శానాపతి(ఏడిద) ప్రసన్నలక్ష్మి

Tragedy

4  

శానాపతి(ఏడిద) ప్రసన్నలక్ష్మి

Tragedy

అర్హత

అర్హత

2 mins
524


                అర్హత

          -శానాపతి(ఏడిద)ప్రసన్నలక్ష్మి


   నిర్మల మనసేమీ బాగోలేదు. జీవితమంతా మోడుబారినట్టుగా ఉంది. చదువే ప్రపంచమనుకుని చదివినందుకు ఇదా...ఫలితం...? మోకాళ్ళమధ్య తలపెట్టుకుని ...తనలో తాను ఏడుస్తుంది. చనిపోవాలన్నంత విరక్తి మనసుని చుట్టేసింది. చచ్చి సాధించేది ఏమీ లేకపోయినా....యే బాధా దరిచేరని లోకంలోకి పారిపోవాలన్న పిరికితనమంతే. అలాంటి వచ్చిందే గానీ...తనమీదే ఆశలు పెట్టుకుని బ్రతుకుతున్న తల్లిదండ్రులు కనిపిస్తున్నారు. తనకు కష్టం వచ్చిందని వారిని కష్టానికి గురిచేయడం ఎంతవరకూ సబబు...? తనకు తానే సర్దిచెప్పుకుంటుంది నిర్మల. 


   నా ఆశయం నెరవేరాలంటే...ఇంకో ప్రయత్నం చేసైనా సాధించాలి. మనసుని మెల్లిగా దృఢపర్చుకుంటుందే గానీ...ఈ జన్మకు సీటు వస్తుందో రాదోననే అనుమానం మనసుని లాగుతూనేవుంది. మోకాళ్ళ మధ్య తలపెట్టుకుని చాలా సేపటి నుంచి తనలో తాను కుమిలిపోతూనే ఉంది.


  " అమ్మా నిర్మలా....గదిలో లైటు కూడా వేసుకోకుండా ఏం చేస్తున్నావు"...? అంటూ వచ్చి లైటు వేసింది సీత.


  తల్లి రాకతో...గబుక్కున కళ్లనీళ్లు తుడుచుకుని..."ఏం లేదమ్మా"...అంటూనే సర్దుకుని కూర్చుంది గానీ...తన ముఖాన్ని చూస్తూనే ...మనసులోని వేదన్ని ఇట్టే కనిపెట్టేసింది తల్లి.


   "ఎందుకమ్మా...ఇంకా ఆవిషయమే తల్చుకుని బాధ పడుతున్నావా...? ఇప్పుడు కాకపోతే... మరోసారి ఎలాగైనా దక్కించుకుంటావు. మాకు ఆనమ్మకం ఉంది. దీనిగురించి మరీ అంత బాధ పడకు". అంటూ ఒక్కగానొక్క కూతుర్ని సముదాయించి భోజనానికి తీసుకెళ్లింది. 


  ఏదో భోజనం చేసిందనిపించిందే గానీ...మనసుని నొప్పించిన గాయం త్వరగాకోలుకునేది కాదుగా...


  నిర్మల తన స్నేహితురాలు స్రవంతిని తల్చుకోలేకుండా వుండలేకపోతుంది...ఉదయం తనకు ఫోన్ వచ్చినప్పటినుంచీ...


   "హలో నిర్మలా....నేను సాధించాను...నాకు ఎంబీబీఎస్ సీటొచ్చింది" ఎంతో ఆనందంగా చెప్పిన ఆమె మాటలకు యాదృచ్ఛికంగా "కంగ్రాట్స్" అని చెప్పిందే గానీ...ఆమె ఆనందానికి పూర్తి భావప్రకటన ఇవ్వలేకపోయింది. 


   చిన్నప్పటి నుంచీ ఒకే స్కూల్లో... ఒకే కాలేజీలో ఇంటర్ వరకూ కలిపి చదువుకున్నారు. చదువులోనూ ఒకరికొకరు తీసిపోయిందీ లేదు. ప్రాణ స్నేహితులయ్యారిద్దరూ. ఎప్పుడు చూసినా చదువే ప్రాణంగా పెట్టి చదివే వీరిద్దరి లక్ష్యం మెడిసిన్ సీటు సంపాదించాలనే. టెన్త్ క్లాసులో ఉండగా స్రవంతి తండ్రికి హైదరాబాద్ ట్రాన్ఫర్ అయిపోవడంతో తల్లీతండ్రీ వెళ్లిపోయినా...అదే ఊర్లో ఉంటున్న పెదనాన్న ఇంట్లో ఉండిపోయి ఇంటర్ వరకూ చదివింది. ఎంసెట్ పరీక్ష రాసేసి...తల్లిదండ్రుల దగ్గరకు నిర్మలను విడిచిపెట్టి వెళ్లలేక వెళ్ళింది. వెళ్తూ వెళ్తూ ఈసారి కూడా మెడిసిన్ ఒకే కాలేజీలో సీటు సంపాదించుకోవాలి అని అనుకుంటూ నవ్వుకున్నారిద్దరూ. 


   ఆ తర్వాత...ఎంసెట్ ఫలితాల్లో స్రవంతి కంటే నిర్మలకు ఎంతో మంచి ర్యాంకు వచ్చింది. 

   

   కానీ తన దౌర్భాగ్యం ఏంటో గానీ...తాను సంపాదించుకోలేని సీటు స్రవంతి దక్కించుకుంది. మంచి ర్యాంక్ వచ్చినా ప్రయివేటు కాలేజీలో కొద్దిగా డబ్బులు ఖర్చుపెడితే వచ్చే సీటుకు కూడా నోచుకోని పేదరికమే పుట్టుకయ్యింది నిర్మలకు. 


   స్రవంతికి డబ్బుకు కొదువలేదు. సీటుని లక్షల్లో కనుక్కోడానికి కావలిసినంత డబ్బుంది. కానీ ఆమె ఫ్రీ సీటు దక్కించుకోగలిగింది. అలాంటి అర్హత పుట్టుకలోనే దక్కించుకుని ఉంటే నిర్మలకు కూడా మెడికల్ సీటు వచ్చివుండేది. 


   ఇద్దరూ ఒకేలా చదువుకున్న స్నేహితురాళ్లే అయినా స్రవంతి జీవితం ఒక్కసారిగా మలుపుతిరిగింది...


    అలా మలుపు తిరిగిందంటే...ఆమెకున్న రెండవకోణం రిజర్వేషన్...!


   నాణేనికి మరోవైపు అంటే ఇదేనేమో.....???*

   

          *****      *****     *****


  


Rate this content
Log in

Similar telugu story from Tragedy