SATYA PAVAN GANDHAM

Classics Inspirational Others

4.5  

SATYA PAVAN GANDHAM

Classics Inspirational Others

"మూగ మనసులు - 6"

"మూగ మనసులు - 6"

7 mins
350


మూగ మనసులు - 5 కి

కొనసాగింపు

మూగ మనసులు - 6

జనవరి 14, 2015

సంక్రాంతి సెలవలకి ఇంటికి వచ్చాను. ఈ రోజు పెద్ద పండగ కావడంతో, రాత్రికి ఊరి చివర గ్రామదేవత గుడి దగ్గర చెరువులో నిర్వహించే తెప్పోత్సవం చూడడానికి ఫ్రెండ్స్ తో కలిసి వెళ్ళాను.

గుడిలోపల జనం ఎక్కువగా ఉండడం వల్ల లోపలికి ఎవరూ రాలేదు. నేను మాత్రం ఆ జనాలను తోసుకుంటూ కొంచెం ముందుకి వెళ్ళి దైవదర్శనం కోసం చూస్తున్నాను.

ఇంతలో అంతమందిలో ఒకమ్మాయి చెంగు చెంగున ఎగురుతూ గుడిలో గంటను అందుకోవడంలో ఆపసోపాలు పడుతుండడం, ఆ క్రమంలోనే తన అరచేతి పై పుట్టమచ్చనూ గమనించాను...

అలా గమనిస్తున్న తరుణంలోనే పక్క నుండి ఎవరో...

"హేయ్.. స్పందన !" తన ఫ్రెండ్స్ పిలుపుకి ఒక్కసారిగా వెనకకి తిరిగి, వాళ్ళ దగ్గరకి పరుగుతీస్తున్న తనని చూస్తుంటే,

ఆ రోజు గుడిలో చూసినట్టుగానే

"ఆకుపచ్చని పరికిణీ లో , గోల్డెన్ సీక్వెన్స్ బోర్డర్ ని జత చేసిన పింక్ కలర్ ఓణీ,

పరుగుతో..

గాలికి విరబూసుకుంటున్న ఆ కురులు...

తన పాదాలపై నాట్యమాడుతున్న ఆ మువ్వలు

నన్ను దాటుకుంటూ వెళ్తున్న ఆ క్షణం, నా కనులు రెండూ తన రూపాన్ని చివరికి చేరుకోగలిగాయి.

నా కళ్ళని మాయ చేస్తున్న తన నెమలి కళ్ళు

కలువరేకుల్లా వాటిని కప్పే తన కను రెప్పలు..

నుదుటమీద బిందువు లాంటి ఓ చిన్న బొట్టు

హోయలోలుకుతున్న తన నాసికా రంధ్రాలు..

గులాబీలకే ఈర్ష్య పుట్టెంత తన ఎర్రటి పెదవులు

ఆ కాసేపు పరుగుతో అలసిన తన దేహంపై జారుతున్న ముత్యపు జల్లులు (చెమట చుక్కలు)

ఆ జల్లుల తాకిడితో తడిసిన తన నున్నటి చెక్కిలి

ఆ నున్నటి చెక్కిలితో మరింత మిరుమిట్లు గొలుపుతున్న తన ముఖారవిందం.

వొంపైన మెడ, సొంపైన కెంపులు.

విరబూసిన కురులు

వాటికి తగిలించిన పువ్వులు

అవి వెదజల్లే సువాసనా పరిమళాలు.

వర్ణించ తగునా ఆ అందాన్ని ఏ కవి హృదయానికైనా...

ఈ విగత జీవిని నీ వేకువ తాకిడితో మెల్కొల్పిన ఓ వెలుగుల వెన్నెలా అందుకో నీపై నా ఈ కవితా పారాయణం.

కలవరపెడుతున్న కలని కళ గా మలచి కనురెప్పల మాటున రూపుదిద్దుకున్న నీ రూపం...

నిశ్చలంగా ఉన్న నా మనసుని చల్లగాలికి తేలియాడే మేఘంలా...

నిశబ్ధంగా ఉన్న నా ఊపిరిని ఉవ్వెత్తున ఎగిసిపడే

ఉప్పెనలా...

