Varanasi Ramabrahmam

Classics

4.5  

Varanasi Ramabrahmam

Classics

గుణ త్రయ విభాగము

గుణ త్రయ విభాగము

5 mins
34.8K


గుణ త్రయ విభాగము - జ్ఞానబోధ మీమాంసా దృష్టి


భారతదేశంలో తత్త్వ శాస్త్రానికి రకరకాల వ్యాఖ్యానములు అందుబాటులోనున్నాయి. ఉపనిషత్తులు భారతదేశ తత్త్వశాస్త్రానికి మూలములు.


ఉపనిషత్తులలో బ్రహ్మజ్ఞానము / ఆత్మజ్ఞానము ప్రతిపాదింపబడి వివరించబడ్డాయి. అద్వైత, విశిష్టాద్వైత, ద్వైత, శాక్తాద్వైత, వంటి దృష్టులతో ఉపనిషత్తులు, భగవద్గీత, బ్రహ్మసూత్రములు - ప్రస్థాన త్రయము - వ్యాఖ్యానింపబడ్డాయి.


ఇందులో ఆచార్యులు తమ మేధాశక్తి, స్ఫురణ, భాషా పటిమ, శాస్త్ర, తత్వ పరిజ్ఞానములు, దృక్పథములు, బుద్ధి నైశిత్యములతో తమ తమ దృష్టులతో పకడ్బందీగా వివరణలు ఇచ్చారు. అవి ఎంత పకడ్బందీగా ఉన్నాయంటే, వారి వారి అనుయాయులిప్పటికీ తమ తమ మతములను ఎంతో నమ్మకముతో అవి మాత్రమే శ్రేష్ఠమైనవి అని వాదులాడుకుంటూంటారు. ఒకరినొకరు ఎంతో తీవ్రపదజాలంతో ఖండించుకుంటారు. ఉపనిషత్తుల ఈ అనుయాయులు ఎవ్వరూ సమ్యక్ దృష్టితో పఠించరు. తమ స్ఫురణ, స్ఫూర్తిలను అసలు ఉపయోగించకుండా ఆచార్యుల మాటలే తమ మాటలుగా ఆచార్య సిద్ధాంతములను ప్రచారము చేయడానికి ఉపయోగించు కుంటారు. ఒక్కొక్కసారి కవిగారి కవిత్వం కొంత మన పైత్యంగా ఈ ప్రచారములు జరుగుతాయి.


ఉపనిషత్తులు మనసు యొక్క పుట్టు పూర్వోత్తరములు, మానసిక దశలు, మానసిక కార్యకలాపములు జరుగు వైనము, మనకు లౌకిక, పారలౌకిక జ్ఞానములు కలిగే విధములు విశదముగా చెప్పాయి. ఆత్మను, బ్రహ్మమును, తత్సంబంధ పారిభాషిక పదములను; భగవంతుని ఉనికిని ప్రస్తావించకుండా, భగవత్ సంబంధము లేకుండా ఉపనిషత్తులను, తదనంతర తత్త్వ సాహిత్యాన్ని వ్యాఖ్యానించ వచ్చు. దీనిని జ్ఞానబోధ మీమాంసా దృష్టితో అన్వయించవచ్చు.


పతంజలి, భర్తృహరి, ఆదిశంకరులు మొదలైన వారు అద్వైత-ద్వైత దృష్టుల మేలు కలయికతో ఎంతో తత్త్వాన్ని బోధించారు. ప్రబోధించారు.


పతంజలి శబ్దబ్రహ్మ సిద్ధాంతమును ప్రతిపాదించి బ్రహ్మజ్ఞానాన్నించి భాషాశాస్త్ర సర్వస్వమును పితికి మనకి అందించారు. భర్తృహరి తదనంతర స్ఫోట వాదులు భాషాశాస్త్ర దృష్టితో మనము భాషలు నేర్చుకునే, మాట్లాడే విధానాన్ని వివరించారు. భాషల అవస్థా భేదములను చెప్పారు.


వేదాంతుల మాయ, తత్త్వజ్ఞుల చిదాభాస, మునుల ప్రణవము, శబ్ద బ్రహ్మ సిద్ధాంతీకుల స్ఫోటము అన్నీ ఒకే మానసిక శక్తికి వివిధ నామములు.


ఉపనిషత్తులు, బౌద్ధజైనతత్త్వముల, షడ్దర్శనములు ఈ ఉపనిషత్ ప్రతిపాదనలను స్వీకరించి, నిరాకరించి, సవరించి, తమ స్ఫూర్తితో విషయాలను జోడిస్తూ ‌భారతీయ తత్త్వశాస్త్రాన్ని వటవృక్ష ప్రాయము చేశారు.


