kottapalli udayababu

Action Classics Inspirational

4  

kottapalli udayababu

Action Classics Inspirational

"అభిమానవంతుడు"(కథ)

"అభిమానవంతుడు"(కథ)

5 mins
27


కథ - "అభిమానవంతుడు"

"మే ఐ కమిన్ సార్?"

తలెత్తి చూసాను నేను.

12 ఏళ్ల కుర్రాడు స్కూల్ యూనిఫామ్ లో ఉన్నాడు.

లోపలికి వచ్చి "గుడ్ మార్నింగ్ సార్. మా నాన్నగారు ఉన్నారా?" అని అడిగాడు.

"గుడ్ మార్నింగ్. మీ నాన్న ఎవరు?" అడిగాను ముఖం చిట్లిస్తూ.

ఆ అబ్బాయి ముఖంలో ఓ క్రోధవీచిక ఒక క్షణం మెరుపులా మెరిసి మాయమైంది.

" వాచ్ మెన్ మునుస్వామి" అన్నాడు నా కేసి సీరియస్ గా చూస్తూ.

" అరే నువ్వు మా వాచ్ కొడుకువా! అబ్బో! ఇంగ్లీష్ లో కూడా మాట్లాడుతున్నావే!ఏ కాన్వెంట్లో చదువుతున్నావ్ రా?" అడిగాను.

" నా పేరు శివరామకృష్ణ సార్!"

"నేను అడిగింది నీ పేరు కాదురా. నువ్వు ఏ కాన్వెంట్ లో ఏ క్లాస్ చదువుతున్నావ్ అని"

వాడు మళ్లీ నొక్కి చెప్పాడు.

" నా పేరు శివరామకృష్ణ సార్! నేను ఫలానా కాన్వెంట్ లో ఏడవ తరగతి చదువుతున్నాను." వాడి ముఖంలో ఆత్మాభిమానం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది.

"ఇంతకీ ఇప్పుడు మీ నాన్నతో నీకేం పని? డ్యూటీలో ఉన్నాడు. ఇప్పుడు రాడు."

నా మాట పూర్తికాకుండానే అంతకుముందు టిఫిన్ కోసం పంపిన మునుస్వామి టిఫిన్ తీసుకొచ్చి నా బల్లమీద పెట్టాడు.

" ఏంటబ్బాయా ఇలా వచ్చావ్? ఏమైంది?" ఆదుర్దాగా అడిగాడు కొడుకును మునుస్వామి.

నాకు ఒళ్ళు మండిపోయింది.

" ఏంట్రా! టిఫిన్ తీసుకొచ్చి ముష్టి పడేసినట్టు నా మొహం మీద పడేసి కొడుకుతో పరాచికాలు ఆడుతున్నావేంటి? నీ తాత పట్టుకొచ్చి ఇస్తాడా?" అన్నాను కోపంగా.

చేయి చాస్తే అందే అంతదూరంలో వాటర్ జగ్, గ్లాస్, నా బల్ల మీదే ఉన్నాయి. మునిస్వామి భయపడుతూ వచ్చి జగ్ కు ఉన్న హ్యాండిల్ పట్టుకొని, బోర్లించిన గ్లాసును సరిగా పెట్టి, వణుకుతున్న చేతులతో నీళ్లు పోయసాగాడు. లూజ్ గా ఉన్న ఆ జగ్ ఒక్కసారిగా ఊడిపోయి నీళ్లన్నీ భళ్ళున టేబుల్ మీద పెట్టిన టిఫిన్ మీద ఒలికిపోయి నా మీద కూడా పడిపోవడంతో నా లాల్చీ కింద భాగం పైజామా పూర్తిగా తెలిసిపోయాయి.

" కళ్ళు కనిపిస్తున్నాయా నీకు? మూత గట్టిగా పెట్టావో లేదో చూసుకొనక్కర్లేదా? కొడుకు కాన్వెంట్లో చదువుతున్నాడు అనే గర్వమా లేక టేబుల్ మీద ఉన్న మంచినీళ్లు గ్లాసులో పోసుకోలేని వీడికి సేవ చేయడం ఏమిటి అని నిర్లక్ష్యమా? ముందు ఈ పని చూసి నీ కొడుకు వెధవతో మాట్లాడొచ్చు కదా! ఒళ్ళు పొగరెక్కి ఏడుస్తున్నావ్. ఈలోగానే వాడితో మాట్లాడకపోతే చచ్చిపోతావా?" గర్జించిన నాకు కంఠం గది నాలుగు గోడల మధ్య ప్రతిధ్వనించింది.

