Surekha Devalla

Drama

3.1  

Surekha Devalla

Drama

టీనేజ్ లవ్

టీనేజ్ లవ్

5 mins
288


చాలా మంది ఆకర్షణనే ప్రేమ అనుకుంటున్నారు. ప్రేమకి మొదటి మెట్టు ఆకర్షణ. కానీ ఆ ఆకర్షణే లోతుగా వెళితే ప్రేమ అవుతుంది అని కొంతమంది నమ్మకం . ముఖ్యంగా టీనేజ్ లోని ప్రేమకి మూలం ఖచ్చితంగా ఆకర్షణ. కానీ ఆ ఆకర్షణ అనే ప్రేమ జీవితాలను ఎటునుండి ఎటు తిప్పుతుందో ఎవరూ చెప్పలేరు. అలాంటి మలుపులతో కూడిన కథ , నా కథ. ఒకవిధంగా నా జీవిత కథ అని చెప్పొచ్చు అనుకుంట. నేనేమీ పెద్ద రచయిత్రిని కాదు , అందంగా నా కథని చెప్పటానికి. ఏదో నాకు తెలిసినట్లుగా చెప్తాను తెలుసుకోండి.


మాది ఉమ్మడి కుటుంబం. అలా అని పెద్ద కుటుంబం కాదు, అమ్మానాన్నలు , తాతయ్యా నాన్నమ్మలు , తమ్ముడు ,నేను, ఇంతే . ఇంట్లో అందరికీ నేనూ ,తమ్ముడూ అంటే చాలా ఇష్టం. కానీ ఆడపిల్లని అని చెప్పి నాకు చాలా రూల్స్ పెట్టేవారు. ఇంట్లో నుంచి ఒంటరిగా బయటికి వెళ్ళకూడదు , ఎక్కువ సేపు బయట ఉండకూడదు. బయట అంటే ఎక్కడికో అని కాదు , నా స్నేహితురాళ్ళ ఇంటికి. నైట్ ఔట్ ,అయితే నో ఛాన్స్, అసలు ఆ విషయమే ఆలోచించనవసరం లేదు .


అదే మా తమ్ముడికి అయితే నో రూల్స్. నైట్ ఆడుకోవడానికి వెళ్లినా ఏమనేవారు కాదు , ఏమైనా అంటే వాడు మగపిల్లవాడు ఏం ఫర్లేదు అంటారు. వాడు నాకంటే మూడు సంవత్సరాలు చిన్న. మగపిల్లవాడు అయితే ఏంటి గొప్ప . అందరి మీద పిచ్చి కోపం వచ్చేది. కానీ ఏం చేయలేను కదా. 


రోజూ ఇంటినుండి స్కూలుకు వెళ్ళేటప్పుడు జాగ్రత్తలు చెప్పేవారు . అవి వినీ వినీ విసుగు , కోపం వచ్చేసేది. జాగ్రత్తలు చెప్పినా కోపం వస్తుందా అని మీకనిపించవచ్చు. ఆ జాగ్రత్తలు ఏంటో తెలుసా......


1. ఎవరితో ఎక్కువ మాట్లాడకూడదు , ముఖ్యంగా అబ్బాయిలతో అస్సలు మాట్లాడకూడదు.


2 . స్పీడ్ గా నడవకూడదు , గట్టిగా నవ్వకూడదు. అందులోనూ నలుగురిలో ఉన్నప్పుడు అసలు అలాంటివి చేయకూడదు.


3 . స్పోర్ట్స్ ఆడటానికి వీల్లేదు.


ఇలా చాలా ఉన్నాయి చిన్నవీ , పెద్దవీ.....


ఈకాలంలో కూడా ఇలా ఉన్నారా (ఉంటారా ) మేము నమ్మం అనొచ్చు మీరు. కానీ ఉన్నారు , కాకపోతే చాలా తక్కువ ఉన్నారు అలాంటివారు.


ఒకరోజు నేను అడిగాను నాన్నని....


ఎందుకు నాన్నా , రోజూ ఇన్ని చెప్తున్నారు , నాకెందుకు ఇన్ని రూల్స్ అని .


" అదికాదు బంగారం, అమ్మాయివి కదా , బయట రోజులు బాలేవు . రోజూ పేపర్లో , టివిలో ఎన్ని చదవట్లేదు, చూడట్లేదూ . మా భయం మాకు ఉంటుంది కదా. ఈకాలంలో పిల్లలు కూడా సరిగా లేరు , చెడు అలవాట్లకి తొందరగా అట్రాక్ట్ అవుతున్నారు.

