kottapalli udayababu

Drama Classics Inspirational

3  

kottapalli udayababu

Drama Classics Inspirational

మనసు చేసిన న్యాయం (5వ భాగం)

మనసు చేసిన న్యాయం (5వ భాగం)

3 mins
4


మనసు చేసిన న్యాయం (5వ భాగం)

మరి ఈనాడు?

అంటే ఈ రోజుల్లో?

'ఉత్తరమే' కాదు ఎవరూ చూడకుండా దక్షిణం వైపు తిరిగి 'దక్షిణ 'రూపంలో ఏదిచ్చినా కూడా ఉద్యోగం సంగతి దేవుడెరుగు. మనం అప్పులు చేసి ఇచ్చిన 'అసలు'కే మోసం జరుగుతోంది. దానికి తోడు నాన్నగారు అటు ఆఫీసు ఇటు నాటకాలతో బిజీగా ఉండేవారు. దాంతో పెద్దగా చదువుకోని పర్యవేక్షణలో అన్నయ్య ఏదో ఒక వంకతో ఇంటికి ఆలస్యంగా రావడం, చెడుస్నేహాలూ పట్టెయ్యడం జరిగింది. 

ఇంట్లో పెద్దవాళ్ళు బాగా చదివితే వాళ్ళ తమ్ముళ్లు కూడా పుస్తకం శ్రద్ధగా పట్టుకుని కూర్చునేవాళ్ళు ఆరోజుల్లో. వాడికీ నాకు ఐదేళ్లు తేడా ఉండటంతో అన్నయ్య ప్రతీదానికీ నామీద ఆజమాయిషీ చేసేవాడు. వాడి గురించి కాలేజీలో లెక్చరర్లు నాన్నగారికి పిర్యాదు చేసినప్పుడల్లా నాన్నగారు వాడిని బెల్ట్ తో కొట్టేసేవారు. అది చూసి భయంతో నేను చదువుకునేవాడిని.

వాడు డిగ్రీ పాసయ్యేనాటికి సిగరెట్టూ, ఆఫీసర్స్ క్లబ్ లో స్నేహితులతో పేకాట ఆడటం నేర్చుకున్నాడని తెలిసి నాన్నగారు తానూ చెప్పినట్టు వింటే ఇంట్లో ఉండమని లేదా ఇంట్లోంచి వెళ్లిపొమ్మని చెప్పేసారు.

మరి ఏ కళనున్నాడో అన్నయ్య ఒప్పుకున్నాడు.నాన్నగారు తనకు తెలిసిన టెలిఫోన్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ గారిని పట్టుకుని డైలీ కాజువల్ లేబర్ గా చేర్పించారు. వాడి అదృష్టం బాగుండి రెండేళ్లలో అది పర్మనెంట్ ఉద్యోగంగా మారింది. పర్మనెంట్ అయేంతవరకు నమ్మకంగా పనిచేసిన అన్నయ్య పూర్తి జీతం చేతుల్లో పడేసరికి మళ్ళీ పాత స్నేహితులు, అలవాట్లు వచ్చేశాయని గమనించిన నాన్నగారు వాడికి  దూరపు బంధువుల అమ్మాయితో పెళ్లి చేసేసారు. తన కుటుంబానికి శని గాడిలా దాపురించిన వాడు ఈ పెళ్లితో బాధ్యత మీద పడి బాగుపడతాడని, తన బాధ్యత కూడా తీరిపోతుందని ఆయన ఉద్దేశమట. 

నాతో నాన్నగారు నిష్కర్షగా చెప్పేశారు.

''చూడు చిన్నోడా! మీ అన్నయ్యని ఆదర్శంగా తీసుకోక, కష్టపడి నీ చదువేదో నువ్వు బాగా చదువుకో. డిగ్రీ పూర్తీ యాకా ఒక పక్క ఏదో ఒక కాన్వెంట్ లో పనిచేసుకుంటూ..అటు బ్యాంకు టెస్ట్ లకు ప్రిపేర్ అవుతూ నీ ప్రయత్నం నువ్వు చెయ్యి. ఈ అబ్బాయికి ఉద్యోగం ఇచ్చి తీరాలి అనే మార్కులు సంపాదించుకో. నువ్వు జీవితంలో స్థిరపడినట్టే. అంతవరకూ వస్తే నా పరిచయస్తులను పట్టుకుని ఎక్కడోచోట దేనిలో ఒకదాంట్లో పోస్టింగ్ వేయించగలను. ఆతర్వాత నీ ఇష్టం".

