kottapalli udayababu

Action Classics Inspirational

3  

kottapalli udayababu

Action Classics Inspirational

"ఏకలవ్యణి"(కథ)

"ఏకలవ్యణి"(కథ)

4 mins
19


"ఏకలవ్యణి"(కథ)


                  ప్రధానోపాధ్యాయుడు తనకు అందజేసిన బదిలీ ఉత్తర్వులను భద్రపరుచుకుని భర్తను అనుసరించింది జనని.

విద్యార్థులను తన బిడ్డలుగా చూసుకునే జనని బదిలీపై తన భర్త ఉన్న ఊరుకు వెళ్ళిపోతోందని తెలుసుకున్న విద్యార్థులు ఒక్కసారిగా ‘’టీచర్...మీరు వెళ్ళవద్దు టీచర్ ..ప్లీజ్... వెళ్ళద్దు ’’ అని రోదించడం మొదలు పెట్టారు.

        విద్యార్ధుల రోదనలతో పాఠశాల ప్రాంగణం దద్దరిల్లిపోయింది. జనని చేయి పట్టుకుని ఆమెను జాగ్రత్తగా కమలేష్ ముందుకు నడిపిస్తున్న కొద్దీ ఒక్కొక్క అమ్మాయి వచ్చి మేడం మెడ చుట్టూ చేతులు వేసి బల్లిలా అతుక్కుపోతుంటే, వారిని ఓపికగా ఓదార్చి పంపుతూ భర్త సహకారంతో కారు దగ్గరకు చేరుకుంది.

కమలేష్ డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు. జనని ముందు సీట్లో అతని పక్కన కూర్చుంది దూడనొదిలి అడవికి వెళ్ళిపోతున్న తల్లి ఆవు పుణ్యకోటిలా. ‘’మేడం ..మేడం...’’అంటూ పిల్లలు కళ్ళుతుడుచుకుంటూనే ఉన్నారు. ఉపాద్యాయులందరూ ‘’పదండి బాబు..లోపలకి..పదండమ్మా’’ అని పిల్లలను అదిలిస్తూ బలవంతంగా తరగతి గదుల్లోకి పంపసాగారు.

సరిగ్గా అప్పుడు గుర్తొచ్చింది జననికి ‘కృపామణి’.

ఆమె ఎనిమిదవతరగతి చదువుతోంది. ఆరవ తరగతిలో ఏదో కొండప్రాంతపు గూడెం నుంచి ఆమె తల్లి తమ పేదరికం చేత ఆమెను వెనుకబడిన తరగతుల హాస్టల్ లో చేర్పించి వెళ్ళిపోయింది. పౌష్టికాహార లోపం వల్ల నాలుగవ తరగతిలోనే ఆమెకు కాళ్ళు చచ్చు బడిపోయాయట.

ఎలాగైనా కష్టపడి చదువుకుని తనలాంటి అవయవలోపం గలవారికి చేయూతనివ్వాలనే  ఆమె ఆశయాన్ని మొదట్లోనే గుర్తించి  ప్రధానోపాధ్యాయుని సహకారంతో ప్రభుత్వం ఆమెకి చక్రాల కుర్చీ   అందచేసేలా కృషిచేసింది జనని. పిల్లలు లేని తనకు   మూడేళ్ళుగా దేవుడిచ్చిన బిడ్డగా భావించి ఆదరించింది. ఆమెను కన్నతల్లిలా సాకి జీవితం పట్ల నమ్మకాన్ని, జీవించడం పట్ల విశ్వాసాన్ని నేర్పింది.  ఒక్కనాడు కూడా కృప తల్లి ఆమెను చూడటానికి రాలేదు.

ఆరోతరగతి ప్రారంభం లోనే ఆమెలోని నైపుణ్యాన్ని గుర్తించింది జనని. ఎక్కువమంది పిల్లలు బొమ్మలు వేయడం లో ఇష్టం చూపితే తన చుట్టూ పడివున్న వ్యర్ధ పదార్ధాలతో రోజూ ఏదో ఒక బొమ్మ తయారు చేసి పాఠశాలకు తెచ్చేది కృపామణి.

ఆమె చేసిన వాటిల్లో ఎక్కువగా అమ్మ బొమ్మలే ఉండేవి. తల్లి బిడ్డను చంకలో ఉంచుకుని నెత్తిమీద కడవతో నీళ్ళకు వెళ్తున్నట్టు, చందమామను చూపిస్తూ అమ్మ బిడ్డకు గోరుముద్దలు తినిపిస్తున్నట్టూ, అమ్మ బిడ్డను చీరకొంగులో చుట్టి నడుముకు ముడివేసుకుని కళ్ళాపు జల్లుతున్నట్టు...ఇంకా ఎన్నేన్నో...అన్ని బొమ్మల్లోను జీవకళ ఉట్టిపడేది.

