POLAVARAPU PUSHPAWATI

Drama

3.6  

POLAVARAPU PUSHPAWATI

Drama

ఒకే ఒక్క తప్పటడుగు

ఒకే ఒక్క తప్పటడుగు

9 mins
485


భవానీకి గాలిలో తేలినట్టుగా ఉంది. పట్టరాని ఆనందం ఓ చోట నిలువనివ్వటం లేదు.కొడుకు కోడల పదవ పెళ్లిరోజు వేడుక అంగరంగ వైభవంగా జరుగుతుంది. కొడుకు అర్జున్, కోడలు వైష్ణవి ఇద్దరూ బెంగుళూరులో మంచి హోదా గల ఉద్యోగాలు చేస్తున్నారు. వాళ్ళ సహ ఉద్యోగులతో ఫంక్షన్ హాల్ నిండి ఉంది. స్టేజీపై పెద్ద స్క్రీన్ మీద తన కుటుంబం యొక్క గ్రూప్ ఫోటోని పెట్టించాడు కొడుకు అర్జున్. మధ్యలో తను, పక్కనే భర్త రాకేష్ వెడ్డింగ్ చైర్స్ లో కూర్చుని ఉన్నారు. ఒకవైపు కొడుకు అర్జున్ కోడలు వైష్ణవి, మరోవైపు కూతురు మోక్ష, అల్లుడు రాజేష్, కింద నలుగురు మనవళ్ళు, ఎంత చూడ సొంపుగా ఉందో, ఎంత చూసినా తనివి తీరట్లేదు భవానికి. కొడుకు, కోడలు, తమ తమ వాళ్లతో భవాని గురించి గొప్పగా చెబుతు, పరిచయం చేపిస్తుంటే భవాని ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఏ తల్లి తండ్రికైన ఇంతకంటే ఇంకేం కావాలి. వాళ్ల బిడ్డలు వాళ్ళ ప్రేమని అర్థం చేసుకుంటే చాలు కదా అనుకుంది మనసులో.

వారం రోజుల క్రితం బెంగళూరుకి వస్తున్నప్పుడు మనసులో రకరకాల భయాలు. కొడుకు కోడలు ఇద్దరిది ఎంతో బిజీ లైఫ్. ఇప్పుడు పిల్లలకి వాళ్ళ బిజీ లైఫ్ లో ఇంట్లో పెద్దవాళ్లు భారంగా అనిపిస్తున్నారని పేపర్లో చదివి చదివి అవే తలకెక్కయి భవానికి.

అందుకె ఎన్నోసార్లు కొడుకు రమ్మన్నా ఏదో వంక చెప్పి వచ్చేది కాదు. "పెళ్లై పదేళ్ళైనా నా దగ్గరికి రాలేదు, ఎంతసేపు చెల్లి దగ్గరే ఉంటున్నావు అని కొడుకు అనడంతో, ఈ సారి ఎలాగు వాళ్ల పదవ పెళ్లి రోజు దగ్గరుండి జరిపించినట్లు ఉంటుందని వచ్చింది.

భవాని ని చూడగానే కోడలు వైష్ణవి సంబర పడిపోయింది. కొడుకు అర్జున్ అయితే చిన్నపిల్లాడి లా అమ్మ ,అమ్మ అంటూ కొంగు పట్టుకుని తిరుగుతూనే ఉన్నాడు.

వాళ్ల ప్రేమాభిమానాలు చూసి,తను ఎంతైనా అదృష్టవంతురాలు అనుకుంది మనసులో.

కోడలు ఇంటిని చాలా శుచిగా ,అందంగా అమర్చి ఉంచింది. భవాని, కోడలి పనితనాన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోయింది. ఉద్యోగం చేస్తూ కూడా ఇంటిని ఇంత చక్కగా చక్కబెట్టుకోవడం నిజంగా ఓ మంచి లక్షణం అనుకుంది.

