనంగా ముందుకు కదిలాడు.

“మీ సమాధానం కోసం మన టీమ్ మెంబర్స్ చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఎం‌.డి గారైతే ఇప్పటికే ఆరుసార్లు దాకా కాల్ చేశారు. మిమ్మల్ని కాంటాక్ట్ చేద్దామని ఎంతగానో ట్రై చేశాం. కానీ నాట్ రీచబుల్ అని వస్తుంది”. శేఖర్ సెల్ స్విచాఫ్ చేశాడు. ఆ విషయాన్నే ప్రస్తావించాడు రాఘవ్. దానికి కూడా సమాధానమివ్వలేదు శేఖర్. గుంభనంగా వెళ్ళి కార్ లో కూర్చున్నాడు. దేనికి స్పందించకపోయేసరికి అయోమయంగా శేఖర్ వంక చూశాడు రాఘవ్. సీరియస్ గా కన్పిస్తున్నాడు. అతడి వాలకం చూస్తే జరక్కూడనిది ఏదో జరిగినట్లు అన్పిస్తుంది. ఇక ప్రశ్నలు వేయటం మాని వెళ్ళి డ్రైవింగ్ సీట్ అలంకరించాడు.

“ఎక్కడికి పోనిమ్మంటారు? హాస్పిటల్ కా?” అడిగాడు.

“ల్యాబ్ కి” ఈసారి సమాధానమిచ్చాడు శేఖర్. ఎయిర్ పోర్ట్ నుండి బంజారాహిల్స్ లోని రిసర్చ్ ల్యాబ్ కి, కార్ ని పరిగెత్తించాడు రాఘవ్.

శేఖర్ బుర్రలో పరుగులు పెడుతున్న ఆలోచనలు నిర్ణయమనే ఫినిషింగ్ లైన్ వద్దకు వచ్చి ఆగాయి. అవి సూచిస్తున్న పరిష్కారం వైపు మొగ్గటానికి శేఖర్ మనసెందుకో ఒప్పుకోవటం లేదు. కానీ అది తప్ప తనకింకొక దారి కనబడటం లేదు. పోనీ మళ్ళీ పరిశోధన మొదలుపెడదామా అంటే, గవర్నమెంట్ నుండి ఫైనాన్షియల్ గా సహకారం అందకుండా రిసర్చ్ కొనసాగించటం కష్టం. అది అసాధ్యం కూడా. ఇక శేఖర్ ఆలస్యం చేయలేదు. వెంటనే తన ల్యాప్టాప్ ఓపెన్ చేసి నెట్ కనెక్ట్ చేశాడు. తన జి-మెయిల్ నుండి మెయిల్ చేశాడు.

ఇది జరిగిన పదిహేను రోజుల తరువాత...

వాచ్ చూస్తే సమయం సరిగ్గా నాలుగు గంటల నలభై ఐదు నిమిషాలుగా చూపిస్తుంది. ఐదు అవటానికి ఇంకా పదిహేను నిమిషాలు ఉంది. ఐదు ఎప్పుడవుతుందా అని ఎదురుచూస్తున్నాడు హైదరాబాద్ లోని హిందూజా గ్లోబల్ సోల్యూషన్స్ లో కాల్ సెంటర్ ఏజంట్ గా పనిచేస్తున్న వరుణ్. క్రితం నెలలోనే అతడి చేతికి ఎం.టెక్ పట్టా వచ్చింది. జాబ్ ట్రైల్స్ వేస్తూ అందాకా ఖాళీగా ఉండటం ఎందుకని కాల్ సెంటర్ లో చేరాడు. ఏంటో మధ్యాహ్నం షిఫ్ట్ కి కూర్చున్నప్పటి నుండి ఒకటే కంప్లయింట్ కాల్స్ వస్తున్నాయి. మా బ్యాలెన్స్ కట్టయింది... మా బ్యాలెన్స్ కట్టయింది... అని కంప్లయింట్ చేసేవాళ్లే ఎక్కువగా కాల్ చేశారు. వాళ్లందరికి సర్ది చెప్పి,చెప్పి ఇంకా వినకపోతే ఎంక్వయిరి చేసి, పోయిన బ్యాలెన్స్ ఎంతో కనుక్కుని పంపి, పంపి విసుగుపుట్టేసింది వరుణ్ కి. అయినా కాల్ సెంటర్ జాబంటే ఇదంతా మామూలే. రోజూ కొన్ని వందల్లో ఇలాంటి కాల్స్ అటండ్ చేయాల్సి వస్తుంది. వాటన్నింటికి విసుగు చెందకూడదు. వరుణ్ వెయిట్ చేస్తుంది విసుగు చెంది కాదు.ఐదు అవుతే షిఫ్ట్ ముగిసిపోతుంది, తన కిష్టమైన పని చేయొచ్చు అని. మళ్ళీ వాచ్ చూశాడు. ఈసారి సమయం నాలుగు గంటల యాబై అయిదు నిమిషాలుగా చూపిస్తుంది. ఇంతలో కాల్ వచ్చింది. దాన్ని అటండ్ చేశాడు వరుణ్.