జారే జలపాతంలా...

సాగే సెలయేటిలా...

నా యదని కదిపిన,

ఓ అందాల అపురూపమా!

మందార మకరందమా !!

పిలుపుకందని ప్రియతమా!

చేయిదాటిన చెలియా!!

నీ రాక కోసం ఆశగా!

కడవరకూ నీ శ్వాసగా!!

తదేకంగా తననే చూస్తూ ఆ అందాన్ని ఆస్వాదిస్తూ అలానే ఉండిపోయిన నేను, ఒక పక్క నా స్నేహితుడు పిలుస్తున్నా స్పందించ లేకపోయాను.

"ఏంట్రా ...సతీష్?

పిలిస్తే పలకకుండా ఏం ఆలోచిస్తున్నావు!

అసలందరూ అక్కడుండి నీ గురించి వెయిట్ చేస్తుంటే, నువ్విక్కడ ఏం చేస్తున్నావ్... ?" అన్నాడు వాడు.

"ఏం లేదు రా..." అని బదులిచ్చాను.

"సరే రా మరైతే వెళ్దాం" అని అక్కడ నుండి తీసుకెళ్ళాడు.

తెప్పోత్సవం దగ్గరుండి, అందరూ దాన్ని ఎంజాయ్ చేస్తుంటే, నేను మాత్రం తన రూపాన్ని పదె పదే తలచుకుంటూ... అప్పటికే ఎన్నో సార్లు తనతో ప్రేమలో పడ్డ నేను, ఇప్పుడు తన ప్రేమ లోతుల్లో పూర్తిగా కూరుకుపోతున్నాను.

అప్పుడే సరిగా ..

"రఘు అన్నయ్య..!

రఘు అన్నయ్య...!!" అంటూ వెనుక నుండి రఘుని ఎవరో పిలుస్తున్నారు.

అరేయ్ రఘు ఎవరో నిన్ను పిలుస్తున్నారు రా అని రఘు కి చెప్పాను...(నేను వెనుకకి తిరిగి చూడకుండా)

వాడు వెనకకి తిరిగి "హా.. చెప్పమ్మా స్పందన!" అనగానే

షాకయ్యి ఒక్కసారిగా వెనకకి తిరిగి చూసాను. అవును తనెవరో కాదు ఆ నా స్పందనే,

తను రఘుకు సమాధానమిస్తూ,

" రాజేష్ అన్నయ్య వాళ్ళు, అక్కడ నీకోసం వెయిట్ చేస్తున్నారని చెప్పమన్నారు." అని చెప్పి అక్కడనుండి వెళ్ళిపోయింది.

"ఇక్కడే వుండ్రా సతీశ్.. రాజేష్ ని ఒకసారి కలిసొస్తానని" చెప్పి వాడు కూడా నా దగ్గర నుండి వెళ్ళిపోయాడు.

నాలో ఒకటే ఆలోచనలు...

స్పందన .. రఘు కి తెలుసా..?

రాజేష్ కి కూడా .....

పైగా తను వీళ్ళని అన్నయ్య అని పిలుస్తుంది.

రాజేష్ నాకంత క్లోజ్ ఫ్రెండ్ కాకపోయినా....రఘుకి మాత్రం బాగా క్లోజ్.

అసలేవరీ స్పందన..?

నిన్న మొన్నటివరకు నాకు కనిపించకుండా నాతో ఆడుకున్న తను, ఇప్పుడు కనిపించినా తానెవరో తెలియనివ్వకుండా నాతో ఆడుకుంటుంది.

రఘు వచ్చాకా అడుగుదామనిపించింది.

కానీ, ఇప్పటివరకు ఎప్పుడూ వాడి దగ్గర అమ్మాయిల విషయమెత్తని నేను, ఇప్పుడు ఒక్కసారిగా తన గురించి ప్రస్తావిస్తే ఏమైనా తప్పుగా అనుకుంటాడేమోనని ఓ చిన్న భయం. పైగా తనకి బాగా తెలిసినమ్మాయి.

మరోపక్క, వచ్చిన ఈ చిన్న అవకాశాన్ని కూడా వదులుకుంటే, తన గురించి ఇంకెప్ప్పటికి తెలియదేమోనన్న దిగులు.