మునిస్వామి వయస్సు 50 సంవత్సరాలు ఉంటుంది. అయితే సరైన పోషణ లేక పోవడంతో, ఒక రెక్క సంపాదనతో సంసారం ఈదుకొస్తున్న అతను వయసుకు మించిన ముసలితనంతో 65 సంవత్సరాల వయస్సు ఉన్న వాడిలా కనిపిస్తాడు.

" నిజంగానే చూడలేదు బాబయ్య! అనవసరంగా టిఫిన్ అంతా పాడైపోయింది. మన్నించండి" అన్నాడు మునుస్వామి కన్నీళ్ళతో.

" టిఫిన్ అలా తడిపేస్తే దాన్ని నీ మొహం తగలేస్తాను. అప్పనంగా టిఫిన్ కొట్టేయొచ్చు అని నీ వెధవ ఆలోచన. ఇదంతా నీ ఎదవ నా కొడుకు వచ్చి కాలెట్టిన ఫలితం. సరిగ్గా టిఫిన్ తినే వేళకు తయారయ్యాడు శనిగాడిలా" అన్నాను చిరాకుగా.

" వాడినేమనకండి బాబు.నా పంచె పానాలు ఆదిమీదే ఎట్టుకుని బతుకుతున్నాను. మళ్లీ మీకు టిఫిన్ తేనా బాబు?" స్వామి అడిగాడు.

"అక్కర్లేదు.అయిన టిఫిన్ తగలెట్టావుగా. ముందు ఆ వెధవ పని ఏంటో చూసి తగలడు. వెళ్లి మళ్లీ టీ తేవాలి" అన్నాను.

మునుస్వామి కొడుకును గోడ పక్కకు తీసుకువెళ్లి అడిగాడు.

"ఏంట్రా నాన్న ఏం కావాలి?" నాకు వారి మాటలన్నీ వినబడుతూనే ఉన్నాయి.

"ఆయన మిమ్మల్ని అంతలేసి మాటలు అంటుంటే అలా ఊరుకుంటారేంటి నాన్నా?" అని అడిగాడు వాడు.

" పోనీలేరా! మనకు ఎప్పుడు అవసరమైతే అప్పుడు పైసలు సర్దిపెట్టేది ఆయనే. సదూకున్నోరు.పెద్దోరు. ఆయన ఒకమాట అంటే మాత్రం పౌరుషం తెచ్చుకుంటే ఎలా?" అన్నాడు మునుస్వామి కొడుకును సముదాయిస్తున్నట్టుగా.

"డబ్బులు ఇస్తే మాత్రం... కళ్ళు కనిపించడం లేదా? ఛస్తున్నావా... అలాంటి మాటలేంటి నాన్నా? నూటికి పది రూపాయల వడ్డీ తీసుకుంటున్నారుగా! పోనీ మీరు ఈ స్కూల్ కు వాచ్మెన్ కాబట్టి అన్నారని అనుకుందాం. నాతో ఆయనకేం సంబంధం? శని వెధవ... వాడు... వీడు... అంటారేమిటి? నాకు ఆయన పద్ధతి నచ్చలేదు నాన్న" అన్నాడు శివరామకృష్ణ ఆవేశంగా

"తప్పయ్య! పెద్దవారిని అట్ట అనమాకు. నా కొడుకువనే సనువుతో అట్ట అని ఉంటారు. పోనీలే. ఇంతకు నువ్వు వచ్చిన పనిఏంటి?"

