Midhun babu

Romance Classics

4.5  

Midhun babu

Romance Classics

అనుబంధం

అనుబంధం

3 mins
19



రంగురంగుల పూలమొక్కలతో

పచ్చగా కళ్ళాపి చల్లిన వాకిట్లో

అందంగా వేసిన ముగ్గులు చూపరులను

ఇట్టే ఆకట్టుకుంటున్న ఆ అందమైన భవంతి

చుట్టూ అందంగా నిత్యం అత్యంత శ్రద్ధ వహించి పెంచుతున్న పచ్చగడ్డితో..  శుభ్రమైన పరిసరాలతో ఎంతో ఆహ్లాదకరంగా

కనిపిస్తున్న గొప్ప ప్రేమాలయం ఆగృహం.. 


ఏమిటీ! చిన్నాడేదో అంటున్నాడు?.. 

అడుగుతోంది ఏడుపదుల వయస్సు 

నిండిన శాంతమ్మగారు తన తనయుడు

రామచంద్రం మాష్టారును. 

ఆఁ.. ఏమీలేదమ్మా!. చిన్నాడికేదో

అమెరికాలో ఉద్యోగమొచ్చిందని 

చెప్తున్నాడు వెళ్ళాలా! వద్దా! అని

అడుగుతున్నాడు .. 

మరినువ్వేమన్నావ్? 

నేనడానికేముంది మంచి అవకాశమేకదా!

చాలీచాలని ఆదాయంతో నేను పడిన

ఇబ్బందులు పిల్లలక్కూడా 

ఎందుకనేకదా! కష్టమయినాసరే!అని

పెద్దాడిని ఇంజనియరూ, చిన్నాడిని

బీఫార్మసీ చదివించాను 


పెద్దవాడు రవికిరణ్ బెంగుళూరులో 

పెద్ద ఉద్యోగం మంచి పోజిషన్లోనే వున్నాడు

చిన్నాడు శశికిరణ్ కి ఈమధ్యే జాబ్ ఆఫర్స్

వస్తున్నాయి అందులోనూ ఇది గొప్ప

అవకాశం. ఎందుకు అడ్డుచెప్పడం?.. 


అలాఅంటావేంట్రా రాముడూ!

నాకేమో వయసు మీదపడుతోంది

కోడలురాజేశ్వరి పిల్లలు కాలేజీ 

చదువుల్లో వుండగానే బాధ్యతలన్నీ  

నా పైనపడేసి నిశ్చింతగా 

అర్ధాంతరంగా కన్నుమూసింది! 


పెద్దాడినికూడా ఇలాగే మంచి భవిష్యత్తు

అంటూ అక్కడి అమ్మాయినే చూసి 

పెళ్ళిచేసి బెంగుళూరు పంపించేశావు!

ఇప్పుడేమో వీణ్ణి ఏకంగా విదేశాలకే

పంపటానికి తయారయ్యావు?

ముసలిదాన్ని నన్నూ, నిన్నూ 

చూసుకోడానికి ఎవరున్నారు నాన్నా!.. 


అలాఅంటే ఎలా అమ్మా! కాలంతోబాటు

మనమూ మారాలి కదా!.. పిల్లల 

ఎదుగుదలకు అడ్డుపెడితే ఎలాగమ్మా!... 

అయినా వనజ మనతోనే వుంటోందిగా!.. 

బాగానే చూస్తోందికదమ్మా!..

ఆఁ .. ఆఁ... 

పనిపిల్ల... రేపో మాపో 

దాని దారి అదిచూసుకుని

వెళ్ళి పోతుంది అప్పుడయినా ఏంచేస్తాం!.. 

ఏంటమ్మా నువ్వు దానికెవ్వరూ

లేరనే కదా రాజేశ్వరి చేరదీసింది

తనూ మనతోనే వుంటుంది మనల్ని

వదిలి పాపం అదిమాత్రం ఎక్కడికెళ్తుంది!.. 

సరే!.. నీఇష్టం అలాగేకానీరా!.. 

వింటావా ఏమిటీ నువ్వు!... 

*---*----*   *---*---*  *---*---*  *---*---*

నాన్నా!.. వీసా వచ్చేసింది 

అంతా రడీ వచ్చేవారమే ప్రయాణం

కానీ నానమ్మనీ, మిమ్మల్నీ వదిలి

వెళ్ళాలంటేనే దిగులుగావుంది నాన్నా!.. 

కన్నీటినిదాచే ప్రయత్నం చేస్తూ 

అంటున్నాడు శశికిరణ్.  

అంత సున్నితమైతే ఎలారా! 

నీభవిష్యత్తు అందంగా,ఆనందంగా

ఉండాలనేకదా! మాకోరిక పైగా మీఅమ్మకి కూడా నాపిల్లలు విదేశాల్లో పెద్ద పెద్ద

ఉద్యోగాలు చెయ్యాలనే ఆకాంక్ష

ఎంతో వుండేది ఇలాగయినా 

తన ఆత్మ తృప్తి పడుతుంది. 