నీకు ఏం జరుగుతుందో అని మా భయం అంతే. ఆడపిల్ల పుట్టాలి అంటే ఎంతో అదృష్టం ఉండాలి అంటారు. మరి పుట్టిన ఆ బంగారాన్ని అపురూపంగా , భద్రంగా ఏ రకమైన హానీ జరగకుండా చూసుకోవాలి కదరా. అందుకే ఆ జాగ్రత్తలు అన్ని. నీ మంచి కోసమే." అన్నారు నాన్న.


నాన్న చెప్పింది చాలా వరకు అర్థమైంది. అప్పటివరకు ఉన్న కోపం, అసహనం అన్నీ తగ్గాయి. కానీ అప్పుడే కొన్ని సందేహాలు వచ్చాయి....


ఇలా ఎంతకాలం అని ఎవరో ఒకరు కాపలా ఉంటారు ఆడపిల్లకి??


అలా లేకపోతే ఆ అమ్మాయి ఎక్కడికీ వెళ్ళకుండా ఇంట్లోనే కూర్చోవాలా ??


తన కలలు , ఆశలు అన్నీ ఎవరికో భయపడి చంపేసుకోవాలా??


ఎవరో ఏదో చేస్తారేమో అంటూ చిన్నప్పటి నుండి భయం నూరిపోసే బదులు , ఏదైనా ఆపద వస్తే దానిని ఎలా ఎదుర్కోవాలో నేర్పొచ్చు కదా.


ఏదైనా ఆత్మసంరక్షణ విద్య నేర్పించొచ్చు కదా.


ఏమిటో అన్నీ సందేహాలే.....అమ్మని అడిగా ఇవన్నీ...


చెప్పినంత సులువు కాదు చెయ్యడం. అవన్నీ జరిగే పనులు కావులే కానీ , నువ్వు చదువు మీద ధ్యాస పెట్టు. పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా బుద్ధిగా ఉండు. అర్థమైందా అంటూ మళ్ళీ నాకే తిట్లు ప్రసాదించింది.


నాకొకటి అర్థం కాలేదు, లోకంలో అందరూ చెడ్డవాళ్ళే ఉంటారా , మంచివాళ్ళే ఉండరా.....ఇంట్లో వాళ్ళందరూ మరీ పాతకాలంలో ఉండి పోయారు. అప్డేట్ కాలేదు వీళ్ళింకా అనిపించింది.


నాదీ టెన్త్ అయ్యి ,కాలేజ్ కి వచ్చాను. ఏంటో అంతా కొత్తగా ఉంది. ఏదో తెలియని సంతోషం. కొత్తగా రెక్కలు వచ్చినట్లు , ఏదో స్వేచ్ఛ దొరికిన ఫీలింగ్. ప్రపంచం అంతా స్పెషల్ గా అనిపిస్తుంది.


కాలేజ్ లైఫ్ ఆడుతూ పాడుతూ సరదాగా సాగిపోతుంది. ఇంటర్ మొదటి సంవత్సరం అయ్యేసరికి ఒకరి ఆకర్షణలో మునిగిపోయాను. ఆ ఆకర్షణ పేరు ఆకాష్. మా క్లాసే. బాగుంటాడు , చాలా బాగా మాట్లాడతాడు , నవ్విస్తాడు. ఆ మాటలకే పడిపోయి , మొదట నేనే ప్రపోజ్ చేశా. కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా , నేను నచ్చని వాళ్ళు ఉండరని. మా క్లాస్ లో అందరికంటే నేనే బాగుంటా. అందుకే అలా.....


వెంటనే ఓకే చెప్పేసాడు. కాలం చాలా సరదాగా గడిచిపోతుంది. ఫస్ట్ ఇయర్ అయిపోయింది. ఒకరి ఫోన్ నంబర్ ఇంకొకరికి ఇచ్చుకుని బై చెప్పుకున్నాం. మా ప్రేమ విషయం ఎవరికీ తెలియదు , ఆకాష్ ఎవరికీ చెప్పొద్దూ అన్నాడు. మళ్ళీ అందరూ రూమర్స్ క్రియేట్ చేస్తారు అని చెప్పాడు. సరే అన్నా , నా బెస్ట్ ఫ్రెండ్కి కూడా మా విషయం తెలియదు. 


