Sridevi Somanchi

Drama Action Others

4  

Sridevi Somanchi

Drama Action Others

యుద్ధం ముగిసాక

యుద్ధం ముగిసాక

12 mins
23.3K


యుద్ధం ముగిశాక

(విపుల మే 2002, సింధూరి కథల సంపుటి)

హీరో హీరోయిన్లు పెద్దలని ఎదిరించి పెళ్ళి చేసుకున్నాక సినిమాకథ ముగుస్తుంది. రాజులు యుద్ధంలో జయాపజయాలని పంచుకున్నాక చరిత్ర ముగుస్తుంది. కాని నిజజీవితంలో కథ మొదలయ్యేది పెళ్ళితోనే. సామాన్యుల జీవితకథలు మొదలయ్యేది యుద్ధం ముగిశాకే.

నేను ప్రేమ యుద్ధం చేశాను.

***

"నేనతన్ని ప్రేమించాను, ఇద్దరం పెళ్ళిచేసుకుందామనుకుంటున్నాం" అని మీరా వచ్చి చెప్తుందేమోనని చాలా ఆశగా ఎదురుచూస్తున్నాను. ఆ ఆశ మనసులో పుట్టిన క్షణం తర్వాత కొన్ని లక్షల క్షణాలు గడిచి దాన్ని కొన్ని సంవత్సరాల వెనక్కి నెట్టేశాయి. ఆ క్షణం ఇంకా ఇంకా వెనక్కి జరుగుతోందిగాని నా ఆశ నెరవేరటంలేదు. మీరా నా కూతురు.

మీరా వట్టి పుస్తకాల పురుగు. కాలేజి లైబ్రరీలో పుస్తకాల గుట్టలవెనుక దాక్కుంటుంది. అంతేగానీ కేంపస్‍లో సీతాకోకచిలుకల్లా రెకలిప్పుకుని తిరిగే తన క్లాస్‍మేట్స్ మధ్య వుండదు. అబ్బాయిల్ని తనచుట్టూ పరిభ్రమింపజేసుకోదు.

చూస్తుండగానే మీరా గ్రాడ్యుయేషనైపోయింది. పోస్ట్‌గ్రాడ్యుయేషన్... లెక్చరర్ పోస్టు... రిసెర్చి... డాక్టరేటు. నెలకి మొదట్లో వేలలో జీతం, ఇప్పుడు దానికి కొన్నిరెట్లు ఎక్కువ. తలలో ఒకటి రెండు పండువెంట్రుకలు, కళ్ళకి టూపాయింట్ ఫైవ్ గ్లాసెస్. ఇంకా తను పుస్తకాల్లోనే ప్రపంచాన్ని వెతుక్కుంటోంది. పెళ్ళిచేసుకోవాలన్న ఆకాంక్ష తనలో కనిపించదు. ఎలా? ఎలా ఈ సమస్యని పరిష్కరించడం?

నా భార్య మాలతిని అడిగాను. తను నిర్లిప్తంగా నవ్వి “"డబ్బూ, అందం, ఆస్తీ, వుద్యోగం అన్నీ వున్న అమ్మాయికి పెళ్ళికావటం కష్టమైందంటే ఆ లోపం మన వ్యవస్థలోనే వుంది" అంది.

"సిద్ధాంతాలు జీవితాలని బాగుపర్చవు. ఈ వ్యవస్థని మనమూ బాగుచెయ్యలేం. ప్రస్తుతం మనకి కావల్సింది మీరా పెళ్ళి" అసహనంగా అన్నాను.

"చూద్దాం, దాని రాతెలా వుందో?"

మూడనమ్మకాలంటారు, తనున్న నిస్సహాయస్థితే మనిషికి దేవుడి పేరిట ముడుపులు కట్టడం నేర్పిస్తుంది. మనచేతుల్లో ఏదీ లేదని తెలిసినప్పుడు కర్మసిద్ధాంతం గుర్తొస్తుంది. ముప్పయ్యేళ్ళ క్రితం నేను చేసిన ఒక పనికి ఫలితం ఇప్పుడు బైటపడ్తోంది. ఇలా... నా ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతియ్యటం ద్వారా.

***

తెలుగు ఎమ్మే చేశాక రీసెర్చి మీదకి పోయింది నా మనసు. వైదికసంస్కృతీసాహిత్యాలు, హిందూసమాజనిర్మాణం. మన కులవ్యవస్థ వీటిమీద నాకు గొప్ప ఆసక్తి కలిగింది. వాటినే రిసెర్చికి సబ్జెక్టుగా ఎంచుకున్నాను. అప్పుడే నాకు మాలతితో పరిచయమైంది.

ఆ అమ్మాయి వాళ్ళ కమ్యూనిటీ హాస్టల్స్‌లో వుండి చదువుకుని వచ్చింది. చామనఛాయతో చురుగ్గావుండే కళ్ళతో ఆకర్షణీయంగా వుండేది.

"ఎందుకండీ, సొసైటీలో మేమంటే ఇంత చిన్నచూపు? ఏం అందరిలా మేము పుట్టలేదా? గాలికీ ధూళికీ పుట్టామా? నేను చదువుకుంటానంటే ఆడపిల్లకి చదువేమిటని మా కులంవాళ్ళూ, మీకు చదువేంటని మా నాన్నని జీతానికి వుంచుకున్నవాళ్ళూ ఒకటే అనటం. ఎందుకు? ఆడపిల్లగా పుట్టడం లేక ఏదో కులంలో పుట్టడం అంత తప్పా? చదువుకి అనర్హతలా?" అనేది ఎరుపెక్కిన కళ్ళతో.

ఆ ఆవేశం చూస్తుంటే నాకు సంతోషం కలిగేది. అన్యాయం జరుగుతున్న ప్రతివారూ ఇలా ఎదిరించి అడిగితే? అణచబడ్డ ప్రతివాడూ తిరగబడి పైకొస్తే? ఇది ఒక కులానికో ఒక వర్గానికో చెందిన సమస్య కాదు. కేవలం ఆడవాళ్ళకి మాత్రమే చెందినది కాదు.

