sesi saradi

Drama Inspirational

4  

sesi saradi

Drama Inspirational

సాయం సంధ్య

సాయం సంధ్య

17 mins
10


సాయం సంధ్య


 వాతావరణం ప్రశాంతంగా ఉంది .అప్పుడే చిరు చీకట్లు ముసురు కుంటున్నాయి . ఆ నీరెండలో "సాయం సంధ్య" ధవళ కాంతిలో మెరుస్తున్నట్టుగా ఉంది.చుట్టూ చెయ్యి తిరిగిన తోటమాలి ఎల్లప్పుడూ శ్రద్ధగా చేసుకుంటున్నట్టు అందంగా పరిచిన తోట ఆహ్లాద కరంగా ఉంది.  రకరకాల పూల మొక్కలు బోర్డర్ లాగా ఉండగా ఇంటి చుట్టూ పచ్చిక పరిచి నట్టున్న  లాన్ , ఆ లాన్ మధ్య లో అక్కడక్కడా సిమెంటు బెంచీలు వేసి ఉన్నాయి. ఎప్పుడూ కోలాహలంగా ఉండి అప్పుడే మౌనం గా ఉన్నట్టు అనిపిస్తున్న ఆ తోటలో సిమెంటు బెంచీ మీద కూర్చుని ఆ ఇంటి పేరుకు తగినట్లుగా "సాయం సంధ్య" లోకి ప్రవేశించిన ఇద్దరు స్త్రీ మూర్తులు దూరంగా నెమ్మదిగా క్రుంగి పోతున్న సూర్యుణ్ణి చూస్తూ కూర్చున్నారు . 

ఒక వేళ "సాయం సంధ్య" వృధాశ్రమం అయితే అందులో ఇద్దరే ఉన్నారా? ఎవరీ ఇద్దరూ? ఎందుకు ఇలా ఒంటరిగా కూర్చుని ఉన్నారు? బరువు బాధ్యతలన్నీ తీర్చుకొని జీవిత చరమాంకంలో ప్రవేశించిన ఆ ఇద్దరి ముఖాలూ సంతృప్తితో నిండిన వెలుగుతో ఉన్నాయి. 

రండి, వాళ్ళిద్దరినీ పరిచయం చేసుకుని వాళ్లకు జీవితం నేర్పిన పాఠాలు మనం కూడా తెలుసుకుందాం.


ఆ ఇద్దరిలో ఒకరు సత్యవతి, రెండో ఆమె పద్మావతి.ఇద్దరూ ఒకే ఊరిలో ఒకే రోజు గంటల తేడాలో పక్క పక్క ఇళ్లల్లో పుట్టారు.ఇద్దరికీ వాళ్ళ నానమ్మల పేర్లే పెట్టారు. ఇద్దరికీ ఒకేసారి బారసాల, అన్నప్రాసన అలాగే తర్వాత అక్షరాభ్యాడం జరిగాయి .ఇద్దరి కుటుంబాలు వ్యవసాయం మీద ఆధార పడినవే. సత్యవతి తల్లితండ్రులు, సావిత్రమ్మ వెంకటరావులు . పద్మావతి తల్లితండ్రులు, రత్నమాంబ రామారావులు .వారు పరిచయస్తులు స్నేహితులు . ఇద్దరి పొలాలు పక్క పక్కనే ఉండడం వలన పనులన్నీ కలిసే చేసుకునేవారు.


సత్యవతి,పద్మావతిల బాల్యమంతా పచ్చని పొలాల మధ్య, ఇళ్లముందు నిండుగా పారే పంట కాలువల పక్కన మామిడి తోటల్లో తిరుగుతూ ముద్ద బంతులు, చామంతులతో స్నేహం చేస్తూ ఎంతో మధురంగా గడిచింది .

ఇద్దరూ కలిసి అ ఆ లు నేర్చుకున్నారు . అలాగే ఏ బి సి డి లు కూడా. రెండు అక్షరాలు కలిసి ఒక పదం అవుతుంటే ఒకళ్ళనొకళ్ళు ఆశ్చర్యంగా చూసుకునే వారు .అంకెలు నేర్చుకుంటున్న కొత్తల్లో ఎవరింట్లో ఎంత పాడి ఉందో లెక్క చూసి ఒకరింట్లో ఒక ఆవు ఎక్కువగా ఉంటే ఇంకొకరు ఆ లోటు పూడ్చే వరకూ ఊరుకునేవారు కాదు .

అన్నింటిలో ఇద్దరూ సమానంగా ఉండాలి . ఆఖరికి గౌనులు, పరికిణీలు కూడా ఒకలాంటివే కావాలని పేచీ పెట్టేవారు . వెంకట్రావు, సత్యవతి కి ఏమైనా కొంటే ఆ చేత్తోనే పద్మావతికి కూడా కొనేవాడు . అలాగే రామారావు కూడా. అలా వాళ్ళ స్నేహం కూడా వాళ్ళ లాగే పెద్దదవుతూ హై స్కూల్ చేరింది. 


ఒక రోజు సత్యవతి దిగులుగా పద్మావతి వేపు చూస్తూ "నీ పేరేంతోబాగుంది పద్మా! నాది చూడు పాతకాలం పేరు సత్యవతి. ఏం బాగోలేదు" అన్నాది . దానికి పద్మావతి "నీ పేరుకేం ఎంచక్కా ఉంది . అందరూ నిన్ను శ్రీ కృష్ణుడు సత్యభామను పిలిచినట్టు "సత్యా" అని పిలుస్తున్నారు కదా",అంటే "నిన్ను మాత్రం" పద్మా " అని పిలవటంలేదూ" అంటూ తన పేరు కూడా బాగానే ఉన్నాదని తృప్తి పడింది.


ఇద్దరిదీ పదవ తరగతి పూర్తి అయ్యింది .ఇద్దరికీ రెండు, మూడు మార్కుల తేడా అయినా ప్రధమశ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు . అక్కడితో వీళ్ళ చదువులు ఆగిపోయేవే, కానీ వాళ్ళ స్కూల్ హెడ్ మాస్టారు, వెంకట్రావు రామారావు లతో మాట్లాడారు.