ఆత్మ, బ్రహ్మము, మాయ, జగత్, ప్రపంచము, మానసిక దశలు, స్థితులు, గుణములు, నిర్గుణము, సగుణము ఇలా ఎంతో తత్త్వశాస్త్ర పరిభాష ఉంది. ఇందులో గుణ‌ శబ్దానికి అర్థ, తాత్పర్యములను జ్ఞానబోధ మీమాంసా దృష్టితో చర్చించాను. గుణత్రయవిభాగము భగవద్గీతలో పరమాత్మ సద్రవ్యచాడు. ఆయన చెప్పిన సారాంశం కలిగి ఉండి మరొక దృష్టితో నేను ప్రస్తుతిస్తాను.


గుణము అంటే మనకు సత్త్వ-రజస్-తమో గుణములు దృష్టిలోనికి వస్తాయి. గుణ శబ్ద ప్రతిపాదనను వైశేషికము చేసింది. ద్రవ్య, గుణ, కర్మ, సామాన్య, విశేష, సమవాయ, అభావములను సప్త పదార్థములుగా ప్రతిపాదించింది. పదార్థమును వేదాంతం నామ-రూప-భావ-వాసనా రహిత వస్తుః పదార్థః అంటుంది. వ్యాకరణము నాలుగు పదార్థములు అంటుంది. సాంఖ్యయోగములు ప్రకృతిని పదార్థము అంటారు.


వీటన్నటిలోి పదార్థాన్ని మనసు, ఇతర అంతఃకరణముల, జగత్, ప్రపంచముల ముడి పదార్థము/శక్తి అనే అర్థములో

వాడారు. ఈ మీమాంస మరొక సారి చేద్దాము.


సత్త్వరజస్తమోగుణములు:


మాయా/చిదాభాస/ప్రణవము/స్ఫోట ల పరిణామములైన అంతఃకరణములు సమస్త మానసిక కార్యకలాపములను నిర్వహిస్తాయి. ఇక్కడ మానసిక శక్తీ పరిణామము వక్తలో పురోధాన (ముందుకు) / శ్రోతలో తిరోధాన (వెనుకకు) జరుగుతుంది.


విషయయుత బహిర్ ప్రపంచముతో అనుసంధానము మనసు జ్ఞానేంద్రియముల ద్వారా కలిగిస్తుంది. ఇది మెళకువ (జాగ్రత్) మానసిక దశలో జరుగుతుంది. ఇప్పుడు మానసిక దృష్టిని బహిర్ముఖ దృష్టి అంటారు.


(కంటికి దృశ్యములు, రూపములు; చెవికి ధ్వనులు, మాటలు; ముక్కుకు వాసనలు; నాలుకకు రుచులు, చర్మమునకు స్పర్శలు, వేడి, చల్లదనాలు విషయములు. వీటన్నిటినీ కలిపి జ్ఞానేంద్రియములు అంటారు.


వాక్-పాణి-పాద-పాయువు-ఉపస్థలు కర్మేంద్రియములు అంటారు.


ఇవి మాట, చేతి కదలికలు, కాలు కదలికలు, ప్రేవుల కదలికలు, జననేంద్రియ కదలికలు. ఇవన్నీ యాంత్రికశక్తీ చలితములు. మాయ దివ్యమై జ్ఞాన శక్తిగా మనసు ద్వారా జ్ఞానేంద్రియములను ప్రచలితము చేసి గ్రహణలు చేస్తుంది. ఇతర అంతఃకరణముల ద్వారా తత్సంబంధ జ్ఞాన సముపార్జన, జ్ఞాన నిధానము, జ్ఞాన ప్రేరణ చేస్తుంది. స్వర శక్తియై కర్మేంద్రియములద్వారా జ్ఞాన వ్యక్తీకరణలు, ప్రతిక్రియలు చేస్తుంది.


మనసు జ్ఞానకర్మేంద్రియముల ద్వారా అన్ని పనులు చేస్తుంది. ఇతర అంతఃకరణములు తోడ్పడతాయి.)

మిగతా అంతఃకరణములైన బుద్ది, అహంకారము, చిత్తము మనసు గ్రహించిన విషయాన్ని తర్క, వ్యక్తి సంబంధ, విషయములుగా విడదీసి అంతర ప్రపంచంగా మస్తిష్కములో భద్రపరుస్తాయు; మనసు మరల ఈ అంతర ప్రపంచం నుంచి విషయగ్రహణము చేస్తే అది భావము లేక తలపు అవుతుంది; చిత్తము ద్వారా వాసనలు (విషయ సంబంధ అనుభవనులు, అర్థములు, స్ఫురణలు,) ఏర్పడడం, ప్రేరేపింపబడడం జరుగుతాయి. ఇప్పుడు దీనిని కల (స్వప్న) మానసిక దశ అంటారు. ఇప్పటి దృష్టిని అంతర్ముఖ దృష్టి అంటారు.


ఇందులో ఏ విషయము కాని విషయానుభవము గాని గ్రహింపబడక మనసు నిర్మలంగా ఉంటే దాన్ని సత్త్వ గుణము అంటారు. ఇది శుద్ధ గమనిక స్థితి. భగవత్ సంబంధమైన విషయ, విషయానుభవ గ్రహణము సత్త్వ గుణము అని ఆస్తికులు అంటారు.


