Surekha Devalla

Comedy

4.3  

Surekha Devalla

Comedy

యాంకరమ్మ తిప్పలు

యాంకరమ్మ తిప్పలు

2 mins
1.5K


"ఎందుకా విచారము బాలా? ఎప్పుడూ తోకతెగిన బల్లిలా చిందులు వేస్తూ ఉండేదానివిగా!"


"ఎప్పుడూ తుప్పుపట్టిన ఆ దిక్కుమాలిన పోలికలు తప్ప ఒక్క మంచి పోలికా దొరకదా!"


"హిహిహి..అంటే నేను నీలా యాంకర్ ని కాదు కదా..కొత్త కొత్తగా అన్ని నేర్చుకోవడానికి"


"నీ బొంద. నీకు తెలుసా, హారీ! యాంకర్ గా చేయడం ఎంత కష్టమో!!"


"అబ్బా, ఛా! యాంకర్లకి కష్టాలేంటమ్మా!!అయినా చాలా ఇష్టపడి వెళ్ళి మరీ అయ్యావుగా యాంకర్ అనన్యా!"


"నీకు అలాగే ఉంటుందే..ఓ పదిహేను రోజుల క్రిందట ఒక వంటల ప్రోగ్రామ్ కి యాంకర్ గా వెళ్ళాను..అక్కడ ఆవిడ ఎన్ని విచిత్ర ప్రయోగాలు చేసిందో తెలుసా!"


"అవునా! ఇంట్రెస్టింగ్.. కొంచెం వివరంగా చెప్పవా, ప్లీజ్!!"


"సరే, ఆవిడ చేసిన విధానం, మాటలు, నా ఫీలింగ్స్ పిన్ టు పిన్ చెప్తా విను!


"నమస్తే, ఔరా కుమారి గారు! మీ వంటల మీద కంటే మీకా పేరు ఎలా వచ్చిందో తెలుసుకోవాలనే ఆరాటం ఎక్కువ అయిపోయింది అండీ.. కొంచెం చెప్తారా! "


"ఓ..చెప్తా! నేను అందరితో 'ఔరా'అనిపించుకోవాలని మా అమ్మ మణి నాకు ఆ పేరు పెట్టారు.. ఆ పేరును సార్థకం చేసుకోవటానికే వంటల్ని కొత్తగా చేస్తున్న" అంది గొప్పగా(వంట అనే ప్రయోగాన్ని ఈవిడే కనిపెట్టినట్లు బిల్డప్ ఇస్తూ)


'వావ్..కొత్త ప్రయోగం అంట..రొటీన్ ఫుడ్ తినీ తినీ విసుగొచ్చేసింది..కుమ్మేయాలి ఈరోజు' అనుకున్నా మనసులో.


 "ఓహో..సూపరండీ! మనం వంట స్టార్ట్ చేసేద్దాం అయితే.. మీరు చేయబోయే వంట పేరు?"


"మామిడాకు సూప్, అరటాకు కేసరి"


(బాబోయ్,ఇవేం వంటలు..ఈవిడ వంటలకు నేను బలి ఈరోజు.. )


"ముందుగా మామిడాకులు ఆరు తీసుకుని ఉడకపెట్టేసి, మిక్సీ పట్టేసి , ఇదిగో ఇవన్నీ వేసేసి మరగనిచ్చేయాలి..ఓ పది నిమిషాల తర్వాత కట్టేసి జామాకుతో గార్నిష్ చేసి తాగేయడమే" అంటూ స్టైల్ గా ఆ బౌల్ అందించింది.


దీని క్రియేటివిటీ ఎత్తుకుపోనూ. మామిడాకుతో సూప్, జామాకుతో గార్నిష్ ఆ..అది తాగితే నేనేమైతానో ఏంటో.. అనుకున్నా.


ఎంత బలవంతంగా నవ్వుదామన్నా వచ్చి చావట్లేదు..ఓ ప్లాస్టిక్ స్మైల్ ని పెదవులకు అతికించేసి ఒక్క స్పూన్ నోట్లో పెట్టుకున్నా! అంతే, నాకేదో అయిపోయిందే...


ఆ స్పూన్ నోట్లోనే ఉండిపోయింది..నా చేతులు ఆ బౌల్ ని వదలట్లేదు..కళ్ళేమో తాటికాయల సైజ్ లో పెరిగిపోయి బయటికి తన్నుకొచ్చేసిన ఫీలింగ్.