"పిల్లలకింకా పదిహేనేళ్ళేకదా! ఎలాగూ పద్దెనిమిది నిండే వరకూ పెళ్లిళ్లు చెయ్యరుకదా, ఇంట్లో కూర్చుని ఏం చేస్తారు? ఇంటర్మీడియట్ వరకైనా చదివించండి.మా అమ్మాయి ఎలాగూ వెళ్తుంది కదా! పోనీ దానికి తోడుగా అనుకుని పంపించండి . ఏమో రోజులు మారి పోతున్నాయి. ఈ రోజుల్లో విద్య మగ పిల్లలకు ఎంత అవసరమో, ఆడపిల్లలకూ అంతే", అంటూ చెప్పారు. చదువు వాళ్లకు ముందు జీవితంలో ఎలా ఉపయోగ పడుతుందో వాళ్ళు ఆలోచించలేదు కానీ "మాస్టారు గారి పాప వెళ్తుంది కదా మన పిల్లల్ని కూడా పంపిద్దాం" అని నిర్ణయించు కున్నారు .

అలా పల్లెలో పుట్టి పెరిగి ముద్ద బంతి పువ్వుల్లా ఉన్న వాళ్లిద్దరూ పై చదువులకు పట్నం బయలుదేరారు .

మొదటి రోజు కాలేజీలో అడుగుపెట్టి అంత పెద్ద భవనం ఎప్పుడూ చూడక విప్పారిన నేత్రాలతో అలాగే చూస్తుండి పోయారు. అక్కడ చేర్పించడానికి వచ్చిన మాస్టారి వెనక, వాళ్ళ అమ్మాయి, సావిత్రి తో కలిసి ప్రిన్సిపాల్ గది లోకి వెళ్లి అక్కడ నుంచి వాళ్ళ క్లాసుకు వెళ్లారు. సాయంత్రం వాళ్ళ ఊరి బస్సు కాలేజీ దగ్గరకు ఎప్పుడు వస్తుందో చెప్పి మాస్టారు వెళ్లిపోయారు.


ఇన్నాళ్లూ పంజరంలో చిలకల్లా ఉన్న వీళ్లకు ఒక్కసారిగా స్వేచ్ఛ వచ్చినట్లయ్యింది . క్లాసులో అడుగు పెట్టగానే మిగిలిన పిల్లల వేష భాషలకు తమకు చాలా తేడా ఉందని గ్రహించారు .బిగించి వేసుకున్న రెండు జడలు వాటిలో నిండుగా కనకాంబరాలు దండలతో, తమకు తామే చిత్రంగా ఉన్న భావన ఇద్దరిలోనూ కలిగింది . సన్నగా, తెల్లగా నాజూగ్గా ఉన్న సావిత్రి ని అందరూ త్వరగానే తమతో కలుపుకున్నారు .కానీ, పద్మావతి, సత్యవతి లు మాత్రం ఎంత ప్రయత్నించినా, మిగిలిన పిల్లలకు దగ్గర కాలేక పోయారు.అందరూ స్టయిలుగా ఒక బాక్స్ లో లంచ్ తెచ్చుకుంటే వీళ్ళుమాత్రం మూడు గిన్నెల కేరేజీలు తెచ్చుకునేవారు . అందరూ వీళ్ళను చూసి నవ్వేవారు .

" అందరూ మమ్మల్ని ఎగతాళి చేస్తున్నారు మేము కూడా ఒక బాక్స్ తీసుకుని వెళ్తాము" అంటే ఇద్దరూ వాళ్ళ అమ్మల చేత మొట్టి కాయలు తిన్నారు.  "ఏ0టే తెగ నీలుగు తున్నారు. ఆ మాత్రం తినకపోతే బలం ఎలా వస్తుంది? అయినా కేరేజిలో ఏముంటుంది, ఒక బాక్స్ లో కూరన్నం, ఒక దాన్లో పెరుగన్నం, ఇంకో గిన్నెలో అరిసెలో, సున్నుండలో ఏవి ఉంటే అవి పెడుతున్నాము . తినడానికి కూడా బాధేనా" అనేవారు. ఆఖరికి ఎలాగైతే రెండు గిన్నెల కేరేజిలు కొనడానికి స్నాక్స్ వేరేగా పేకెట్ కట్టడానికి ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నారు . అయినా ఇద్దరూ లంచ్ అవర్లో అందరికీ దూరంగా కూర్చుని తినేవారు . అలా ఇంటర్ కూడా పూర్తి అయ్యింది .అది కూడా మంచి మార్కులతో పాస్ అయ్యారు.

కానీ ఇంకా పైకి చదువుతామని తల్లితండ్రులను అడగలేక పోయారు . పెళ్లి సంబంధాలు చూస్తున్న పెద్దలకు మౌనం గానే తమ అంగీకారాన్ని తెలియజేసారు.

తెల్లగా బొద్దుగా ఉండే సత్యవతి కి వాళ్ళు కాలేజీ కి వెళ్లిన పక్క ఊరిలోనే పంచాయతీ ఆఫీస్ లో పనిచేసే గోపాల కృష్ణ తో త్వరగానే సంబంధం కుదిరింది.

ఆ రోజు సత్యని ఆట పట్టిస్తూ పద్మావతి," నేను ముందునుంచి చెప్తున్నాను కదా నిన్ను "సత్యా"అని పిలిచే గోపాల కృష్ణుడు వస్తాడని" అంటూ చాలా గొడవ చేసింది . ఎప్పుడూ మౌనంగా ఉండే సత్యవతి "అవును ,నాకు గోపాల కృష్ణుడు వస్తే ఈ  పద్మావతికి శ్రీనివాసుడు దొరుకుతాడు" అంటూ నవ్వేసింది.


సత్యవతి పెళ్లయ్యాక ఖాళీగా ఉండడం ఎందుకని టీచర్ ట్రైనింగ్ కు వెళ్ళింది పద్మావతి .ఎలాగూ కాలేజికి వెళ్లడం అలవాటయ్యింది గాబట్టి పోన్లే పెళ్లి కుదిరేవరకూ చదువు కుంటుందని వాళ్ళింట్లో అనుకున్నారు.

సెలవులకు సత్య ఇంటికి వెళ్ళేది పద్మావతి . సత్య అత్తగారు, మామగారితో పని తెమలక కంగారు పడుతూ ఉండేది . పద్మ సెలవులలో ఆమెకు సాయంగా ఉండేది . "సత్యకి చక్కగా పెళ్లయ్యింది" అని పద్మ అనుకుంటే "పద్మ పనే బాగుంది బాగుంది చక్కగా చదువుకుంటుంది" అని సత్య అనుకునేది.