నేను డిగ్రీ రెండవ సంవత్సరం లో ఉండగా అన్నయ్యకి పెళ్లి అయింది... మామయ్యగారు రైల్వేలో టి.సి.గా పనిచేసేవారు. ఆయన చాలా మంచి వారు. అత్తయ్యగారు మాత్రం పాత సినిమాల్లో ఎస్. వరలక్ష్మి. వారిది ఆరోజుల్లోనే ప్రేమవివాహమట.

వదిన పేరు విజయలక్ష్మి. వాళ్ళది పెద్దకుటుంబం. వదిన తరువాత ఒక అబ్బాయి...తరువాత ఇద్దరు అమ్మాయిలూ.

రైల్వేలో ఆయన టి.సి కావడంతో ఆవిడకు చదువుకున్నది తక్కువే అయినా సోషల్ గా ఉండటం, ఆధునిక అలంకరణతో నిత్యం కొత్తగా కనపడటం...ఆఫీసులో పనివాళ్లను ఇంట్లో బానిసలుగా వాడుకోవడం ఆమెకు వెన్నతో పెట్టిన విద్య అని పెద్దవాళ్ళు మాటల్లో చెప్పుకుంటుంటే విన్నాను. 

చాలా కుటుంబాలను గమనిస్తే పిల్లల్లో ఎవరో ఒకరు మిగతావాళ్ళలా కాకుండా వారొక్కరే 'తప్పుబుట్టినవారు' గానో లేదా కుటుంబానికి ఒక 'శనిగాడి'లాంటివారుగానో ఉంటూ ఉంటారు.

ప్రతీ రోజూ రైళ్లల్లో తిరిగే వుద్యోగం కావడంతో పిల్లలందరితో బదిలీలమీద ఊళ్ళు తిరగడం ఎలా ?అనుకున్న ఆ దంపతులు పెద్ద అమ్మాయి అయిన మా వదినను తన అమ్మమ్మగారి వూరిలో ఉంచేశారట. నెలకోసారి వచ్చి కూతురిని తల్లిగాని, తండ్రి గానీ చూసుకుని వెళ్లేవారట. దాంతో ఆ పల్లెటూరి అమాయకత్వం, వినయ విధేయతగల ప్రవర్తన, కాస్త సంగీతం అన్నీ అలవడ్డాయట వదినకు. పదవతరగతి పాస్ అయ్యేవరకు ఆ పల్లెటూరిలోనే చదువుకుందట వదిన.

ఆవిడ తన అభిరుచులకు తగ్గట్టు తన మిగతా ముగ్గురు పిల్లల్ని పెంచుకుందట. అలా వారి కుటుంబంలో 'తప్పుబట్టిన అమ్మాయి'గా వదిన మిగిలిందట. 

పదహారు రోజుల పండుగ జరిగాకా ఒక మంచిరోజు వదినను కాపురానికి పంపించారు. అన్నయ్య ఉద్యోగసమయం పూర్తి అయ్యాక  చక్కగా ఇంటికి రావడం...వదినతో కలిసి షికారు వెళ్లడం...వారానికోసారి సినిమాకు వెళ్లడం చేసేవాడు. 

అన్నయ్యకు కూడా ఆధునికత అంటే చాలా ఇష్టం. అందుకని వదినకు చక్కటి చీరలు, మేకప్ సామాను, మంచి మంచి ఖరీదైన చెప్పులు అన్నే కొనేవాడు. మూడునెలలు వారిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉన్నారు. 

వదిన తరువాత పిల్లలు కాలేజీ చదువుల్లోకి రావడంతో, రాష్ట్రాలు రాష్ట్రాలు దాటి పిల్లలకు భాషా సమస్య తలెత్తడంతో విజయవాడలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని తానూ తిరగడం అలవాటుగా మార్చుకున్నారట మావయ్యగారు. ఆయన అటు ఉత్తరాది రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు వారమేసి రోజులు వచ్చేవారు కాదట. దాంతో అత్తయ్యగారికి ఏమీ పనిలేక పిల్లలు కాలేజీకి వెళ్లిన వెంటనే ఎక్స్ప్రెస్ రైలు పాస్ తో ఎక్కేసి మా ఇంటికి భోజనానికి వచ్చేసేవారు. 