కష్టపడితేగానీ కడుపు నిండని ఇళ్ళలో చదువుకి ఆడేంటి, మగేంటి? ఎవరికీ వుండదు. చదువొక భుక్తిమార్గంగా ఎంచుకున్న కుటుంబాల్లో సంపాదించుకు రావటం మగవాళ్ళ పని కనుక ఆడవాళ్ళకి చదువుండదు. ఇక ధనికకుటుంబాల్లో చదువు స్టేటస్‍సింబల్ కాబట్టి ఆమెకి ఎంత చదువుంటే అలంకారమో, తూచి తూచి అంతే చదివించి దాన్ని నిరుపయోగంగా వుంచుతారు.

స్త్రీకి చదువుండాలి. వియ్యమైనా నెయ్యమైనా సమవుజ్జీతోనన్న స్పృహ ఎంతమంది మగవారికుంటుంది? చదువుకోవాలనే తపనవుండి, ఎన్నో తెలుసుకోగలిగే తెలివి వుండి కూడా నిరర్ధకంగా వంటిళ్లలో జీవితాలని గడిపే ఆడవాళ్ళని చూసి నాకు హృదయం కదిలిపోయేది. అలాంటివాళ్ళు ఎక్కడో కాదు, నా చుట్టూనే, నా కుటుంబంలోనే, నా ఇంట్లోనే వుండే వారు. అమ్మ, అత్తయ్య, పిన్ని ఇలా ఎందరో! ఒక్కొక్కరూ ఒక్కొక్క విషాదగీతిక. కొంతకాలం గడిచేసరికి వాళ్ళలో ఆ జిజ్ఞాస చచ్చిపోయి పనులతో బండబారిపోవటాన్ని కూడా నేను గుర్తించేవాడిని.

మాలతి అలాంటి మూసబొమ్మ కారాదనిపించేది. ఆమెలో రెండు విషయాలు నన్ను ప్రత్యేకంగా ఆకర్షించేవి. మొదటిది ఆమె స్త్రీత్వం. రెండోది ఆమె మరో కులానికి చెందివుండటం. మా యిళ్ళలో మడీతడీ ఆచారం వుంటాయి. చదువుంటుంది. సంఘంలో గౌరవ మర్యాదలుంటాయి. మరి వాళ్ళ ఇళ్ళలో? కట్టు వుంటుంది. ఆ కట్టుబాట్లు తప్పినవాళ్ళని నిలువునా నరికేసే నిబద్ధత వుంటుంది. ఇంకా?

"ఎవరు సృష్టించారండి ఈ కులాలని? మనిషి సమాజపరిరక్షణ కోసం ఏర్పరుచుకున్న వర్ణవ్యవస్థనా ఇలా రూపుదిద్దుకున్నది? మనిషి ప్రవృత్తినిబట్టి నిర్ణయించాల్సిన వర్ణం అనువంశికంగా వచ్చే కులంగా ఎప్పుడు రూపాంతరం చెందిందో చెప్పగలరా? ఈ విషయంమీదే రీసెర్చ్ చేస్తున్నట్టున్నారు" అని అడిగింది. ఆ అడగటంలో జిజ్ఞాస వుంది. ఆవేదన, ఆక్రోశం వున్నాయి.

"నాగరికత పెరిగిన కొద్దీ మనిషి అవసరాలు పెరిగాయి. తమలో సహజసిద్ధంగా వున్న నైపుణ్యాలని ఉపయోగించుకుని ఒక్కొక్కరు ఒక్కొక్క వృత్తిని మొదలు పెట్టారు.భుక్తినిస్తున్న వృత్తిని గౌరవించటం మొదలైంది. వృత్తి అంటే అదొక ఫైనాన్షియల్ సెక్యూరిటీ, వృత్తిని గౌరవించటం మొదలయ్యాక అది అనువంశికమైంది"

"ఇప్పుడు జరుగుతున్నది కూడా అంతేగా? డాక్టరు కొడుకు తన తండ్రి వృత్తిని క్షుణ్ణంగా పరిశీలించి దానితో సహజీవనం చేసి, తనూ డాక్టరు ఆవాలనుకుంటాడు. అలాగే టీచర్ పిల్లలంతా టీచింగ్ లైన్‍లోకి వెళ్తారు. ఇది జనరల్‌గా జరిగేదే" అంది.

తను చూపించిన ఉపమానానికి నేను స్టన్నయ్యాను. నిజమే. తండ్రి ఎలాంటి ప్రొఫెషన్‍లో వుంటే పిల్లలు అందులోకి వస్తారు. సులువుగా రాగలుగుతారు. అప్పటికే పరచబడి వున్న మార్గంకాబట్టి పెద్దగా ఆటంకాలు, ఇబ్బందులు వుందవు. అంటే ఇప్పుడు కులవ్యవస్థ మారాల్సి వుంది. డాక్టర్ల కులం ఇంజనీర్లకులం ...ఇలా.

"అవన్నీ చదువుకున్న వాళ్ళకి. మరి మాలాంటివాళ్లకి? మేం ఎప్పటికీ ఇలాగే వుండాలా?" నా మనసు చదివినట్లు అడిగింది మాలతి.

"మీలోమాత్రం మార్పు రావటంలేదా, మాలతీ? చదువుకుని పైకిరావాలనే తపన మొదలైంది"

"అదొక్కటే చాలా?"

"గవర్నమెంటు కృషి చేస్తూనే వుందిగా?"

“ "వాటిని ఎంతదాకా వుపయోగించుకుంటున్నాం?"

“ "ఆ తప్పెవరిది?"

"మాది మాత్రం కాదు"

"మరి?"

"ఏ పూటకాపూట ఎవరికి వారు సంపాదించుకుంటేగానీ తిండికి లేని కుటుంబాల్లో తల్లీతండ్రీ కూలికి పోతే తర్వాతి పిల్లల్ని చూడాలిన ఆడపిల్లలు... కాస్త ఎదగగానే ఆసరా ఆశించి తండ్రి అందించే చేతిని అందుకోక తప్పని మగపిల్లలు... ఏ బడికెళ్తారు? ఏ చదువులు చదువుతారు? మీకున్న అనుకూలత మాకేది?’"

నిజమే. అవసరాలు మనిషి ఎలా బతకాలో నిర్దేశిస్తాయి.ఎన్నో ప్రశ్నలు వేసేది. కొన్నిటికి జవాబు చెప్పగలిగేవాడిని. కొన్నిటికి లేదు. నెనే వెతుక్కునేవాడిని.