కానీ కోడలు, ఇందులో తను చేసింది ఏమీ లేదు, ఇంటిలో పనిచేస్తున్న సునీత పుణ్యమే ఇది.అని చెప్పింది.పనిమనిషి ఇంటిని ఇంత చక్కగా ఉంచింది అంటే నమ్మశక్యం కాలేదు భవానీకి. తొందరగా ఆ పనమ్మాయి సునీతని చూడాలనుకుంది.కానీ భవాని వచ్చి రెండు రోజులు అయినా సునీత కనిపించలేదు. ఆ విషయమే కోడలికి అడిగితే, ఎప్పుడు ఒక్క పూట కూడా సెలవు పెట్టని సునీత రెండు రోజులుగా సెలవు పెట్టేసింది కనీసం కారణము కూడా చెప్పలేదు, అని వాపోయింది.

వైష్ణవి ఎలాగోలా రెండు రోజులు అన్ని పనులు తనె చేసుకుంది కానీ మూడవ రోజు కోపం ఆపుకోలేక సునీకి ఫోన్ చేసింది."ఓవైపు అత్తగారు వచ్చి ఉంటే,ఈ సమయంలో నువ్వు ఇలా సెలవు పెట్టడం ఏమన్నా బాగుందా? అత్తగారు ఏమనుకుంటారు ఆమే వచ్చే టైంలో నిన్ను నేను మానిపించినట్టు. ఇలా అయితే కొత్త మనిషిని చూసుకుంటా అని గట్టిగా అడిగే సరికి,"అయ్యో వద్దమ్మా ఇంకెవరిని పెట్టుకోవద్దు నేనే వస్తా. కాస్త ఒంట్లో నలతగా ఉంది ఓ నాలుగు రోజులు ఓపిక పట్టండమ్మా" అంటు తెగ ప్రాధేయ పడింది సునీత.

ఇంకా నాలుగు రోజులు రాలేనంటుందటే ,కాస్త ఎక్కువ నలతగానే ఉన్నట్టుంది,"అయ్యో ఊరకనే తొందరపడ్డాను అనుకుంది మనసులో, ఎందుకంటే సునీత గత ఐదేళ్లుగా వాళ్ళింట్లోనే పనిచేస్తుంది. ఎప్పుడు సెలవు పెట్టిన పాపాన పోలేదు. పండగ పూట కూడా పనిలోకి వచ్చేస్తుంది.అడిగితే "నాకు మాత్రం ఎవరున్నారమ్మా ,మీ ఇంటికి వచ్చి మీ పిల్లల్ని చూసుకుంటే అదే నాకు పెద్ద పండగ" అనేది నవ్వుకుంటు.

"తను చేసే సేవ చూస్తే అసలు పిల్లల యొక్క సొంత అమ్మమ్మ, నాన్నమ్మలు కూడా ఇంతలా సేవ చేయరేమో అనిపించేది వైష్ణవికి.

ఒక సారి వైష్ణవికి ఒంట్లో బాగా లేకపోతే, అన్ని తానై సేవ చేసింది. పూర్తిగా నయం అయినంతవరకు తనకి కాలు కింద పెట్టనివ్వలేదు.ఎవరైనా కొత్తవారు వస్తే అసలు సునీత ఆ ఇంటి పనిమనిషి అని అనుకోరు అంతలా కలిసిపోయింది ఇంట్లో వాళ్లతో.

అలాగే ఒక్కసారి అర్జున్ కీ యాక్సిడెంట్ అయితే లేబోదిబోమంటూ హాస్పిటల్ లోనే ఉండిపోయింది. ఇంటికి వెళ్ళేది కాదు."ఇంటికి వెళ్లి ఏం చేస్తానమ్మా ఇక్కడే ఉంటే బాబుకి ఏదైనా అవసరం వస్తే చూసుకుంటాను కదా,"అంటూ రాత్రింబవలు అక్కడే ఉంటూ అర్జున్ నీ కంటికి రెప్పలా చూసుకుంది.

అంతలా అభిమానించే సునీతకి ఒంట్లో బాగోలేదంటే చిరాకు పడ్డానేంటి, అనుకుంటూ తనకు తానే తిట్టుకుంది వైష్ణవి.

