kottapalli udayababu

Tragedy Classics Children

4  

kottapalli udayababu

Tragedy Classics Children

అనాధ (కథ)

అనాధ (కథ)

6 mins
68


అనాధ (కథ)

 “అరెరే...! పాపం ఇంత చిన్న వయసులో ఎంత కష్టం వచ్చింది? పట్టుమని పాతికేళ్లు కూడా లేవు. బంగారం లాంటి పిల్లని దేవుడెత్తుకుపోయి ఈ ఏడాది పసికందును అనాథను చేశాడా దేవుడు!’’


“ వీధిలో నడిచి వెడుతుంటే చిలకాగోరింకల్లా ఉండేవారు. ఎంత వినయం! ఎంత విధేయత! పండుగనాడు కొత్త చీర కట్టుకొని కాళ్లకు దండం పెట్టేది. ‘నాకెందుకమ్మా’ అంటే ‘మాకంటూ మీరు తప్ప ఎవరెవరున్నారు పిన్నిగారు?’ అనేది. దేవుడిచ్చిన కూతురు అనే అనుకున్నాను. ఆ భాగ్యం లేకుండా చేశాడు దేవుడు!’’ ముక్కు చీదింది మరో పెద్ద ముత్తయిదువ.


‘’ఊరుకో వాడినా! మనం ఏం చేయగలం చెప్పు? నన్ను మటుకు నన్ను సొంత అక్కలా చూసుకునేది. ‘మేము ఇద్దరమే. ఎంత అని తింటాము? ఆయన వద్దన్నా అన్ని తెచ్చి పెడతారు. నాకేమీ లోటు రాకూడదని ఆయన ఉద్దేశం. అయితే మాత్రం దేనికైనా ఒక హద్దు ఉంటుంది గా. అందుచేత మీరు మొహమాటపడకుండా మీకు ఏ సరుకు కావలసినా తీసుకెళ్ళండి అక్కయ్య!’ అనేది. ఈ మాయదారి న్యూమోనియా ఆ అమ్మాయికే రావాలా? ‘’ బావురుమంది మరో ఆవిడ.


‘’ఊరుకో కనకం. చుట్టుపక్కల వాళ్ళం ...మనమే ఇంత ఇదైపోతుంటే పాపం ఆ అబ్బాయి బాధ ఎవరు తీర్చగలరు చెప్పు?’’

శవం చుట్టూ చేరి ఇలా ఒకరినొకరు ఓదార్చుకుంటున్న దృశ్యం తప్ప , అక్కడ దిక్కులు పిక్కటిల్లేలా గగ్గోలు పెట్టి వెక్కి వెక్కి ఏడుస్తున్న ఆ ఏడాది పసికందును కనీసం ఎత్తు కొన్నవారు లేరక్కడ.

భార్య శవాన్ని తదేకంగా చూస్తూ నిర్వేదంగా ఉన్న శ్రీ హర్ష పాక్కుంటూ తన కాళ్ళ దగ్గరికి వచ్చి చుట్టుకున్న బాబుని బాబుని ఉలిక్కిపడి అపురూపంగా ఎత్తుకుని పొదివి పట్టుకుని ముద్దాడాడు.


'’నీకు, నాకు మీ అమ్మ ఇక లేదు రా నాన్న. ఇంక రాదు. కానీ...కానీ నీకు నా పోలిక రాకూడదు. రానివ్వను నేను. నువ్వు ఎప్పటికీ అనాధవి కావు. అందుకోసం నేను ఏమైనా చేస్తాను. అవును ఏమైనా చేయాలి. చేసితీరాలి’’ అని తీర్మానించుకున్నాడు శ్రీహర్ష.


సరిగ్గా అప్పుడు పడింది అతని భుజం మీద ఒక చేయి. శ్రీహర్షకి తెలుసు అతనెవరో. ఒక చేతితో బాబుని పట్టుకొని, రెండవచేతితో ఆ చేయిని అందుకున్నాడు.


 ఆదిత్య అతని ముందుకు తిరిగాడు. అతనిని చూస్తూనే అతని భుజం మీద తల వాల్చి మౌనంగా రోదించ సాగాడు శ్రీ హర్ష.


 స్నేహితుని ఆప్యాయంగా కౌగిలించుకుని వెన్ను నిమురుతూ ఉండిపోయాడు ఆదిత్య.