" గంటలో పరీక్ష ఫీజు తెమ్మన్నారు నాన్నా. అందుకు వచ్చాను. పొద్దున మీకు గుర్తు చేశాను కదా"

" అవును కదా. నేను ఆ సంగతే మర్శిపోయాను. చూసావా! ఇప్పుడు ఆయన గారినే డబ్బులు అడగాలా. మరి ...మనలాటోళ్లం కోపం తెచ్చుకుంటే ఎలాసెప్పు? వత్తానుండు." కొడుకును సముదాయించి లోపలికి వచ్చాడు మునుస్వామి.

నేను టిఫిన్ తినడం పూర్తి చేశాను. ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్ లో కట్టి తీసుకురావడం వల్ల పై పేపర్ తడిసింది గానీ టిఫిన్ నిక్షేపంగా ఉంది.

మునుస్వామి నేను టిఫిన్ తిన్న పొట్లం తీసుకెళ్ళి బయట పడేసి ఖాళీ పళ్ళెం పట్టుకొచ్చాడు. అందులో చేతులు కడుక్కున్న నాకు నా బ్యాగ్ లోని నాప్-కిన్ తీసి ఇచ్చి పళ్లెంతో బయటికి వెళ్లాడు. శుభ్రపరిచిన పళ్ళాన్ని దాని స్థానంలో ఉంచి నా దగ్గరకు వచ్చి విషయం చెప్పాడు వినయంగా చేతులు కట్టుకొని.

అరగంట సేపు బ్రతిమాలించుకుని ఆ కుర్రవాడు చేసిన పనికి మరొకసారి మునుస్వామిని రేవెట్టి, చివరకు వడ్డీ ముందుగానే తీసుకొని 450 వాడి చేతుల్లో పెడుతు అన్నాను.

" చూడు! నీ కొడుకు గాడిద నీతో అన్న మాటలు అన్నీ విన్నాను. 'మింగ మెతుకు లేదు మీసాలకు సంపెంగ నూనె' అని అర్హత లేని వాడిని అందలమెక్కించినట్లు కాన్వెంట్ లో చేర్పించి ఇంగ్లీష్ చదువు చదివిస్తున్నావు. చివరకు నీకు ఎంగిలి మెతుకు కూడా విదల్చడు అంత ఒళ్ళు పొగరు పనికిరాదు. ఒళ్ళు దగ్గర పెట్టుకోమను వెధవని. ఈ డబ్బు నేనివ్వకపోతే పరీక్షకు ఎలా వెళ్తాడట? పోనీలే కదా అని ఇస్తున్నాను.జాగ్రత్త"హెచ్చరించాను.

మునస్వామి డబ్బు తీసుకుని వెళ్ళిపోయాడు.నేను క్రూరంగా నవ్వుకున్నాను.

అమ్మో! ఇలాంటి వాళ్లను చెట్టుకింద తేలులా ఉంచకపోతే మనల్ని నిర్దాక్షిణ్యంగా కుట్టేస్తారు.

*******

వారం రోజుల అనంతరం నాకు ఒక ఉత్తరం వచ్చింది.

" పూజ్యులైన గురువు గారికి - వందనములు. సార్!నేను మీ వాచ్మెన్ మునుస్వామి గారి అబ్బాయిని. ఆనాడు మీరు మా నాన్న గారి పట్ల ప్రవర్తించిన తీరు నన్ను కలచి వేసింది. కేవలం మా తండ్రిగారి పట్ల గౌరవంతో నేను ఆగవలసి వచ్చింది. అంతేకాదు మా నాన్నగారు మీ గురించి ఎంతగా చెబుతారో తెలుసా?ఆంజనేయస్వామిని శ్రీరాముని గురించి అడిగితే ఏం చెప్తారో అంత గొప్పగా చెబుతారు. మీరు ఎంతో మంచి పండితులు అని, అటువంటి వారిని ఆదర్శంగా తీసుకుంటే భాష పట్ల అభిరుచిని పెంచుకోవచ్చని, మంచి విషయాలు ఎన్నో తెలుసుకోవచ్చని చెబుతారు. ఆ నేపధ్యంలో మీ దగ్గరనుంచి 'మా అబ్బాయికి ఇవ్వండి బాబు' అని మిమ్మల్ని అడిగి మంచి కథల పుస్తకాలు,శతకాలు తెచ్చి ఇచ్చారు నాకు.

