Midhun babu

Romance Inspirational Others

4  

Midhun babu

Romance Inspirational Others

నిమిషము అనగా...

నిమిషము అనగా...

3 mins
259


నిమిషము అనగా ఏడాది..


ఇదేం లెక్క అంటారా? పరీక్షలు నిర్వహించే వారి లెక్కలు ఇలాగే వుంటాయి. 

‘ఒక్క నిమిషం ఆలస్యం అయినా సరే పరీక్ష హాల్లోకి అనుమతించేది లేదు’

ఎం సెట్ పరీక్షలకు ముందు టీవీల్లో ఈ స్క్రోలింగు చకచకా పరిగెత్తుతూ పరీక్షార్దుల గుండెల్లో రైళ్ళు పరిగెత్తిస్తూ వుంటుంది. ఎం సెట్ ఒక్కటే కాదు ఏ సెట్టయినా ఇదొక ఆనవాయితీగా మారిపోయింది. ఏదో సబబైన కారణం వుండి నిమిషం ఆలస్యం అయి పరీక్ష హాల్లో ప్రవేశించని వారు మళ్ళీ పరీక్ష రాయాలంటే ఒక ఏడాది నిరీక్షించాలి. పైగా ఈ ‘సెట్ల’ కు సప్లిమెంటరీలు కూడా వుండవు, మార్చి తప్పితే సెప్టెంబరు ఉందిలే అనుకోవడానికి. ఏకంగా ఏడాది ఆగాల్సిందే. అందుకే చెప్పింది, నిమిషం అంటే ఏడాది అని. 


పరీక్షలు అనేవి రాసే పిల్లలకే కాదు, వాళ్ళ తలితండ్రుల పాలిట కూడా విషమ పరీక్షలే. ఆ పరీక్షలే పెద్ద పరీక్ష అనుకుంటే పరీక్ష రాయడం, రాయించడం మరో పరీక్షగా పరిణమిస్తోంది. రాసే పరీక్షకు సిద్ధం అవడం ఒక పరీక్ష అయితే, ఆ పరీక్షరాయడానికి చదువుతో నిమిత్తం లేని అదనపు కసరత్తులు కొన్ని చేయాల్సివస్తోంది.


ముందు హాలు టిక్కెట్టు వస్తుందో లేదో అన్న ఆందోళన. వచ్చిన తరువాత అది సరిగా వుందో లేదో అని సరి చూసుకోవడం, అచ్చు తప్పులు వుంటే అదో మనాది. అది బాగుంటే, రాయాల్సిన పరీక్షాకేంద్రం ఆనుపానులు కనుక్కోవడానికి దుర్భిణీ వేసి వెతుకులాడడం. మహానగరంలో వాటి  అడ్రసులు కనుక్కోవడంలోనే తల ప్రాణం తోకకు వస్తుంది. ఎలాగో అలా కనుక్కుని వెడితే ఇది కాదు మరో చోటికి పొమ్మంటారు. అది వెతుక్కుని వెళ్ళేలోగా పుణ్యకాలం ముంచుకు వస్తుంది. ‘నిమిషం నిబంధన’ నెత్తి మీది కత్తిలా వేలాడుతుంటుంది. ఆ ఆందోళన బుర్రల్ని వాళ్ళ నిరామయం చేస్తుంది. ఇన్నాళ్ళు చదివింది పూజ్యంగా మారి, సమయానికి అక్కరకు రాని కర్ణుడి విలువిద్యను గుర్తుకు తెస్తుంది.


ఏ విషయంలోనయినా క్రమశిక్షణ అవసరమే. సమయ పాలన మరింత ముఖ్యమే. చిన్నతనంలోనే ఈ రెంటికీ సరయిన పునాదులు పడడం అభిలషణీయమే. ఈ దిశగా అధికారులు కానీ, వారిని పర్యవేక్షించే ప్రభుత్వాలు కానీ చర్యలు తీసుకోవడం కూడా అవశ్యమే. ఎవరూ కాదనలేని విషయమే. అయితే కొండ నాలుకకు మందు వేసే క్రమంలో వున్న నాలుక ఊడిపోకూడదు. ఇలా హితోక్తులు పలికేవాళ్ళు తమ మార్గానికి అడ్డం వస్తున్నారని, మార్పుకి వ్యతిరేకులని అనుకోరాదు.