సెలవుల్లో అప్పుడప్పుడు కాల్స్ , మెసేజెస్ తో కాలం గడిచిపోయింది. సెకండ్ ఇయర్ స్టార్ట్ అయింది. మా మధ్య కొంచెం చనువు పెరిగింది. ఆ విషయం నా ఫ్రెండ్ రచన కనిపెట్టింది. ఆ విషయమే అడిగితే నిజం చెప్పేసా. సారీ కూడా చెప్పాను. కానీ అది ఎందుకో మూడీ అయిపోయింది. తన దగ్గర విషయం దాచినందుకు అలా వుంది అనుకున్నా. ఒక పది రోజులకి తను నార్మల్ అయింది. ఒకరోజు రచన కాలేజ్కి రాలేదు. కాల్ చేస్తే కట్ చేసి , మెసేజ్ పెట్టింది. తర్వాత చేస్తా రా , కొంచెం బిజీ అని.

మర్నాడు కాలేజ్ కి వచ్చిన రచన నాతో రేపు మా ఇంట్లో ఎవరూ ఉండరు , మా ఇంటికి రావే నువ్వు అనడిగింది. ఇంట్లో ఏమంటారోనే అడిగి చెప్తా అన్నాను.

తను అక్కడే మా ఇంటికి కాల్ చేసి అడిగి ఒప్పించింది.


నువ్వు , ఆకాష్ ప్రేమించుకుంటున్నారనే కానీ డైరెక్ట్ గా మాట్లాడుకుంది తక్కువ కదా. రేపు ఇన్వైట్ చెయ్ మా ఇంటికి , ఎవరూ ఉండరు కదా అంది. 

నేను ఎగిరి గంతేసి థాంక్స్ చెప్పి ,ఆకాష్ కి విషయం చెప్పాను. మొదట ఒప్పుకోలేదు, తర్వాత సరే అన్నాడు.


రచన ఇంటి దగ్గర కలిసాం. ముగ్గురం సరదాగా ఒక గంట కబుర్లు చెప్పుకున్నాం. ఈలోపు సడెన్ గా నాన్న వచ్చారు. నేను ఆకాష్ షాకయ్యాం. నాకైతే ఏదో తెలియని టెన్షన్. 

నాన్న నా కంగారు చూసి దగ్గరకు తీసుకొని టెన్షన్ పడకు రా , రచన నాకంతా చెప్పింది. మీ ఇద్దరితో మాట్లాడ్డానికి వచ్చా. ఏం బాబూ , నాన్నగారు ఏం చేస్తూ ఉంటారు అన్నారు.


రెవెన్యూ డిపార్ట్మెంట్ లో జాబ్ చేస్తారండి అని చెప్పాడు భయం భయంగా. 


సరే పెళ్ళెప్పుడు చేసుకుందాం అనుకుంటున్నారు


అప్పుడే పెళ్ళేంటంకుల్ , ఇంకా చదువు అయ్యి , లైఫ్ లో సెటిల్ అవ్వాలి కదా


ఓకే నువ్వు సెటిల్ అయ్యాకనే పెళ్ళి చేసుకుందురు , మీ అడ్రస్ చెప్పు. మీ పెద్ద వాళ్ళతో కూడా ఒక మాట చెప్తే నాకు నిశ్చింతగా ఉంటుంది. 


నాన్నా నిజమా మీరు నా ప్రేమని ఒప్పుకుంటున్నారా , థాంక్యూ నాన్నా , థాంక్యూ సో మచ్. ఈ విషయం మీ దగ్గర దాచినందుకు క్షమించండి.


ఫర్వాలేదు బంగారం, నా కూతురి మనసు నాకు తెలియదా...


చెప్పు ఆకాష్ మీ అడ్రస్ అన్నారు నాన్న..


అదీ అంకుల్ మా ఇంట్లో ఇదంతా ఒప్పుకోరు . ఈ విషయం తెలిస్తే నన్ను చంపేస్తారు అన్నాడు..


ఫర్వాలేదు , నేను ఒప్పిస్తా లే......నువ్వు చెప్పు అన్నారు


అదీ అంకుల్ అంటూ నసుగుతున్నాడు..ఆకాష్


ఈలోపు బయటనుండి ఒక అమ్మాయ్ వచ్చింది లోపలికి . రచన తన ఫ్రెండ్ గా పరిచయం చేసింది.


