kottapalli udayababu

Drama Classics Inspirational

4  

kottapalli udayababu

Drama Classics Inspirational

మనసు చేసిన గాయం - 9వ భాగం

మనసు చేసిన గాయం - 9వ భాగం

4 mins
7


మనసు చేసిన గాయం - 9వ భాగం 

మార్చి 31 వస్తూఉండటంతో నాన్నగారు బ్యాంకులో చాలా పని ఉండటంవలన బ్యాంక్ కి వెళ్లిపోయారు.అన్నయ్యకి వాళ్ళ ఆఫీస్ యూనియన్ మీటింగ్ ఉండటంతో అన్నయ్య కూడా వెళ్ళిపోయాడు.

ఇంట్లో అమ్మ, నేను వదిన మాత్రమే ఉన్నాం. 

''సరే గానీ డాక్టర్ గారికి చూపించారా వదినా? ఏమన్నాడు డాక్టర్?'' అడిగింది ఆవిడ.

''చూపించాను వదినా. బాగా నీరసంగా ఉంది...మందులు, టానిక్లూ రాసి ఇచ్చారు. విశ్రాంతి అవసరం అన్నారు. అన్ని పనులూ నేనే చేసుకుంటాను. రాత్రి వంట వద్దన్నా తానే చేస్తుంది.వద్దమ్మా అంటే...'నా దగ్గర ఉండగానే అన్ని పనులూ నేర్చేసుకో..ఏ పనీ లేకపోతే బద్ధకం పెరిగిపోతుందమ్మా ..బధ్ధకం పెరిగితే లావు అయిపోతావు. రేపు పెళ్లి అయ్యాకా ఏ పనీ చెయ్యకుండా తిని కూర్చుంటే కానుపు కష్టమయిపోతుంది.'అని వాళ్ళ బామ్మగారు చెప్పారట.''అంది అమ్మ. 

'' ఆవిడ పెంపకం వల్లే ఇది ఇలా మొద్దు రాచిప్పలా అయిపొయింది. అదే నా మిగతా పిల్లలైతేనా వాత పెట్టినట్టు సమాధానం చెబుతారు మరి. ఇంకొక్క మూడు నెలలు గడిస్తే సీమంతం చేసి నేనే తీసుకెళ్లి బంగారంలా చూసుకుంటాను నా కూతుర్ని. అక్కడ రైల్వే ఆసుపత్రిలో ఆధునిక సౌకర్యాలతో ఆ డాక్టర్లూ, ఆ ట్రీట్మెంట్...సుఖంగా ఉంటుంది. ఇంతకీ నా మనవరాలికి ఏం పెడాతావేమిటి వదినా బారసాలకి? '' అని చటుక్కున నాలిక కరుచుకుంది అత్తయ్యగారు.

''మనవరాలే పుడితే గొలుసు చేయిస్తాను. మనవడు పుడితే మురుగులు చేయిస్తాను. అన్నట్టు మొన్న వచ్చినప్పుడు మీ రెండో అమ్మాయికి సంబంధాలు వస్తున్నాయని కోడలి మెడలో కన్యాదానం చేసిన గొలుసు తీసుకుని వెళ్ళావట? అదేం పని వదినా? ఎంత లేని పుట్టింటి వాళ్ళయినా కన్యాదానం చేసిన గొలుసు తీసుకువెళ్ళారమ్మా అని మా అమ్మ చెబుతూ ఉండేది.కనీసం నాతో చెప్పవచ్చు కదా..ఇలా ఇంట్లో పెద్దవాళ్ళం ఉన్నాము అని కనీస గౌరవం కూడా లేకుండా నీమానా నువ్వు వ్యవహరిస్తావు. మాకు ఎంత బాధగా ఉంటుంది చెప్పు? అయినా విజయా...నువ్వైనా నాతో చెప్పాలి కదమ్మా..'' అని అడిగింది అమ్మ. 

''ఆరోజు అమ్మ నా గదిలోకి వస్తూనే 'అమ్మాయ్ ..మళ్ళీ మర్చిపోతాను. నీ పెద్ద చెల్లెలికి సంబంధాలు వస్తున్నాయి. ముగ్గురు ఆడపిల్లలకి ఒకే రకమైన గొలుసులతో కన్యాదానం చేద్దామని అనుకున్నాను.నీ గొలుసు ఈ ఒక్కసారికి ఇస్తే మళ్ళీ వారం వచ్చినప్పుడు తెచ్చి నీకిచ్చేస్తాను. మొన్న చీర విషయంలోనే అంత గొడవ చేసుకుని నానా మాటలూ పడ్డాను. ఈ ఒక్క విషయం మీ అత్తగారితో చెప్పకు. చెబితే నామీద ఒట్టే' అంటూనే నామెడలోంచి తీసుకుని తన పర్సులో వేసేసుకుంది అత్తయ్యగారు. ఆయన కూడా అడిగారు. తెగితే అత్తయ్యగారికి జాగ్రత్త పెట్టమని ఇచ్చాను అని అబద్ధం చెప్పాను. అమ్మ అన్నట్టు మొన్న చీరకే అంత గొడవ అయ్యింది కదా..ఈ విషయంలో ఇంకెంత గొడవ అవుతుందో అని భయపడ్డాను అత్తయ్యగారు..''అంది వదిన.