అందుకే ఓసారి సునీతని పలకరించి వద్దామా అని బయలుదేరింది. ఏలాగు కోడలు బయటికి వెళుతుంది కదా .అలా కాస్త మార్కెట్ పని కూడా చూసుకుని రావచ్చుఅని భవాని కూడా కోడలితో పాటే వెళ్ళింది.

వైష్ణవి, కారు దిగి సునీత వాళ్ళు ఉంటున్న సందులోకి వెళుతుండగా ఎదురుగా సునీత వస్తూ కనిపించింది.

అనారోగ్య లక్షణాలు ఏమీ కనిపించలేదు ఆమేలో, కాకపోతే బాగా ఏడుస్తూ ఉన్నట్టు ఉంది ముఖం.

"అదేంటి ఒంట్లో బాగోలేదు అని అన్నావు ఇప్పుడు ఎలా ఉంది? అని అడిగింది వైష్ణవి కంగారుపడుతూ."మందులు వేసుకున్నాను గా తగ్గిందమ్మా అని తడబడుతూ బదులిచ్చింది సునీత. ఇంతలో కారులో కూర్చుని ఉన్న భవాని అటువైపు చూసింది. ఒక్కసారిగా ఉలిక్కి పడింది. "సుచరిత"అనుకోకుండా నోటి వెంబడి పదాలు వెలువడ్డాయి. గుండె దడ దడ కొట్టుకో సాగింది. సునీత ఏంటి సుచరిత పోలికలతో ఉంది. కారు దిగి అటువైపు వెళ్లబోయింది కాని అంతలోనే వైష్ణవి తిరిగి వచ్చేసింది. మరో దారి లేక భవాని వెనక్కు వచ్చేసింది. ఇద్దరూ బజారు పని పూర్తి చేసుకుని ఇంటికి వచ్చేసారు.

భవాని, ఇంటికైతే వచ్చేసింది గాని మనసు మాత్రం అలా సునీత ఉన్న సందుల్లోనే ఇరుక్కుపోయింది. 30 ఏళ్ల క్రితం మాయమైన సుచరిత, సునీత రూపంలో ఎదురుపడడం ఏంటి? వయసు పైబడినప్పటికీ సుచరిత పోలికలు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి సునీతలో. ఎక్కడో శ్రీకాకుళం లో మారుమూల గ్రామము నుంచి మాయమైన సుచరిత ఇన్నేళ్ల తర్వాత బెంగళూరులో తారసపడడం ఏంటి? అసలు సునీత, సుచరిత ఒక్కరేనా లేక వేరువేరా?తను ఏమన్నా పొరబడుతుందా? ఇలా రకరకాల ప్రశ్నలతో బుర్ర వేడెక్కిపోతుంది.

కోడలిని పిలిచి సునీత గురించి ఆరా తీసింది. "సునీత ఒక అనాధ అటండి. ఎప్పుడూ తన గురించి ఏమీ చెప్పదు. చిన్నప్పటినుంచి నాకు ఎవరూ లేరమ్మా అని చెబుతోంది. ఎక్కడి నుంచి వచ్చిందో కూడా తెలియదు. ఒకరోజు వచ్చి ఇంటి పని ఇప్పించమని అడిగింది."ఏ పనైనా చేసి పెడతా,నాకు రోజు గడిస్తే చాలమ్మా ,ఒక్కపూట కడుపునిండా భోజనం పెడితే చాలు అని పదేపదే బ్రతిమాలుకుంది. అనామకులను పనిలో పెట్టుకోవద్దని హెచ్చరికలు వస్తున్నప్పటికీ, ఎందుకో తన మీద చాలా జాలి వేసింది. మరోవైపు ఈ మహానగరంలోపని మనుషులు దొరకడం కూడా కష్టం. అందుకే పోనీలే పైపై పనులు చేసి పెడుతుందిలే అని పనిలో పెట్టుకున్నాము".