వదిన, అన్నయ్య తనకు కొన్నవన్నీ తల్లికి చూపించి ఆయన తనను ఎంతో బాగా చూసుకుంటున్నారని, తనకు ఈ మూడు నెలలలో కొన్న వన్నీ చూపించిందట. 

ఆమరునాడు అన్నయ్య ఆఫీసునుంచి వచ్చాకా తానూ కొన్న ఫలానా కొత్త చీర కట్టుకుని వస్తే సినిమాకు వెళదామని అన్నాడట. వదిన ఆ చీర తనదగ్గర లేదని చెప్పిందట. అన్నయ్య గట్టిగా అడిగితే భయపడి అసలు విషయం చెప్పిందట వదిన. 

అత్తయ్యగారు, అన్నయ్య వదినకు కొన్న కొత్త చీరలు చూసి అవి తనకి ఎంతో బాగుంటాయని, కొంతకాలం కట్టుకుని ఇచ్చేస్తానని, ఆ కొత్త చీరలు, తన పాత చెప్పులు వదిలేసి వదినకు కొన్న కొత్త జలతారు చెప్పులు వేసుకుని ఆ సాయంత్రం విజయవాడ వెళ్లే ఎక్స్ప్రెస్ రైలుకు వెళ్లిపోయిందట.  

అన్నయ్యకి అసలే కోపం చాలా ఎక్కువ. దాంతో వదినమీద దాదాపుగా చెయ్యి చేసుకునేంత పని చేసాడట. దాంతో వదిన చాలా భయపడిపోయి ఆ రాత్రంతా ఏడుస్తూ కూర్చుందట.

అమ్మ అన్నయ్యను కేకలేసి, వదినను ఓదార్చి తన పక్కలోనే పడుకోబెట్టుకోవడం మాత్రం నేను చూసాను.

ఆ మరునాటినుంచి అన్నయ్య వదినతో సరిగ్గా మాట్లాడేవాడు కాదు. మూడునెలలు తనను మనస్ఫూర్తిగా ప్రేమించిన భర్త ఎందుకు ఆ విషయాన్ని అంత తీవ్రంగా తీసుకున్నాడో అర్ధంకాని వదిన ఆ రెండు రోజుల్లోనే దిగులుగా కూర్చోవడం నేనూ చూసాను.  

అమ్మ అడిగితే 'నా కష్టార్జితం నా భార్యకోసం గానీ అత్తగారు సింగారించడమేమిటమ్మా? ఆవిడ అడిగితే మాత్రం దీనికి బుద్ధి ఎలా లేకపోయింది? పెళ్లయి 'నాకేమీ తెలియదు మా అమ్మ వాటిని చూస్తూనే తన బాగ్ లో పెట్టేసుకుంది...నన్నేంచేయమంటారు?' అని నాదగ్గర ఏడుస్తుందే నాకు కొంచెం ఆవేశం ఎక్కువ ...కొంచెం గట్టిగా కోప్పడ్డాను ...అది నా తప్పే...' అన్నాడట.

''కోడలు మంచి పిల్లరా...వాళ్ళ అమ్మ చేసిన తప్పుకు ఆ అమ్మాయిని బాధపెట్టకు. పల్లెటూరిలో పెరగడం వల్ల గడుసుతనం తెలీదు. మీ అత్తగారు వస్తే నేను జాగ్రత్తగా అడుగుతానులే.'' అందట అమ్మ. 

మళ్ళీ వారం రోజుల్లో ఒక ఆదివారం పిల్లలతో సహా వచ్చేసింది పొద్దున్నే.

ఆరోజు అందరమూ ఇంట్లోనే ఉన్నాము. ఆవిడను చూస్తూనే అన్నయ్య శివాలెత్తినట్టు అరిచేసాడు.

దానికి కారణం...!

(మిగతా 6 వ భాగంలో)



Rate this content
Log in

Similar telugu story from Drama