"ఏదైతే అదయ్యింది! ఎలాగో రఘు కి నా క్యారెక్టర్ గురించి తెలుసు కాబట్టి, నా ప్రేమ విషయం చెప్పెద్ధాం" అనిపించింది.

ఇంతలో రఘు రానే వచ్చాడు...

"అరేయ్ సతీష్ లేట్ అవుతుంది, పద నిన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేసి నేను వెళ్తా' అని అక్కడ నుండి నన్ను తీసుకొచ్చేసాడు.

"అరేయ్... రఘు !

ఎవరమ్మాయి..?

నిన్ను అన్నయ్య అని పిలుస్తుంది.

రాజేష్ నీ కూడా అన్నయ్య అంటుంది."

బైక్ పై వెళ్తుండగా దారి మధ్యలో అడిగాను రఘు ని

ఎవరూ..?

స్పందన గురించా మాట్లాడేది నువ్వు.

నేను: హా.. అవును ఇందాకా... అని నేను చెప్పేలోపు

రఘు: ఓహ్.. తనా... నీకు తెలీదు కదూ!

తను మన రాజేష్ గాడి చెల్లెలు.

నేను: అవునా... నేనెప్పుడూ చూడలేదే.

రఘు: తను ఇక్కడే పుట్టింది కానీ, పెరిగిందంతా వాళ్ళమ్మమ్మగారి ఊరిలో.. అక్కడే చదువంతా.. హైదరాబాద్ లో మంచి జాబ్ కూడా చేస్తుంది తను. అప్పుడప్పుడు ఇక్కడకు వచ్చి వెళ్తుంటుందిలే.

నేను రాజేష్ గాడింటికీ వెళ్తుంటాను కదా, అలా పరిచయం తను నాకు.

అయినా..! అసలే అమ్మాయిలంటే ఆమడ దూరం పారిపోతావ్, ఊరిలో ఉన్న అమ్మయిలగురించే నీకు సరిగా తెలీదు, ఇక ఈ అమ్మాయి గురించి నీకేం తెలుస్తుంది.

కానీ, ఏ మాటకి ఆ మాటే చెప్పుకోవాలి వినయం విధేయతలలో తనకు రారు సాటెవ్వరూ...

ఇంటా బయటా అనే బేధం లేకుండా ఎవరినైనా సొంత వాళ్ళల్ల ట్రీట్ చేస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే,

ఈ కాలపు ఆడపిల్లలందరూ ఒకెత్తు, తను మాత్రం ఒకెత్తు.

నేను: హా అవున్రా!

రఘు: ఏంటీ..? అంటూ కళ్ళు పెద్దవి చేసి నా వైపు అదోలా   

         చూసాడు.

          (నాకేదో తన గురించి తెలిసినట్టు చెప్పడంతో...)

నేను: హా.. అవునా అంటున్నా రా..! (అని నేనేదో కవర్ చేశా)

రఘు : ఏంటో నువ్వు, ఎక్కడెక్కడో ఆలోచిస్తావ్.

ఇంతలో ఇల్లు రావడంతో బైక్ దిగి వెళ్తున్న నన్నాపి ..

"అవునూ..?

అయినా.. ఎందుకడిగావ్ తన గురించి" అని ప్రశ్నించకనే ప్రశ్నించాడు రఘు.

అదేం లేదు..రా, తనని ఇంతకు ముందెప్పుడో చూసినట్టనిపించింది, అందుకే అడిగా అని సర్ది చెప్పాను.

హుమ్.. సరే,

నువ్వా..! తననా...!

ఎక్కడో చూడడం కూడాను చాల్లే ఆపరా అంటూ నవ్వుతూ వెటకారించాడు.

అయినా ఛాన్సే లేదు, తను అసలు బయట ఎక్కువగా తిరిగే పిల్ల కూడా కాదు. ఇక నీ గురించి నాకు తెలిసిందే గా...

అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, తనకి వాళ్ళ బావతో పెళ్లి చేద్దామని ఇంట్లో వాళ్ళు అనుకుంటున్నారంట.