“అయ్యో! బాబు పాల కోసం ఏడ్చి ఏడ్చి పడుకున్నట్టున్నాడు. ఇలా ఇవ్వు నాయినా. పాలు పట్టి తీసుకు వస్తాను’’ కనకం అన్నావిడ చనువుగా ఆ బిడ్డను తన చేతుల్లోకి తీసుకునీ వెళ్ళింది.


 ఆదిత్య అన్నాడు’’ ఒరేయ్ ఇలా బాధపడుతూ కూర్చుంటే ఎలా? జరిగే కార్యక్రమం చూడాలి. నీకు భార్య కాదు. నా తోబుట్టువు ఇంక నాకు లేదు అనుకుంటేనే...”


 

ఈసారి విస్తుపోవడం శ్రీహర్ష పని అయింది. ప్రతి చిన్న విషయానికి కూడా తీవ్రంగా చెల్లించే మనస్తత్వమున్న ఆదిత్యను ఐదు నిమిషాల వరకు వూరుకోపెట్టలేకపోయాడు శ్రీ హర్ష.


 ఎవరు చెబుతున్నా వినకుండా చంటి బిడ్డను భుజాన వేసుకుని అతను భార్య చితికి నిప్పంటించిన తీరు అక్కడే అందరి హృదయాలను తీవ్రంగా కలిచివేసింది. పగ వాళ్లకు కూడా అలాంటి పరిస్థితి రాకూడదు అన్నంతగా!


 


ఆదిత్య సహాయ సహకారాలతో 15 రోజుల్లోనే ఆవగింజంట కోలున్నాడు శ్రీహర్ష.


 


అతనికి అర్థం కానిది ఒకటే. తను నమ్ముకున్న వారిని భగవంతుడు ఎందుకు అన్యాయం చేస్తాడు? తను ఎన్నో ఎన్నో కుటుంబాలు చూశాడు, నిత్యం పూజలు పునస్కారాలు చేసేవాళ్ళు, చర్చిలకు, మసీదులకు వెళ్ళేవాళ్ళు ఎప్పుడూ ఏదో ఒక సమస్యతో బాధపడుతూ ఉండటం, అలాంటివేమీ లేకుండా ముప్పోద్దులా


హాయిగా తిని తిరిగేవాడికి ఏమీ బాధ గాని చీకూ చింతాగానీ లేకుండా బతికేసే వాళ్ళను చూశాడు. వాళ్ళకి అలా ఎలా సాధ్యం?


 


అతనికి లెక్కల మాష్టారు సుబ్రహ్మణ్యం గారు గుర్తుకొచ్చారు.


‘’ బాబు శ్రీ... ఎక్కువ మంది గణిత ఉపాధ్యాయులు తమ బోధనలో నిర్లక్ష్యం వహించే అధ్యాయము రేఖాగణితం. రేఖాగణితం ఔపోసన పట్టిన వాడు కచ్చితంగా వాస్తు బ్రహ్మ అవుతాడు. అది తర్కజ్ఞానాన్ని పెంచి మనిషికి లోతుగా ఆలోచింపచేసే శక్తిని కలగజేస్తుంది. అందుచేత నువ్వు ఆ శాస్త్రాన్ని అధ్యయనం చేయడం అంటే ఆలోచించడమ్ అంటే తర్కించి తర్కించి ఆలోచించడమే. దాని ద్వారా నువ్వు ఒక సత్యానికి చేరువ అవుతావు. ‘’ అని అంటూ ఉండేవారు. అంటే నిత్యం పూజ చేసేవారు - బలహీన మనస్కులు అయి వుండాలి. వారు గురువు ఆశ్రయం పొంది వారి అడుగుజాడల్లో నడిచి తమ గమ్యం చేరుకుంటారు. ఏ పూజా పునస్కారాలు చేయని వారు ఆత్మ విశ్వాసానికి ప్రతీకలై ఉండి తీరాలి. ప్రతీ పనిని తాము సాధించగలననే పట్టుదల, తమపై తమకు అచంచల నమ్మకం కలిగిన వారే స్వతంత్ర జీవనం తో నిశ్చింతగా బతకగలరు.