వర్ణాశ్రమ ధర్మం ముందు పుట్టిందా? కులవ్యవస్థా? లేక రెండూ సమాంతరంగా నడిచాయా? దేన్ని ఏది డామినేట్ చేసింది? దేనినుంచి ఏది పుట్టింది? మేమెందుకు ఇలా అణిగిపోయి వున్నాము? ఇవన్నీ అడిగేది.

ప్రశ్నలు చాలా చిన్నవేగానీ లోతైనవి. చాలా. కారణాలు అనేకం. సరైన ఆధారాలు మిగిలిలేని ఎన్నో లోతులలోంచీ కారణాలని వెతికిపట్టుకుని విశ్లేషించాలి. అది నాకొక అంతర్గత జ్వాలగా అంటుకుంది. రిసెర్చిని మించి నన్ను ఆకర్షించింది. 

ప్రేమా? ఏమో! జవాబు నా చదువులోనే వుంటుందనిపించింది. మేమిద్దరం సామాజిక అవగాహనల చెరో ప్రవాహంలోనూ వున్నాము. మా ఆలోచనలు ఎలా కలుస్తాయి? చెరోవొడ్డూ చేరకుండా ఆపే శక్తి ఏదైనా వుందా?

వర్ణం మనిషి మనస్తత్వానికి సంబంధించినది. ఒకవిధంగా స్పందించే మానసికవ్యవస్థని పుట్టుకతో తెచ్చుకుంటాడు. కొన్ని ఆసక్తులనీ నైపుణ్యాలనీ జన్మతహా పొందుతాడు. అవి అతని డ్రైవింగ్ ఫాక్టర్స్. అతనిపై పరిసరాలు, పరిస్థితులు, పెంపకం ఇలా ఎన్నో అంశాలు ప్రభావాన్ని చూపిస్తాయి. సమాజం అతనెలా బతకాలో నిర్దేశిస్తుంది. అలాగే బతికారు. సమాజం ఒకొక్కమెట్టూ దిగజారుతున్నకొద్దీ అందులో వుండే మనుషుల జీవితాలు దుర్భరమౌతాయి. దాదాపు వెయ్యిసంవత్సరాల పరాయిపాలనలో భారతదేశం ఎన్నో విలువలని పోగొట్టుకుంది. చరిత్ర కొన్ని ప్రశ్నలకి జవాబు చెప్పవలసిన అవసరం వుంది.

భరతఖండపు సరిహద్దులని కాపాడుకోవటానికి ప్రయత్నాలు ఎందుకు జరగలేదు? అశోకునివంటి మహాచక్రవర్తి ఆయుధాన్ని వదిలిపెట్టి అహింసని పాటించడంవల్లనేకదా,పశ్చిమహద్దులో శకులు రాజ్యాన్ని స్థాపించుకోగలిగారు? పురుషోత్తముడు హిందువు. యుద్ధరంగాన నిలిచినప్పుడు బంధుత్వాలు వుండవని గీతకారుడు చెప్పిన విషయాన్ని మర్చిపోయి, రుక్సానా కపటోపాయంతో పంపిన రాఖీకి ఎందుకు విలువ ఇచ్చాడు? పృథ్వీరాజ్ చౌహాన్ తన చేతిలోనే పదహారుసార్లు వోడిపోయిన ఘోరీని ఎందుకు చంపలేదు? వీటన్నిటి ఫలితం పరాయిపాలన, ప్రజాపీడన, అవ్యవస్థ.

ఇది కళ్ళముందు కనిపించే వాస్తవం. దీనికి కారణం మనువో మరెవరో కాదు. పరాయిపాలకులు హిందూధర్మాన్ని గుర్తించలేదు. వాళ్ళ జీవనసూత్రాలని, లస్ట్‌ని మనమీద రుద్దారు. వాటివలన మన సమాజానికి రుగ్మత వచ్చింది.

ఈ విషయాలని మాలతితో చర్చించాను. తనకి మొదట్లో నచ్చలేదు. కొన్ని ద్వేషాలు అంత త్వరగా చల్లారవు. బలంగా నమ్ముతున్న ఒక విషయాన్ని మరోలా అర్థం చేసుకోవటంలో సమస్య వుంది. తనవారు, పైవారు అన్న బేధభావం వుంది.

   చివరికి మా ఆలోచనాస్రవంతులు కలిసాయి. తర్వాత పెళ్ళి. మా పెళ్లికి పెద్దల ఆమోదం లేదు. కానీ సంఘసంస్కర్తలు హర్షం ప్రకటించారు. మా ఇద్దర్నీ తమ గుంపులో కలుపుకున్నారు. కులరహిత సమాజాన్ని నిర్మించడం, కులాంతర వివాహాలు ప్రోత్సహించటం, నేనూ ఆ గుంపులో కలిసిపోయి తిరిగాను. అదొక మత్తులా నన్ను కమ్మేసింది. ఆ మత్తు తరుణ్ మీరాని తిరస్కరించే వరకూ అలాగే వుంది. ఆ తర్వాత క్రమంగా దిగి వెబ్‍సైట్లలో వరుణ్ణి వెతికే దాకా వెళ్లి అక్కడ నిస్సహాయంగా ఆగింది.

మీరాకి అప్పుడు ఇరవయ్యేళ్లు. తరుణ్ కొత్తగా ఆఫీసులో చేరాడు. నా పక్కసీటే అతనిది. ప్రతి విషయం మీదా అనర్గళంగా మాట్లాడేవాడు. సమసమాజం రావాలనేవాడు. డిగ్నిటీ ఆఫ్ లేబర్ గురించి మనం నేర్చుకుంటే సోషలిజం ఆటోమేటిగ్గా వస్తుందనేవాడు.

"“ఇప్పుడంతా కేపిటలిజమ్ గురించి మాట్లాడుతుంటే నువ్వేంటి, పాత రాతి యుగం మనిషిలా సోషలిజం అంటున్నావు. మార్క్స్ చచ్చిపోయి ఎన్నోయేళ్ళైంది. ఎంతో పెద్ద సోషలిస్టు దేశమైన రష్యా కుప్పకూలింది. కేపిటలిస్టులు మాత్రం అడుగడుక్కీ వున్నారు. ఎక్కడో లైబ్రరీలో పుస్తకాల్లో నిక్షిప్తమైపోయిన ఆయన సిద్ధాంతాలు ఈ సజీవచైతన్యం ముందేం నిలుస్తాయి?" అనేవాడిని నవ్వుతూ.