నాకేం అర్థంకాక ,

"ఓహ్ ..!

అంటూ బిత్తరపోయి తలాడించాను నేను.

హా.. అవును రా!

అబ్బాయి యూ ఎస్ లో మంచి జాబ్, మంచి ఫ్యామిలీ, పైగా దగ్గర సంబంధం. అందుకే రాజేష్ వాళ్ళ ఫ్యామిలీ ఎలాగైనా ఈ సంబంధం కలుపుకోవడం కోసం తాపత్రయ పడుతున్నారంట.

అది చెప్పడానికే పిలిచాడు నన్ను ఇందాక వాడు.

దాంతో నాకేమనాలో అర్ధం కాలేదు.

ఈ ప్రపంచమంతా ఒక్కసారిగా స్తంభించినట్టనిపించింది. దానికితోడు చుట్టూ ఉన్నా చీకటి నన్ను మరింత ఒంటరివాడిని చేసింది.

కళ్ళల్లో నీళ్ళు ఉబికి వస్తున్నాయి, ఎంత కంట్రోల్ చేసుకుందామన్నా కంట్రోల్ అవ్వడం లేదు. నా కళ్ళు రెండూ కన్నీటి సంద్రాన్ని తలపించాయి.

అవి కిందికి వాలి నేలను చూస్తున్నాయి. దానికి తోడు అసలే చుట్టూ చీకటి అలుముకోవడంతో, వాడికి నా నిట్టూర్పు సెగలు కనిపించడం లేదు కోసం,

ఆ వేదనతో నేనేం మాట్లాడకుండా మౌనంగా ఉండేసరికి, దాన్ని వాడు నేను అప్పటికే ఆరోజంతా అలసిపోయుండడం వల్ల అల ఉన్నానని అనుకున్నాడు. అందుకే,

"బాగా లేట్ అయ్యింది, మార్నింగ్ నుండి తిరుగుతూనే ఉన్నాం. సరే రా రెస్ట్ తీసుకో.. రేపు కలుద్దాం" అని చెప్పి వెళ్ళిపోయాడు.

నైటంతా నిద్ర పట్ట లేదు. రఘు కి కాల్ చేసి అంతా చెప్పేద్ధామనిపించింది.

కానీ, వాడకి నా మీదున్న స్నేహభావంతో వాళ్ళ అన్నయకి కానీ, ఇంట్లో కానీ చెప్తే మళ్ళీ మాటా మాటా వచ్చి వాళ్ళిద్దరినీ విడదీసిన వాడినవుతానేమో...

అసలే ఈ పల్లెటూర్లలో ప్రేమలు గీమలు అంటే ఇక అంతే సంగతులు.

పైగా రాజేష్ వాళ్ళ నాన్న గారు పరువంటే ప్రాణాలిస్తారని, అవసరమైతే ప్రాణాలు తీస్తారని ఊళ్ళో అనుకుంటుంటారు.

అందుకే, చేసేదేం లేక సైలెంట్ గానే ఉండిపోయాను.

ఇక అక్కడ వుండలేక వెంటనే మరుసటి రోజు రాత్రి హైదరాబాద్కి వెళ్ళిపోయాను.

కానీ, అక్కడ కూడా తన ఊహలు , తన ఆలోచనలు, ఆ కొద్ది జ్ఞాపకాలు.. అనుక్షణం నన్ను వెంటాడుతున్నాయి...

అసలే ఇలా సతమవుతున్న నాకు,

నేను ఏ రోజైతే తనని మొట్ట మొదటి సారి చూసానో, అదే ఫిబ్రవరి 14 న తనకి పెళ్లి ఫిక్స్ అయ్యిందనే వార్త తెలిసింది. ఇక హైదరాబద్ లో వుండలేక, జాబ్ లో కూడా సరిగా ఇమడలేక హెల్త్ ప్రాబ్లెమ్ అని వంకతో కొన్ని రోజులు సెలవులపై ఇంటికి వచ్చేసాను.