బోధనోపకరణాల తయారీలో తనకు చేదోడు వాదోడుగా ఉండేది. తన సాయం తో ఎన్నో ప్రాజెక్ట్ వర్క్స్ పిల్లలందరిచేతా చేయించి విద్యాశాఖాదికారులచేత ‘బెస్ట్ మోటివేటర్’ అవార్డ్ కూడా పొందింది. ఆలోచిస్తూనే అసంకల్పితంగా ‘’కమల్ ప్లీజ్ రెండు నిమిషాల్లో వచ్చేస్తాను.’’ అని అతని సమాధానం కోసం చూడకుండా కారు దిగి పిల్లల్ని తప్పించుకుంటూ ఎనిమిదవతరగతి లోకి వచ్చింది.

ఆఖరి రెండు బెంచీల మధ్య వీల్ చైర్ లో కూర్చున్న కృపామణి ‘’మేడం. వెళ్ళిపోతున్నారా...మళ్ళీ ఎపుడోస్తారు మేడం.నేను మీ దగ్గరకు రాలేకపోయాను మేడం.క్షమించండి.’’ అంది చేతులుచాస్తూ...

జనని గబగబా కృపదగ్గరకు పరుగున వచ్చి అమాంతం కౌగలించుకుంది.

‘’అమ్మ...కృపా...తప్పలేదు నాన్నా.సర్ ఉన్నవూరికి వెళ్ళిపోతున్నాను.నిన్ను చూడటం కోసమే పరుగెత్తుకు వచ్చాను.  వారానికి ఒక ఉత్తరం రాస్తాను.సబ్జెక్ట్ లో నీకు ఏ అనుమానం ఉన్నా వెంటనే నివృత్తి చేసుకో. నువ్వు పదవతరగతి లో పదికి పది జి.పి.ఏ. తెచ్చుకోవాలి. ఇదే ఈ మేడం కోరిక.ఆరోగ్యం జాగ్రత్త నాన్నా.ఎంత కష్టం లోనూ నీ పెదాలమీద చిరునవ్వు చేరిగిపోనివ్వకు.

ఈ స్కూల్లో దాదాపు అందరు పిల్లలూ ఏడ్చారు.కానీ నన్ను నవ్వుతూ పంపుతున్న దానివి నువ్వే. నీకు  శిల్ప కళ పట్ల మంచి  అభిరుచి, నైపుణ్యం కూడా  ఉన్నాయి. చదువుతో పాటు నీ దృష్టి బొమ్మల మీద కూడా కేంద్రీకరించు.నీలో అద్భుత శిల్పకళాశక్తి నీలో దాగిఉంది .నీకు దేవుడు శుభం చేస్తాడు.వెళ్లి రానా మరి.’’ అని కృపామణి బుగ్గ మీద ముద్దాడింది జనని.

‘’మేడం. అమ్మ ఇక్కడ ముద్దు పెట్టుకోవాలి.’’ బుగ్గ చూపిస్తూ అంది కృపామణి. జనని ఆమె బుగ్గ మీద  ముద్దు పెట్టుకుంది.ఒక్క క్షణం తాదాత్మ్యం తో కళ్ళు మూసుకుంది కృప.అనంతరం చేయి ఊపుతూ ‘’వెళ్లి రండి మేడం. ఈరోజు ఏదో ఒకరోజు వచ్చేదే...నా చదువు పూర్తయినా,మీకు బదిలీ అయినా...మళ్ళీ మిమ్మల్ని చూసే క్షణం వరకు నవ్వుతూ బతుకుతాను మేడం.’’అని ఒక బాబు బొమ్మను జననికి అందించింది కృప.

‘’మీకోసమే మేడం. మీకు తమ్ముడు తప్పకుండ పుడతాడు.’’

దానిని పదిలంగా అందుకుని కృప చేతులు మృదువుగా నొక్కి రాబోతున్న కన్నీటిని పెదవితో నొక్కి పెట్టి కారుదగ్గరకు వచ్చేసింది జనని.  పెదవులమీద చిరునవ్వు కళ్ళల్లో మెరుస్తుండగా మేడమ్ వెళ్ళిన వైపు అలాగే చూస్తూ ఉండిపోయింది కృపామణి.                            

 *****

ఇచ్చిన మాట తప్పకుండా జనని కృపకు ప్రతీ వారం ఉత్తరం వ్రాసేది.కృప కూడా తనకు జీవితం పట్ల గల భయాలు, అపోహలు అనుమానాలు అన్ని అడిగేది..తనకు తెలిసినంతవరకూ సమాదానాలిచ్చేది. పదవ తరగతిలో ఉండగా తనకు బాబు పుట్టాడని జనని రాసిన ఉత్తరం చదివి మురిసిపోయింది కృప.జనని కోరుకున్నట్టే పబ్లిక్ పరీక్షల్లో పది కి పది జి.పి.ఏ. సాధించిన కృపను మనసులోనే అభినందించినా,ఆమెను ఆమె తల్లి తీసుకువెళ్లిపోయిందని తెలిసి ఎంతో బాధపడింది. తర్వాత ఎంత ప్రయత్నించినా కృపామణి జాడ తెలియలేదు ఆమెకు.

