Sridevi Somanchi

Inspirational

5  

Sridevi Somanchi

Inspirational

యుద్ధదృశ్యం

యుద్ధదృశ్యం

9 mins
35.1K



***

యుద్ధదృశ్యం... ఆటవికస్థాయినుంచీ

నాగరిక స్థాయికి పరిణామం చెందని ఏ కొద్దిమందో తప్ప సభ్యసమాజంలోని వారెవరూ ఆ దృశ్యాన్ని చూసి భరించలేరు.

మనకి అన్యాయం జరిగినప్పుడు దానికి కారణమైన వ్యక్తిని కత్తి అందుకుని కసకసా పొడిచి పారెయ్యాలనిపిస్తుంది. నిజంగా చేతిలో ఆ సమయానికి కత్తి వున్నా ఆ పనిచెయ్యటానికి అంతరంగం అంగీకరించక మన మనస్సునే హింస పెట్టుకుంటాం. ప్రత్యక్షశతృవైతే దాడి చెయ్యగలం. అవకాశం ఉంటుంది. మరి పరోక్ష శతృవు విషయంలో?

ఇదంతా ఎందుకు? హింసకి హింస... శతృవు ప్రత్యక్షమైనా పరోక్షమైనా

తిరగబడటమో తిరుగుబాటో తప్పనిసరని కొందరంటే-

అంతకన్నా మానవ సంబంధాలు మెరుగుపరుచుకుని శత్రువు కన్నా శతృత్వాన్ని హతమారిస్తే మంచిదని ఇంకొందరంటారు.

హింసోన్మాదం యుద్ధానికి ముందూ మానవతావాదం యుద్ధం తర్వాతా పుడతాయి. ఉత్తప్పుడంతా తటస్థవాదమే. మనిషెప్పుడూ తటస్థంగా ఉండటాన్నే ఇష్టపడతాడు. కాదంటే పైచేయిగా. ఎవరిది పైచేయిగా ఉండాలన్న దగ్గిరే యుద్ధానికి తొలి పునాది పడుతుంది.

భారతదేశపు మహా చక్రవర్తి అశోకుడుకూడా యుద్ధం చేసాకే మానవతావాది అయ్యాడు. 

***

యుద్ధం... ఒక గాఢమైన అనుభవం. 

దాదాపు యాభై ఎనిమిది రోజుల తర్వాత నిర్విరామ యుద్ధంనుంచి విడుదలైంది ఆ దేశం. అదా దేశంలోని ఒక ముఖ్య నగరం. బాగా ఎత్తైన ప్రాంతంలో ఉంది. నగరం చాలావరకూ ధ్వంసమైంది. పౌరులంతా దాదాపుగా చనిపోయారు. ఏ కొద్దిమందో మిగిలారు.

వాళ్ళందర్నీ నడిమధ్యలోని కూడలికి తరలించుకుని వచ్చారు సైనికులు ఎనిమిది నెలల శిశువుతో సహా.

ఒకప్పుడా కూడలి చాలా రద్దీగా ఉండేది. మనుషులు ఆగి శ్వాస పీల్చుకోవడానికి కూడా వీల్లేనంత బిజీగా ఉండేది. బస్సులు, కార్లు, టూవీలర్లు చీమలబారుల్లా పరిగెత్తేవి.

ఏరియల్ ట్రాఫిక్కూ బాగానే ఉండేది. అంత ప్రగతిని సాధించిన నగరం ఇప్పుడు దాదాపు నిర్మానుష్యంగా ఉంది. మిగిలిన కొద్దిమంది మనుషులూ ముఖాలు వేళ్ళాడేసుకుని జీవచైతన్యం  లేకుండా నిలబడి ఉన్నారు.

ఈ మనుషుల్తో జాతిని పునర్నిర్మించటం సాధ్యమయే విషయమేనా? సార్జెంటుకి చాలా నిరుత్సాహంగా అనిపించింది. కానీ తప్పదు. జరిగినది తలుచుకుంటే రక్తం ఉడికి పోతోంది. ఆ ఉడుకు తగ్గాలంటే ఏదో ఒకటి చెయ్యాలి. ఆ ఏదో ఒకటి చెయ్యాలంటే ముందు వీళ్ళందర్నీ తన మాటలతో ఓదార్చాలి. ఉపన్యాసాలతో ఉత్తేజపరచాలి.

ప్రపంచయుద్ధాల వరుసలో మహాభారతయుద్ధం మొదటిదట. దాన్ని చూసినవాళ్ళుగానీ, అలాంటివాళ్ళ సంతతి, వారసులూ ఎవరూలేక ఆ అనుభవం కాలగతిలో కలిసిపోయింది. వాస్తవాన్నించీ విడివడి కథగా మారిపోయింది. తరువాతివి ఒకటిన్నర శతాబ్దాలక్రితం జరిగిన రెండు ప్రపంచయుద్ధాలు. వాటిని చరిత్ర ఇంకా పట్టి వుంచుతోంది. ప్రపంచం మాత్రం పాఠం నేర్చుకోలేదు. మరో ప్రపంచయుద్ధాన్ని తెచ్చుకుంది. దాని పరిణామం ఈ సంఘటనల పరంపర.