 


 ప్రతిభ ఉన్నంతకాలం తను బలహీన మనస్కురాలై తననూ ఆ బాటలో నడిపించింది. ఇప్పుడు తన స్వశక్తితో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకొని ఏదైనా చేయాలి. ఎస్. అనాధల కోసం ఏదైనా చేయాలి. ఏం చేస్తే బాగుంటుంది?


 


ఆదిత్య సహకారంతో అతనిలో ఉన్న ఆలోచన మొలకెత్తి నవనవలాడే మొక్కలా రూపుదిద్దుకుంది అతని అంతరంగంలో!!!


*********


           శ్రీహర్ష ఎప్పుడు ఎక్కడ పుట్టాడో తెలియదు. అతనికి జ్ఞానం వచ్చేసరికి రైల్వే ప్లాట్ ఫారం మీద ఉన్నాడు. అందంగా ఇన్-షర్ట్ చేసుకుని భుజాన బ్యాగ్ తో రైల్ లో కూర్చుని అవకాశం దొరికితే క్లాసు బుక్స్ చదువుకునే ఎంతో మంది స్టూడెంట్స్ ని పరిశీలించాడు.  తాను అలా చదువు కోగలగాలి.


 


ఒక రోజు అతని కళ్ళముందు జరిగిన చిన్న సంఘటన అతనికి మార్గాంతరం సూచించింది.


 


తనతోపాటే ఆ ప్లాట్ ఫారం మీద గత మూడు రోజుల నుంచి విపరీతమైన జ్వరం తో బాధపడుతున్న ఒక కుర్రాడు రెండు రూపాయలు విలువ చేసే సొంపాపిడి దొంగలించాడు. దాన్ని తీసుకొని పారిపోతూ మూడు లంఖణాల నిస్సత్తువతో స్పృహ తప్పి పడిపోయాడు.


అమ్మానాన్న చదువుకోమని విపరీతంగా హింస పెట్టడంతో ఇంటి నుంచి పారిపోయాడట.


రైల్వే ప్లాట్ ఫారం సెల్లర్స్ అతని పట్ల జాలి చూపించలేదు. నిర్దాక్షిణ్యంగా పోలీసులకు అప్పగించారు. తానూ అలా జైలుకు వెళ్తే? ఊహూ. కాదు ఇలా చేస్తే....!


 


అతడు తన ఆలోచనను అమలు లో పెట్టాడు.


 ఆ రోజు ఒక ఖరీదైన మనిషి ఆగి ఉన్న బండిలో కూర్చున్నాడు. అతని చేతిలో బ్రీఫ్ కేసు ఉంది. అది తెరిచి తన తన చేతిలోని ఫైళ్ళని కూడా దాంట్లో పెట్టి లాక్ చేసుకుని ఇంగ్లీషు నవల చదువుకోవడం మొదలు పెట్టాడు. బండి బయలుదేరడానికి ఇంకా అరగంట సమయం ఉంది.


శ్రీ హర్ష ఆయన దగ్గరకు వెళ్ళి తనను తాను పరిచయం చేసుకున్నాడు. తన ప్లాన్ ఆయనకు వివరంగా చెప్పి తన భవిష్యత్తుకు బాటలు వేసుకునే అవకాశం కలగ చేయమన్నాడు. ముందు విచిత్రంగా చూసినా ఆ తర్వాత ఆయన అంగీకరించాడు .


 


రైల్వే పోలీసులు అటుగా రావటం చూసిన శ్రీ హర్ష తన ప్లాన్ ప్రకారం ఆయన బ్రీఫ్ తీసుకుని పరిగెత్తడానికి ప్రయత్నించినట్టు నటించి పడిపోయాడు. అంతలో ఆయన శ్రీ హర్ష చెప్పిన విధంగా ‘’దొంగ.. దొంగ.. పట్టుకోండి’’ అని అరిచాడు. పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్లో అప్పగించారు.


 


తనని మర్నాడే వదిలేస్తారని తెలిసింది - ఎందుకంటే అతను దొంగిలించిన సామాను అతని దగ్గర దొరికింది కాబట్టి.


శ్రీహర్ష కళ్ళల్లో గిర్రున నీళ్ళు తిరిగాయి. తాను ఎంత దురదృష్టవంతుడు? దురదృష్టం ఎంత వద్దన్నా వెనకాల నీడలా వస్తోంది? తాను చదువుకోవడానికి వచ్చానంటే ఎవరు నమ్మి చదివిస్తారు?


