Anjani Gayathri

Inspirational Others

4.7  

Anjani Gayathri

Inspirational Others

🌹 వర్షం కురిసినరాత్రి 🌹

🌹 వర్షం కురిసినరాత్రి 🌹

3 mins
400


వర్షం కురిసిన రాత్రి


 రచన :- అంజనిగాయత్రి


 అంత చీకటిలో జోరు వానలో ఎక్కడికి పోవాలి అనే ఆలోచనతో తన బుర్ర వేడెక్కిపోతోంది కిన్నెర కి. బస్టాండ్ లో అందరూ ఎవరి గమ్యస్థానాలు చేరుకునే బస్సు రాగానే వారు వెళ్లిపోయారు అంతా.


ఆమెకి కొంచం దూరం లో ఇద్దరు మగాళ్లు వున్నారు. ఆమె వైపు అడుగులు వేస్తున్న వాళ్ళని చూస్తుంటే ఆమెకి భయంతో పిచ్చెక్కిపోతోంది. వెంటనే అక్కడ నుండి లేచి వడివడిగా అడుగులు వేస్తూ కొంచెం ముందుకు పరుగెట్టింది. ఇంతలో ఆఖరి మజిలీ గా ఆ స్టాప్ లో ఆఖరి బస్సు వచ్చి ఆగింది. దాంట్లో నుంచి దిగిన లేడీ కండక్టర్ని చూసిన కిన్నెర కి కొంచెం ధైర్యం వచ్చింది.


" ఏమ్మా!!ఎక్కడకి వెళ్ళాలి?? ఇదే ఆఖరి బస్సు, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళేది?? " అంటూ ప్రశ్నించింది కండక్టర్. " మేడం, నా చిన్నప్పుడే అమ్మ పోయింది, నాన్న కూడా మొన్ననే పోయాడు. తాగుడుకు బానిస కావడం, అతను అప్పులు వల్ల ఉన్న ఇల్లు పోయింది. చూసే దిక్కులేరు. ఎక్కడికి పోవాలో తెలియక ఉదయం నుండి బస్టాండ్ లోనే ఉన్నాను. ఇప్పుడు చూస్తే భయంగా ఉంది " అంటూ బాధ పడింది.


" అయ్యో!!పాపం, అయితే ఇపుడు ఏమి చేద్దామనుకుంటున్నావు??" అని ప్రశ్నించిందే కానీ, తన మనసులో ఆమె పై జాలి కలిగింది.


 " అయితే ఒక పని చేద్దాం, నాకు తోడు ఎవరు లేరు, ఇద్దరు పిల్లలతో చాకిరి చేసుకుంటూ ఈ ఉద్యోగం చేయాలంటే ఇబ్బందిగానే ఉంది, నాతో వచ్చేయ్, నిన్ను నా కూతురు గా చూసుకుంటాను, " అంటూ అడిగేసరికి వెంటనే ఏమీ అనలేక సరే అని ఒప్పుకొని ఆమె వెంట వెళ్లింది.


 కండక్టర్ గా చేసే పద్మకి ఇద్దరు ఆడపిల్లలు, పెద్ద పిల్ల 10, చిన్నది 7 వ తరగతి చదువుతున్నారు. ఒక ఆక్సిడెంట్ లో భర్త చనిపోయాడు.ఆర్టీసీలో చేస్తూ పోయాడు. అందుచే ఆర్టీసీలో తనకి జాబు దొరికింది. ఇద్దరు పిల్లల్ని చదివిస్తూ సంసారం నెట్టుకొస్తోంది. ఎపుడైనా ఆమె తమ్ముడు వచ్చిచూసి పోతూ ఉంటాడు.


 వచ్చిన కొద్ది రోజులకే ఆ ఇంట్లో పిల్లలకి, పద్మ కి అలవాటయింది కిన్నెర. వంటలో పద్మకు సహాయపడటం, క్యారియర్ సిద్ధం చేయడం, పిల్లలిద్దరికి జడ వేయడం చేస్తూ ఉండేది. ముగ్గురు వెళ్ళాక తలుపు గడియ వేసి కాసేపు టీవీ చూస్తూ లేదా వార పత్రికలు చదువుతూ గడిపేసేది. పద్మ,పిల్లలు వచ్చేసరికి తినడానికి టిఫిన్ సిద్ధం చేసేది. రాత్రి కి వంట కూడా తానే చేసేది. ఎందుకంటె పద్మ అలసిపోయి వస్తుంది. ఆమె వద్దని చెప్పినా వినకుండా వంట చేసేది.


 ఎపుడు లానే " అక్కా అక్కా! అంటూ పిలుస్తూ లోపలకి వచ్చాడు గోపాల్. అక్కడ కిన్నెర ని చూసి ఆశ్చర్యంతో బృకుటి ముడిపడింది. అలా చూస్తూనే పద్మ ఉన్న గదిలోకి వెళ్ళాడు.


 పద్మచెప్పిన విషయాలన్నీ విన్న గోపాల్ " మంచి పని చేసావ్ అక్క, అలాంటివారికి దారి చూపడం మంచిదే, నీకు ఆసరాగా ఉన్నట్టు ఉంటుంది, ఆమెకి ఆధారం దొరికినట్టు అవుతుంది, " అంటూ మెచ్చుకోలుగా పద్మ వైపు చూశాడు.