"అన్నయ్యా" అని నోరారా పిలిచే పద్మ అంటే గోపాల కృష్ణ కు కూడా చాలా అభిమానం .ఆమె ట్రైనింగ్ పూర్తి అయ్యేటప్పటికి వాళ్ళ ఆఫీసు లో కి కొత్తగా ఉద్యోగం లో చేరిన శ్రీనివాస రావుకి పద్మ గురించి చెప్పి పెళ్లి చూపులు ఏర్పాటు చేసాడు.సత్యవతి దగ్గరుండి పద్మావతి ని ముస్తాబు చేసి "చూడు ఈ సంబంధం ఎలాగైనా కుదిరిపోతుంది .నీకు శ్రీనివాసుడొస్తాడు" .అని ఆట పట్టించింది . అలాగే పద్మకు ఆ సంబంధం కుదిరింది .

పద్మ ఇంట్లో వాళ్ళు ఎంతో సంతోషించి సత్య కి ఖరీదైన పట్టుచీర పెట్టారు . అలా స్నేహితురాళ్ళిద్దరూ. మళ్ళీ ఒకే ఊర్లో పక్క పక్క ఇళ్లల్లో కాపురాలు పెట్టారు.

ఇంతకు ముందు లాగే అన్ని విషయాలూ జరిగిపోతున్నాయి . ఇద్దరూ అన్నింటిలో సమానంగా ఉన్నారు . ఇద్దరికీ వాళ్ళ పుట్టింటి వాళ్ళు రెండేసి ఎకరాలు మాగాణి భూమి పెళ్ళిలో ఇచ్చారు ఇద్దరికీ ఇద్దరేసి పిల్లలు సత్యవతి కి రాజేష్ రమ్య అయితే పద్మావతికి రమేష్ దివ్య.చూస్తుండగానే పది సంవత్సరాలు గడిచిపోయాయి . పిల్లలు స్కూలుకి వెళ్తున్నారు . ఆలా ఇద్దరి జీవితాలూ ఒకే రేఖలో నడుస్తుండగా ఒక సంఘటన జరిగింది. 


పద్మ మామగారు రిటైర్ అయ్యాక కొడుకుతో కలిసి ఉండడానికి వచ్చారు . పద్మ టీచర్ ట్రైనింగ్ అయినా ఇంట్లోనే ఉండడం ఆయనకు ఏమాత్రం రుచించలేదు .

తెలిసిన వాళ్లందరికీ చెప్పి పద్మకు టీచర్ ఉద్యోగం తెప్పించారు . పద్మకు మొదట్లో సుతరామూ ఇష్టం ఉండేది కాదు . కానీ నెమ్మదిగా బయటకు వెళ్లడం అలవాటయ్యింది . నెల తిరిగేసరికి జీతం చేతిలో పడడంతో ఆత్మ విశ్వాసం పెరిగింది.పద్మ ఉద్యోగానికి వెళ్లడం వల్ల స్నేతురాళ్ళిద్దరి మధ్య పొరపొచ్చాలు రాకపోయినా తాను అన్నింటిలో పద్మ కన్నా తక్కువగా ఉన్నాననే ఆత్మ న్యూన్యతా భావం సత్యలో చోటు చేసుకుంది. దానికి ఇద్దరి అత్తగార్ల ప్రవర్తన కూడా కొంత వరకు కారణ మయ్యింది. సత్య ఇంట్లో ఎంత పనైనా సత్యే చెయ్యాలి . మొదట్లో సత్యే అత్తగారిని ఏ పనీ చెయ్య నిచ్చేది కాదు .కానీ పిల్లలు పుట్టాక అవిడ కూడా కొంత సాయం చేస్తే బాగుండునని అనిపించేది .

ఇక పద్మ అత్తగారు ముందునుంచి అన్నీ ఆవిడే చేసేవారు . పద్మ పై పనులు చేస్తుండేది . ఇప్పుడు పద్మకు ఉద్యోగం వచ్చాక, ఆవిడ కోడలును ఇంకా గారంగా చేస్తున్నారు ." బయటకు వెళ్లి అలసి వస్తున్నావు "అంటూ ఏ పనీ ముట్టుకోనివ్వడం లేదు .

సత్య ఇంట్లో  ఆమె అత్తగారు , "చూడు సత్యవతి, చక్కగా పద్మావతి నెల తిరిగేసరికి నాలుగు రాళ్లు సంపాదించుకొని వస్తుంది . వేన్నీళ్ళకు చన్నీళ్ళు తోడు . అయినా అందం కొరుక్కు తింటామా" ? అంటూ సూటి పోటి మాటలు మాట్లాడేది .దాంతో సత్య బాగా క్రుంగి పోయింది . ఇంకో విషయం సత్య గమనించింది ఎప్పుడూ సత్య అని పిలిచే అత్తగారు ఈ మధ్య సత్యవతి అని పిలుస్తున్నారు .అంటే నా మీద ఇంతకూ ముందున్న అభిమానం లేదన్న మాట అనుకునేది సత్య . చాలా బాధ పడేది. 

ఒకసారి" ఏంటి సత్యా అలా చిక్కిపోతున్నావు దిగులుగా కూడా ఉంటున్నావు" అని అడిగింది పద్మ . "ఏమీ లేదులే పద్మా "అని సత్య దాటవేద్దామని చూసినా పద్మ చెప్పాలని మరీ మరీ బలవంతం చేస్తే , "నేనేమీ సంపాదించడం లేదని మా అత్తగారికి నా మీద చాలా చిన్న చూపుగా ఉంది పద్మా రోజూ ఆవిడ సూటి పోటి మాటలు వినలేకపోతున్నాను ఏం చెయ్యాలో తోచడం లేదు".అంటూ తన మనసు లోని సంఘర్షణని స్నేహితురాలితో పంచుకుంది.


ఇదా సంగతి అని మనసులో అనుకొని "ఆవిడకు నువ్వు సంపాదించడం లేదని కాదు నేను సంపాదిస్తున్నానని నువ్వు ఆవిడ మాటలు పట్టించుకోకు. మళ్ళీ చదువు మొదలు పెట్ట కూడదా సత్యా! కొంత కాలక్షేపమే కాకుండా నీ మనసు కూడా కొంత ప్రశాంతంగా ఉంటుంది". 


"నాకెక్కడ తీరిక పద్మా చదువుకోవడానికి, పని తోనే సరిపోతుంది" అన్న సత్య మాటలు కొట్టి పారేస్తూ" నేను డిగ్రీ చేద్దాం అనుకుంటున్నాను. బయటకు వెళ్లే నేనే చదువుకుందాం అనుకుంటుంటే నువ్వెందుకు చదవలేవు సత్యా? అయినా మనం కాలేజికి వెళ్లనవసరం లేదు కదా దూరవిద్య ద్వారానే కదా ఒకళ్ళ కొకళం తోడుంటే చిన్నప్పటి లాగానే కలిసి చదువుకోవచ్చు", అని చెప్పి ఊరుకోకుండా అప్లికేషన్స్ కూడా తెప్పించింది.