ముందుగా మృతవీరుల సంస్మరణ జరిగింది. ఆయుధం పట్టి యుద్ధంలో మరణించిన సైనికులని స్మరించి నివాళులర్పించారు. ఆ తర్వాత నిస్సహాయులై శతృదేశం దాడుల్లో

మరణించిన పౌరులనీ, పసివాళ్ళనీ కూడా మృతవీరుల కింద లెక్కకట్టి సంస్మరించారు. సైనికులకి నిర్వికారంగా నివాలులర్పించిన జనం పౌరులని స్మరిస్తున్నప్పుడు మాత్రం పెద్దగా

ఏడ్చారు. ఆపాటి స్పందన వారిలో మిగిలుంటే తిరిగి యుద్ధోన్ముఖులుగా తయారుచెయ్యటం జటిలమైనదైనా అసాధ్యం మాత్రం కాదనిపించింది సార్జెంట్ కి.

గుండెలనిండా శ్వాస తీసుకుని, తన ఉపన్యాసాన్ని ప్రారంభించాడు.

"ప్రియమైన పౌరులారా!" అని సంబోధించగానే జనంలో కొంత నిరసన వ్యక్తమైంది.

“నిలబడలేకుండా ఉన్నాం. తిండి తిని మూడు రోజులైంది" అని ఎవరో సణగటంకూడా వినిపించింది.

వాళ్ళందరికీ తినడానికని ఫుడ్ పేకెట్స్ హైకమేండు పంపింది. వాటిని ఇప్పుడే

ఇచ్చేస్తే ఎవరూ ఉపన్యాసం వినరు. ముందు తినాలంటారు. తిన్న తర్వాత వారి శరీరాలు బడలికతో నిద్రలోకి జారుకుంటాయి. అప్పుడింకెవరికోసం ఉపన్యసించాలి? అందుకే సార్జెంట్

వారి నిరసన ధ్వనులని పట్టించుకోలేదు.

"ప్రియమైన పౌరులారా!" మరొకసారి సంబోధించాక వెంటనే అక్కడున్నవారికి

అర్థమైంది, సార్జెంట్ చెప్పేదేదో వినక తప్పదని, వినక తప్పనిసరైనదాన్ని వినేసి వదిలించుకోకపోతే మళ్ళీ మళ్ళీ అవే మాటల్ని వినాల్సిన ప్రమాదం ఉందని గ్రహించుకున్నారు..

వాళ్ళేం తక్కువ వాళ్ళుకారు. డాక్టర్లు, ఇంజనీర్లు, ఐటీ ప్రొఫెషనల్స్ ఉన్నారు. వాళ్ళలో.

"ఈ రోజున మనమున్న పరిస్థితి చాలా సంక్లిష్టమైనది. శతృదేశం మనమీద బాంబులవర్షం కురిపించింది. నగరాన్ని విధ్వంసం చేసింది. ఒక్క ఈ నగరమనే ఏమిటీ, దేశం మొత్తం విధ్వంసమైంది. కోట్లమంది అమాయక పౌరులు మరణించారు. బాంబులప్రయోగం ప్రధానంగా పట్టణాలమీద జరిగింది. పట్టణనాగరీకతకి మూలస్తంభాల్లాంటి మేథావుల్లో అన్ని వర్గాలవారూ చనిపోయారు. ఆ చనిపోయినవారిలో మీ భార్య లేక మీ భర్త... కొడుకో కూతురో... తల్లో తండ్రో, తోబుట్టువులో ఎవరో కొందరున్నారు. ఏ కుటుంబంలోనూ ఒకరికి మించి మిగిలి లేరు. ఇది చాలా పాశవికమైన

చర్య, మన గుండెల్ని రగిలిస్తోంది" సార్జెంట్ చాలా భావోద్వేగంతో అన్నాడు. చివరి వాక్యాల్లోని ఆవేశానికి అతని కళ్ళు ఎరుపెక్కాయి. జనం మౌనంగా తలదించుకున్నారు.

నిజమే! అందరికీ గుండెలు మండుతున్నాయి. చెయ్యని తప్పుకి పడిన శిక్ష. బదులు తీర్చుకోలేని అసహాయత. అలా బదులు తీర్చుకున్నా అతకని జీవనశకలాలు. రాజ్యాధినేతల విధానాల్లో విబేధాలొచ్చాయి. అందుకు ప్రజలెంతవరకూ బాధ్యులు? ఏ మేరకి బాధ్యులని పసిపిల్లల్నీ, స్త్రీ పురుషుల్నీ వాళ్ళు బలి తీసుకున్నారు? వీళ్ళు బలి చేసారు? దీనికి నైతికబాధ్యత ఎవరు తీసుకుంటారు? తీసుకుని మాత్రమేం సాధిస్తారు? ఈ విధ్వంసాన్ని చెరిపేసి వెనకటి స్థితికి చేర్చగలరా? 