కానీ తన మంచితనముతో అందరి మనసులను గెలుచుకుంది. నోరు తెరిచి ఏదీ అడగదు. మనం ఏదిస్తే అదే మహాభాగ్యం అనుకుంటుంది. మరెక్కడికి పనికి కూడా వెళ్లదు. మనం ఇచ్చిన జీతంతోనే సరిపెట్టుకుంటుంది. తెల్లవారి ఆరో గంట కల్లా వచ్చేస్తుంది. రాత్రి తొమ్మిదికి గాని వెళ్ళదు. ఆఫీస్ నుంచి వచ్చిన నాకు ఒక్క పని కూడా చేయనివ్వదు, అలా ఏదేదో చెప్పుకుపోతుంది వైష్ణవి. భవానికి మాత్రం అవేవి వినిపించుకోలేదు. అనుమానం తలపై తాండవిస్తోంది. కంటిమీద కునుకు మాయమైంది. ఎక్కడో తేడా కొడుతుంది.

కాలగర్భంలో కలిసిపోయిన పీడకల లాంటి గతం మళ్లీ కళ్ళ ముందు కదలాడుతుంది.

***

సుచరిత, భవాని కి పెద్దమ్మ కూతురు. పేరుకు తగ్గ గుణవంతురాలు. మంచితనంతో అందరిని ఇట్టే ఆకర్షించుకునే ఉత్తమురాలు. రక్తసంబంధంతో పాటే ఇద్దరు మంచి స్నేహితులు కూడా. సుచరిత భర్త రాకేష్ చిన్న టిఫిన్ హోటల్ నడిపేవాడు.అన్యోన్యమైన దాంపత్యం వాళ్ళిద్దరిది. పెళ్ళై మూడేళ్లయింది.ఒక ఏడాది బాబు కూడా ఉన్నాడు. తల్లి, కొడుకు, కోడలు,మనవడు ముచ్చటైన కుటుంబం. కానీ అంతలోనే కాలానికి ఆ కుటుంబం అంటే కన్ను కుట్టినట్టుంది.

సుచరిత కి పెళ్లి చేసిన తర్వాత, అప్పులు బాధ తాళలేక వాళ్ళ అన్నయ్య దుబాయ్ వెళ్ళాడు. వెళ్లిన రెండేళ్లకే బాగా సంపాదించి అప్పులు తీర్చేసి భార్య కోసం కొన్ని నగలు కూడా చేయించాడు. అది చూసిన సుచరిత తన భర్త కూడా దుబాయ్ పంపిచాలనుకుంది. మనిషి మనసు చాలా బలహీనమైనది. దానిని అదుపులో పెట్టుకోకపోతే రేసుగుర్రంలా పరిగెడుతుంది. సుచరిత పరిస్థితి కూడా అంతే. భర్త దుబాయ్ వెళితే బోలెడు డబ్బు సంపాదించుకోవచ్చు అనుకుంది. రాకేష్ కి భార్య అంటే ఎనలేని ప్రేమ. అలాగే తన తల్లి ని విడిచి ఎప్పుడు ఎక్కడకి వెళ్లలేదు. దానికి తోడు ముద్దులొలికించే తన చిన్న బాబు ని విడిచిపెట్టి వెళ్లడం అంటే ఆషామాషీ కాదు. కానీ సుచరిత మొండి పట్టు ముందు చేసేది లేక తన బావమరిదితో కలిసి దుబాయ్ బాట పట్టాడు. బాగా సంపాదించి సుచరితకు డబ్బులు పంపించేవాడు. దానితో సుచరిత తనకు కావలసిన నగానట్రా కొనుక్కుంది.

ఏడాది తర్వాత రాకేష్ వచ్చాడు. ఓ రెండు నెలలు సంతోషంగా గడిపారు. రాకేష్ తను కూడా తెచ్చిన డబ్బులతో హోటల్ ని డెవలప్ చేసుకుని ఇక్కడే ఉంటాను అన్నాడు. కానీ "రక్తం రుచి చూసిన పులి మళ్లీ శాఖాహారం తింటుందా"? డబ్బు రుచి చూసినా సుచరిత పరిస్థితి కూడా అంతే. సొంత ఇల్లు కట్టుకునే అంత వరకైనా దుబాయ్ వెళ్లాల్సిందే అని పట్టు పట్టింది. తప్పనిసరై రాకేష్ మళ్లీ దుబాయ్ వెళ్లిపోయాడు. అతను వెళ్ళినప్పటికీ సుచరిత రెండోసారి గర్భం దాల్చి ఉంది.