అతను నాకు బాగా నచ్చాడు. ఆత్మీయుడిలా అనిపించాడు. మా గురించి చెప్పి మాలతినీ మీరానీ పరిచయం చేశాను. అతను మా కుటుంబాన్ని చాలా ఆరాధనగా చూశాడు. ఆ తర్వాత అతనికి మీరాని ప్రపోజ్ చేశాను.

నిర్విణ్ణుయ్యాడు ముందు.

"ఆదర్శాలు చెప్పటం తేలిక అంకుల్. కానీ ఆచరించటం కష్టం. చెప్తుంటే విని అంతా మత్తులో పడిపోతారు. మనని ఆరాధనగా చూస్తారు. ఆచరిస్తుంటే మాత్రం మన పక్కన ఎవరూ వుండరు. నేను పలికే ఆదర్శాలు మీలాంటివారిలో ఆశని పుట్టిస్తున్నాయని గుర్తించాక నేనొక నిర్ణయానికొచ్చాను. అది కూడా మీరంటే వున్న గౌరవంతో, నేనింకెప్పుడూ ఆదర్శాలు మాట్లాడను" అన్నాడు పాలిపోయిన ముఖంతో.

ఆ తర్వాత ట్రాన్స్ఫర్ చేయించుకుని వేరే ఆఫీసుకి వెళ్ళిపోయాడు.

అది మొదటి ప్రకరణం. అలా ముగిశాక ,“"రామ్‍ధన్ని అడుగుతే?” అంది మాలతి.

అతను మాలతికి తమ్ముడి వరుస. ఉన్న వాళ్లందర్లో బాగా చదువుకుని మంచి ఉద్యోగంలో అన్నది అతనే. నల్లగా ఎత్తుగా బలిష్టంగా వుండే రామ్‍ధన్ నేను మనసు సరిపెట్టుకుంటే మీరాకి వరసైన వరుడే. కానీ ఆ మనసే ముడుచుకుపోయింది. అతనొప్పుకోకపోతే బాగుండునని లోపలెక్కడో అనిపించింది.

"మీరొచ్చి వెళ్లాక మా కాలనీలో ఆడపిల్లలంతా అర్జెంటుగా చదువులు మొదలు పెట్టేశారు" అని నేనెప్పుడు కనిపించినా జోక్ చేసే రామ్‍ధన్ మాలతిని సొంత అక్కలా ఆదరిస్తాడు. వాళ్లింట్లో ఆమెకి పుట్టిల్లులేని లోటు తీరుతుంది. ఆమె కోణంలోంచి చూస్తే అతను కోరుకోదగ్గ వరుడే.

మీరాని చేసుకొమ్మని అడగ్గానే తెల్లబోయాడు. “"నేనా? దాన్నా?"” అన్నాడు ఆపనమ్మకంగా.

"ఏం తక్కువైందిరా దానికి?"” అతను వెంటనే ఒప్పుకుంటాడని ఆశించిన మాలతి తట్టుకోలేక వుక్కిరిబిక్కిరవుతూ ఉక్రోషంగా అడిగింది.

"దానికి తక్కువేంటక్కయ్యా? అన్నీ ఎక్కువే"” నవ్వాడతను. కాస్సేపాగి “"మన యిళ్లలో అది ఇడలేదు. దాన్ని పూర్తిగా శాకాహారజంతువులా పెంచారు. మా ఇంటికొచ్చాక అది వేటపిల్లని కొయ్యగలదా? కోడి కూరొండగలదా? నాకవిలేనిదే రోజు గడవదు. ఒకసారి దసరాకి మా ఇంటికొచ్చారు చూడు, అదా మూడు రోజులూ తిండి కూడా తినలేదు... గుర్తుందా?"” అన్నాడు.

అతను పైకి వ్యక్తపరచని మరో విషయం కూడా నాకు స్పురించింది అది. సుతారంగా జాజిమొగ్గలా వుండే మీరా ఈ మొరటు మనిషిని శారీరకంగానూ మానసికంగానూ భరించగలదా అని.

మన సమాజం స్త్రీ యొక్క సున్నితమైన మనస్తత్వాన్ని దృష్టిలో వుంచుకునే ఏ నిర్ణయమైనా చేసింది. మనస్తత్వాలనిబట్టి వర్ణ నిరయం జరిగాక అనులోమ వివాహాలని ప్రోత్సహించి ప్రతిలోమ వివాహలని తిరస్కరించింది. మానసికస్థాయిలో తనకన్నా తక్కువలో వుండే మగవాడిని ఆడపిల్ల చేసుకోరాదని నిర్దేశించింది. మీరా రామ్‍ధన్‍ని చేసుకుంటే అది నిషిద్ధవివాహమవుతుంది. చాలా పెళ్లిళ్లు బ్రేకవుతున్నాయన్నా, భార్యాభర్తలో హార్మొనీ లేక జీవితంలో వుత్సాహాన్ని కోల్పోయి నిస్సారంగా గడిపేస్తున్నారన్నా ఇదే కారణం.

"ఎలారా, దానికి సంబంధాలు రావటం లేదు?" మాలతి ఏడ్చేసింది.

"అక్కా చదువుకున్న నువ్వూ ఇలాగే మాట్లాడితే ఎలా? నువ్వు బాధపడుతున్నావనో, బావ అడిగారనో మీరాని నేను చేసుకుంటే అది మా మధ్య సర్దుకుపోగలదా? సంతోషంగా వుంటుందా? మరోసారి ఆలోచించుకుని చెప్పండి" అన్నాడు.

అతను వెళ్లిపోయాక మాలతి మీరాని అడిగింది. "మామయ్య నిన్ను చేసుకుంటాడటనే, నీకిష్టమేనా?”" అని.

విని మీరా కూడా రామ్‍ధన్‍లాగే తెల్లబోయింది. “"నేనా? అతన్నా?" అని అడిగింది.

ఆమె కళ్లలో స్వల్పంగా భయం... అసహ్యంలాంటివేవో కదిలాయి. అతన్ని మేనమామగా ప్రేమించడం వేరు. భర్తగా చూసుకోవట వేరు. "ఇప్పుడే నా పెళ్లికేం తొందర? వద్దు" అనేసింది.

నేను తేలిగ్గా వూపిరిపీల్చుకున్నాను. తలమీది బరువేదో దిగిపోయినట్లైంది. మరో అధ్యాయం మొదలైంది.