ఒక్కసారి ఎదురుగా ఉన్న ముఖాల వంక చూపు సారించి మళ్ళీ తన ఉపన్యాసాన్ని సాగించాడు సార్జెంట్.

“శతృదేశం మీద లక్ష సంవత్సరాల యుద్ధాన్ని ప్రకటించింది మన హై కమాండు. మన జాతి వున్నంతవరకూ, వాళ్లతో వైరమే"

“ఈ యుద్ధంలో అణుబాంబులు వాడలేదుగానీ వాడివుంటే భూగోళమే జీవకోటిమీద లక్ష సంవత్సరాల యుద్ధం ప్రకటించి ఉండేది” ఒక బయోకెమిస్టు నిరసనగా అన్నాడు.

సార్జెంటు ఆ మాటల్ని ఉపేక్షించాడు. శతృదేశం మీద తామే ముందు అణుబాంబు ప్రయోగించాలనుకున్నారు. కానీ ఆ దేశపు గూఢచారి వ్యవస్థ చాలా నిశితమైనది. వాళ్ళు మెరుపుదాడులు చేసి తమ అణుస్థావరాలన్నీ ఆక్రమించుకున్నారు.

“మనం మన దేశాన్ని పునర్నిర్మించుకోవాలి. ప్రస్తుతం ఈ ప్రదేశమంతా కలుషితమై

పోయింది. పంటలు పండే పరిస్థితి ఎంత మాత్రం లేదు. ఒకవైపు భవననిర్మాణాల్ని

చేపడుతూనే మరోవైపు వ్యవసాయం కోసం నదీలోయ ప్రాంతానికి వెళ్ళిపోవాలని హైకమాండువారు

ఆదేశించారు.”

జనం నిరాసక్తంగా చూసారు.

“మొదటి పంట చేతికొచ్చేదాకా దేశంలోని ప్రతి పౌరునికీ ఆహారపు పొట్లాలని ఉచితంగా సరఫరా చెయ్యడానికి వారు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రపంచదేశాలన్నీ మన శతృదేశాన్నిదేశాన్ని దుమ్మెత్తిపోస్తూ మనవైపు సహాయహస్తాలని చాస్తున్నాయి. దేశాన్ని వెనుకటంత వైభవంగా పునర్నిర్మించడానికి మనకి వనరుల్ని సమకూరుస్తున్నాయి"

“ఎవరికోసం?" అన్న ప్రశ్న అందరి ముఖాల్లోనూ వ్యక్తమైంది.

"....ఐతే మనం ఇక్కడ ఎదుర్కొంటున్న ముఖ్యమైన సమస్య మానవ వనరులు.

మన కుటుంబ వ్యవస్థ పూర్తిగా నాశనమైంది. యాభై ఎనిమిది రోజుల క్రితం సుఖసంతోషాలతో పరిపుష్టంగా ఉన్న కుటుంబాలలో ఏ ఒక్కటి ఈ రోజున మిగిలి లేదంటే అతిశయోక్తి కాదు. జరిగిన మారణకాండకి సజీవసాక్షుల్లా మిగిలిన మీరు... నా ప్రియమైన పౌరుల్లారా! ఈ

కుటుంబాలుగా ఏర్పడాలి. భర్తల్ని కోల్పోయిన స్త్రీలు భార్యల్ని కోల్పోయిన మగవారిని భర్తలుగా ఎంచుకోవాలి. వారిద్దరూ కలిసి అందర్నీ కోల్పోయి అనాథలుగా మిగిలిన ఈ పిల్లల్లో

ఒక్కొక్కరికి తల్లిదండ్రులవాలి."

జనంలో మళ్లీ గుసగుసలు మొదలయ్యాయి. వాళ్ళలో వాళ్ళే మాట్లాడుకుంటున్నారు. 

"ఇవేం మతిలేని మాటలు? ఆడా మగా కలిసున్నంత మాత్రాన దాన్ని కుటుంబమంటారా?”

"ప్రాణాధికంగా ప్రేమించిన నా భార్యే పోయాక జీవితంలో ఇంకే స్త్రీ ముఖమేనా ఎలా చూడగలను?"

 "నా భర్త నన్నెంతో ప్రేమించేవాడు. నన్ను పెళ్ళి చేసుకోవటం కోసం అతను తన తల్లిదండ్రుల్నీ, కోట్ల ఆస్తినీ వదులుకున్నాడు. అలాంటి వ్యక్తి స్థానంలో ఇంకొకర్ని స్వీకరించటం |

అతనికి ద్రోహం చెయ్యటం కాదూ?"

"నా ఇద్దరు పిల్లలు ఇంటి కప్పుకింద ఛిద్రమవటం నాకళ్ళతో నేను చూసాను

బ్రతికున్న శవాన్ని నేను, కుటుంబాన్నేం తయారు చెయ్యగలను?