రోజులు గడుస్తున్నా, తన ఆలోచనలు మాత్రం నన్ను అనుక్షణం కలవరపెడుతూనే ఉన్నాయి. ఏ పెద్ద సమస్యోచ్చినా నాకున్న సెల్ఫ్ మోటివేషన్ తో కుంగుబాటు నుండి నాకు నేనుగా బయట పడే నేను, ఇప్పుడెందుకో అది కూడా నన్ను చూసి వెక్కిరిస్తున్నట్టనిపిస్తుంది.

ఇంతలో రానే వచ్చింది.

ఫిబ్రవరి 14, 2015

అయినా నాది వన్ సైడ్ లవ్వే కదా!

అసలు తన మనసులో ఏముందో..?

ఇప్పటి వరకూ మేమిద్దరం మీట్ కూడా అవ్వలేదు.

అంతెందుకు, అసలు తను నన్ను చూడను కూడా చూడలేదు....

మరెందుకు తన గురించి ఇంతలా ఆలోచించి, తాపత్రయ పడడం.

పైగా తనకిష్టం లేకుండా ఇంట్లోవాళ్లు ఈ పెళ్లి చెయ్యరు కదా...?

ఆ అబ్బాయి నాకంటే బాగా సెటిల్. పైగా బాగా దగ్గర సంబంధమని రఘుగాడన్నాడు.

అయినా తనని ప్రేమించిన అబ్బాయిగా తను నాతోనే ఉండాలన్న స్వార్థం కన్నా, తనెక్కడున్నా సంతోషంగా ఉండలనేదే కదా నా అభిలాష !

అయినా ఇప్పుడు అనవసరంగా ఇలాంటివి బయటకు తీసుకురావడం వల్ల అటు వాళ్ళ, ఇటు మా కుటుంబాల పరువు, ప్రతిష్టలకు మాసిపోని మచ్చ తీసుకురావడం తప్ప నే సాధించేదేముంటుంది.

తనని దక్కంచుకోవడంలోనున్న సంతృప్తి కన్నా, ఈ విషయం ఎవరికి చెప్పకుండా నా ప్రేమను సమాధి చేయడంలోనే నా స్వఛ్చమైన ప్రేమకి నేనిచ్చే ఓ గొప్ప గౌరవంగా భావించాను.

ఇలా.. నాకు నేనే

దుఃఖంతో ఉప్పొంగుతున్న నా మనసుకి సర్ది చెప్పుకుంటూ, నాలో కనుమరుగవుతున్న ఆ సెల్ఫ్ మోటివేషన్ ని వెలికి తీసాను.

మరికాసేపట్లో తన పెళ్లి...

ఇన్నాళ్ళ నా కలలకు, ఊహలకు, ఆశలకు, అవకాశాలకు తెరదించుతూ వీడ్కోలు పలికే క్షణాలు ఇంకెంతో దూరంలో లేవు.

అందుకే.. 

అందుకో ఓ నా కలల రాకుమారి !

నీపై నా ఈ చివరి "ప్రేమ కావ్యం"

"ఓ అరుదైన నేస్తమా.."

నల్లని మబ్బులను వెరసి చూస్తున్న నా కళ్ళు..!

వర్షపు చుక్కలతో కలిసి జారుతున్న కన్నీళ్లు..!!

పిల్లగాలి అల్లరికి మూగబోయిన పలుకులు..!

చిటపటల చప్పుడుకి ఆగిపోయిన అడుగులు..!!

ఏకాకినై ప్రతి తలపులో నీకై నా ఆలోచనా..!

ఎడారిలో దొరకని నీటి జాడలా నీ చిరునామా..!!

ఒంటరిగా నీ అన్వేషణలో నా విరామ సమయం..!

సాగరంలో తెప్ప లేని నావలా ఈ నిర్విరామ ప్రయాణం..!!

మనసే మాట విననంటూ ఎదురుతిరుగుతున్నా..!

స్తంభించిన హృదయం నీ రాకకై ఎదురు చూస్తుంది..!!

ఆశలే ఊహకందనంటూ ఎగిరిపడుతున్నా..!

అలసిన ఊపిరి నీ తోడుకై ఎగిసిపడుతుంది..!!

అడగాలని ఉన్నా ప్రియతమా నీవచట కుశలమా అని..!