*****

దాదాపు ఏడు సంవత్సరాల తర్వాత తన అద్భుత కళా ప్రతిభతో విగ్రహాలు జీవం ఉట్టిపడేలా తయారుచేస్తూ వినుతి కెక్కిన కృపామణిని రాష్ట్రప్రభుత్వం శిల్పకళారంగానికి చెందిన అత్యుత్తమ అవార్డుకు ఎంపిక చేసింది. ఉగాది పర్వదినాన జరగబోయే వేడుకలలో ఆమెకు ఆ అవార్డును ముఖ్యమంత్రి స్వయంగా ఆమెకు అందజేస్తారు. తాను నేర్చిన కళను తనలాంటి ఎందరో విద్యార్థులకు ఉచిత శిక్షణ ఇస్తున్న ఆమెను విద్యాశాఖ ప్రత్యేకంగా అభినందిస్తుంది అన్న వార్త ముందు మీడియాలోనూ , మర్నాడు అన్ని ప్రధాన వార్తాపత్రికల్లోనూ చదివిన జనని ఆనందానికి అవధులు లేవు. 

పత్రికా విలేకరులు ఇంటర్వ్యూ చేసినప్పుడు 'తానూ ఈరోజు ఈ స్థాయికి చేరడానికి ప్రధాన కారణం మాతృమూర్తి సమానురాలైన జననీ మేడం అని, తనను 'శిల్పిని చేసిన శిల్పం ' ఆమె అని,ఆ మేడం తన భర్త ఉన్న జిల్లాకు బదిలీపై వెళ్ళిపోయిన రోజు, తన అవకరం వల్ల తరగతి గదిలోనే ఉండిపోతే తనను గుర్తుచేసుకొని కారు దిగి తాను ఉన్న చోటికి వచ్చి ఎన్నో ధైర్య వచనాలు చెప్పి వెళ్లారని, ఆమె రాసిన ఉత్తరాలు చదువుతున్నప్పుడు మాజీ భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ, తన కుమార్తె, మన దేశానికి మరొక ప్రధాని అయిన శ్రీమతి ఇందిరా గాంధీ గారికి రాసిన ఉత్తరాలు ఇఛ్చినంత స్ఫూర్తిని తనకు ఇచ్చాయని,  ఆ ప్రతి ఉత్తరాన్ని తానూ భద్రంగా దాచుకున్నాననీ,  ఆ తల్లి ఎక్కడున్నా ఆ రోజు కార్యక్రమానికి హాజరుకావాలని పత్రికాముఖంగా ఆమెకు స్వాగతం పలుకుతున్నానని చెప్పింది. 

తన ఉపాధ్యాయిని పట్ల అంత ప్రేమాభిమానాలతో, గౌరవభావంతో అమృతతుల్యమైన మాటలు ఆమె మాట్లాడుతూ ఉంటే,   తెలిసిన అందరూ జనని వేనోళ్ళ కొనియాడారు.

ఒకరినొకరు చూసుకునే ఆ శుభఘడియ రానే వచ్చింది.

వేదిక మీదకు "కృపామణి"అభ్యర్ధన మేరకు జననిని ఆహ్వానించారు అధికారులు.  "మేడం" అంటూ తనకు నమస్కరించబోయిన కృపామణిని చూస్తూనే గాఢంగా కౌగలించుకుని నుదుట ముద్దాడింది జనని.ఇద్దరి కళ్ళల్లో ఆనందభాష్పాలు గంగలై ప్రవహించాయి.

ఉగాది వేడుకలలో ఒక విద్యార్థిని తన జీవితానికి మార్గదర్శిగా నిలిచిన ఉపాధ్యాయుని "జనని" విగ్రహాన్ని ముఖ్యమంత్రి చేత స్వయంగా ఆవిష్కరింపచేస్తుంటే ఆ అపురూప దృశ్యం ఎన్నో కోట్ల విద్యార్థుల హృదయాలను పులకింప చేసింది.

 ఆ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ కళారత్న అవార్డు సాధించిన కృపామణికి , ''ఏకలవ్యణి '' అనే బిరుదును ముఖ్యమంత్రి, జననీ టీచర్ ల చేతులమీదుగా అందుకున్న కృపామణి సభాముఖంగా "ఉపాధ్యాయ లోకానికి ఈ అవార్డు అంకితం"అని ప్రకటించింది.

సమాప్తం.



Rate this content
Log in

Similar telugu story from Action