"జీవితంలో అన్నీ కోల్పోయాం. అందర్నీ కోల్పోయాం. ఏం మిగిలిందని ఇంకా

బతికుండాలి? మళ్ళీ కుటుంబ జీవనంలోకి అడుగుపెటి ఏం సాధించాలి? ఇంకో యుద్ధాన్నేగా?"

అందరూ రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. పధ్నాలుగేళ్ళ బాలుడు మాత్రం ఏమీ మాట్లాడకుండా ఆకాశంకేసి తదేకంగా చూస్తున్నాడు.

సార్జెంటుకి వాళ్ళ మాటలు వినిపిస్తున్నాయి. అవి అర్థరహితంగా అనిపిస్తున్నాయి.వాళ్ళు మాట్లాడే ప్రతిమాట చివరా- 

'ఐతేనేం? అనే ప్రశ్న అతని కళ్ళముందు కదులుతోంది.   

మొదట్లో గుసగుసగా మొదలైన చర్చలు కాస్త వేడెక్కడంతో సార్టెంట్ కి మళ్ళీ 

పనిపడింది. గొంతు సవరించుకున్నాడు.

“మీరు అన్నీ కోల్పోయిన మాట వాస్తవమే. కానీ యోధుడికి ఓటమి లేదు. ఓటమిదిశగా రాజీపడే మాటలేదు. మాతృదేశపు రుణం తీర్చుకోవలసిన బాధ్యత మన మీద

ఉంది ”

ఆ మాటలకి ఎటువంటి స్పందనా రాలేదు.

"ముందుగా మన నిపుణులసంఖ్య పెంచుకోవాలి. విధి నిర్వహణలో మొదటిబాధ్యత మానవశాస్త్రవేత్తలది. అంటే క్రయోనిక్స్, బయో, న్యూరో... ఇలా మనిషి శరీరాన్ని గురించి తెలిసిన అందరిదీ. సాధ్యమైనన్ని హ్యూమన్ క్లోన్స్ తయారు చెయ్యాలి" సార్జెంటుకి ఆగాడు. చుట్టూ చూసాడు. ఉ<హు< ఏమీ మార్పులేదు. అసలు వాళ్ళేమైనా వింటున్నారా? నిద్రపోతున్నారా? మామూలు మిలిటరీ పద్ధతిలో అదిలిద్దామనుకున్నాడుగానీ అలాంటివేమీ చెయ్యద్దన్న హైకమాండ్ ఆర్డర్ గుర్తొచ్చి ఆగిపోయాడు. వాళ్లు భావాలతో బతికే మనుషులట. ఏమీ అనకూడదు. 

అంటే ఏమిటో?!

"యుద్ధం సమయంలో చనిపోయిన ఇంజనీర్లు, డాక్టర్లు, శాస్త్రవేత్తలు బ్రెయిన్ డెత్ తర్వాత కూడా సురక్షితంగా కాపాడబడుతున్నారు. వారి మెదళ్ళలో వున్న సమాచారం మరొకరి మెదడులోకి కాపీ చెయ్యాలి. హోల్ బ్రెయిన్ అప్ లిఫ్ట్ ట. దాని పేరు. 

ఇన్ విట్రో మెదళ్ళు కొన్ని వున్నాయి. తలకి బలమైన గాయాలు తగిలి చనిపోయినవారి మెదళ్ళు విడిగాతీసి రసాయనాల్లో భద్రంగా వుంచారు. ఈ కొత్తగా పుట్టే క్లోన్స్ కి అమర్చగలిగే ప్రయోగాలు కొన్ని. వీటిగురించి మీకు తెలిసినంతగా నాకు తెలియదు"

"మేమిప్పుడు మా కుటుంబాలని మర్చిపోయి ఈ మెదళ్ళని ప్రేమించాలా?" ఒక జెనెటిక్ ఇంజనీరు అడిగిన ప్రశ్న సరైనదే.

"ఈ మెదళ్ళు మన జాతిసంపద. 

ఈ మేథోసంపత్తికి సమర్ధులైన వారసులుగా తయారు చెయ్యాలి. వాళ్ళకి సంరక్షకులు కావాలంటే మీరు కుటుంబాలుగా ఏర్పడాలి. ఒకరికొకరు సహకరించుకుంటూ, మీరు పోగొట్టుకున్న ప్రేమని పంచుకుంటూ... అలాగే అదే క్లోనింగ్ ద్వారా కావాల్సినన్ని ఆహారధాన్యాలనీ, జంతువులనీ, కోళ్ళూ బాతుల్నీ తయారు చేసుకుంటూ ముందుకెళ్ళాలి"

సార్జెంట్ కళ్ళముందొక సుందర దృశ్యం కనిపిస్తోంది. అది భవిష్య చిత్రం. తమని

పూర్తిగా దెబ్బ తీసామని శతృదేశం భావిస్తోంది. గర్వపడుతోంది. దాన్ని ఆ మత్తు దిగకముందే దెబ్బకొట్టే దృశ్యం.