 


అతను ఆలోచనలో ఉండగా తాళం తీసి అతను ఉన్న జైలు గది తాళం తీసి అతనిని తీసుకువచ్చి జైలు అధికారి ముందు నిలబెట్టారు.


 


‘’ఈయన రావుగారు అని నీ కోసం వచ్చారు. నిన్ను విడుదల చేయించారు. ఎంత చదువుకోవాలని ఉంటే మాత్రం దానికి దొంగతనం మీద వేసుకుని జైలుకు రావడం తప్పు బాబు . ఇంకెప్పుడు ఇలా చేయకు. ఆయనే నీ పధకం అంతా మాకు వివరంగా చెప్పారు. లేకపోతే చెయ్యని తప్పుకు నేను శిక్షించే వాళ్ళము అయ్యేవాళ్ళం’’ అన్నాడు జైలు అధికారి శ్రీహర్ష వెన్ను తడుతూ.


శ్రీహరి ఆయన కేసి చూశాడు. ఆయన నిన్నటి కళ్ళజోడు ఆయనే. తన పెట్టుకున్న రేబాన్ కళ్ళజోడు తీసి చిరునవ్వుతో శ్రీ హర్ష బుగ్గలు పుణికి అన్నారాయన.


‘’ చూడు బాబు చదువు పట్ల నీకున్న అభిలాష నన్ను ఇక్కడకు లాక్కు వచ్చేలాగా చేసింది. నువ్వు చదువుకుంటున్నావు. నేను చదువు చెప్పీస్తాను, థాంక్యూ వెరీ మచ్ సర్.’’అని జైలు అధికారికి చెప్పీ


‘’రా బాబు’’ అంటూ ఆయన శ్రీహరి భుజాల చుట్టూ చేతులు వేసి తీసుకు వెళుతుంటే అల్లావుద్దీన్ అద్భుతదీపం తొలిసారి ప్రసాదించిన తండ్రి ప్రేమను అనుభూతి చెందుతూ ఆయనని అనుసరించాడు శ్రీహర్ష. 


 


రావు గారు ఒక ఉప విద్యాశాఖ అధికారి అని, ఆయన పరిధిలో ఉన్న పాఠశాలల్లో విద్యార్ధులంతా ఆయనని దైవ సమానంగా భావిస్తారని, ఎందరో ఉపాధ్యాయులు ఆయన ఆ జోన్ కి వచ్చాక తమలోని లోని బద్ధకాన్ని వదిలించుకొని, ఆధునిక బోధనా పద్ధతుల ద్వారా తమ బోధనాపటిమను మెరుగుపరచుకుని తనలోని సామర్థ్యాన్ని పెంచుకుని తమ తమ రంగాల ఎన్నో అవార్డులు సాధించారని విన్నప్పుడు శ్రీ హర్ష హృదయం ఆయన పట్ల భక్తిభావంతో పులకించిపోయింది.


తన వృత్తిధర్మం తాను నిర్వర్తిస్తూ  తన కింద వారి చేత సమర్థవంతంగా పని చేయించి, తాను నిర్వహిస్తున్న పదవికే వన్నె తెచ్చే అధికారులు నేడు ఎంతమంది ఉన్నారు?


 


 ఆయన తనకు ఇచ్చిన ప్రోత్సాహంతో తాను ఇష్టపడి చదివి - ఆయనకు మరింత పేరు తెచ్చిపెట్టాలని స్థిరంగా నిర్ణయించుకున్నాడు శ్రీహర్ష.


బీకాం చదివిన తర్వాత అనుకోకుండా బి ఎస్ ఆర్ బి కి సెలెక్ట్ కావడంతో, అప్పటికే తను ఆయనకు ఎంతో రుణపడి ఉన్నాడు అన్న భావనతో ఆయన చదివిస్తాను అన్నా శ్రీహర్ష సున్నితంగా తిరస్కరించాడు. ‘’నాన్నగారు. దిక్కు మొక్కు లేని నన్ను సానబెట్టి నా కాళ్ళ మీద నేను నిలబడేలా చేశారు . ఇంకా మీకు భారమైతే ఆ భగవంతుడు నన్ను క్షమించడు. మీ ఆశీర్వాదబలం తో మొదటిసారి అప్లికేషన్ పెట్టిన ఉద్యోగానికే ఎన్నికయ్యాను. నా ఆఖరి క్షణం వరకు ఈ జీవితం మీరు ప్రసాదించింది. అందుచేత మీరు మనస్పూర్తిగా ఆశీర్వదిస్తే ఈ ఉద్యోగంలో చేరతాను.’’ అపాయింట్మెంట్ ఆర్డర్ ఆయన పాదాల మీద పెట్టి సాష్టాంగ నమస్కారమ్ చేసి అన్నాడు శ్రీహర్ష.