ముందు సత్య అత్తగారు "ఈ వయసులో చదువు లెందుకు" అన్నా పద్మ గట్టిగా చెప్పడంతో, కృష్ణ మూర్తి   కూడా ప్రోత్సహించడం వల్ల ఆవిడ ఏమీ అనలేక పోయారు.

అలా వాళ్ళ జీవితాలలో కొత్త అధ్యాయం మొదలయ్యింది . తెల్లవారు ఝామునే లెగిసి త్వర త్వరగా పనులు ముగించుకొని చదువు కోవడానికి కూర్చునేవారు . ఇంట్లో వాళ్ళు నిద్ర లేచే టప్పటికి మళ్ళీ ఇంటి పనులు ప్రారంభం . అయినా సరే సత్య చాల హుషారుగా ఉండేది . పద్మ తో ఎక్కువ సమయం గడపడం , కొత్త విషయాలు నేర్చుకోవడంతో విజ్ఞానంతో ఆమె ముఖం కళ కళ లాడేది . కొన్ని రోజులు ఇలా గడిచేసరికి సత్య అత్తగారు కూడా సత్య తో పాటే లేచి ఆమెకు టీ కలిపి ఇచ్చి కొంత పని కూడా మొదలు పెట్టేసేవారు . వద్దన్నా వినే  వారు కాదు. ఆవిడకు కోడలు చదుకుంటుందని ఇరుగు పొరుగుతో చెప్పుకోవడం చాలా గొప్పగా అనిపించేది. 

అత్తగారి లో వచ్చిన మార్పుతో సత్య జీవితం సజావుగా సాగుతుంది .

ఈ లోగా వాళ్ళ జీవితాలలో ఇంకో మలుపు ఎదురయ్యింది . ఒక రోజు ప్రెసిడెంట్ గారి భార్య ప్రియంవద గారు పద్మావతికి కబురు పెట్టారు ఒకసారి వచ్చి కలవమని . ఎందుకు పిలిచారోనని కంగారు పడుతూ పద్మావతి వాళ్ళ ఇంటికి వెళ్ళింది.

పద్మావతి ని చూడగానే ఆవిడ నవ్వుతూ ఎదురు వచ్చారు . హమ్మయ్య అనుకుంటూ ," ఎందుకో రమ్మన్నారంటమ్మా "! అని అడిగింది పద్మ. ఆ రోజుల్లో ఇంకా ఎవరినైనా సరే ఆంటీ ,అంకుల్ అని పిలిచే సంస్కృతి రాలేదు . దగ్గరవాళ్ళు బాగా తెలిసిన వాళ్ళని పిన్నిగారు, పెద్దమ్మగారు, అత్తయ్య గారు అని పెదనాన్నగారు, చిన్నాన్నగారు, మామయ్యగారు అని పిలిచేవారు .

"ఏం లేదు పద్మావతీ! నీకు తెలుసు కదా మన ఊళ్ళో చదువుకున్నవాళ్లు చాలా తక్కువ. మన స్కూలు మాస్టారు గారితో మాట్లాడాను . మగవారికి అయన రాయడం చదవడం నేర్పుతానన్నారు . స్కూలులోనే రాత్రి పాఠశాల నడుపుతామన్నారు.కానీ ఆడవాళ్లతోనే చిక్కు వచ్చి పడింది . వాళ్ళని రాత్రి రమ్మనడమ్ బాగోదు. అందుకని వాళ్ళకి మధ్యాహ్నం పాఠాలు చెప్తే ఎలావుంటుంది?" అని అడిగారు.

"మీ ఆలోచన బాగుందమ్మా కానీ ముందు వాళ్ళని ఇంటినుంచి బయటకు తీసికొనిరావాలి కదా!" "అవును అందుకే నిన్ను రమ్మన్నాను నువ్వు చదువుకున్నదానివి ఉద్యోగం చేస్తున్నావు నువ్వు ఏదైనా ఉపాయం చెప్తావని అనుకున్నాను" అన్నారు .


'చదువు కోవడానికంటే ఎవ్వరూ బయటకు రారమ్మా.దానితో బాటు కుట్లు, అల్లికలు రక రకాల ముగ్గులు నేర్చుకోవచ్చంటే అందరూ ఉత్సాహపడతారు. తర్వాత వాళ్లకు చదువు విలువ గురించి చెప్పవచ్చు" అంటూ సలహా ఇచ్చింది పద్మావతి.

"సరేనమ్మా అలాగే చేద్దాం . నేను అందరికీ వార్త అందేలా చూస్తాను .కానీ వాళ్లకు అన్నీ ఎవరు నేర్పుతారు", అని అడిగారు . "ప్రతి వాళ్లకూ ఎదో ఒక దాన్లో ప్రావీణ్యం ఉంటుంది అలా ఒకళ్ళ దగ్గర నుంచి ఇంకొకళ్ళు నేర్చుకుంటారు."

 "అది సరే కానీ, మన ముఖ్య ఉద్దేశం అందరికీ రాయడం చదవడం రావాలని కదా . చదువు చెప్పే టీచర్ కావాలి కదా నువ్వు ఆ బాధ్యత తీసుకుంటావా?" అని అడిగారు.

ఆలోచన పడింది పద్మావతి . అవునంటే స్కూలుకు వెళ్లివచ్చి, మళ్ళీ క్లాసులు తీసుకోవాలంటే కష్టం ,కాదంటే ఆవిడకు కోపంరావచ్చు. అందుకే , "నేను పొద్దున్న నుంచి సాయంత్రం వరకు స్కూల్ లోనే ఉండాలండీ! నా స్నేహితురాలు సత్యవతి మీకు తెలుసుకదండీ,తనని అడిగి చూస్తాను. ఒప్పుకుంటే నేను ఆదివారాలు క్లాసు కి వచ్చి చూస్తానండి" .

అన్నాది. దానికావిడ "అలాగే పద్మావతి! ,సత్యవతి ని అడుగు.

అవసరం అయితే జీతం కూడా ఇద్దాము" అన్నారు .

 దానితో పద్మ మనసు ఎగిరి గంతేసింది.సత్య కు ఈ అవకాశం ఎంత అవసరమో ఆమెకు తప్ప ఎవరికీ తెలుసు?