ప్రజలకలాంటి దృశ్యాలేం తోచలేదు. వాళ్ళ కళ్ళు నిరాశానిస్పృహలతో వాలిపోయాయి. ఆ పధ్నాలుగేళ్ళ కుర్రాడు ఆకాశంలో ఇంకా ఏదో వెతుకుతునే ఉన్నాడు.

తనే చొరవ తీసుకోక తప్పదనిపించింది. సార్జెంటుకి. అతనికి యాభయ్యేళ్ళు వుంటాయి.

పెళ్ళి చేసుకోకూడదనే నిర్ణయాన్ని తీసుకున్నాడు. దానికి కట్టుబడి ఉన్నాడు. కాని అమ్మాయిలతో

పరిచయాలకేం కొదవలేదు. వాళ్ళంతా చిరు అలలు. ఉత్తిగా అవి ఒడ్డుని తాకి వెళ్తాయి. వాటితో ఒడ్డుకెలాంటి అనుబంధం ఉండదు. సార్జెంట్ కీ వాళ్ళతో ఎలాంటి అనుబంధం

లేదు. అతని అనుబంధమల్లా తను చేసిన యుద్ధాలతోనే.

అతను తన వృత్తిలో భాగంగా ఎన్నోమార్లు యుద్ధం చేసాడు. అతని శరీరం మీద గాయాల తాలూకు ఎన్నో మచ్చలున్నాయి. బరువైన తుపాకుల్ని మోసి మోసి అతని భుజం కాయకాసింది. అవేవీ అతనికో లెక్కలోనివి కావు. అతని మనసెప్పుడూ యుద్ధోన్మత్తతతో కొట్టుకుంటుంది. శత్రువులని దెబ్బతీసే మార్గం వెతుకుతుంటుంది. దెబ్బ తినక తప్పనప్పుడు, తట్టుకుని నిలబడి, అవకాశం చూసుకుని ఎదురుదెబ్బ తియ్యటం కూడా తప్పనిసరేననేది

అతని సిద్ధాంతం.

ఇప్పుడు శత్రుదేశంమీద ఎదురుదెబ్బ తియ్యాలి...కోలుకోలేనంతగా.

అలా కోలుకోలేనంతగా దెబ్బతిన్నట్టు ప్రపంచాన్ని నమ్మిస్తూనే చేసేది నిశ్శబ్దంగా చేస్తూ వెళ్ళాలి.

అందుకు అడుగూ, బొడుగూగా మిగిలిన ఈ జనమే.. దేశమంతటా ఇలాగే మిగిలున్న ఇలాంటి జనమే సహకరించాలి. లేకపోతే ఎలా?

ఒక్క క్షణం నిశ్వసించి ముందడుగు వేశాడు. తనెదురుగా ఉన్నవాళ్ళని లెక్క పెట్టాడు. పద్దెనిమిదిమంది మగవారు, పదహారుమంది స్త్రీలు, ఎనిమిది నెలల శిశువునీ పధ్నాలుగేళ్ళ కుర్రవాడినీ కలుపుకుని పదిమంది పిల్లలు.

మిలట్రీని సెగ్మెంట్లుగా, బెటాలియన్లుగా, ట్రూపులుగా విడగొట్టిన అనుభవం వుంది సార్జెంటుకి. అదే అనుభవంతో ఈ జనాన్ని విభజించాడు. ముందు స్త్రీలని పిల్లల్ని దగ్గరికి పిలుచుకొమ్మని ఆదేశించాడు. స్త్రీల మనసు చాలా సున్నితమైనది. మగవారితో కలిసి కుటుంబాలుగా ఏర్పడమంటే విముఖమైన వాళ్ళ హృదయాలిప్పుడు కరుణని వర్షించాయి. కోల్పోయిన తమ పిల్లలే గురొచ్చారో చెదిరి శకలాలైన తమ దైన్యమే గుర్తొచ్చిందో... చిన్న చిన్న పిల్లల్ని అక్కున జేర్చుకుని ఏడ్చేసారు.

పధ్నాలుగేళ్ళ కుర్రవాడు మాత్రం ఇంకా అలాగే నిలబడ్డాడు. అతన్నెవరూ దగ్గిరకి పిలవలేదు. ఒక ముసలామె అతనికేసి ఆశగా చూస్తున్నది. అతన్నామె చూపులు కూడా

తాకలేదు. సార్జెంట్ కి యీ పరిస్థితి కొంత అసహనాన్ని కలిగించింది. వెళ్ళి కుర్రవాడి దగ్గర |నిలబడ్డాడు.

"ఆకాశంలో ఏం వెతుకుతున్నావు? " మృదుత్వాన్ని గొంతులోకి తెచ్చిపెట్టుకుంటూ అడిగాడు.

 “మా అమ్మా నాన్నా.... చెల్లిని కూడా"

"వాళ్ళంతా యుద్ధంలో పోయారుకదూ? ఐతే ఆకాశంలో ఏం చూస్తున్నావు?" |

"చచ్చిపోయినవాళ్ళు స్వర్గానికి వెళ్తారట. స్వర్గం ఆకాశంలో వుంటుంది."