సంతోషంగా వెళ్ళు నాన్నా!.. 


రామచంద్రం మాష్షారు చాలాబెంగగా

కనిపిస్తున్నారేమిటీ!.. అడిగాడు 

చిన్ననాటి స్నేహితుడు సాంబశివం. 

సాంబశివం రామచంద్రంకు సహాధ్యాయి. 

కొంతవరకూ చదువుకుని తన తండ్రి 

కిరాణా వ్యాపారంలో తానూ చేరిపోయాడు.

ఏమీలేదురా సాంబూ! ఈమధ్య అమ్మకి

సూస్తీగా వుంటోంది పెద్దావిడకదా!.. 

నాకూ అంత ఓపిగ్గా వుండటం లేదు!

పిల్లలు దూరంగా వుండటంతో ఇప్పుడు

చాలా కష్టంగా అనిపిస్తోంది!

మరి మేమూ,అమ్మా చెబితే విన్నావా!

అసలే వదిన దూరమై ఒంటరి వాడివయ్యావు!.. 

అమ్మ ఎన్నాళ్ళు నీతో ఉండగలదు!.. 

మళ్ళీ పెళ్ళి చేసుకోరా!.. 

అంటే విన్నావు కాదు!

అదెలాకుదురుతుందిరా సాంబూ! 

రాజీని మరువగలనా! పైగా పిల్లల 

దృష్టిలో చులకనయ్యేవాడిని కాదా!.. నువ్వేచెప్పు!.. 

అదిసరే.. పనమ్మాయి వనజ బాగానే

చూసుకుంటోందికదా అమ్మనీ, నిన్నూ !... 

ఆఁ.. బాగానే చూసుకుంటోందిరా!.. 

కానీ ఆపిల్లకూ పెళ్ళీడుకూడా దాటుతోంది. 

తల్లీ,తండ్రీ ప్రమాదంలో పోయినప్పట్నించీ 

మాతోనే వుంటోంది కదా!.. దానిక్కూడా 

ఓదారి చూపించాలిరా! రాముడూ!.. 

అని అమ్మ ఆరాటపడుతోందిరా!.. 

ఏంచెయ్యాలో తోచడంలేదు!.. 


టాక్సీ డ్రైవర్ గా పనిచేస్తూ రంగయ్యా,

నాలుగిళ్ళలో పనిచేస్తూ లక్ష్మీ.  

బతుకుసాగించేవారు ఒక్కగానొక్క

బిడ్డ వనజ. లక్ష్మి.. రాజేశ్వరి,రామచంద్రం

ఇంట్లో పనికి కుదిరిన నాటికి వనజ పసిపిల్ల

పల్లెటూళ్ళో పనులు ఏవీ లేక.. నివాసం ఉంటున్న చిన్న పాక చుట్టూఉన్న కాస్త స్థలమూ అమ్మేసి ఓ పాత కారు కొనుక్కుని 

బతకడానికి ఈ ఊరు వచ్చారు. చక్కగా సాగిపోతున్న వాళ్ళ జీవితాలను 

విధి ప్రమాదం రూపంలో మింగేసింది. 

కూతురిని బడిలో దింపి 

దూరపు బంధువుల పెళ్ళికి వెళ్ళి వస్తుండగా

ప్రమాదం జరిగి ఇద్దరూ ఈలోకాన్నీ,.. 

లోకం తెలియని పసిదాన్నీ..  వదిలి వెళ్ళిపోయారు పాపం వనజ బ్రతుకు

ప్రశ్నార్ధకమయ్యింది. ఒంటరిదైన వనజని 

ఐనవాళ్ళెవ్వరూ ఆడపిల్ల అనే కారణంతో

పట్టించుకోలేదు. రాజేశ్వరికీ, వనజకూ 

ఆత్మబంధమేదో కలిపాడు పైవాడు

పనిపిల్లలా ఏనాడూచూడలేదు తను.. 


మరి ఏంచేద్దామనుకుంటున్నావ్!.. 

సాంబశివం ప్రశ్నతో

స్వగతంలోనుంచి బయటికొచ్చారు

రామచంద్రం. అదే ఆలోచిస్తున్నాను... 

అయితే ను.. వ్వే.. మ.. యి.. నా...  

ఛ.. ఛ ఏమిట్రా ఆమాటలు

నాఇద్దరు పిల్లల్తోనే అదీపెరిగింది. 

కూతురులేని లోటు తీరుస్తోంది

పిల్లలు దగ్గరలేకున్నా ఇంటా, బయటా 

అన్నీ తనే చూసుకుంటోంది. 

తనకు కూడా మంచి జీవితం 

ఇవ్వాలని చూస్తున్నాను. 