అనవసరంగా మన సైనికులు అంత కష్టపడి శత్రుదేశం వాళ్ళతో పోరాడుతున్నారు కానీ, ఈవిడని వంటావిడగా వాళ్ళ దగ్గర జాయిన్ చేస్తే చాలు..

వాళ్ళు వాళ్ళ దేశంలో కూడా ఉండకుండా ఏ సముద్రంలోనో దూకేస్తారు..మనకి పీడా పోద్ది..అని బలంగా అనిపించిందే..


"హహహహహహహ...అదిరింది ఫో.."


నీకలాగే ఉంటదే..మావాళ్ళేమో ఎక్స్ప్రషన్ మార్చండి మేడమ్ అంటున్నారు.. అదెక్కడ మారి ఛస్తోంది..అలా తప్ప ఇంకోలా పెట్టే అవకాశం లేదక్కడ.


మీరు వచ్చి టేస్ట్ చూడండ్రా, తెలుస్తుంది అని నానా తిట్లూ తిట్టుకున్నా..


ఇప్పుడే వస్తా అని ఆవిడకు చెప్పి, కట్ చేయండి ఓసారని మావాళ్ళకు చెప్పి ఓ రెండు బకెట్ల నీళ్ళతో నోరు కడిగేసుకునే సరికి ఆ వంట ప్రభావం ఒక వంతు తగ్గింది. 


రెండోవంటకు రెడీ అయిపోయాం..పోనీలే స్వీట్ కదా,ఎంతో కొంత బాగుంటుంది అనుకున్నా..


అరిటాకు కేసరి అంటే అరిటాకులో కేసరి వేసి తినమంటదేమో అనుకున్నా...కాదంట,అరిటాకుతోనే స్వీట్ చేస్తుందంట.


ఈరోజు నా కర్మ ఇలా కాలిపోయింది అన్నమాట అని నా మీద నేనే జాలిపడ్డా..


ఈలోగా ఊహించశక్యం కాని తీరులో, ఏ వర్ణమో చెప్పే అవకాశం ఏమాత్రం లేని రంగూ రూపుతో ఆ పదార్థం తయారయిపోయింది.


నిజం చెప్పొద్దూ, నాకయితే కరోనా మానవరూపం ఎత్తి ఈవిడలా వచ్చి వింతవింత వంటలతో మానవజాతిని నిర్మూలించటానికి వచ్చిందేమో అనే అనుమానం కూడా వచ్చేసింది.. ఎందుకయినా మంచిది, ఏ సిబిఐ వాళ్ళకో ఈ ఇన్ఫర్మేషన్ అందించాలి అనుకున్నా..


ఆవిడేమో టేస్ట్ చూడమంటుంది..నాకేమో ధైర్యం సరిపోవట్లేదు..మా డైరెక్టర్ ఏమో తినకపోతే చీటింగ్ కేసు వేస్తానని బెదిరిస్తున్నాడు..


బయటకు వచ్చాకా ఈ వంట మొత్తం వాడికే తినిపించి మర్డర్ చేసెయ్యాలని ఫిక్సయిపోయా..


ఆవిడ తినమని బలవంతం చేస్తోంది.. ఇంకొద్ది సేపు ఆగితే తినిపించేస్తుందేమో కర్మ.


ఈవిడ ప్రయోగాల మీద బండపడా..నేను బలి ఈరోజు ఈ వంటలకు అనుకుని వాపోతూనే చచ్చినట్టు టేస్ట్ చూశా..


గట్టిపిండాన్ని కాబట్టి నాకు ఏం కాలేదు కానీ, ఇంకొకరయితే వెంటనే టపా కట్టేసేవారు..


"హహహహహహహ....సూపర్..ఇంకా నీ ఇన్స్పిరేషన్ తో నేను కూడా అటు వద్దామనుకున్నా..పొరపాటున కూడా అటు తొంగిచూడను.." 


"మంచి డెసిషన్. నువ్వు ఇంటర్వ్యూ లు చేస్తున్నావు కదా...నువ్వు హ్యాపీ చక్కగా.."


"అంతలేదమ్మా.. అది ఇంకా వింతగా ఉంటుంది తెలుసా.. !"


"అవునా! చెప్పు చెప్పు"


సరేనని మొదలుపెట్టింది హారిక(హారీ).


మిగతాది తరువాయి భాగంలో..


సురేఖ దేవళ్ళ


Rate this content
Log in

Similar telugu story from Comedy