"వైజయంతి కొడుక్కి చేసుకుంటుందేమో అడుగుతాను. దానికి నేనంటే చాలా ఇష్టం. ఎన్నోసార్లు మనింటికొచ్చింది. శివానీ తీసుకొచ్చింది. బావ సరేసరి" అన్నాను.

మాలతి నన్నదోలా చూసింది. ఆ చూపు కర్ధం తర్వాతెప్పుడో గ్రహించాను.

వైజయంతి నా ఆఖరి చెల్లెలు. ఆమ్మానాన్నలతో నా సంబంధాలు పూర్తిగా తెగిపోయాక తనే మామధ్య వారధైంది. శివా బీటెక్ పాసై లెక్చరర్‌గా చేస్తున్నాడు. నేనంటే వాడికి చాలా అభిమానం. మీరా, శివా కబుర్లలో పడ్డారంటే కాలమే తెలీదు. వాళ్లకి. శివాకి నేనడుగుతాననే వైజయంతి అనుకుంటోందేమో! మగపిలాలవాడి తల్లికదా? ముందుగా తనెలా బైట పడుతుంది?

నేను వెళ్లేసరికి వైజయంతికీ శివాకీ మధ్య ఇదే విషయం మీద చర్చ జరుగుతుండటం కేవలం కాకతాళీయం.

"నా కులం ఎక్కువనో, ఆమె కులం తక్కువనో కాదురా, ఇప్పటికీ మాలతిని వదినగా అనుకోలేను. ఆమె ఇస్తే మంచినీళ్లు కూడా తాగలేను. వెలపరం పుడుతుంది. ఇంట్లో వండుకోరేమోగాని ఆమెని హోటల్‍కి తీసికెళ్తాడట మామయ్య వాళ్ల కూరలు తినిపించడానికి. వాళ్ళ బంధువులిళ్లకి వెళ్తారు. వాళ్లూ వస్తూంటారు. చిన్నప్పట్నుంచీ వాడి దగ్గర నాకున్న చనువునీ

రకసంబంధాన్నీ తెంచుకోలేక వాళ్లింటికి వెళ్తుంటానుగానీ వాళ్ల మధ్య వాడెప్పుడూ నాకు పరాయివాడిలాగే వుంటాడు" లోపలి గదుల్లోంచి వైజయంతి గొంతు తీవ్రస్థాయిలో వినిపిస్తూంటే హాల్లోనే ఆగిపోయాను.

కాళ్లకింది నేల కదులుతున్నట్టనిపించింది. గిరుక్కుమని వెనక్కి తిరిగాను.

ఇంతలోనే శివా గొంతు వినిపించింది.

"మీరా ప్యూర్ వెజిటేరియన్ అమ్మా! నువ్వసలు ఇంట్లోంచి ఎక్కడికీ వెళ్లవు కాబట్టి నీకేమీ తెలీవు. ఈ రోజుల్లో మనిషికీ మనిషికీ భేదంలేదు. ఆఫీసులో నీళ్ళిచ్చే అటెండరు దగ్గర్నుంచి ఆర్డర్లిచ్చే బాస్‍దాకా అందరూ వుంటారు. అంతెందుకు? మనలో మాత్రం ఎంతమంది తినటం లేదు? ఒరియావాళ్లకీ బెంగాలీవాళ్లకి అసలది తప్పేకాదు. చేపల్ని తింటారు. వాటిని జలపుష్పాలని వ్యవహరిస్తారు. మీరా పైపిల్ల కాదు. సంబంధాలు దొరకటంలేదు. పాపం మామయ్య..."

నేనింక వినదల్చుకోలేదు.

నా కూతురు ఎవరితోనో కాంట్రాస్ట్ చెయ్యబడి, ఆపైన జాలితోనో, ఇంకెందుకో ఆమెని పెళ్లి చేసుకోవడం... శివానైనా ఇంకెవరైనా సరే నేను సహించలేను. మీరా ఒక మంచి పెళ్ళికూతురు కాదా? తనకున్న లక్షణాలు ఎంతమంది ఆడపిల్లలకుంటాయి?

రెండంగల్లో ఇవతలికొచ్చి స్కూటర్ స్టార్ట్ చేశాను. నేనిక్కడికొచ్చేముందు మాలతి చూసిన చూపు గురొచింది. ఎంత మూగవేదన... అందులో! తనంటే ఏమాత్రం గౌరవం లేని ఇంటికి పిల్లనిస్తానని వెళ్తుంటే ఆపలేని నిస్సహాయత.

ఇంటికెళ్ళాలనిపించలేదు. పార్కులోకెళ్ళి సందడిలేనిచోట సిమెంటు బెంచీ మీద కూర్చుని వెనక్కివాలి కళ్ళు మూసుకున్నాను. మనసు అగ్నికీలలా భగ్గుమనడం అంతర్నేత్రానికి స్ఫురిస్తోంది.

రామ్‍ధన్‍కి మీరానివ్వాలనుకున్నాం. అతనికి మీరాకన్నా నాన్‍వెజ్ ముఖ్యం. నాన్‍వెజ్ వండిపెట్టగలిగే భార్య ముఖ్యం. శివాకి ఆఫర్ చెయ్యబోయాను. నాన్‍వెజ్ తినే, అన్యకులస్తురాలైన స్త్రీకి కూతురు, కాబట్టి వైజయంతికి మీరావద్దు.

మనుషులు ఎడ్వాంటేజియస్ పొజిషన్లో వున్నప్పుడు ఎదుటివారి కష్టం, సమస్య అర్ధమవవు. ఒక మెట్టు దిగివచ్చి అర్థం చేసుకోవాలనుకోరు. అలా దిగి రావాలంటే ఒక బలమైన కారణం, అలాంటి ఒక డ్రైవింగ్ ఫోర్స్ కావాలి.

ఏమిటీ సమాజం? చుట్టూ మనుషులు కావాలి. అలా లేకుండా ఒంటరిగా బతకలేరు. మళ్ళీ వాళ్ళకోసం ఏమీ చెయ్యరు. వాళ్ళ కష్టసుఖాలతో మనకి నిమిత్తం వుండదు. వుండకూడదు. మనుషులు అంతరంగికంగా ఎవరి గూటిని వాళ్ళు కాంక్రీట్ చేసుకుని, భౌతికంగా గుంపులుగుంపులుగా జీవిస్తున్నంతమాత్రాన అది సమాజమౌతుందా? సంయుక్తత లేని సమాజం ఎవరి మంచికోసం? చాలా అసహనంగా అనిపించింది. నేను మనుషుల మధ్య వున్నట్లు కాకుండా ముళ్ళ పొదలమధ్యన చిక్కుకున్నట్టు భావన.