“ఎవరు చెప్పారు?"

"మా మామ్మ"

"ఎప్పుడు చెప్పింది?"

"మా అమ్మ పోయినప్పుడు"

“అదెప్పుడు జరిగింది?"

“నా చిన్నప్పుడు”

“మీ మామ్మ ఇప్పుడుందా?"

“లేదు, చచ్చిపోయింది. నాన్నా, చెల్లీకూడా"

“ఎప్పుడు?"

"యుద్ధం జరుగుతున్నప్పుడు."

కొద్దిసేపు అక్కడ నిశ్శబ్దం రాజ్యం చేసింది. పసితనంలోనే తల్లిని కోల్పోయిన ఇద్దరు పిల్లల్ని ఒక ముసలమ్మ పెంచిన దృశ్యం అందరి మనుసుల్లో కదిలింది. జాలి కలిగింది.

"చూడు... నీ పేరు?... మీ వాళ్ళంతా పోయిన మాట నిజమేగానీ నువ్విప్పుడొక కొత్త మామ్మని సంపాదించుకోబోతున్నావు. ఇంకా కొందరు తమ్ముళ్ళు అచ్చం నీలాగే

ఉండేవాళ్ళు" అన్నాడు సార్జెంట్.

ఆ కుర్రాడిలో ఉన్నట్టుండి చైతన్యం వచ్చినటైంది. గాలిలా వేగంగా కదులూ,

"నాకు కొత్త మామ్మ, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు... ఎవరూ వద్దు. నా చెల్లి నేనెంతో జాగ్రత్తగా దాచుకున్న నెమలిపించాన్ని అడిగింది. దానికది ఇవ్వాలి. కూలిపోయిన మా ఇంట్లోంచి

దాన్ని కష్టపడి వెతికి తెచ్చాను. నేనూ చచ్చిపోతాను. చచ్చిపోయి స్వర్గానికెళ్ళిపోతాను. అక్కడ

మా అమ్మానాన్నా, చెల్లి, మామ్మా ఉంటారు. దేవుడు మాకక్కడ అందమైన ఇల్లు కట్టిస్తాడు." అంటూ పరిగెత్తసాగాడు.

పిల్లవాడిలో ఉన్నట్టుండి వచ్చిన చైతన్యంలాంటిదే జనంలోనూ వచ్చింది. స్వర్గం ఉందో లేదో, ఇప్పటిదాకా ఎవరూ చూసి తిరిగిరాలేదు. ఉందేమో....అక్కడ తమవాళ్ళున్నారేమో... వాళ్ళకి తిరిగిరావాలనిపించదేమో, తామే ఎలాగా అక్కడికొస్తారనిఉపేక్షించారేమో.

చిన్నతర్కం .

న్యూటన్ గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని కనిపెట్టకముందుకూడా గురుత్వాకర్షణ

ఉంది. ఏపిల్ పండు చెట్టుమీంచి రాలి కిందకే పడింది. పైకెగిరిపోలేదు. ఉన్నదాన్నే ఆయన సూత్రీకరించాడు. అలాగే స్వర్గంకూడా. దాని ఉనికిని స్థిరపరచడానికి మరో న్యూటన్

రావాలంతే. ఈలోపే తామక్కడికి వెళ్ళటంలో తప్పేముంది?

జనం చిన్న గాలి అలలా కదిలి, కుర్రవాడిని వెంబడించారు. సార్జెంట్ తేరుకుని చూసే సరికి అంతా కొండ అంచుని ఉన్నారు. అతను తన సర్వీసు మొత్తంలో ఎప్పుడూఇంత క్రమశిక్షణారాహిత్యాన్ని చూడలేదు.

“వద్దు... ఆగండి..." అరుస్తూ పరిగెత్తాడు. సైనికులు అతని వెంబడి పరిగెత్తారు.

"మేము మెదళ్ళని ప్రేమించలేము. వాటికి సేవచెయ్యలేము. 

నగరం కొండపాదం మీద ఉంది. క్రమంగా కొండలోయలోకి దిగుతూ ఒక దగ్గిర ఆగిపోయింది. ఆ తర్వాతిదంతా సార్జెంట్ చెప్పిన వ్యవసాయ క్షేత్రం, కొండకి రెండోవైపుని పెద్ద అగాధం ఉంది. దూరంగా కనిపించే పర్వతం మీంచీ నది ఒకటి అందులోకిదూకి నురగలు కక్కుతూ కొంత దూరం ప్రవహించి పాయలుగా చీలిపోయింది. అందులోంచి

ఒకపాయ కొండలోయలోకి ప్రవహించి వ్యవసాయ క్షేత్రానికి ఉపయోగపడుతుంది.

ఇటువైపు ఎంత ఆహ్లాదకరమైన దృశ్యమో, రెండోవైపు దృశ్యం అంత భయానకం.

ఆ భయానకమైన దృశ్యాన్ని కొండ అంచుమించి ఒక్కసారి చూసి, జనం అందరూ దూకేసారు.