" అవును రా తమ్ముడు, నువ్వు చెప్పింది నిజమే, అందుకే వెంటనే తనని ఇక్కడికి తీసుకొని వచ్చా. టెన్త్ వరకే చదివినదట. ఇంటర్, డిగ్రీ ప్రైవేటుగా కట్టిద్దామని అనుకుంటున్నా. భవిష్యత్తులో ఉపయోగపడుతుంది చదువు, " అంటూ ముగించింది.


" కరెక్ట్ గా చెప్పావు అక్క, ఈ రోజుల్లో కనీసం డిగ్రీ అయినా ఉండాలి, ఆమె కాళ్ళ పై ఆమె నిలబడాలంటే, నాకు నీ ఆలోచన నచ్చింది, " అంటూ రేపు వస్తాను, బై అని వెళ్ళిపోయాడు.


 పద్మ కిన్నెరతో చెప్పింది, గోపాల్ తన తమ్ముడని, దగ్గరలోనే వేరే ఊర్లో అమ్మ, నాన్న, తమ్ముడు ఉంటారని. తనని అక్కడికి వచ్చి ఉండమన్నారు అని, కానీ పిల్లల చదువులు బస్టాండ్ దగ్గర ఉండటం వల్ల తను ఇక్కడ ఉన్నట్టు చెప్పింది.


 తర్వాత రోజు గోపాల్ కిన్నెర ఇంటర్ చదవడానికి అప్లికేషన్ తెచ్చి పద్మకి ఇచ్చి అప్లికేషన్ పూరించి తీసుకు వెళ్ళాడు. సొంత వాళ్ళలా చూసుకునే పద్మ వాళ్ళతో అరమరికలు లేకుండా కలిసి పోయింది కిన్నెర. ఇంటి పని మొత్తం తన భుజాలపై వేసుకుని కన్నతల్లిని చూసుకున్నట్లు చూసుకుంటోంది పద్మని. అందుకే పద్మ కూడా ఎంతో ఆప్యాయంగా ఆమెను చూస్తోంది.


 పద్మ ఇంటికి వచ్చి వెళుతూ ఉండటం వల్ల పద్మ తల్లిదండ్రులకు కూడా కిన్నెర అలవాటయింది. వచ్చిన కొత్తలో కంటే ఇప్పుడు చాలా బాగా తయారయింది. యే బాధా లేకుండా నిశ్చింతగా ఉండటం వల్ల మరింత అందంగా ఆకర్షణీయంగా కనబడుతోంది. దానికి తగ్గట్టుగా చదువుకుంటోంది కదా హుందాగా వుంది.


 పద్మ మనసులో గోపాల్ కి కిన్నెర నిచ్చి పెళ్లి చేస్తే బాగుంటుంది అని అనిపించసాగింది. గోపాల్ దగ్గర ఉండబట్టలేక అనేసింది. " నా ఇష్టం కన్నా ముందు ఆమె ఇష్టం కనుక్కోవాలి, అప్పుడు అమ్మా నాన్నకు చెప్పాలి, వాళ్లంతా ఒప్పుకుంటే నాకు ఎటువంటి అభ్యంతరం లేదు, ఆమెకి ఆధారం చూపించినట్టు అవుతుంది, తనకి ఏ వంక పెట్టడానికి లేదు, మనిషి కూడా బాగుంటుంది, " అంటూ ఆమె పై అభిప్రాయం తెలిపాడు.


" మంచి మాట చెప్పావు తమ్ముడు, మిగతాదంతా నేను చూసుకుంటాను, " అని తమ్ముడు భుజంతట్టి వంటింట్లోకి వెళ్ళింది.


 వంటింట్లో కూరలు కట్ చేస్తున్న కిన్నెర తో మాట్లాడుతూ గోపాల్ తో మాట్లాడిన మాటలు, అతను చెప్పిన సమాధానం ఆమెతో చెప్పి, " మా తమ్ముడు పైన నీ అభిప్రాయం చెప్పు కిన్నెర, " అని అడగగానే ,


" నా అభిప్రాయం కన్నా ముందు నా గురించి మీ అమ్మగారు నాన్నగారు ల అభిప్రాయం అడిగి తెలుసుకోవాలి కదండీ, " అని సిగ్గుతో అక్కడి నుండి వెళ్ళిపోయింది.


" అబ్బో!! గడుసు దానివే, అని నవ్వుకుంటూ తల్లి తండ్రికి ఫోన్ చేసిపెళ్లి విషయం మాట్లాడి అందరూ అంగీకారం ప్రకారం పెళ్లి ముహూర్తాలు ఏర్పాట్లు చేశారు. నిశ్చితార్థం హడావిడి లేకుండా కానిచ్చేశారు.


 మంచి ముహూర్తం లో కిన్నెర మెడలో మూడు ముళ్ళు వేసాడు గోపాల్. పెద్దలందరి ఆశీర్వాదం తీసుకున్నాక తల్లిదండ్రుల ఫోటోకి దండం పెట్టుకుని " నాన్న, మీరు లేకపోయినా, వర్షం కురిసిన ఆ రాత్రి పద్మ గారి రూపంలో దేవుడే నాకు దారి చూపాడు. " అని కళ్ళనీళ్ళు తుడుచుకుని ఆ ఇంట్లో స్థానం పొందినందుకు సంతోషంగా ఉంది.


 దేవుడు ఎప్పుడు ఎవరికి ఏ దారి చూపాలో మార్గనిర్దేశం చేస్తూనే ఉంటాడు. అది దేవుడు సృష్టి.

 🌹సమాప్తం 🌹


Rate this content
Log in

Similar telugu story from Inspirational