 


ఆయన కళ్ళు చెమ్మగిల్లాయి. అదే చదువు కన్నబిడ్డలను చదివిస్తూ ఉంటే దాన్ని సద్వినియోగం చేసుకునే పిల్లలు ఎంతమంది ఉన్నారు నేడు ఈ సమాజం లో? మన దగ్గర ఏదైతే లేదో దాన్ని సంపాదించుకోవడమే - నేర్చుకోవడం. ఆవిషయం తు.చ తప్పక పాటించాడు శ్రీ హర్ష. అందుకే అంగీకార సూచకంగా ఆయన అతని తల ఆప్యాయంగా నిమిరారు. 


‘’నేను నీళ్ళు పోసి మొక్క వృక్షమై వెళ్ళూనుకుంటూ ఉంటే నా ఆనందం ఎలా వర్ణించగలను బాబు! సరే నీ ఇష్టం! అయితే నీ అనుమతి లేకుండా నేను ఒకరికి మాట ఇచ్చాను బాబు.!’’


‘’ఎవరికి? ఏమని నాన్న గారు?’’ వినయంగా అడిగాడతను.


‘’ నీ మీద మనసు పడిన ఒక అమ్మాయికి - నిన్ను తన జీవిత భాగస్వామిని చేస్తాను అని. ఆ అమ్మాయి పేరు ప్రతిమ. నా దగ్గర నమ్మినబంటు గా పనిచేసిన అటెండర్ ఉండేవాడు. అతని పేరు రమణయ్య.


డ్యూటీలో ఉండగా గుండెపోటు వచ్చి హఠాత్తుగా మరణించాడు. అతని కూతురు ఆమె. ఆమెకూ నీలాగానే చదువు చెప్పించాను. నువ్వు ఏమంటావు?’’


“”పంచభక్ష్య పరమాన్నం లాంటి జీవితంలో కొంచెం అమృతం వేస్తాను ఉండు అన్నట్టు తమరు ఆశీర్వదిస్తుంటే  నేను అంగీకరించడం తప్ప మరి ఏం చేయగలను నాన్నగారు?’’ అన్నాడు శ్రీహర్ష వినమ్రంగా.


 


అలా అతని అర్ధాంగి అయింది ప్రతిమ. మూడేళ్ళ వాళ్ళ అన్యోన్య కాపురం లో బాబు పుట్టాడు. అటువంటి ప్రేమ జంటలో ప్రతిమను నిర్దాక్షిణ్యంగా తీసుకుపోయాడు దేవుడు.


అయితే ప్రతిమా శ్రీ హర్షల వివాహం జరిగిన ఏడాదికి రావు గారు పక్షవాతం వచ్చి నెల తిరక్కుండానే మరణించడంతో శ్రీహర్ష తట్టుకోలేకపోయాడు. ప్రతిమ సాహచర్యం ఉన్నా అతను మామూలు మనిషి కావడానికి ఆరు నెలలకు పైగా పట్టింది.


 


దానికి కారణం ఆయన ఒక్కగానొక్క కొడుకు అమెరికాలో ఉండడంతో శ్రీ హర్ష రావు గారికి తలకొరివి పెట్టాడు. అందుకే శ్రీహరి ఒక నిర్ణయానికి వచ్చాడు.


ఈ ప్రపంచం నుంచి ఏ మనిషి ఏది తీసుకెళ్లడు - మంచి పేరు సంపాదించుకుని కీర్తిశేషులు గా మిగలడం తప్ప.  అలాంటి ఒక మంచి పని చేసి, అనాధల కోసం ఒక సంస్థను ఏర్పాటు చేసి తనలాంటి అనాధలందరినీ చేరదీసి  తన కంటే ఉన్నత స్థితికి వచ్చేలా కృషి చేయాల్సిన అగత్యం ఎంతైనా ఉంది. 