సార్జెంట్, సైనికులు అక్కడికి చేరుకునేసరికి కొండ అంచుమీద ఎవరూ లేరు. నీళ్ళలో కొట్టుకుపోతున్న నల్లటి చుక్కలు మాత్రం కనిపించాయి.

సార్జెంట్ ఎప్పుడూ జనావాసాల మధ్యనున్నవాడు కాదు. కుటుంబ జీవితాన్ని గురించి అందులోని రాగద్వేషాల గురించి తెలిసినవాడు కాదు. అతనికి తెలిసిందల్లా బేరక్సు,

బంకర్లూ, సోల్జర్లూ, వాళ్ళతో సహజీవనం. ఇంతమంది జనం అంత గొప్ప ఆశయసాధన ముందుండగా ఎందుకు చచ్చిపోయారో ఏమాత్రం అర్ధమవలేదు.

వెంటనే హై కమేండుకు రిపోర్ట్ చేసాడు. “ఇక్కడ మన ఆశలన్నీ కుప్పకూలినటే

కమేందర్...." ఎటెన్షన్లో నిలబడి చెప్పాడు. “జనం మతి భ్రమించిన వాళ్ళలాగా నదిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. దీనికంతటికీ కారణం పద్నాలుగేళ్ళ బాలుడు... పైనెక్కడో !

స్వర్గం ఉందనే అతని పిచ్చి నమ్మకం" అతని గొంతులో అంతులేని విషాదం ధ్వనించింది..

“ఔతే అక్కడెవడూ మిగిలిలేరా?" కమాండర్ గొంతు పిడుగులా ధ్వనించింది.

"లేకేం .... ఉన్నాడు ఒక నిస్సహాయ శిశువు. ఎనిమిది నెలలవాడు. అతను తనుగా కదలలేడు. అందుకే ఆత్మహత్య చేసుకోలేకపోయాడు." సార్జెంట్ ముఖం ప్రకాశవంతమైంది. కనీసం ఒకరేనా మిగిలినందుకు.

 "అంతమంది జనం ఆత్మహత్య చేసుకున్నారంటే అది నీ వైఫల్యమే ఔతుంది. నువ్వా శిశువుని తీసుకుని వెంటనే ఇక్కడికొచ్చేయ్" అన్న ఆజ్ఞతో ఫోన్ డిస్కనెక్ట్ అయింది. 

సార్జెంట్ చిన్నబుచ్చుకున్నాడు. ఇప్పుడేం జరుగుతుందో అతనికి తెలుసు. తనకి క్వార్టర్ గార్డ్ పడుతుంది. తర్వాత తనని తక్కువ రేంకుకి డిమోట్ చేస్తారు. కమేండరు అన్నాడనో, తనకి శిక్ష పడుతుందనో కాదుగానీ ప్రస్తుత పరిస్థితిలో ఒక డాక్టర్నో ఇంజనీరునో

కంప్యూటర్ ప్రొఫెషనల్ నో కోల్పోవటమంటే ఒక వ్యవస్థనీ, కొన్ని సంవత్సరాల కృషినీ కోల్పోయినట్లే. ఇప్పటికిప్పుడు హ్యూమన్ క్లోన్స్ ని తయారు చేసి జన సంఖ్యని పెంచవచ్చు

కానీ ఒకొకళ్ళని ఒక్కొక్క రంగంలో తీర్చిదిద్దాలంటే ఎంత టైం కావాలి? ఎన్నేళ్ళు పడుతుంది?ఎవరినైతే తను శతృదేశం మీద దాడికి ఆయుధాలనుకున్నాడో ఆ మానవాయుధాలన్నీ ఎందుకు

ఆత్మహత్య చేసుకున్నాయి? ఎందుకు? ఆలోచిస్తూనే సార్జెంట్ కొండదిగి క్రిందికొచ్చాడు.

ఇప్పుడతని ఆఖరి ఆశ గాయపడ్డ శిశువు మాత్రమే. అతడికి తను సంరక్షకుడౌతాడు. అతడికే

కాదు. అతడి క్లోన్స్ కి కూడా. వాళ్ళని పెంచి, తనకనుగుణంగా తీర్చిదిద్దుతాడు. సుశిక్షుతులైన

సైనికులుగా తయారు చేస్తాడు. అతని గుండె కొద్దిగా పొంగింది.

ఎప్పుడో చితికిపోయిన బాల్యంలోని ఒక జ్ఞాపకం తూటాలా మనసు పొరలని

ఛేదించుకుని పైకెగిసింది.

సార్జెంట్ చాలా చిన్నవాడప్పుడు. వ్యవసాయ క్షేత్రంలోని పచ్చిక మైదానంలో పరిగెడుతున్నాడు. సీతాకోక చిలుకల్ని, తూనీగల్ని వెంటాడుతున్నాడు. మెల్లిగా కదిలివచ్చి

తనని తాకుతున్న గాలి అలలకి కిలకిలా నవ్వుతున్నాడు. తన గొంతులో కలిసిపోతూ ఇంకెవరిదో గొంతు ఎవరిది? తన తల్లిదా? తండ్రిదా? తనకో తల్లీ, తండ్రి ఉండేవారా? వాళ్ళకి తను పుట్టాడా? అప్పుడు క్లోనింగ్ లేదు కాబట్టి పుట్టే ఉంటాడు.