సుచరిత వాళ్ళ ఇంటి నుంచి బ్యాంకు చాలా దూరం. ఇదివరకైతే తను బ్యాంకు కి ఆటోలో వెళ్ళేది. కానీ నిండు గర్భిణీగా ఆటోలో ప్రయాణం కష్టంగా అనిపించింది. రాకేష్ పంపిన చెక్కు క్యాష్ చేసుకోవాలంటే తప్పనిసరిగా బ్యాంకు కి వెళ్లాల్సిందే. అందుకే తన ఇంటి పక్కనే ఉన్న మహేష్ సహాయం కోరింది. మహేష్ తన మోటార్ బైక్ పై ఆమేకి బ్యాంకు కి తీసుకు వెళ్లేవాడు. ఇంతవరకు బాగానే ఉంది కానీ డబ్బుఎంతటి వాళ్ళకైనా ఏమార్చి వేస్తుంది. మహేష్ కన్ను కూడా నెలనెలా సుచరిత బ్యాంకు నుంచి తెచ్చుకుంటున్న డబ్బులు పైన పడింది. అంతే తను సుచరితతో కాస్త సాన్నిహిత్యం పెంచాడు. నెమ్మది నెమ్మదిగా సుచరితని తన మాటల గారడీతో ఆకర్షించుకోవడం ఆరంభించాడు. రాకేష్ కి దూరంగా ఉండడం వలనో, మహేష్ మాటల గారడి వలనో, ఎంతో సౌమ్యంగా ఉండే సుచరిత విచక్షణ శక్తిని కోల్పోయింది.

ప్రతి పనిలో మహేష్ సహాయం కోసం ఎదురుచూసేది. సుచరితకు పాప పుట్టింది. ఇప్పుడు సుచరిత మామూలు మనిషి, అయినా మహేష్ బండి మీద వెళ్లడం మానలేదు. మహేష్ కూడా ఇంటా బయట ప్రతిచోట సుచరితకి చేదుడు వాదోడుగా ఉంటూ క్షణం కూడా విడిచి పెట్టేవాడు కాదు.

నెమ్మది నెమ్మదిగా చుట్టుప్రక్కల జనాలలో వాళ్ల గురించి గుసగుసలు మొదలయ్యాయి. భవాని వాళ్ళ అమ్మ, తన చెల్లెలు కూతురి గురించి నలుగురు ఇలా మాట్లాడుకుంటుంటే తట్టుకోలేక, వెళ్లి సుచరితని నిలదీసింది.ముందు బుకాయించి, తర్వాత తన పెద్దమ్మతోనే గొడవకు దిగింది సుచరిత. వీధిలో వాళ్లు,వాళ్ళిద్దరి లీల పై అభ్యంతరాలు పెట్టడం మొదలుపెట్టారు. దానితో సుచరిత లో ఒక రకమైన బరితెగింపు వచ్చేసింది. ఎవ్వరినీ ఖాతరు చేసేది కాదు. వీధిలో వాళ్ళకి కోపం వచ్చి, పరువు గల వీధిలో ఇలాంటివి పనికి రావని కాస్త గట్టిగా చెప్పారు.

కామంతో కళ్ళు మూసుకుపోయిన సుచరితకి మంచి చెడ్డ తెలియకుండా పోయాయి. ఒకవైపు ఇల్లు, పిల్లలు, సంసారం, మరోవైపు మహేష్ తో ప్రేమాయణం. ఎంత ఆలోచించినా మహేష్ ను వదులుకోవడానికి సుచరిత మనసు ఒప్పుకోలేదు.

దానితో ,ఒక రాత్రి నిద్రపోతున్న పిల్లల్ని, ముసలి అత్తని వదిలేసి, ఇంట్లో ఉన్న నగనట్రా, ఇన్నాళ్లు దాచుకున్న డబ్బు పట్టుకుని మహేష్ తో వెళ్ళిపోయింది.