పద్మ,ఇంటికి కూడా వెళ్లకుండా ముందు సత్య ను కలిసింది . విషయమంతా వివరించింది . సత్య కు చెయ్యాలని ఉన్నా ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారో, ముఖ్యంగా అత్తగారి అభిప్రాయం ఎలా ఉంటుందో !అని ఆలోచించింది .అదే మాట పద్మ తో అంటే "నేను పెద్దమ్మ గారితో మాట్లాడతాను" అని ఆవిడ దగ్గరకు వెళ్లి కూర్చుంది.

ఆవిడ తో కూడా సత్య తో చెప్పినది మళ్ళీ చెప్పింది . " మీ రేమంటారు పెద్దమ్మా ! సత్య రావడానికి వీలు పడదంటుంది" అని అంటే , "అది అంతే లేవే! ప్రతిదానికి వెనకడుగు వేస్తాది. అయినా ఇప్పుడు ఇంట్లో పెద్ద పనేం ఉంటుంది ? పిల్లలు పెద్దవాళ్లయ్యారు . వాళ్ళ పనులు వాళ్ళే చేసు కుంటుంన్నారు ఇంక మా కృష్ణుడి సంగతి నీకు తెలిసినదే కదా!దేనికీ కాదనే మనిషి కాదు నేను సత్యకి చెప్తానులే" అన్నారు .అలా సత్య సమస్య తీరింది.


ముందుగా సత్య, పద్మ, ప్రియంవద గారిని కలిశారు . తరవాతి ప్రణాళికల గురించి చర్చించారు . ఆవిడ సభ్యులందరికీ కొంత ఫీజు చెల్లించ మందామని అన్నారు. అలాగంటే ఎవ్వరూ రారేమోనని సత్య అనుమానం వ్యక్తం చేసింది. 

దానికావిడ ఎంతో కొంత కట్టమనకుండా ఉచితంగా నేర్పుతామంటే కొన్ని రోజులకు రావడం మానేస్తారు . అదే డబ్బు కడితే మానకుండా వస్తారు అన్నారు.అదికూడా నిజమే కదా చివరకు సభ్యత్వ రుసుము రెండు రూపాయలు, నెల నెలా ఒక్క రూపాయి కట్టమంటే అందరికీ అందుబాటులోనే ఉంటుందని భావించారు . ఆ డబ్బుతో దారాలు, సూదులు ఎంబ్రాయిడరీ సామాను పుస్తకాలూ, పలకలు కొనాలని , సత్య జీతానికి ఆ డబ్బు సరిపోదు కాబట్టి ప్రస్తుతానికి ప్రియంవద  గారే ఇస్తానని అన్నారు . "వద్దండీ మండలి లో సభ్యులు పెరిగే దాకా జీతం లేకుండానే చేస్తానండి" అని సత్య అన్నా ఆవిడ వినిపించుకోలేదు.


ప్రియంవద గారి కబురు అందుకుని ఒక ఇరవై మంది ఆవిడ ఇంటికి వచ్చారు . మండలి గురించి ఆవిడ వివరించారు . మండలికి "అభ్యుదయ మహిళా మండలి" అని పేరు పెట్టారు . మండలి ప్రెసిడెంట్ గా ప్రియంవద గారు ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు.


తర్వాత సత్య ,ప్రియంవద గారు జీవితకాల ప్రెసిడెంట్ గా ఉంటే బాగుంటుందని ప్రతిపాదించింది . దానికి అందరూ చప్పట్లు కొట్టి ఒప్పుకున్నారు . ఇంటికి వస్తుండగా ఎందుకలా అన్నవని పద్మ సత్యని అడిగింది . దానికి సత్య నవ్వుతూ మళ్ళీ ఎలక్షన్ లు ఆ గోలంతా ఎందుకు ? తీరా ఇంకొకలెవరైనా ఎన్నిక అయితే ఆవిడ తన ఇంట్లో మండలి నడపడానికి ఒప్పుకోరు . ఆవిడ పలుకుబడి వల్ల వచ్చే విరాళాలు రావు, మండలి మూతపడే ప్రభావం ఉంది. అందుకే ఆలా ప్రతిపాదించాను, అని వివరించింది. 

సత్యలో కొత్త కోణాన్ని చూస్తున్నట్టు అనిపించింది పద్మకు . అదే అంటే , ఇంట్లో అత్త మామలకు కోరింది సమకూరుస్తూ ,భర్తకు కోపం రాకుండా చూసుకుంటూ, పిల్లలు దారి తప్పకుండా జాగర్త పడుతూ, ఇరుగు పొరుగులతో సఖ్యంగా ఉండడానికి ఇల్లాలికి ఎంత నేర్పు, ఓర్పు ఉండాలో నీకు తెలీదా? అని ఎదురు ప్రశ్నించింది.

ఆ మాట నిజమే కదా!

 . ఇంకా ఇంటి విషయాలకు వస్తే కోడళ్ళు ఎక్కువగా బలవంతం చెయ్య కుండానే వాళ్ళ అత్తగార్లు మండలిలో సభ్యులు గా చేరారు.

ఇప్పటిలా టి వి లు, ఇంటర్నెట్ లేని ఆ రోజుల్లో ఆడవారికి అలా మండలిలో వెళ్లి అందరినీ కలవడం, కొత్త విషయాలు తెలుసుకోవడం ఎంతో ఆనందం గా ఉండేది. 


ఇలా కొన్ని నెలలు గడిచాయి . అందరికీ మండలి బాగా అలవాటయ్యింది . సత్య అక్షరాలు కూడా రాని  వారికి ఎంతో శ్రద్ధ తీసికొని నేర్పించేది . ఇంకా అక్షరాలు వచ్చినవారికి చదివించేది.కొంత కాలానికి ఒకరోజు కమల అనే అమ్మాయి ప్రియంవద గారి.కాళ్ళకు ననమస్కరించి ఆవిడ చేతిలో, అరటిపళ్ళు పెట్టింది.ఏంటమ్మా అన్న ఆవిడ ప్రశ్నకు ముందుగా సత్య కాళ్ళకు కూడా నమస్కరించి,ఇక్కడకు వచ్చే ముందు నాకు అక్షరం అంటే ఏంటో తెలియదమ్మా!ఇక్కడకు రావడం కూడా కుట్లు అల్లికలు నేర్చుకుందామనే వచ్చాను.టీచర్ గారి ప్రోత్సహించడం తో అక్షరాలు నేర్చుకున్నాను. నా కొడుకు బడికి వెళ్తున్నాడమ్మా ! వాడు ఏమి నేర్చుకుంటున్నాడో కూడా నాకు తెలిసేది కాదు కానీ ఈ రోజు వాడు అక్షరాలు తప్పు రాస్తుంటే నేను దిద్దానమ్మా అంతా మీ ఇద్దరి వల్లే నమ్మా అని చెప్పింది.