ఆ అమ్మాయ్ ని చూసి ఆకాష్ షాకయ్యాడు..


ఆ అమ్మాయేమో కోపంగా చూస్తోంది ఆకాష్ ని...


ఏం జరుగుతుందో నాకర్థం కావట్లేదు..అయోమయంగా చూస్తున్నా.......


మరి ఈ అమ్మాయ్ గురించి ఏం చేద్దాం ఆకాష్ అన్నారు.


ఏమైంది నాన్నా , ఏంటిదంతా అనడిగాను


నీలానే , ఈ అమ్మాయ్ ని కూడా లవ్ చేస్తున్నాడు. ఈ అమ్మాయినే కాదు , మరో ఇద్దరిని కూడా అవునా ఆకాష్ అలియాస్ వికాస్ అలియాస్ గణేష్.......


షాకయ్యాడు ఆకాష్.....పారిపోవడానికి ట్రై చేశాడు..

నాన్న గట్టిగా పట్టుకున్నారు. ఈలోపు నలుగురు పోలీసులు వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోయారు.


మేమింకా షాక్ లోనే ఉన్నాం...


నాన్న చెప్పారు మాకు ఆకాష్ అమ్మాయిల్ని కిడ్నాప్ చేసి అమ్మేసే ముఠాలోని మనిషి, మీలా టీనేజ్ లోని అమ్మాయిలకి వల వేసి ప్రేమ పేరుతో నమ్మించి మోసం చేసి అమ్మేస్తాడు. నువ్వు సెలవుల్లో నీ ఫోన్ ఎక్కువ వాడుతూ నీలో నువ్వు నవ్వుకుంటున్నపుడే డౌట్ వచ్చింది. అనుకోకుండా ఒకసారి నీ ఫోన్ లో మెసేజెస్ చూసి కన్ఫర్మ్ చేసుకున్నా. తర్వాత ఆ అబ్బాయి గురించి ఎంక్వైరీ మొదలుపెట్టాను. నా ఫ్రెండ్ ఒకరికి ఒక ఎస్సై రిలేటివ్. ఆయన దగ్గరకు వెళ్ళి విషయం చెప్పాను. ఆయన తీగ లాగితే డొంకంతా కదిలింది....


నాన్నా నువ్వు లేకుంటే మా పరిస్థితి ఏంటంటూ ఏడ్చేసా. నాతో పాటు ఆ అమ్మాయి కూడా. చాలా సార్లు థాంక్స్ చెప్పి వెళ్ళింది ఆ అమ్మాయి.


చాలా తొందరగానే ఆ షాక్ నుండి బయటపడి , చదువు మీద ధ్యాస పెట్టాను. మంచి జాబ్ తెచ్చుకున్నా.


ఆఫీసు లో ఒకబ్బాయి ప్రపోజ్ చేశాడు. నేను వెంటనే నాన్నకి చెప్పాను. ఆ అబ్బాయి కి కూడా ఏం ఉన్నా మా నాన్నతో మాట్లాడండి అని చెప్పా.


తర్వాత ఇరువైపుల పెద్దలు ఒప్పుకోవడంతో మా పెళ్ళి చాలా సంతోషంగా , ఆడంబరంగా జరిగింది.


అన్నట్లు నాన్న అన్ని విషయాలూ పెళ్ళికి ముందే చెప్పారు. అవన్నీ అర్థం చేసుకునే ఆయన నన్ను చేసుకున్నారు.


ఇదండీ నా కథ. ఒక వయసు వచ్చాకా చాలామంది తల్లిదండ్రులని విలన్స్ లా చూస్తారు. ముఖ్యంగా ప్రేమ విషయంలో. దయచేసి అలా చూడకండి. వాళ్ళు ఏం చేసినా ఏం చెప్పినా మనకోసమే....


అలానే తల్లిదండ్రులు మీరు కూడా పిల్లలు తెలిసో తెలియకో తప్పు చేసినా , తప్పటడుగు వేసినా వాటిని సరిదిద్ది , ముందడుగు వేసేలా వాళ్ళకి ధైర్యాన్ని , మీ సహకారాన్ని అందించండి...


ఇంతకీ నా పేరు చెప్పలేదు కదా.......


నా పేరు హాసిని....


ఎప్పుడూ నవ్వుతూ ఉండాలని నాన్న నాకా పేరు పెట్టారు.


ఐ లవ్ యూ నాన్న.......


Rate this content
Log in

Similar telugu story from Drama