ఎవరో నా పక్కని కూర్చున్నట్టనిపించి చూశాను. శివా! నాకేసి సూటిగా చూడలేక తలొంచుకున్నాడు.

"నువ్వు మా ఇంటికెప్పుడొచ్చావో గుర్తించలేదుగానీ వెళ్తుంటే చూశాను మామయ్యా! నాకూ, అమ్మకి మధ్య జరిగిన సంభాషణ విని వుంటావని గ్రహించి నిన్ను వెంటనే ఫాలో అయాను. అయాం సారీ" అన్నాడు.

"దీనికి సారీ" నా గొంతులో నేనే ఎప్పుడూ ఎరగని కారిన్యం.

"అత్తయ్యని చేసుకుని నువ్వు మొదలు పెట్టిన ఓ మంచిపనిని నేను కొనసాగించలేకపోతున్నందుకు, నిన్ను బాధ పెట్టినందుకు"

"మాలతిని నేను చేసుకుంటూ అదో మంచిపనని అనుకోలేదు. అందర్లాగే మేము పెళ్ళిచేసుకున్నాం. అందులోని మంచిచెడలుగానీ నేనేదో గొప్పపని చేస్తున్నాననిగాని లెక్కలు వేసుకోలేదు. ఆమె కోసం చేశాను. ఆమె లేనిదే బతకలేననిపించి చేశాను"

"నాకు మీరాపట్ల అలాంటి భావంలేదు మామయ్యా! నీకోసం ఆమెని చేసుకోవాలనుకున్నాను"

""అమ్మకి ఇష్టం లేదు కాబట్టి నాకు సారీ చెపున్నాను. అంతేనా? నీకోసం నువ్వు బతకడం నేర్చుకోరా, అదెన్నో సమస్యలని పరిష్కరిస్తుంది. ఈ కృత్రిమ విలువల్ని తగ్గిస్తుంది" అని లేచి నిలబడ్డాను. మీరాని చేసుకోవాలనుకోవడం, వద్దనుకోవడం. అమ్మకి ఎదురు చెప్పలేకపోవడం, ఇవన్నీ అతని వ్యక్తిగత సమస్యలు. నాకు వాటితో సంబంధం లేదు. మీరాని అతను కోరుకుని వుంటే ఆ కోరిక మీరా ఇప్పటి సౌఖ్యానికీ, భవిష్యతుకీ సంబంధించినది కాబట్టి నేను తలదూర్చేవాడిని.

కోరిక అంతరంగికం. అనుభవం వైయక్తికం. పర్యవసానం సామాజికం.

అతనికి కోరికే లేదు. అలాంటప్పుడు అనుభవానికి చోటులేదు. పర్యవసానం ప్రసక్తే లేదు.

ఇంటికొచ్చాక మాలతి నన్నేం అడగలేదు. జవాబు ముందే ఊహించినది కాబట్టి పెద్దగా అప్సెట్ అవలేదు. మీరామాత్రం నాతో దెబ్బలాడింది. “

"శివా నాకు బెస్ ఫ్రెండ్. ఈ టాపిక్ తేవడంతో మా ఫ్రెండ్లిప్ దెబ్బతింటుంది. దయచేసి నాకు మేచెస్ చూడకండి నాన్నా! ఇప్పుడే చేసుకోవాలనిలేదు”" అంది.

సరేననటానికే తప్ప కాదనటానికి నాకు అవకాశం లేదు.

మీరా చదువులో పడిపోయింది. పి.జి... రిసెర్చి... కెరీర్... ఇలా తన చుట్టూ అడ్డుగోడ కట్టుకోవడంలో మునిగిపోయింది.

తరుణ్‍కి పెళ్ళైందని తెలిసింది. అతను నాకు కార్డు పంపలేదు. ఒకే డిపార్ట్మెంటు కావడంవల్ల ఎవరిద్వారానో తెలిసింది.

రామ్‍ధన్ పెళ్ళి చేసుకున్నాడు. అతను మీరాని తిరస్కరించినందుకు మా మనసులో ఏ కోపమూలేదని తెలియచెప్పేందుకు భార్యాభర్తలిద్దర్నీ పిలిచి బట్టలు పెట్టాం. అతనొచ్చి వెళ్తుంటాడు.

భార్యకి దగ్గరుండి స్వయంగా ఎండుచేపల పులుసు పెట్టడం ఎలా నేర్పించాడో మాలతికి చెప్తుంటాడు. అతనికామెని చేసుకోవడంలో సంతోషం వుంది. మేడ్ ఫర్ ఈచ్ అదర్‍గా వుండడానికి భార్యాభర్తలు మిస్ అన్డ్ మిస్టర్ యూనివర్స్ కానక్కర్లేదు. వాళ్ళిద్దరూ చాలా సంతోషంగా వున్నారు.

శివాకీ పెళ్ళైంది. మావైపు జరిగే పెళ్ళిళ్ళన్నిటికీ నేనొక్కడినే వెళ్తాను. మాలతి రాదు. ఇప్పుడూ అలాగే జరిగింది. శివా కళ్ళలో నన్ను చూడగానే అదే అపరాధభావం. ఆ అపరాధభావనే వాళ్ళ వైవాహిక జీవితాన్ని శాసించబోతోందా? ఇగ్నోరెన్స్ యిజ్ ఎ బ్లిస్ అన్నారు. తెలీక చేసిన తప్పు మనని బాధించదు. తెలిసి చేస్తేమాత్రం అది నిప్పులా కాలుస్తుంది.

మీరా రోజురోజుకీ పెద్దరికాన్ని తెచ్చుకుని హుందాగా మారిపోతోంది. కళ్ళలో నిర్లిప్తతేతప్ప ఆకాంక్షగానీ, నైరాశ్యంగానీ కనిపించవు. వసంతాన్ని కోరుకోని మనసుంటుందా? వసంతం అనేదొకటి వుంటుందని తెలీనట్టుండే మీరా గుండెల్లో మాకు తెలీని రహస్యహర్యాలు.