అందరూ నిలబడి చప్పట్లు కొట్టారు . ప్రియంవద గారు చాలా సంతోషించారు . సత్య ను అభినందించారు .ఈ సంఘటన జరిగిన తర్వాత కుట్లు అల్లికలు వంటలు నేర్చుకుంటున్న వాళ్ళు చదువు నేర్చుకోవడానికి ఉత్సాహం చూపించారు . అంటే కాక కొత్తగా కొందరు సభ్యులుగా చేరారు.


సత్యకు పని చాలా పెరిగింది కానీ తృప్తిగా అనిపించింది. ఊళ్ళో అందరూ టీచర్ గారూ అని సత్య నే అంటున్నారు. .పద్మ కన్నా తనెందులో తీసిపోనని అనుకుంటే ఆనందంగా అనిపించింది. ఆత్మ విశ్వాసం కూడా పెరిగింది.


"సత్యా ఇప్పుడు ఊళ్ళో అందరి నువ్వే ఇప్పుడు టీచర్ వి , నేను టీచర్ ననే అందరూ మర్చిపోయారు" అని పద్మ అంటే ," ఇదంతా నీవల్లే పద్మా ! ఆ సంగతి నేనెప్పుడూ మర్చిపోను" అని బదులిచ్చింది సత్య . ఇద్దరూ హాయిగా నవ్వుకున్నారు.

చూస్తుండగానే సంవత్సరం గడిచి పోయింది . మండలి వార్షికోత్సవం సందర్భంగా ఏదైనా కార్యక్రమం చేయాలన్నారు ప్రియంవద గారు. 

మండలి సభ్యులందరూ వాళ్ళకి ఎందులో ప్రావీణ్యం ఉన్నదో ఆ వస్తువులు తయారు చేస్తే చిన్న సేల్ పెట్టి ఎవరి సరుకు వాళ్ళు అమ్ముకోవచ్చని నిర్ణయించారు.

అందరూ వారికి వచ్చిన కుట్లు అల్లికలు వడియాలు అప్పడాలు రకరకాల వంటకాలు, ఎంబ్రాయిడరీలు, బుట్టలు మొదలైన వన్నీ తయారు చేస్తున్నారు . సత్య అత్తగారు ఎంబ్రాయిడరీ బాగా చేసేవారు . ఇద్దరూ కలిసి జేబురుమాళ్ళు,తలగడ గలేబుల మీద రంగు రంగుల పువ్వులతో ఎంబ్రాయిడరీ చేసారు.


ఆఖరుకు సేల్ రోజు వచ్చింది. ఈ ప్రదర్శన గురించి బాగా ప్రచారం జరగడంతో ఆ ఊరివారే కాకుండా చుట్టు పక్కల ఊళ్ళ నుంచి కూడా భారీగా జనం తరలి వచ్చారు. అంతవరకూ ఏమీ చెయ్యకుండా ఉన్నవాళ్లు ప్రజల స్పందన చూసి అప్పటికప్పుడు టీ , పకోడీలు, బజ్జీలు పుణుకులు వేసే స్టాల్ లు తెరిచారు . ఇంతకుముందు అక్కడ ఇలాంటివి జరగక పోవడం వలన ఆ ప్రదేశమంతా జనాలతో కిక్కిరిసి పోయింది .

సత్య అత్తగారు ఎంబ్రాయిడరీ లో అందె వేసిన చెయ్యి కాబట్టి వాళ్ళ స్టాలు దగ్గర జనం ఎక్కువగా కొనుగోలు చెయ్యడానికి ఉత్సాహం చూపించారు .పెట్టినవన్నీ తొందరలోనే అమ్ముడవ్వడమే కాకుండా ఇంకా కావాలని ఆర్డర్ లు కూడా వచ్చాయి . 


తన కళకు మంచి గుర్తింపు రావడముతో సత్య అత్తగారు చాల ఆనందించారు. దానికి కారకురాలైన కోడలిపై అభిమానం పెంచుకున్నారు . ఎప్పుడూ లేని విధంగా ఇద్దరూ సఖ్యంగా ఉంటున్నారు . ఇద్దరూ కలిసి పనులన్నీ గబగబా తెముల్చుకొని కుట్టు కోవడానికి కూర్చునేవారు . కొన్నాళ్ళకి షాపులకు కూడా ఇచ్చేవారు . చాలా రోజులకు సత్య ఆనందం గా ఉంది ఆమె ఆనందం చూసి పద్మ ఎంతో సంతోషించేది.

కాలం ఎవరికోసం ఆగదు కదా ! చూస్తుండగానే ఇరవై సంవత్సరాలు గడిచిపోయాయి . సత్య పద్మలు మధ్య వయస్సు వారైతే పిల్లలు పెద్దవారు అయ్యారు అలాగే వాళ్ళ తల్లి తండ్రులు అత్తా మామలు చాలా ముసలివాళ్లయ్యి పిల్లల్ని మనుమలని చూసుకుంటూ తృప్తిగా కళ్ళు మూసారు .


కాలం ఎన్ని మార్పులై తెచ్చినా చెక్కు చెదర కుండా నిలిచింది సత్య పద్మాల స్నేహం .


పిల్లల చదువులు పూర్తి అయ్యి ఉద్యోగాలు కూడా వచ్చాయి . అందరూ ఈ రెండు కుటుంబాలను చూసి అసూయపడేలా ఉండేవారు ..ఇంతలో ఒక రోజు సత్యవతి కొడుకు రాజేష్ పద్మావతి కూతురు దివ్య అందరూ కూర్చుని మాట్లాడు కుంటున్నప్పుడు వచ్చి తామిద్దరూ పెళ్లి చేసు కుందాం అనుకుంటున్నామని చెప్పారు. చిన్నప్పటి నుంచి పిల్లలు నలుగురూ స్నేహం గా ఉన్నా దివ్య రాజేష్ లు ప్రత్యేకంగా ఉండేవారు . ఏ పనైనా ఇద్దరూ కలిసే చేసేవారు , కలిసే తినేవారు, కలిసి చదువుకునేవారు . అందువల్ల వాళ్ళు పెళ్లి చేసుకుందామంటే ఎవ్వరూ ఆశ్చర్య పడలేదు .సత్యవతి పద్మావతి ఎంతో సంబరపడిపోయారు .స్నేహితులు వియ్యంకులు అవుతున్నారని అందరూ అభినందించారు .