గమనికలో అంతఃకరణములుంటే అది రజోగుణము. అంతఃకరణములు విషయయుతమైతే అది తమో గుణము. గమనుకలో ఏ విషయము, విషయానుభవము ఉండక పోవడం నిర్గుణము.


గుణము అంటే సంస్కృత భాషలో ముడి అనీ అర్థము ఉంది. ఈ అర్థములోనే గుణ శబ్దము వాడబడింది.


నిర్గుణము:


ఏ విషయ, విషయానుభవముతో ముడి వడి ఉండక పోవడం నిర్గుణము. ఇది శుద్ధ గమనిక. ఆత్మ అంటే శుద్దాహం. ఇదే శుద్ధ గమనిక. అహం అన్నా గమనిక అనే అర్థము. అయమ్ ఆత్మా బ్రహ్మా - ఆత్మ, బ్రహ్మము ఒకటే అంటుంది.

అలా "అహం బ్రహ్మాస్మి" అంటే "నేను శుద్ధ గమనిక" అని తాత్పర్యము. ఈ స్థితి నిర్గుణ స్థితి. నిర్మల మానసిక స్థితి.

దీనినే అద్వైత (రెండు కాని-రెండు లేని-రెండుగా లేని) స్థితి అంటారు. ఇప్పుడు దృష్టిలో విషయ, విషయానుభవములు ఏమీ ఉండవు. దీనిని విశ్రాంత దృష్టి అంటారు. అహం-అహం అనే శుద్ధ గమనికా స్ఫురణ నిరంతరంగా సాగుతూంటుంది. దృష్టిలో అహం-ఇదమ్ అనే విభాగము ఉండదు.


ఇదమ్ - మానసిక కార్యకలాపములు జరగడానికి, గ్రహణలకు, విరమింప బడడానికి చిహ్నము. దృష్టి అహం ఇదమ్ లుగా విడి అంతఃకరణములకు కనబడితే అది ద్వైత (రెండు ఉన్న- రెండు - అహం-ఇదమ్-గా కనబడుతున్న) స్థితి. ద్వైత స్థితిలో దృష్టిలో త్రిపుటి విభాగము జరుగుతుంది. జ్ఞాత-జ్ఞాన-జ్ఞేయములుగా విడడం-మూడూ విడిగా తెలియడం త్రిపుటి ఏర్పడడానికి చిహ్నము.


ఈశావాస్యమ్ ఇదమ్ సర్వమ్, సర్వమ్ ఖలు ఇదమ్ బ్రహ్మా ల లోని ఇదమ్ ఇదే.


ఈ విభాగమే వైయాకరుణుల కర్త-క్రియ-కర్మ విభాగము.


ధ్యానపరుల ధ్యాత-ధ్యానము-ధ్యేయము విభాగము.


ఈ విభాగము గుణత్రయ విభాగము. సత్త్వ- రజ: - తమో - గుణములు గా మనసు పని చేసే సమయము.

త్రిపుటి ఏర్పడక, మనసు, ఇతర అంతఃకరణములు పనిచేయక నిర్వాపారముగా ఆత్మలో లీనమై ఉండడం

నిర్గుణ స్థితి. శాంతము, మౌనము, ఆనందము, మోక్షము, తురీయము, భగవత్ స్థితి, పరమాత్మ స్థితి అని దీనికే పేర్లు.


గుణ త్రయ విభాగము జరిగితే మానసిక కార్య కలాపములు జరుగుతున్నట్టు. అనుగుణ వ్యక్తిత్వ స్పృహ జాగరితమై మనము జీవ స్థితినొంది తత్సంబంధ విషయ, విషయానుభవము లకు లోనై వర్తిస్తాము.


గుణత్రయవిభాగము జరగకపోతే వ్యక్తిత్వ స్పృహ కలుగదు. మన సహజ స్థితియైన పరమాత్మ స్థితి చెదరదు. మనము జీవ స్పృహ కోల్పోయి పరమాత్మాను సంధానమును పొంది నిర్గుణులమై నిరాకులంగా ఉంటాము. జీవిస్తాము.


సత్త్వరజస్తమోగుణములు కలిగి బహిర్ అంతర జగత్తులతో అనుసంధానం ఏర్పడడం, విషయ, విషయానుభవములతో మవసు, ఇతర అంతఃతరణములు ముడివడడం జీవ స్థితి.


సత్త్వరజస్తమోగుణములు కలుగక నిర్గుణముగా - విషయ, విషయానుభవములతో అంతఃకరణముల ద్వారా ముడివడక - ముడి వీడి - ఉండడం పరమాత్మ స్థితి.


ఇవి త్రిగుణములు, నిర్గుణము.


శ్రీరస్తు! శుభమస్తు! సమస్త సన్మంగళాని భవంతు!


Rate this content
Log in

Similar telugu story from Classics