''పోనీలే అయిందేదో అయింది కూడా.. ఇప్పుడైనా ఆ గొలుసు ఇచ్చేయ్ వదినా..లేకపోతే అబ్బాయికి నేను సమాధానం చెప్పుకోలేను.'' అంది అమ్మ.

అత్తయ్యగారు ఒక్కసారిగా బొల్లు రాగాలు మొదలెట్టింది. ''అయ్యో వదినా..నాకు ఏలినాటి శని పట్టి పీడిస్తోంది. ఆ గొలుసు తీసుకెళ్లి అలవాటుగా చేసే ఆ బంగారం కొట్టువాడికిచ్చి అలాంటివి మరో మూడు చెయ్యమని ఆర్డర్ ఇచ్చాను. వాడికి వాడి పెళ్ళానికి ఏం తెలుగులొచ్చిందో రెండో రోజు పేపర్లో పెద్దవార్త...మొత్తం షాపు ఖాళీ చేసేసి రెండు మూడు కోట్ల బంగారంతో పరారైపోయారట. పోలీసులు వెతుకుతున్నారట.మళ్ళీ మీ చేత మాట అనిపించుకునే యోగం నా మొహాన రాసి ఉంటే వాడు మాత్రం ఏం చెయ్యగలడు? నీ గొలుసు నీకు భద్రంగా అందించే పూచీ నాది. ఈఒక్కసారికి ఈవిషయం మాత్రం మీ ఆయనకీ తెలియకుండా జాగ్రత్తపడమ్మా.. ఇవి చేతులు కావు.''అని వదిన చేతులు పట్టుకుంది.

అమ్మ, వదిన అయోమయంగా ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు. 

అప్పుడే వదిన చేతులు చూసినట్టు...''ఈ వాత ఏమిటే? అయ్యో! గొలుసు నాకిచ్చి పంపించేసినందుకు మీ అత్తగారు ఇలా వాత కూడా పెట్టేసిందా? నిజం చెప్పవే తల్లీ...ఎన్నని కడుపులో దాచుకుంటావే అమ్మా..అయినా వదినా? నోట్లో నాలుక లేని పిల్ల అని తెలిసి ఇలా వాత పెడతావా? నీకూ ఆడపిల్ల ఉండి ఉంటే తెలిసేది ఆ బాధేమిటో.?''

ఈసారి అమ్మ నిర్ఘాంతపోయింది.''విజయా...నేను గమనించనే లేదు..ఇంతలా ఎలా కాలిందమ్మా?''

''మొన్నఉదయం మీరు పులుసు పొయ్యిమీద పెట్టి స్నానానికి వెళ్లినట్టున్నారు అత్తయ్యా..నేను వంటిట్లోకి వచ్చినపుడు పులుసు పొంగిపోతోందని ఆ కంగారులో చీరకొంగుతో దింపేసాను. వెనక్కి తిరుగుతోంటే పులుసుగిన్నె అంచుకు చెయ్యి తగిలింది. వేడి భరించలేక చటుక్కున నీళ్లు పోసేసాను. దాంతో వాతబాగా తేలిపోయింది.మీరు చూసే బాధపడతారని చీరకొంగు కప్పుకుని మేనేజ్ చేసాను. ఆయన 'చూసుకోకపోతే ఎలా?అంత కంగారెందుకు?' అని బర్నాల్ రాశారత్తయ్యా.'' అంది.

''భేష్ వదినా..ముష్టి మూడు కాసుల గొలుసు నీతో చెప్పకుండా తీసుకువెళ్ళానని నువ్వు వాతలు పెట్టడం, నాకూతురు త్యాగమూర్తిలా నిన్ను సమర్ధిస్తూ మాట్లాడటం బాగుందమ్మా.. చాలాబాగుంది.''ఆమెలో తననుంచి తనకూతుర్ని బలవంతంగా వేరు చేసేస్తున్నారన్న భావన కాబోలు. 

కానీ వదిన గట్టిగానే అందుకుంది.