అదే సంవత్సరం ఊరికి దూరంగా స్థలాలు కొనుక్కొని రెండు కుటుంబాలూ ఒకేలా ఇళ్ళు కట్టుకున్నారు.

త్వరలోనే రమ్యకు, రమేష్ కి కూడా మంచి సంబంధాలు చూసి పెళ్లిళ్లు చేసారు . రమేష్ కు వాళ్ళ మామగారు పై చదువులకు విదేశం పంపించారు . రమ్య భర్త అమెరికా లో ఉద్యోగం చేస్తుండడం వల్ల తాను కూడా కొన్ని రోజుల్లో అక్కడకు వెళ్ళిపోయింది.

రాజేష్ కు కూడా విదేశాల్లో అవకాశం వచ్చినా , ఆతను దివ్య కలిసి తల్లి తండ్రులకు  దగ్గరలోనే ఉండాలని  నిర్ణయించు కున్నారు . వాళ్ళు ఎంతో చెప్పిన తర్వాత హైదరాబాద్ లో వచ్చిన ఉద్యోగాలలో చేరారు .


సత్యవతి, పద్మావతి ల జీవితాలు ఒక  గాడి లో పడి సజావుగా సాగుతున్నాయి . బాధ్యతలన్నీ తీర్చుకొని కొద్దిగా ఊపిరి పీల్చు కుంటున్నారు . ఇన్నాళ్లూ అత్తా మామలు చెప్పినట్టు చేస్తూ పిల్లలకి ఇష్టమైనవే వండుతూ ఉండే వారు . ఇప్పుడు వారి కి, భర్తలకు ఇష్టమైనవి చేస్తూ , జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు.


ఇక మండలి విషయానికి వస్తే ప్రియంవద గారి తర్వాత ఆమె కోడలు సంధ్యా రాణి ఆ బాధ్యతను తీసుకున్నారు. ఇప్పుడు సభ్యులలో చాలామంది వయసులో చిన్న వాళ్ళు .


వాళ్ళు ఇంగ్లీషు చదువులు, కంప్యూటర్ 

విద్య మీద చూపిస్తున్న ఉత్సాహం కుట్లు అల్లికలు వంటల మీద చూపించడం లేదు . మారుతున్న కాలంతో పాటూ అన్నీ మారాయి . మండలిలో సంధ్యా రాణి గారు కంప్యూటర్ పెట్టించారు . నేర్పించడానికి టీచర్ ను కూడా పెట్టారు.సత్యవతి పద్మావతి కూడా పిల్లల బలవంతం మీద కంప్యూటర్ నేర్చుకున్నారు . దానితో వాళ్ళకి ఒక కొత్త ప్రపంచం గురించి తెలిసింది .ఇంట్లో ఒక ఫోన్ ఉండడమే గగనమనుకునే రోజులు మారి ప్రతి చేతిలోనూ ఫోను ఉండే కలం వచ్చింది . ప్రతి వారికీ చేతిలోనే ప్రపంచం అంతా వచ్చి వాలినట్టి ఉంది.


అప్పుడే వారి జీవితాల్లో అతి పెద్ద విషాదం చోటు చేసుకుంది . పొలానికి కౌలు సరిగ్గా ఇవ్వడం లేదని పొలం అమ్మేద్దామని , ఆ బేరసారాలు మాట్లాడడానికి ఊరు వెళ్లి న శ్రీనివాస రావు , గోపాలకృష్ణ ల మోటార్ సైకిల్ కు ఆక్సిడెంట్ జరిగి ఇద్దరూ అక్కడ కక్కడే చనిపోయారు.

కొన్నాళ్ళు వారి జీవితాలు స్తబ్దుగా తయారయ్యాయి . పిల్లలు ఉన్నన్నాళ్లు వాళ్లతో మాట్లాడడం వాళ్ళకి వండి పెట్టడంలో కొంత వాళ్ళ బాధను మర్చిపోయారు .పిల్లలకు వాళ్ళ జీవితాలు వాళ్లకు ఉంటాయి . వారు వెళ్లిపోయిన తర్వాత ఇద్దరూ ఒంటరి లై పోయారు .

ఇద్దరూ పక్క పక్క ఇళ్లల్లో ఉంటారన్న మాటే కానీ రోజంతా ఎవరి ఒకరి ఇంట్లో కలిసే గడుపుతున్నారు .కాలం ఇలా సాగుతుండగా ఒక రోజు దివ్య రాజేష్ లు వచ్చారు. మా ఇంట్లో దిగాలంటే మాఇంట్లో దిగాలని సత్యవతి, పద్మావతి ఇద్దరూ పట్టు పట్టారు .కూతురు పుట్టింట్లోనే ఉండాలని ఒకరు కొడుకు ముందుగా తనింటికే వచ్చి తర్వాతే అత్తవారి ఇంటికి వెళ్లాలని ఒకరు వాదించారు .అప్పటికి ఎలాగో వాళ్ళ ని సముదాయించి అందరూ ఒక ఇంట్లోనే ఉన్నారు. అప్పుడే రాజేష్ దివ్యలకు ఒక దివ్యమైన ఆలోచన వచ్చింది .

వంట భోజనాలు అయ్యాక అందరూ హాల్ లో కూర్చున్నప్పుడు రాజేష్ ఇలా అన్నాడు అమ్మా, అత్తయ్యా మీ ఇద్దరూ పుట్టిన  దగ్గర నుంచీ కలిసే ఉన్నారు . ఇప్పుడు కూడా ఏదో ఒకరి ఇంట్లోనే కలిసి ఉంటున్నారు. మీ ఇద్దరూ ఒకే ఇంట్లో ఉంటూ ఇంకో ఇల్లు అద్దెకు ఇచ్చుకోవచ్చు కదా అంతే మళ్ళీ నా ఇంట్లో అంటే నా ఇంట్లో అంటూ గొడవ మొదలయ్యింది . చిన్న పిల్లలలా దెబ్బలాడు కుంటున్న వాళ్ళిద్దరినీ చూసి రాజేష్, దివ్య నవ్వుకున్నారు .ఇంక లాభం లేదని రాజేష్ రెండు ఇళ్ళూ ఇద్దరి పేర్ల మీద జాయింటు గా రిజిస్ట్రేషన్ చేయించాడు . డాక్యూమెంట్లు వాళ్ళ చేతిలో పెడుతూ ఇప్పుడు ఇద్దరూ హ్యాపీ కదా అన్నాడు.

