నీ మనసు
నీ మనసు
దైవమసలు వేరేగా..లేదన్నది తెలియాలిక..!
ఆ దైవం ప్రతిరూపం..అన్నింటా చూడాలిక..!
స్వర్గానికి దారులేవొ..వెతకాల్సిన పనేంలేదు..
తెఱచియున్న నీ హృదయం..సరిగ నీకు దొరకాలిక..!
నీ మనసును బంధించే..హింసించే వారుండరు..
సొంతమైన ఆనందపు..పెన్నిధితో ఉండాలిక..!
రామచిలుక కెందుకటా..యతిప్రాసల పద్యవిద్య..
గున్నమావి కొమ్మదిగులు..తక్షణమే తీరాలిక..!
పెదవిచివరి మాటలతో..ఎవరికడుపు నిండేనట..
గాయపడిన గుండెగీతి..తమకాలే తీరాలిక..!
సాటిజీవి ప్రాణాలతొ..చెలగాటం ఏం ముచ్చట..
తీపినరక యాతనలకు..స్వస్థిసరిగ చెప్పాలిక..!