తెల్లవారగానే చుట్టుప్రక్కల వాళ్ళు పిల్లల ఏడుపులు విని సుచరిత వెల్లి పోయిందని తెలుసు కున్నారు. మూడేళ్ల బాబు, ఏడాది కూడా నిండని చంటి పాపని చూసి ప్రతి ఒక్కరూ కంటతడి పెట్టుకున్నారు. హుటా హుటినా రాకేష్ దుబాయ్ నుంచి వచ్చాడు. భార్య గురించి కాళ్లు అరిగేలా వెతికాడు. వెళ్లిపోయిన దానికి ఏం చేసు కుంటావని అందరూ అంటే దొరికితే పిల్లల కోసమైనా తనని క్షమిస్తాను అని అన్నాడు. ఎంత సంస్కారం.

కానీ సుచరిత మహేష్ ల ఆచూకీ లభించలేదు.

భవాని వాళ్ళ ఇల్లు సుచరిత వాళ్ళ ఇంటికి దగ్గర్లోనే ఉండడంతో ఆ కుటుంబమే ఈ పిల్లల్ని చేరదీసింది.

రాకేష్ చాలా మంచివాడు. అంత మంచి మనసు గల రాకేష్ కి ఇలా రంపపు కోత మిగిల్చిన భగవంతుడికి తిట్టుకుంది భవాని. ఎలాగు ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఎవరికో ఒకరికి పెళ్లి చేసుకోవాలి కదా, ముక్కు ముఖము తెలియని ఎవరినో పెళ్లి చేసుకోవడం కంటే ఇంత బాధలో ఉన్న రాకేష్ ని పెళ్లి చేసుకుని వాళ్ళ జీవితాలను మళ్ళి చిగురింపజేస్తె బాగుంటుంది కదా అనుకుంది భవాని. ఆ పిల్లలని కూడా తన సొంత బిడ్డలా చూసుకుంటానని మనసారా నిర్ణయించుకుంది.

తల్లి తండ్రి నీ ఒప్పించి రాకేష్ నీ పెళ్లి చేసుకుంది. అలా కనకుండానే అర్జున్, మోక్షలకి తల్లి అయింది. రాకేష్ మళ్లీ చిన్న హోటల్ పెట్టుకున్నాడు. భవాని అన్ని విధాల అతనికి సహకరిస్తుంది. ఇద్దరు కలిసి పిల్లల్ని మంచి విద్యాబుద్ధులు చెప్పించారు.

పిల్లలకి భవాని కన్నతల్లి కాదు అని ఎప్పుడూ అనిపించలేదు. అంతటి అనురాగాన్ని పంచి పెట్టింది పిల్లలకి. ఆ పిల్లలను తను కనలేదు అన్న విషయం తను కూడా మర్చిపోయింది. పిల్లలు మంచి ప్రయోజకులు అయ్యారు. కూతురు మోక్ష ప్రభుత్వ ఉపాధ్యాయునిగా వైజాగ్ లో స్థిరపడింది, అల్లుడు రాజేష్ కూడా ప్రభుత్వ ఉపాధ్యాయుడే.

కొడుకు అర్జున్ బెంగళూరులో ఇంజనీర్గా ఉద్యోగం చేస్తున్నాడు. కోడలు వైష్ణవి కూడా ఉద్యోగస్తురాలె.

మొత్తానికి భవాని పుణ్యమా అని సంసారం గాడిలో పడింది కానీ అన్ని మనం అనుకున్నట్టే జరగవు.

ఐదేళ్ళ క్రితం అనారోగ్యంతో రాకేష్ చనిపోయాడు.

భవాని ఒంటరిదయింది. పిల్లలు భవాని నీ ఒంటరిగా ఉండడానికి ఒప్పుకోలేదు. ఇద్దరికీ అమ్మ కావాలి. కానీ భర్తతో కష్టసుఖాలు పాలుపంచుకున్న ఆ ఇంటిని, ఊరిని విడిచిపెట్టడానికి భవానీ మనసు ఒప్పుకోలేదు.తను అక్కడే ఉంటూ అప్పుడప్పుడు కూతురు ఇంటికి వెళ్లి వస్తూ ఉండేది.