మిమ్మల్ని గురువుగా చేసుకొని ఏకలవ్య శిష్యరికం చేసిన నేను మా కాన్వెంట్ లో మా తెలుగు మాస్టారి ఆధ్వర్యంలో 'అష్టావధానం' చేశానంటే నమ్మగలరా సర్ మీరు? అదంతా మీ ఆశీర్వాదం బలమే అని నమ్మిన నేను మీ ప్రవర్తన చూసి ఆశ్చర్యపోయాను.

మన ప్రవర్తనతో ఎదుటి మనిషి మనసు గెలుచుకోవచ్చు అని నమ్మిన నాకు మా నాన్నగారే ఆదర్శం.

మేము అన్ని విధాలా మీకన్నా అల్పులమే. అయితే మాత్రం మీ తండ్రి వయసున్న వ్యక్తితో మీరు 'ఏరా.. కళ్ళు కనిపిస్తున్నాయా.. ఛస్తున్నావా' లాంటి అమర్యాదపూర్వకమైన మాటలు వింటూ ఆశ్చర్యపోయాను.

మనిషిని చూడకుండానే వారి చరిత్రలు చదివి స్ఫూర్తి పొంది ఉన్నత శిఖరాలు చేరిన ఎందరో మహానుభావులు ఉన్న దేశం మనది. మరి మీ చదువు,విద్వత్తు ఇవన్నీ ఏమైపోయాయా అని ఆశ్చర్యం వేసింది. మా నాన్నగారు నన్ను ఎలా పెంచుతున్నది మీరు చూశారు. కానీ మీరు అలా ప్రవర్తించారంటే మీ తల్లిదండ్రుల పెంపకాన్ని శంకించాల్సివస్తోంది. గౌరవం అనేది ఇచ్చుకోవాలి అంటారు. మానాన్నగారు వృత్తిరీత్యా మీకు వాచ్-మెనే కావచ్చు. కానీ ఆయన మీలాంటి ఉద్యోగస్తుడే. తండ్రి వయస్సు కలిగిన ఆయనను మీరు కనీసం 'ఏమయ్యా'అనైనా పిలవకపోవడం నా మనసులో తుమ్మముల్లు గుచుకున్నట్టుగా ఉంది.

మీరెవరో చూడకుండానే మీ పట్ల అభిమానం పెంచుకున్న నాకు మీ పట్ల గౌరవం తగ్గిపోతుందేమో అన్న భయంతో ఇది వ్రాస్తున్నానే గాని మిమ్మల్ని కించపరచాలని మాత్రం కాదు. ఇలా నేను ఉత్తరం రాసినట్లు మా నాన్న గారికి తెలియజేయకండి. అన్నట్లు మీరు ఇచ్చిన డబ్బుతో నేను పరీక్ష ఫీజు కట్టలేదు. నా మార్కులు చూసిన ఒక ధర్మాత్ముడు తనంత తానుగా నాకు సాయం చేశాడు. రోజు ఉదయం పేపర్ వేసి ఆ జీతం డబ్బుతో ఆయన అప్పు తీర్చేలా ఉద్యోగ సహాయం కూడా చేశాడు. ఆ డబ్బుతో పరీక్ష ఫీజు కట్టాను. నేను మంచి మార్కులతో పరీక్ష పాస్ అయ్యేలా ఆశీర్వదించండి." నమస్కారాలతో..

- శివరామకృష్ణ."

అది ఉత్తరం కాదు. పండితుడు అన్న నా అహంకారం, డబ్బు ఉందన్న నా గర్వం... అంతే కాదు నా మనో కల్మషాన్ని కడిగేసిన పాశుపతాస్త్రం.

ఆ తర్వాత నేను ఎప్పుడూ మునుస్వామిని ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని అగౌరవపరిచ లేదు.

"ఏమయ్యా స్వామీ..." అని నేను పిలిచినప్పుడల్లా మునిస్వామి చూసే చూపు నా తప్పును ఎత్తి చూపుతూ శివరామకృష్ణని గుచ్చిన తుమ్మముల్లులా గుచ్చుతూనేఉంది !

సమాప్తం


Rate this content
Log in

Similar telugu story from Action