అందుకే తన స్నేహితుడు ఆదిత్య సహకారంతో తన లక్ష్య సాధనకు ప్రణాళికను రూపొందించు సాగాడు. 


 


ఒకపక్క బాబుని చూసుకుంటూనే శ్రీ హర్ష తన విరాళంగా బ్యాంకు లోన్ పెట్టి 60 వేల రూపాయలతో స్థలం కొని తాను స్థాపించబోయే ‘’కైండ్ ఫరెవర్’’ అనాధ ఆశ్రమ స్థాపనకు శ్రీకారం చుట్టాడు. 


 


ఆదిత్య ఒక ప్రముఖ రాజకీయ నాయకుడు మేనల్లుడు కావడంతో అతని సహకారంతో శ్రీ హర్ష మంచి విరాళాలు సేకరించగలిగాడు. పైగా శ్రీ హర్ష బ్యాంకు వచ్చే కస్టమర్లకు అతను బెస్ట్ సర్వీసెస్ అందిస్తాడనే అభిప్రాయం ఉండడంతో అడిగినదే తడవుగా ఎంతో సంతోషంతో తమ వంతు విరాళాలిచ్చారు. తమ శాఖ మిగతా బ్రాంచీలు కూడా సహకరించడంతో అతను తన ఆర్థిక లక్ష్యానికి బాగా చేరువ కాగలిగాడు.


 


తాను విరాళం ఇచ్చిన స్థలంలో భవన నిర్మాణం ప్రారంభించాడు. అది పూర్తి కావడానికి రెండు నెలలకు పైగా పట్టింది. మంచి ముహూర్తం నిర్ణయించి దాని ప్రారంభోత్సవ ఏర్పాట్లను ఘనంగా చేశాడు. ఆ పట్టణంలో అన్ని వార్డులు తిరిగి వివరాలు సేకరించాడు. పట్టణ ప్రముఖులు అందరికీ, ముఖ్యమైన కస్టమర్లకు తన బ్యాంకు, బ్రాంచి లకు ఆహ్వానాలు పంపాడు. ఇంతటి పనిలోనూ ఆదిత్య అతనికి అనుక్షణం కుదిభుజమై ఎంతో సహకారం అందించాడు. మర్నాడు ప్రారంభం కాబోయే భవనాన్ని దూరంగా చూస్తూ ఎంతో సంతృప్తి చెందాడు శ్రీహర్ష.


 అతని మనసంతా ప్రతిమ రూపం తో నిండిపోయింది. బాబుని, శ్రీహరి ఇంటి దగ్గర దింపి మరుసటి రోజు ఉదయమే వచ్చి పికప్ చేసుకుంటానని ఆదిత్య వెళ్లిపోయాడు.


 


ఆ రాత్రి బాబు ని గుండెల మీద పడుకోబెట్టుకుని లాలిస్తూ ప్రతిమ కబుర్లు చెబుతూ ఇంచుమించు ఆ రాత్రంతా నిద్ర లేకుండానే గడిపాడు శ్రీహర్ష.


తెల్లవారింది! బాబు ని సిద్ధం చేసి తాను తయారయ్యేసరికి ఆదిత్య రానే వచ్చాడు. టాక్సీ తో.


***********


 


మరుసటి రోజు ఉదయం శ్రీ హర్ష,ఆదిత్యల ఫోటోలు అన్ని ప్రముఖ దినపత్రికలలో వచ్చాయి.


ఒక ఘోర రోడ్డు ప్రమాదంలో శ్రీ హర్ష, ఆదిత్య మరణించారు,


 


బాబు షాక్ కి గురయ్యి, ప్రాణాపాయం లేకుండా బతికి బయట పడ్డాడు.


 


‘’కైండ్ ఫరెవర్’’ ఆశ్రమం ప్రారంభోత్సవం నిరాడంబరంగా జరిగింది శ్రీ హర్ష పనిచేసే బ్యాంకు వారి సహకారంతో – శ్రీహర్ష కోరిక ప్రకారం.


 


అనాధాశ్రమమ్ రిజిస్టర్ లో మొదటి అనాధగా ‘బాబు’ పేరు రాయబడింది. దాని ఎదురుగా తండ్రి పేరు స్థానంలో ‘లేట్ శ్రీ హర్ష’ అని ఉంది!!!


 సమాప్తం


 


 


 




Rate this content
Log in

Similar telugu story from Tragedy