''అమ్మా..నీకేమైనా మతిపోయిందా ? మా అత్తగారు నాకు వాతలు పెట్టడమేమేమిటి? ఆవిడ నాకు వాత పెట్టారని నీకు చెప్పానా? నువ్వు చేసిన దానికి ఒక మాట అంటే వంద చదువుతున్నావే .ఏమీ లేనిదానికి నువ్విలా రాద్దాంతం చేస్తుంటే చూసేవాళ్ళు వినేవాళ్ళు ఏమనుకుంటారు? మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను. ఇది పొరపాటున నేను కాల్చుకున్నది. మా అత్తగారికి ఏమీ సంబంధం లేదు.'' అంది వదిన.

'' ఎంతమార్చేశావ్ వదినా నా కూతుర్ని? అలా నా మాట కూడా వినేలా చేసే మందు ఎక్కడ దొరుకుతుందో చెప్పు వదినా...తెచ్చుకుంటాను.అయినా నేను మీకు ఏం అపకారం చేశానే...నామీద ఈ ఇంట్లో అందరూ కక్ష సాధిస్తున్నారు? ఇప్పటికైనా నిజం చెప్పవే తల్లీ..అయినా వాళ్ళని కడుపులో పెట్టి చూసుకుంటారని పిల్లనిస్తే...వాతలు తేలిన కూతుర్ని ఇలా చూడాల్సివచ్చింది..అంతా నాఖర్మమ్మా ..నా ఖర్మ.''

జరిగినదంతా చూస్తున్న నాకు చాలా బాధ అనిపించింది. నాన్నగారు, అన్నయ్య ఇంట్లో లేరు.వాళ్ళ తరపున మగపిల్లాడిగా ఆవిడకి సమాధానం చెప్పడం నా బాధ్యత అనిపించింది.

''అదేంటి అత్తయ్య గారు? సాక్షాత్తూ వదినే ఏమీ జరగలేదు అని చెబుతుంటే మీరు నమ్మరేంటి? పైగా దానిని ఇంకోలా మార్చి మా అమ్మ మీద నేరం మోపుతున్నారు.ఇలాగే రేపు మీ కోడలి విషయంలో మీ ఇంట్లో జరిగితే మీరు ఇలాగే మాట్లాడతారా?'' అన్నాను. అంతే !

''వెరీగుడ్. నువ్వూ లైన్ లోకి వచ్చావా నాయనా..ఇంతకాలం ఈ ఇంట్లో మాట్లాడకుండా ఉన్నది నువ్వొక్కడివే అనుకున్నాను. వెరీగుడ్. ఇవీ తెలివితేటలంటే. మీ నాన్న, అన్నయ్య ఇంట్లో నిన్ను కాపలా పెట్టి వాళ్ళ పనిమీద పోయారు. ఈవేళ ఆదివారం. ఈ తింగరిముండ ఎలాగూ వస్తుంది...దానికి సమాధానం చెప్పే మగాడుండాలి కదా అని నిన్ను ఉంచేసి పోయారన్నమాట. పేరుకి పెద్ద రైల్వే ఆఫీసర్ పెళ్ళాన్ని..ఎంత హీనమైపోయింది నా బతుకు? మీరంతా ఎప్పుడూ ఒక్కమాటగానే ఉన్నారు. కనీసం నాకూతురైనా నా పక్షాన ఉంటుందని ఆశతో వచ్చినందుకు నాకీ శిక్ష పడాల్సిందే. ఇంక ఇక్కడ ఒక్క క్షణం ఉండను. వెళ్తానమ్మా కూతురా...వెళ్తున్నా వదినా...మళ్ళీ రావడం అంటూ జరిగితే పిల్లని పురుటికి తీసుకువెళ్ళడానికే.'' అంటూ బయల్దేరిపోయింది ఆవిడ. 

''అమ్మా..నా మాట విను. కాస్త ఎంగిలిపడి వెళ్ళు. కనీసం టిఫినైనా చేసి వెళ్ళమ్మా..''అని వదిన అమ్మ చేతులు పట్టుకుంది. 

''వదినా..కనీసం బొట్టు పెట్టించుకునైనా వెళ్ళు.ప్లీజ్'' అంది అమ్మ.

ఆవిడ వదిన చేతులు సున్నితంగా తప్పించుకుంది. కళ్ళొత్తుకుంటూ చెప్పులేసుకుని విసవిసా వెళ్ళిపోయింది.

మేము ముగ్గురమూ ఆవిడ మొండితనానికి విస్తుపోతూ అయోమయంగా కూర్చుండిపోయాము.

(మిగతా 10 వ భాగంలో....)

 



Rate this content
Log in

Similar telugu story from Drama