బెంగళూరు రావడం మాత్రం ఇదే మొదటిసారి.

వచ్చుంటే సునీత ముందే తారసపడును.

సునీత గుర్తుకు రాగానే, భవాని గత స్మృతుల లోకం నుంచి వర్తమానంలోకి వచ్చింది. ఎలాగైనా సునీతతో కలవాలి. మిస్ట్రీ ఏంటో తెలుసుకోవాలి అనుకుంది. రెండవ రోజు ఉదయాన్నే ఏదో పని ఉంది అంటూ కారు డ్రైవర్ సహాయంతో సునీత ఇంటికి వెళ్ళింది.

భవాని నీ తన వీధి సందులో చూడగానే సునీత ముఖం చాటేయ్యాలని ప్రయత్నించింది. కానీ భవాని ఆ అవకాశం ఇవ్వలేదు. దాంతో సునీత రూపంలో ఉన్న సుచరిత భవాని నీ పట్టుకుని బోరుమని ఏడ్చింది.

భవాని కూడా తనని ఏడవనిచ్చింది. మనసులో బాధ అంతా కన్నీటి రూపంలో బయటికి వచ్చిన తర్వాత తన చీకటి గాథను చెప్పింది సుచరిత.

ఊరు విడిచి పెట్టిన తర్వాత సుచరిత మహేష్ ఏకంగా బొంబాయి వెళ్ళిపోయారు. తన దగ్గర ఉన్న డబ్బు బంగారము ఉన్నంత వరకు జల్సాగా గడిపారు. అవి అయి పోయిన తర్వాత ఇక మహేష్ కు తనంటే రోత పుట్టింది. తనని మాయ మాటలు చెప్పి బంధువుల ఇంటికని చెప్పి ఒక వేశ్య గృహానికి తీసుకువెళ్లి,తనను వాళ్ళకి అమ్మేసి పారిపోయాడు.

వివాహ బంధాన్ని కాళ్ళ తన్ని, భర్తని పిల్లలని తల్లి లాంటి అత్తని అన్యాయం చేసినందుకు తగిన శిక్ష వేశాడు ఆ భగవంతుడు. ఒకే ఒక్క తప్పటడుగు తన జీవితాన్ని సర్వనాశనం చేసింది.

ఆ వేశ్య గృహములో రోజుకొక నరరూప రాక్షసుడు తనని పీక్కు తింటుంటే నరకయాతన భరించలేక భర్తని పిల్లల్ని తలుచుకుంటూ కుమిలి కుమిలి ఏడ్చింది.

పారిపోవడానికి ఏమాత్రం అవకాశం లేని ఆ గృహములో దాదాపు 20 ఏళ్లు గడిపేసింది. ఆ తరువాత వయసు పైబడిన తనని పెద్దగా పట్టించుకోకపోవడంతో అదును చూసుకుని అక్కడినుంచి బయటపడింది.

వేషధారణ మార్చుకుని గ్రామానికి వచ్చింది పిల్లలు భర్త కనిపిస్తారేమో అన్న ఆశతో. అక్కడికి వచ్చాక భవాని చేసిన మహోన్నతమైన త్యాగం గురించి తెలుసుకుంది. కన్న తల్లిగా తను పిల్లల్ని అనాధ చేసేసిన, భవాని మాత్రం పిల్లల్ని అనాధ కానివ్వలేదు అని తెలుసుకుని చాలా సంతోషపడింది. దూరం నుంచి భవానిని చూసి మనసారా నమస్కరించుకుని ఎవరైనా, పోల్చేస్తే బాగుండదని వైజాగ్ వచ్చేసింది. వైజాగ్ లో ఉన్న కూతురు మోక్షాన్ని కూడా దూరం నుంచే, చూసి వాళ్ళ చక్కనైన జీవితాలలో తన వల్ల ఎటువంటి కల్లోలం రాకూడదని, అక్కడ ఉంటే ఎవరో ఒకరు పోల్చే ప్రమాదం ఉందని, బెంగళూరు వచ్చేసింది.