దాంతో ఇద్దరూ ఒక గూటి కిందకి చేరారు .


ఇలా కొన్నాళ్ళు బాగానే జరిగింది మరలా ఒంటరితనం బాధించేది ఎంతకాని ఒకళ్ళనొకళ్లు చూస్తూ కూర్చుంటారు ?ఎంతసేపు టి వి చూస్తారు కొన్ని రోజులు చూసే టప్పటికి ఏ సీరియల్ ఎలాంటి మలుపులు తిరుగుతుందో ముందే ఊహించేస్తున్నారు దానితో టి వి అంటేనే చిరాకు పుట్టింది. 


అప్పుడప్పుడు మండలికి వెళ్లేవారు . కానీ వారి తరం మారిపోయింది . మండలి మొదలు పెట్టిన నప్పటి నుంచి ఉన్నవారిని అందరికీ గౌరవం ఉంది . అంతే ! వీళ్ళు ఉన్నంతసేపూ అందరూ బిగుసుకు పోయినట్టు ఉండడం గమనించారు . తరవాత ముఖ్తమైన సమావేశాలకు పిలిస్తే వెళ్లి అడిగితే సలహాలు చెప్పి వస్తున్నారు.


అప్పుడే సత్యవతి కి "సాయం సంధ్య" ఆలోచన వచ్చింది . తమ లాగే ఏంతో  మంది పెద్దవారు ఒంటరిగా ఉంటున్నారు . పిల్లలు వారి గమ్యాలను వెతుక్కుంటూ దూర ప్రాంతాలలో ఉంటున్నారు . ఆలా అని వారికీ తల్లి తండ్రుల మీద ప్రేమ లేదని అనలేము . జీవితపు పందెంలో ఒక్క సారి వెనకపడితే ఇంక పైకి రావడం చాల కష్టం . ఆ సంగతి పద్మకు, సత్యకు బాగా తెలుసు.


సత్య కు వచ్చిన ఆలోచన గురించి ఇద్దరూ బాగా ఆలోచించారు . ఇప్పుడు తాము అనుకుంటున్నది తామిద్దరూ కలిసి చెయ్యలేరు . ఇప్పుడు చిన్నప్పటి ఉత్సాహం, బలం లేవు. పిల్లల సలహా సహాయం తప్పక అవసరమవుతాయి .రమ్య కుటుంబం రమేష్ కుటుంబం ఇండియా వచ్చి కూడా మూడు సంవత్సరాలు అయిపొయింది ఎంతగా వీడియో కాల్ లో చూసినా మనవలని దగ్గరగా  చూడాలని , మాట్లాడాలని ఉంది . వెంటనే వాళ్ళకి ఫోన్ చేసారు . మామూలుగా అయితే ఏదో ఒక సాకు చెప్పి ప్రయాణం వాయిదా వేసు కుంటారని ఇద్దరికీ ఒంట్లో బాగోలేదని చెప్పారు . అసలు సంగతి దివ్య ,రాజేష్ లకు తెలుసు. 


వారం , పది రోజులు సందడి గా యిట్టె గడిచి పోయాయి . చిన్న నాటి స్నేహితులను కలిసికొని అందరూ సరదాగా  కాలం గడిపారు. వాళ్ళ చిన్నప్పుడు తిరిగిన ప్రదేశాలన్నీ పిల్లలకి చూపించారు . సత్యవతి, పద్మావతి ఎంతో సంతోషంగా ఉన్నారు . పిల్లలకి ఇష్టమైన వన్నీ వండిపెట్టడంలో ఎంతో తృప్తి అనుభవించారు .చూస్తుండగానే పిల్లలు వెళ్ళే రోజు దగ్గర పడుతుండడంతో , రాజేష్ ను అందరితో మాట్లాడమని అడిగారు.


ఒక రోజు రాత్రి భోజనాలు అయ్యాక అందరూ కూర్చుని ఉండగా" సాయం సంధ్య "విషయం గురించిన ప్రస్తావన రాజేష్ తీసికొనివచ్చాడు . దానికి ముందు కొంత వ్యతిరేకత వచ్చింది .ఇక్కడ తోచకపోతే మా ఇళ్లకు వచ్చేయ్య వచ్చి కదా అని రమ్య అన్నది . దానికి సత్య ,పద్మ తీవ్రం గా వ్యతిరేకించారు . ఇది తమ ఒక్క సమస్య కాదని తమ లా ఒంటరిగా ఉన్న వారికోసం ఏమైనా చెయ్యాలనే తపన మాత్రమేనని చెప్పారు.రెండు రోజుల తర్జన భర్జన తర్వాత కొంత ఆస్తి మనవుల పేరు మీద పెట్టి మిగిలినది "సాయం సంధ్య "నడపడానికి వదలని అనుకున్నారు . సత్యవతి, పద్మావతి పెద్దవాళ్ళు అయిపోవడం వల్ల అంత బాధ్యత మొయ్యడం అసంభవం కాబట్టి ఒక ట్రస్ట్ ఏర్పాటు చెయ్యాలని తీర్మానించారు.ట్రస్ట్ గురించి అనుకోగానే పద్మావతి , ప్రియంవద గారి అబ్బాయిని ఒక ట్రస్టీ గా ఉండమని అడుగుదామని అన్నారు . అలాగే అందరూ కలిసి వాళ్ళ ఇంటికి వెళ్లారు . వీరిని అయన సాదరంగా ఆహ్వానించారు . చిన్నప్పటి నుంచి వీళ్ళ గురించి బాగా తెలి యడం వలన వీళ్ళ ప్రతిపాదన కు వెంటనే ఆమోదించారు . అంతేకాక గవర్నమెంట్ నుంచి ఏదైనా గ్రాంట్ వస్తుందేమో కనుక్కుంటానని అన్నారు .దాంతో అంతా ఆనందించారు . వెంటనే  రాత కోతలన్నీ పూర్తీ చేసారు . ఎవరిని చేర్చుకోవాలో ఎంత కార్చి అవుతుందో అన్నీ లెక్కలు వేసుకున్నారు . పిల్లలు కనీసం సంవత్సరనికి ఒక సారైనా రావాలని నిబంధన పెట్టారు. 


అలా మొదలయ్యింది" సాయం సంధ్య" . ఇదండీ సత్యవతి పద్మావతిల కధ . మీకు నచ్చిందని అనుకుంటున్నాను.



Rate this content
Log in

Similar telugu story from Drama