ఎంసెట్ అనేది చదువుకునే పిల్లలకు, వారి పిల్లలకు ఒక అపూర్వమైన ఘట్టం. ఈ పరీక్షే వారి భవితను నిర్దేశిస్తుందని నమ్మేవారు కోకొల్లలు. వారిలోని ఈ నమ్మకమే ప్రైవేటు విద్యా సంస్థలకు కల్పతరువుగా మారుతోంది. కోట్ల రూపాయలు కురిపించే కామధేనువుగా తయారువుతోంది.


ఈ పరీక్షలు రాసేవాళ్ళు ఢక్కామొక్కీలు తిన్న బాపతు కాదు. లేత వయస్సులో వున్నవాళ్ళు. ఈ ప్రాయంలో ఎటువంటి శరాఘాతాలను తట్టుకునే మానసిక నిబ్బరం వారికి వుండదు. తమ బతుకు బాట మార్చే పరీక్ష రాసే అవకాశం చేజారి పోయిందన్నప్పుడు వారికి కలిగే మానసిక క్లేశం అంతా ఇంతా కాదు. బస్సు తప్పిపోయో, అడ్రసు దొరక్కనో, వారి చేతిలో లేని కారణం వేరేదో కారణం చేతనో, నిమిషం ఆలస్యం అయిందన్న ఒకే ఒక్క కారణంతో తమ జీవిత ధ్యేయానికి దూరం అవుతున్నప్పుడు వారికి కలిగే క్షోభను అర్ధం చేసుకోవడానికి సైకియాట్రిస్టులు కానవసరం లేదు.     

కొద్దిగా మనసు పెట్టి ఆలోచిస్తే అసలు ఈ నిమిషం నిబంధన ఎంత అర్ధరహితమో అన్నది అర్ధం అవుతుంది. 


నిమిషం కూడా లేటు కాకూడదు అంటున్నారు సరే! అది ఏ లెక్క ప్రకారం? పరీక్ష రాసే అభ్యర్ధి పెట్టుకున్న గడియారం ప్రకారమా? గేటు కాపలాదారుడి చేతికి వున్న వాచీ ప్రకారమా? పరీక్ష హాల్లో పర్యవేక్షణ చేసే అధికారుల గడియారాల ప్రకారమా? నిమిషం ఆలస్యాన్ని నిర్ధారించడానికి ఏది ప్రామాణికం? ప్రపంచంలో ఏ రెండు గడియారాలు ఒక సమయం చూపెట్టవని అంటారు. అలాంటప్పుడు నిమిషం ఆలస్యం అయిందా లేదా అనే విషయం ఎవరు నిర్ణయించాలి? అసలు ఈ నిమిషం నిబంధన ఈ ప్రాతిపదిక పైన విధించారు?


ఈ సమాజంలో ప్రతి ఒక్కరూ ఆలస్యం అనేది తమ హక్కుగా పరిగణిస్తున్నప్పుడు, ఒక్క నిమిషం ఆలస్యాన్ని కూడా ఉపేక్షించేది లేదు అనే ఈ వైఖరిని ఒక్క పరీక్షార్ధుల పట్ల మాత్రమే ఎందుకు వర్తింప చేస్తున్నారు? ఇది ఏమేరకు సమంజసం?

అధికారులు సమయానికి ఆఫీసులకి రారు. వారికోసం వచ్చిన వారికి, ఇప్పుడే ఒక నిమిషంలో వస్తారు, వేచి వుండండి అనే జవాబు సిద్ధంగా వుంటుంది. గంటలు గడిచి పోతున్నా ఆ నిమిషం అనేది ఎప్పటికీ రాదు. అదేమని అడిగే హక్కు ఎవరికీ వుండదు. మంత్రులు, ముఖ్యమంత్రుల కోసం సమయానికి ఎగరాల్సిన విమానాలు ఆగిపోతాయి. బయలుదేరాల్సిన రైళ్ళు నిలిచిపోతాయి. ఎందుకు ఆలస్యం అని అడిగేవాళ్ళు వుండరు.


ఎవరూ ఎప్పుడూ పాటించని సమయ పాలన అనే నిబంధనను లేలేత ప్రాయంలోని విద్యార్ధుల పట్లనే అంత నిర్దయగా అమలు చేస్తారు అన్నదే జవాబు దొరకని ప్రశ్న. ఒక్క నిమిషంలో పుట్టేమీ మునగదు అంటూ నీతి సూక్తాలు వల్లె వేసే వాళ్ళే ఈ నిమిషం నిబంధన పట్ల గంభీర ప్రకటనలు చేస్తూ వుండడం విడ్డూరం...


... సిరి ✍️❤️


Rate this content
Log in

Similar telugu story from Romance