కొడుకు బెంగళూరులో ఉన్న అడ్రస్ కనుక్కుంది. తను విడిచి పెట్టినప్పుడు అర్జున్ చాలా చిన్నవాడు ఎలాగూ పోల్చుకోడు చుట్టు పక్కల ప్రజలు కూడా తనకు పోల్చె అవకాశం లేదు అనే గట్టి నమ్మకంతో కొడుకు ఇంటిలోనే పనిమనిషిగా చేరింది. అక్కడ కొడుకు మనవళ్ళ ఆలనా పాలనా చూసుకుంటూ సంతోషంగా గత ఐదేళ్లు గడిపేసింది.

అత్తగారు భవాని వస్తున్నారని వైష్ణవి చెప్పడంతో తన బండారం బయట పడిపోతుందని భయంతో పనికి వెళ్లలేదు. తన కథ చెబుతూ సుచరిత ఏడుస్తూనే ఉంది. చేసిన పాపం కన్నీటి రూపంలో ప్రవహిస్తుంది.

భవాని బాధగా వింటుంది. ఒకప్పడు రాకేష్ మనోసామ్రాజ్యానికి పట్టపురానిగా సుచరిత. ధన దాహంతో దారితప్పి పరపురుషని వ్యామోహంతో ఒకే ఒక్క తప్పటడుగు ఈ దీన స్థితికి చేరుకుంది. బ్రతుకును నరకప్రాయం చేసుకుంది, అనుకుంది బాధగా.

అయిందేదో అయ్యింది జరిగిన నష్టం ఎలాగు జరిగిపోయింది. ఇకనైనా తన పిల్లలకి అమ్మ గా ఉండమని కోరింది భవాని. తనే వాళ్లని కన్నతల్లిని పరిచయం చేస్తానని కూడా అంది.

కానీ సుచరిత ఒప్పుకోలేదు.తనకు ఇలాగే సునీత గానే ఉండనీయమని ప్రాధేయపడింది. తన బిడ్డల కళ్ళల్లో అసహ్యం భావం భరించలేనని కన్నీరు మున్నీరుగా ఏడ్చింది. పాత సుచరిత ఎప్పుడో చనిపోయింది. ఇప్పుడు సునీత గానే ఉంటు పిల్లల్ని చూసుకునే అవకాశం ఇప్పించమని కాళ్ళ వేళ్ళ పట్టుకుని వేడుకుంది.

భవాని కి సరే అనక తప్పలేదు. మరునాడు కొడుకు కోడల పదవ పెళ్లిరోజు ఫంక్షన్ ఉంది. దగ్గరుండి అన్నీ చూసుకోవచ్చు. అందుకే ఎప్పటిలాగే ఇంటికి వచ్చేయమని చెప్పింది సునీతకి.

అర్జున్ వైష్ణవి ల పదవ పెళ్లిరోజు వేడుక లో సునీత తెగ హడావిడి పడి అన్ని పనులు దగ్గరుండి చూసుకుంటుంది. కూతురు మోక్ష, అల్లుడు రాజేష్, వాళ్ళ పిల్లలు కూడా రావడంతో మహదానందంగా ఉంది సునీతకి. ఇంతటి అవకాశం ఇప్పించిన భవానీకి జన్మజన్మలకి రుణపడి ఉంటాను అనుకుంది. తన బిడ్డలను ఇంత బుద్ధిమంతులుగా తీర్చిదిద్దిన భవాని ఒక దేవతే అని కూడా అనుకుంది మనసులో.

తను చేయరాని నేరం చేసినా, తనను క్షమించి పనిమనిషిగానైనా తన బిడ్డల దగ్గరకు చేర్చె ఆ భగవంతునికి, అలాగే భవానికి పదే పదే కృతజ్ఞతలు తెలుపుకుంటుంది సుచరిత.


స్వస్తి

పోలవరపు పుష్పావతి,

సోంపేట,

శ్రీకాకుళం.

9110793796.



Rate this content
Log in

Similar telugu story from Drama