***

ఆరోజు ఆఫీసులో కూర్చుని వున్నాను. మార్చి ఎకౌంట్స్ పూర్తవటంతో తీరిగ్గా వున్నాను. ఎటెండర్ ఎవరిదో విజిటింగ్ కార్డు తెచ్చి ముందు పెట్టాడు.

"ప్రొఫెసర్ జ్ఞానదేవ్ ఎమ్మెస్"

నా భృకుటి ముడిపడింది. ఎవరితను? నాతో ఏం పని? ఆశ్చర్యపోతూనే పంపించమని చెప్పాను. అతనొచ్చాడు. ప్రొఫెసర్లు సింబాలిగ్గా ఎలా వుంటారో అలా వున్నాడు. సన్నగా, పొడుగ్గా. నిశితమైన చూపులు, చిరుగడ్డం. మీరా గురొచ్చింది. తనూ అంతే. ఎలావుంటే స్టూడెంట్స్ గౌరవిస్తారో అటువంటి ఆహార్యాన్ని స్వీకరించింది.

అతను రాగానే నమస్కరించాడు. నేను తిరిగి నమస్కరించి, కూర్చోమన్నాను. కూర్చున్నాడు.

"మీతో పర్సనల్‍గా మాట్లాడాలి. ఎప్పుడు తీరిగ్గా వుంటారో, ఎక్కడ కలుసుకుందామో చెప్పండి" అన్నాడు సూటిగా.

నేను ఆశ్చర్యపోయాను.

"మీరా గురించి" నెమ్మదిగా అన్నాడు. అతని ముఖం ఎరుపెక్కింది. ఇబ్బందిగా వున్నట్టు కనిపించాడు. పెద్ద సంతోషపు కెరటం నన్ను బలంగా తాకి ఉక్కిరిబిక్కిరి చేసింది.

" ఖాళీగానే వున్నాను. ఎక్కడో ఎందుకు? ఇప్పుడే... ఇక్కడే చెప్పండి" అన్నాను . బెల్ నొక్కి ఎటెండర్ రాగానే రెండు డ్రిక్స్ పంపమని చెప్పాను.డ్రింక్స్ వచ్చేదాకా మేమేమీ మాట్లాడుకోలేదు. అవి రాగానే ఒక బాటిల్ అతని ముందుకి జరిపి నేనొకటి తీసుకున్నాను. నేను మళ్ళీ బెల్ నొక్కేదాకా రావద్దని అటెండర్‍కి చెప్పాను. అతను వెళ్ళిపోయాదు.

"అయామ్ ఇన్ లవ్" సిప్ చేస్తూ చెప్పాడు.

కభీకభీలో శశికపూర్‍లా నవ్వాలనిపించింది నాకు. అంతలోనే చిన్న సందేహం. ఇతను మీరాని ప్రేమిస్తే నాకొచ్చి చెప్తున్నాడెందుకు? అనుకున్నాను.

"కానీ తను నా ప్రతిపాదనని ఔట్‍రైట్‍గా తిరస్కరించింది. తనకసలు పెళ్ళి చేసుకునే ఉద్దేశ్యం లేదట" అతను నాతో ఈ విషయాలు చెప్పటానికి చాలా మొహమాటపదుతున్నాదడు. టీనేజ్ లవ్‍స్టోరీ కాదు. వాళ్ళంతట వాళ్ళు నిర్ణయించుకుని ఫార్మల్ గా మాకు చెప్పే స్టేజ్.

క్రమంగా జ్ఞానదేవ్‍లో యీజ్ చోటుచేసుకుంది. ఫ్రీగా చెప్పసాగాడు. మాటలనేవి బిగించి ముడివేసిన పూసలదండల్లాంటివి. ఒకసారి ముడి విప్పితే జలజలా జారిపోతాయి.

"నేను నాన్ రెసిడెంట్ ఇండియన్ని, కాలిఫోర్నియాలో వుంటాను. అక్కడ ఐమీన్... స్టేట్స్‌లో పెళ్ళిళ్ళు కొంచెం ఆలస్యం. అన్నీ అమర్చుకున్నాక సెటిల్ కావడానికి చేసుకుంటారు. నాకు ముప్పయ్యెనిమిది. నాలుగేళ్ళక్రితం ఒక సెమినార్లో మీరాని కలుసుకోవడం జరిగింది. అప్పట్నుంచీ ఆమెని నేను మర్చిపోలేదు. కానీ అప్పట్లో పెళ్ళి చేసుకోవాలనే ఆలోచన నాకు లేదుకాబట్టి ఆమె ఒక జ్ఞాపకంగా వుండిపోయింది"

"..."

" గత రెండేళ్ళు మేమిద్దరం ఒక ప్రాజెక్టులో ఆన్‍లైన్‍లో కలిసి పనిచేసాం. మా కంపెనీ కొన్ని సెలెక్టెడ్ యూనివర్శిటీలతో ఒక ప్రాజెక్టు లాంచ్ చేసింది. నా ఇండియన్ కౌంటర్‍‍పార్ట్ మీరా. అప్పుడప్పుడు చాటింగ్ చేసేవాళ్ళం. మా ప్రాజెక్టు పూర్తయిపోయాకా మీరాతో మళ్ళీ నా కాంటాక్స్ తెగిపోయాయి. నాలో ఒక రకమైన నిరుత్సాహంలాంటిది చోటుచేసుకుంది. అదేమిటో కూడా గ్రహించాను. మీరాకోసం వెంటనే బయల్దేరాను "

"తనేమంది?"

"తనకసలు పెళ్ళి చేసుకోవాలని లేదని చెప్పింది. ఎందుకని అడిగాను. సింప్లీ అని జవాబిచ్చింది. ఇలాంటి అసాధారణమైన నిర్ణయాలు అంత సింపుల్‌గా తీసుకోరని నాకు తెలుసు" జ్ఞానదేవ్ చిన్నగా నవ్వాడు.

నాకర్థమైంది. మీరా తనకింక పెళ్ళవదని అర్థంచేసుకుని పెళ్ళంటే విముఖతని పెంచుకుంది.

"తనలా ఎందుకందో నాకు తెలీదు. ఇరవైల్లో వున్నప్పుడు రెండుమూడు సంబంధాలు చూశాం. కొన్ని కారణాలచేత ఏదీ కుదరలేదు. తను చదువు, కెరీర్ వైపు మళ్ళిపోయింది. అంతే"

"ఎనీ బ్రోకెన్ ఎఫేర్"

“ "అలాంటివేం లేవు" నమ్మకంగా చెప్పాను.