ఆ తర్వాతేమీ గుర్తులేదు సార్టెంట్ కి. ఎవరెవరో చెప్పిన నిజాలు మాత్రమే

గుర్తున్నాయి. తల్లీతండ్రీ సివిల్ వార్లో చనిపోయారు. ఒక సైనికుడు తనని సంరక్షించి పెంచాడు. ఆ తర్వాత ఆర్మీలో చేరాడు. ఇప్పుడు చరిత్ర పునరావృతమౌతోంది.

గాయపడ్డ శిశువుని సమీపించాడు సార్టెంట్. బాంబుదాడిలో అతని ఇల్లు

కూలిపోయింది. అతని తల్లిదండ్రులు ఇంటికప్పు మీదపడి చనిపోయారు. ఇతనా శిథిలాల్లో ఇరుక్కుపోతే సైనికులు బైటికి తీసారు. రెండున్నర అడుగుల పొడవు మాత్రమే ఉన్న శరీరం

నిండా గాయాలు. ఏవో మందులు వేసి తాత్కాలిక వైద్యం చేసినా గాయాల నొప్పి బాధిస్తుండటం చేత నిద్రలోనే ఏడుస్తున్నాడు. ముఖం చికిలిస్తున్నాడు.

సార్జెంట్ మనసు ద్రవించింది. మానవత్వపు తొలి వీచికలు అతన్నుంచీ వీచాయి.

వంగి అతన్ని చేతుల్లోకి జాగ్రత్తగా ఎత్తుకొని నడవసాగాడు. శిశువు ఒళ్లు చాలా వేడిగా ఉంది. అతడికి బాగా జ్వరంగా ఉందని అర్థమైంది సార్జెంట్ కి. నడక వేగం పెంచాడు.

సార్జెంట్ నడక వేగం పెరుగుతున్నట్టే శిశువు అంతర్గత కదలికల్లో కూడా

మార్పులొచ్చాయి. వడివడిగా కొట్టుకుంటున్న అతని గుండె ఆగిపోయింది. శరీరం క్రమంగా

చల్లబడి బరువెక్కింది.

చావంటే ఏమిటో ఎన్నోసార్లు సార్జెంట్ అతి సమీపంలో చూసినా కూడా అదంతా భీభత్సమైనది. ఈ నిశ్శబ్దపు చావుని సారెంట్ అంతరంగం ఒప్పుకోలేకపోయింది.

ఇప్పుడు తన గమ్యం ఏమిటి? ఇంతమంది జనం చావకుండా ఆపలేక

పోయినందుకు శిక్ష తప్పదు. ఈ శిశువు తన ఆఖరి ఆధారం అనుకుంటే వీడూ పోయాడు..ఇంక తను సాధించాల్సినదేమిటి? శిక్ష అనుభవించటానికి బతకాలా?

శిక్ష అనుభవిస్తూ దేశానికి నిరుపయోగకరంగా చచ్చిపోవడానికి బతకాలా? ఈ దేశం ఏమైతే తనకెందుకు? శతృదేశం పం

పునర్నిర్మాణంలో తనకి భాగం ఉండదు. అలాంటి బ్రతుకుమీద తనకి కాంక్షలేదు.

అతనికి హఠాత్తుగా అర్ధమైంది. అంతమంది నదిలోకి దూకి ఎం

చేసుకున్నారో, వాళ్ళు తల్లిదండ్రులూ భార్యాబిడ్డలనే కుటుంబ బాంధవ్యాల మధ్య పెరిగారు. బతికారు.ఆ పరిధిలోనే కొన్ని ఆశయాలూ, ఆకాంక్షలూ పెంచుకున్నారు. అన్నిటినీ కోల్పోయిన వాస్తవం వాళ్ళకి బ్రతుకుని అర్ధరహితంగా చూపింది. వారికి యుద్ధంతోగానీ దేశాల దౌత్య 

వ్యవహారాలతోగానీ సంబంధం లేదు.

అతనికింకా విశదంగా అర్థమైంది. దేనికోసమైతే అంకితమయ్యారో అవి

సాధించలేనప్పుడు, జీవితమే తృణప్రాయంగా అనిపిస్తుంది. మనుషులకి,

సార్జెంట్ ఒక్క క్షణం ఆగాడు. వెంట వస్తున్న సైనికులు కొద్ది దూరంలో ఉన్నారు. హోల్ స్టర్ లోంచీ పిస్టల్ తీసాడు. కణతకి గురి పెట్టుకోవటం, అక్కడికక్కడే కుప్పకూలటం

జరిగిపోయింది. 


 

   

   



   

   

   

   



Rate this content
Log in

Similar telugu story from Inspirational