శశికిరణ్ పెళ్ళి వైభవోపేతంగా

జరిపించేశారు రామచంద్రం. కోడలుకూడా 

అమెరికాలో ఉద్యోగి కావడంతో.. 

ఉన్న తక్కువ సమయంలో పెళ్ళి హడావుడిగా చెయ్యవలసి వచ్చింది. 

పెళ్ళయ్యాక పదహారు రోజులూ ఇట్టే గడిచి పోయాయి. కావలసినవన్నీ కొనుక్కుని 

తిరుగుప్రయాణానికి సిద్ధమయ్యారు. 

వనజ సామాన్లన్నీ సర్దుతోంది. 

రవిబాబుగారూ!.. మీలగేజీ 

మీగదిలోనే పెట్టేశాను. 

శశిబాబూ!..మీ లగేజీ అంతా

ఒకసారి చూసుకోండి!.. 

అలాగే.. సరే!.. కానీ వనజా! ... 

మా అవసరాలన్నీ చూస్తున్నావు. 

నీకేంకావాలో ఎప్పుడూఅడగవేఁ!..  

అదేంటి శశి బాబూ! మీరిద్దరయనా!

అయ్యగారయినా నాకేం తక్కువ చేశారని

అమ్మగారు అనారోగ్యంగా వున్నప్పుడే

నువ్వు ఏజన్మలోనో నాకూతురివే!.. 

అని ఏంతో ఆప్యాయంగా చెప్పేవారు!

మీరంతా అంత దయగా చూడకుంటే 

నేనేమయ్యే దాన్నయ్యా!.. 

ఆమాటతో అక్కడున్నవారందరికీ

కళ్ళు చెమర్చాయి.  

రామచంద్రం మాష్టారింక 

ఒకనిర్ణయానికి వచ్చేశారు. 

వెంటనే.. ఒరే నాన్నా! .. 

ఇద్దరూ బయల్దేరబోతున్నారు 

కాబట్టి ఒకవిషయం చెబుతాను 

మీకు నానిర్ణయం నచ్చకపోతే

నిరభ్యంతరంగా చెప్పండి సరేనా!..  

అలాగే నాన్నా!.. అన్నారు పిల్లలిద్దరూ. 

నేను వనజకు ఒకమంచి సంబంధం చూసి 

పెళ్ళి చేద్దామనుకుంటున్నాను. 

అలాగే ఈ ఇల్లుకూడా వనజ పేరనే 

రాయాలనుకుంటున్నాను. 

మీరేమంటారు?. 

మన సాంబశివంకు తెలిసిన

అబ్బాయి ఉన్నాడని చెప్పాడు

తనషాపులోనే గుమాస్తాగా

పని చేస్తున్నాడు నమ్మకస్తుడు 

అనికూడా చెప్పాడు!... మీరేమంటారు?..

అడిగారు రామచంద్రం. 

మీకెలా మంచిదనిపిస్తే అలా చేయండి నాన్నా!.. కానీ వనజను మేమెప్పుడైనా

ఒక అక్కగానే భావిస్తాము

అమ్మ లేదనే లోటు తెలియకుండా

నానమ్మా! తనూ మమ్మల్ని ఎంతబాగా

చూసుకున్నారు!.. 

మీపట్ల మాకన్నా బాధ్యతగా

వుంటోంది తనేకదా!నాన్నా!.. 

అన్నారిద్దరూ ఏమ్మా! మీకూఇష్టమేకదా!.. 

అడిగారు ఇద్దరు కోడళ్ళవైపుచూస్తూ.. 

అలాగేమామయ్యా! వనజని 

ఆడపడుచులానే చూస్తున్నాను అంది

పెద్దకోడలు కమల. 

వనజ గురించి 

మా పరిచయమైనప్పటినుంచీ

మీ అబ్బాయి అంతా 

చెప్తూనే వుంటారు మామయ్యా!

చూడకుండానే ఆ అమ్మాయిపై

నాకు అభిమానం ఏర్పడింది మాకు

మంచి ఆడబడుచుందని సంతోషంగా 

వుంది అన్నది చిన్నకోడలు చంద్రిక. 

మీ కుటుంబాన్నీ, నీ పెంపకాన్నీ చూసి

చాలా ఆనందంగా వుందిరా! రాముడూ!

ఏ లోకాన వుందో రాజేశ్వరి తను కూడా

ఉంటే ఇంకా ఎంతో ఆనందంగా వుండేది! ఇదంతా చూస్తూనే వుంటుంది పైనుంచి.. అంటూనే శాంతమ్మగారికి 

కళ్ళు చెమర్చాయి.. 

పిల్లల సంస్కారానికీ, తనపట్ల వాళ్ళకున్న గౌరవానికీ రామచంద్రంమాష్టారు 

మనసులోనే అభినందనలు చెప్పుకున్నారు!.  



Rate this content
Log in

Similar telugu story from Romance