అడగలేకున్నా ప్రణయమా నీ యడబాటుతో తడబడుతూ..!!

ఆపలేకున్నా సఖియా నా భావోద్వేగపు భాషని..!

ఆలపించగలనా చెలియా నీ చెంత చేరేవరకూ..!!

యదలోని భావాలను, మదిలోని ఆలోచనలతో ముడివేసి

సృష్టించిన ఈ అక్షరాలను, పదాలుగా పేర్చి, వాక్యాలుగా కూర్చి, రచనలా వ్యక్తపరుస్తూ అందించగలనా ఈ అందమైన కావ్యాన్ని..!

ఆదరించి ఆరాధిస్తారనీ ఆశించనా ఓ అపురూప స్వప్నమా..!!

Be happy😊

dear SPANDHANA ...😊😊

                                 ***********

అలా ఆ డైరీ లో చివరి అక్షరాలను పూర్తి చేసిన రఘు కి కన్నీళ్లు ఆగలేదు.

అప్పటికే వెనక నుండి అంతా గమనిస్తున్న రఘు తల్లి కూడా సతీష్ ప్రేమకు మద్దతు తెలుపుతున్నట్లు రఘు భుజాలను తట్టింది. రఘు కూడా వాళ్లమ్మను గట్టిగా హత్తుకున్నాడు.

"పాపం మనసులో ఎంత దాచుకున్నాడో బిడ్డ...

ప్రేమను ఒప్పుకోకపోతే లేచిపోతాం, లేకపోతే చచ్చిపోతాం.. అనే ఈ రోజుల్లో... కుటుంబ పరువు మర్యాద ల కోసం తన ప్రేమనే త్యాగం చేసిన అలాంటి ఓ గొప్ప స్నేహితుడు ఉన్నందుకు గర్వించు నాన్న...

బాధ పడకు! ఇక ఆలస్యం చేయకుండా..

ఒకసారి వెళ్లి సతీష్ తో మాట్లాడు నాన్న" అన్న వాళ్ళమ్మగారి ఒదార్పుతో కూడిన సలహాతో కాల్ చేద్ధామని మొబైల్ తీశాడు రఘు,

అందులో అప్పటికే చాలా మిస్డ్ కాల్స్ ఉన్నాయి. అవి రాజేష్ దగ్గర నుండి వచ్చినవి.

(తన చెల్లి స్పందన పెళ్లి కదా అందుకు చేసుంటాడు.)

రాజేష్ కి కాల్ చేసి జరిగిందంతా చెప్దామని అనుకున్నా, ఈ టైం లో చెప్పడం కరెక్ట్ కాదు అనుకుంటాడు ....

పైగా స్పందన మనసేంటో ఎవరికి తెలీదు.. అసలు సతీష్ నీ సంప్రదించకుండా చేస్తే , మళ్ళీ ఇవెన్ని అనర్థాలకు దారి తీస్తాయోనని.. అనుకుంటూ

ముందు సతీష్ కి కాల్ చేస్తాడు రఘు. ఈసారి కూడా తన కాల్ కలవదు. అపుడే తనకి కాల్ చేసిన వేరొక స్నేహితుడి ద్వారా సతీష్ ఎక్కడున్నాడో కనుక్కుంటాడు రఘు.

వెంటనే,

తన చేతిలో నున్న డైరీ మూసి, సతీష్ దగ్గరకి బయలుదేరాడు రఘు.

                                ***********

మరో పక్క, కాసేపట్లో పెళ్లి పెట్టుకుని ఆనందంగా గడపాల్సిన స్పందన మోహంలో ఉదయం నుండి నిరాశను గమనించిన తన క్లోజ్ ఫ్రెండ్ సౌజన్య ...

ఎవరూ లేని టైం చూసి, తలుపులు మూసి అసలు కారణమేమిటో అడగడానికి ప్రయత్నిస్తుంది.

అలా అడిగిన సౌజన్యకి స్పందన ఏం బదులిచ్చిందనేది తెలిస్కోవాలంటే,

మూగ మనసులు -7 వరకూ ఆగాల్సిందే...

To be continued in part 7

రచన: సత్య పవన్



Rate this content
Log in

Similar telugu story from Classics