"అలాగైతే మీరామెతో మాట్లాడతారా?”" ఆతృతగా అడిగాడు. అందులో అభ్యర్థన ధ్వనించింది. అతను మీరాని కోరుకుంటున్నాడు. మరికొద్దిసేపు వుండి మామూలు చిషయాలు మాట్లాడి వెళ్ళిపోయాడు.

సాయంత్రం మీరాని జ్ఞానదేవ్ గురించి అడిగాను. తన కళ్ళలో తడబాటు కనిపించింది. “"అతను మీకెలా తెలుసు?"” తడబాటుని కప్పిపుచ్చుకుంటూ అడిగింది. చెప్పాను.

"అతన్ని చేసుకోవడంలో నీకు గల అభ్యంతరమేమిటమ్మా? ఇలాంటి అకేషన్‍కోసం నేనూ, అమ్మా ఎంతగా ఎదురుచూస్తున్నామో"” అన్నాను.

’"నాకు... నాకెందుకో పెళ్ళి చేసుకోవాలనిపించడం లేదు"

“ "ఎందుకు? ఎందుకని?"

"పెళ్ళి పేరిట జరగుతున్న కించపాటు చూశాక అలా నిర్ణయించుకున్నాను"”

"ఏం చూశావు మీరా, నువ్వు? చదువు, ఆస్తి, అందం, ఉద్యోగం... అన్నీ వున్న నువ్వే ఇలాగంటే మిగిలినవాళ్ళమాట? అసలు నువ్వు చూసిందేపాటి? నీ దగ్గర చదువుకునే ఆడపిల్లలు తూనీగల్లా తుళ్ళిపడడం నువ్వు రోజూ చూస్తూనే వుంటావు. పెళ్ళిళ్ళయ్యాక వాళ్ళ కళ్ళు ఎంత కాంతివిహీనంగా వుంటాయో! ఎన్ని కన్నీటి గాధల్ని చెపాయో! అది బాధని కూడా తెలినంతగా ఈ కించపాటు వాళ్ళ జీవితాల్లో పెనవేసుకుపోయింది. ఎన్నున్నా ఆడపిల్లని తక్కువగా చూసే కల్చర్ మనది. అదొక్క ఆడపిల్లని అనేకాదు. సాటి మనిషినే తక్కువగా చూసి, అతడి బాధలోనే మనకి మనుగడ వుందని గుడ్డిగా నమ్మే సంస్కృతిని మనం తయారుచేసుకున్నాం. " నాలో ఆవేశం కట్టలు తెంచుకుంది.

"యత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః అని గొప్పగా చెప్పుకుంటాం. అంటే దానర్థం... స్త్రీని గుళ్ళో దేవతగానో, సతిగానో, మాతగానో పూజించమని కాదు. స్త్రీ పురుషుడికన్నా శారీరకంగా బలహీనురాలు. అయినా సృష్టిలో సగం. సృష్టిలో బలవంతులూ, బలహీనులు కూడా స్త్రీ పురుష వివక్షత లేకుండా సగం సగం గానే ఉంటారు. స్త్రీని గౌరవించే స్థాయికి మగవాడు ఎదిగితే... అలా ఎదగడంకోసం అతడో మెట్లు దిగగలిగితే తనకన్నా బలహీనుడికోసం కూడా ఆ పని చెయ్యగలుగుతాడు. ఎలాంతి న్యూనతగానీ అభద్రతాభావంగానీ లేకుండా వాళ్ళూ అతడిస్థాయికి ఎదుగుతారు. అదే సమసమాజమంటే..."

"నాన్నా!"

"ఔను మీరా! మనిషిని మనిషి కించపరచుకుంటూ బతుకుతున్నాం మనం. స్త్రీలుగా, పురుషులుగా, కులాలుగా, మతాలుగా, వున్నవాళ్సుగా, లేనివాళ్ళుగా విడిపోయిన సమాజం మనది. అందుకే నీ పెళ్ళి ఆలస్యమైమ్ది. అతను నీ విలువ గుర్తించి వచ్చాడు "

"..."

"మేం చాలా సంతోషంగా పెళ్ళి చేసుకున్నాం. నువ్వు పుట్టావు. సంతోషం రెట్టింపైంది. నీకు ఊహ తెలిసేదాకా మేం నీకోసం ఏర్పాటు చేసినవే, అలా ఇవ్వగలిగినవే నువ్వు సంతోషాలనుకున్నావు. ఆ తర్వాత సమాజం పెట్టిన ఇబ్బందులని మనం కలిసి పంచుకుకున్నాం. మీరా! ఇప్పటిదాకా మనం పంచుకున్నది బాధని మాత్రమే. నువ్వు పెళ్ళి చేసుకుంటే సంతోషాన్ని కూడా పంచుకోగలుగుతాం. అప్పుడే జీవితానికి సాఫల్యత"” అన్నాను.

నా మాటలు మీరామీద బాగా పనిచేశాయి. జ్ఞానదేవ్‍కి తనే ఫోన్ చేసి స్వయంగా డిన్నర్‍కి ఆహ్వానించింది. దగ్గరుండి అతడికి తనే పెట్టింది. ఆ తర్వాత ఇద్దరూ కలిసి సివిల్‍మేరేజ్‍కి తేదీ నిర్ణయించుకున్నారు

నాకో సత్యం... ఇన్నాళ్ళూ ఆచరిస్తూ వచ్చినదే అయినా ఇప్పుడర్థమైంది. కులం, మతం, ఆస్తి, అంతస్థు, కట్నకానుకలూ... ఇవన్నీ స్త్రీపురుషులు ఒకరికొకరు ఏమీ కానప్పుడు వాళ్ళ పెళ్ళిలో ముఖ్యపాత్ర వహిస్తాయి. ఒకకరినొకరు కావాలనుకున్నప్పుడు తమ అస్థిత్వాన్ని కోల్పోతాయి. నేను గ్రహించిన ఈ నిజాన్ని చెప్పడం కోసం మాలతిని ఇంట్లోకి తీసుకెళ్ళాను జ్ఞానదేవ్ తో మీరాకి ఏకాంతన్నొదిలి.


Rate this content
Log in

Similar telugu story from Drama