“హలో, నా పేరు వరుణ్. చెప్పండి నేను మీకు ఏవిధముగా సహాయము చేయగలను?”

“నాకు కంచె సినిమా నుండి టైటిల్ సాంగ్ హలోట్యూన్ గా కావాలి సార్. దానికి ఎంత చార్జ్ చేస్తారు?”

“తప్పకుండా తెలియజేస్తాను సార్. ముందుగా మీ పూర్తి పేరు మరియు మొబైల్ నెంబర్ చెప్పగలరా?”

“నా పేరు రామాయప్ప. మొబైల్ నెంబర్ 8686516248”

“మీ పేరు మరియు మొబైల్ నెంబర్ తెలియజేసినందుకు ధన్యవాదాలు. ఇప్పుడు చెప్పండి మీకు ఏం కావాలో?”

“నాకు కంచె నుండి హలోట్యూన్ కావాలి. దానికి ఎంతవుతుందండి?”

“తప్పకుండా సార్. సాంగ్ డౌన్ లోడింగ్ కి 15 రూపాయలు. మంత్ కి 30 రూపాయలు చార్జ్ చేయబడతాయి”

“హా! పర్లేదు యాక్టివేట్ చేయండి”

“ఒకే సర్, ఇది మీకు రెండు గంటల్లోగా యాక్టివేషన్ లోకి వస్తుంది”

“సరే!!”

“మీకు మరే ఇతర సహాయమేమన్నా కావాలా?”

“లేదు”

“మీరు మా ముఖ్యమైన ఖాతాదారులుగా ఉన్నందుకు సంతోషం. నిరంతర సేవలు ఆనందించటానికి మాకు ఇలాగే కాల్ చేయండి. ధన్యవాదాలు” అంటూ కాల్ కట్ చేశాడు వరుణ్.

వాచ్ చూస్తే సరిగ్గా అయిదు చూపించింది. హమ్మయ్యా... లాస్ట్ కాల్ కంప్లయింట్ కాల్ రాలేదు సంతోషం! అనుకుంటూ హెడ్ ఫోన్స్ తీసి డెస్క్ మీద పెట్టి లేచాడు.

కుర్చీ సరిచేసి వెనక్కి తిరిగి అడుగులు వేస్తూ అన్నీ పెట్టుకున్నాడో లేదోనని జేబులు తడుముకున్నాడు. సెల్ ఫోన్ మర్చిపోయాడు! వెంటనే తాను కూర్చున్న సీట్ వంక చూశాడు. డెస్క్ పక్కనే సెల్ కనిపించింది. దానిని తీసుకుని జేబులో పెట్టుకుని ఫ్లోర్ ఇన్చార్జికి చెప్పి బయటకి నడిచాడు.

***


Rate this content
Log in

Similar telugu story from Drama